సాంస్కృతిక వినమ్రత

 

r1

‘పరమతసహనం’ -చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో పరిచయమైన పదం. మన గురువులు మనకు గర్వించదగ్గదిగా పరిచయం చేసిన పదం. భారతదేశం మొదటినుంచీ పరమతసహనాన్ని చూపిస్తూ ఉందని చెప్తూ వచ్చిన పదం. కాని, నా మటుకూ నాకు, ఈ పదం positive పదం కాదనీ, negative పదమనీ తెలియడానికి చాలా కాలమే పట్టింది.

‘సహనం’ అనే సంస్కృతపదంగానీ, ‘tolerance’ అనే దాని ఇంగ్లీషు సమానార్థకంగానీ గుణాత్మక పదాలు కావు. వాటి అసలైన అర్థం ‘భరించడం ”ఓపికపట్టడం‘ అనే. అంటే నీ ఎదుటిమనిషిని, అతడి అభిప్రాయాల్నీ, అతడి వేషభాషల్నీ, ఆహారపుటలవాట్లనీ, ఒక్కమాటలో చెప్పాలంటే అతడి జీవితవైఖరి మొత్తాన్ని చూస్తూ, అది నీకన్నా భిన్నమైందని అర్థమవుతున్నాక, పళ్ళ బిగువున ఓపిక పట్టడం అన్నమాట. నీకన్నా భిన్నమైన దృక్పథమో, జీవితవిశ్వాసాలో ఉన్నవాడు మరొకడు ఉన్నాడని తెలియడమే నీకు చాలా కష్టం కలిగించే విషయంగా నువ్వు భావిస్తున్నావనీ, అయినా ఆ కష్టాన్ని నిశ్శబ్దంగా భరించడాన్నే నువ్వు సహనం అని చెప్పుకుంటున్నావనీ అర్థం.

మతం అంటే మతాలనే కాదు. నిజానికి మతమంటే నువ్వు నమ్ముతున్న అభిప్రాయమనే అర్థం కూడా ఉంది. పరమతసహనం అంటే ఒక మతం వాళ్ళు మరొక మతంవాళ్ళ పట్ల చూపించే ఉదారవైఖరి అనేది పూర్వకాలపు విషయం. ఇప్పుడిది, సిద్ధాంతాలకీ, అభిప్రాయాలకీ, జీవనవిధానాలకీ, అన్నిటికీ వర్తిస్తుంది. కాని పరమతసహనం గురించి మాట్లాడేటప్పుడు మనం మర్చిపోతున్నదేమంటే, మనం మామూలు లౌకిక, ప్రాపంచిక, దైనిక విషయాల్లో కూడా మనకన్నా భిన్నమైన అభిప్రాయాలున్నవాళ్ళని భరించలేకపోతున్నామని.

కాని నిజానికి మనం అలవర్చుకోవలసిన సంస్కారం ఓపిక పట్టడం కాదు, ఎదటి మనిషి మనకన్నా భిన్నమైన జీవితవిధానంతో మనముందు కనిపిస్తున్నప్పుడు, అతడి జీవితాన్ని నడిపిస్తున్న ఆ విలువలు ఏమిటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. నీకు దుర్భరంగా కనిపిస్తున్న ఆ పరాయి జీవనసంస్కృతి వెనక ఉన్న జీవితదర్శనమేమిటని పరిశీలించడం. ఒక్కమాటలో చెప్పాలంటే, మనకు కావలసింది, పరమత సహనం కాదు, పరమత గుణగ్రహణం. Appreciate చెయ్యగలగడం. అతణ్ణి నువ్వు చూడటం వల్ల నీ జీవితంలో నీకింతదాకా పరిచయం లేని మరొక కొత్త కోణమేదో తెలిసివస్తున్నదన్న స్పృహ. అలా కొత్త పార్శ్వాలు తెరుచుకుంటున్నందువల్ల నీ ప్రపంచం మరింత విస్తృతమవుతోందనీ, నీ అనుభవం మరింత సుసంపన్నమవుతోందనే ఎరుక, అనిదంపూర్వమైన సంతోషాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.

ఈ మెలకువని సూచించడానికి తగిన పదమేదీ స్ఫురించక చాలాకాలంగా అవస్థ పడుతున్న నాకు cultural humility అనే పదం కనిపించింది. ఆ పదం కంట పడగానే ఒక పెన్నిధి దొరికినట్టనిపించింది.

Cultural humility! సాంస్కృతిక వినమ్రత! నిజమైన విద్యకి, నిజమైన సంస్కారానికి చిహ్నంగా తోచిందీ పదం. ఒక మార్తా నాస్ బమ్ వంటి విద్యావేత్త, తాత్త్వికురాలు, సంస్కారి మాత్రమే ప్రయోగించగల పదం.

2011 లో చేసిన ఒక ప్రసంగంలో ఆమె ఈ పదం ప్రయోగించింది. ఒకప్పుడు తాను చదువుకున్న యూనియన్ కాలేజి వ్యవస్థాపక దినోత్సవంలో చేసిన ప్రసంగంలో ఆమె విద్యాలయాల్లో సాంఘిక శాస్త్రాల అధ్యయనం ఎంతో అవసరమో చెప్తూ ఇలా అన్నది:

‘మరింతగా ముడిపడిపోతున్న ఈ సంక్లిష్ట ప్రపంచంలో మనం మంచి పౌరులుగా ఎదగాలంటే, మన ఉమ్మడి అవసరాలూ, ఆశయాలూ వివిధ పరిస్థితుల్లో ఎంత వైవిధ్యంతో నెరవేరుతున్నాయో అర్థం చేసుకోవలసి ఉంటుంది. అమెరికన్ విద్యార్థులకి నేడు పాశ్చాత్యసంస్కృతులకన్నా భిన్నమైన సంస్కృతుల్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇటువంటి అవసరం పూర్వకాలంలో చాలా అరుదుగా తటస్థించేది. కాని ఇప్పుడు పాశ్చాత్యేతర సంస్కృతులగురించీ, అల్పసంఖ్యాక వర్గాల గురించీ..తెలుసుకోవలసిన అవసరం ఏర్పడింది. ..ఈ మధ్యకాలంలో విదేశీ భాషల్నీ, విదేశీ, పాశ్చాత్యేతర సంస్కృతుల్నీ అధ్యనం చేయడం మీద దృష్టి పెరిగింది. భాషని అధ్యయనం చేయడమంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించని పని అనుకుంటాం. కాని, కాదు. మనం అట్లా అధ్యయనం చేసిన భాషతో ఆ తర్వాత మనకు పనిలేకపోయినా కూడా, అసలు, మరొక సృజనశీలమానవసమూహం దృష్టిలోంచి ఈ ప్రపంచాన్ని చూడటమే.. సాంస్కృతిక బహుళత్వానికీ, సాంస్కృతిక వినమ్రతకీ సంబంధించిన ఒక అత్యవసరమైన పాఠాన్ని మనకు బోధిస్తుందనుకోవాలి.’

ఎంత సంస్కారవంతమైన మాటలు!ఇటువంటి మాటలు నా చుట్టూ ఉన్న ఒక్క రచయితగాని, ఒక్క రాజకీయనాయకుడుగాని, ఒక్క మతాచార్యుడుగానీ మాట్లాడలేదే.

ప్రపంచంలోనే భారతదేశం వంటి దేశం లేదనీ, మన మతంకన్నా గొప్పది లేదనీ, మన తత్త్వశాస్త్రాల్ని మించిన దర్శనం లేదనీ ఎవరన్నా చెప్తుంటే వాళ్ళని చూస్తే నాకు చాలా జాలిగానూ, బాధగానూ ఉంటుంది. ఇంత ఇంటర్నెట్ యుగంలోనూ, ఇంత గ్లోబల్ యుగంలోనూ కూడా ఇంకా ఇంత సంకుచితంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారా అనిపిస్తుంది. నీ మతం, నీ సంస్కృతి ప్రత్యేకమైనవని చెప్పు, అర్థం చేసుకుంటాను. కాని అన్నిటికన్నా గొప్పవంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. మతమనే కాదు, ఫలానా తాత్త్విక దృక్పథం ఒక్కటే మానవాళికి దారిచూపిస్తుందంటే కూడా అంతే సంకుచితంగా ఉంటుంది. ప్రతి మతమూ, ప్రతి దర్శనమూ, ప్రతి తత్త్వశాస్త్రమూ ప్రత్యేకమైనవే. ఒక ప్రత్యేక సామాజిక-భౌగోళిక పరిస్థితిలోంచే అవి పుట్టుకొచ్చాయి. కాని ఏ మతమూ, ఏ దృక్పథమూ, ఏ తత్త్వశాస్త్రమూ మరొక మతంకన్నా, మరొక దృక్పథం కన్నా, మరొక తత్త్వశాస్త్రం కన్నా ఉన్నతమైనవి కావు.

కొన్ని మతాలూ, కొన్ని దృక్పథాలే కాదు, ప్రపంచంలో ఎందరు మనుషులున్నారో అన్ని దృక్పథాలు వికసిస్తాయి, వికసించాలి. అలాకాక, తన ఒక్క అభిప్రాయం మటుకే మనుషులందరికీ దారిచూపిస్తుందనేవాడికీ, ఫుట్ పాత్ మీద చిలకజోస్యం చెప్పటానికి కూచునేవాడికీ మధ్య తేడా ఏమీ లేదు.అసంఖ్యాకమైన, బహుళ దృక్పథాల మధ్య వ్యక్తులూ, సమూహాలూ, జాతులూ ఎప్పటికప్పుడు ముందుకు దారిచేసుకుంటూ పోవలసిఉంటుంది. రోడ్డుమీద ట్రాఫిక్ లో దారి వెతుక్కుంటూ పోయినట్టుగా, ఇది అనుక్షణం జరిగే ఒక negotiation.

ప్రపంచబహుళత్వం మునుపెన్నడూ లేనంత స్పష్టంగా అనుభవమవుతున్న ఈ వేళ ఈ వినమ్రతను , ఈ సంస్కారాన్ని అలవర్చడం కన్నా మించిన కర్తవ్యం విద్య కి మరొకటి ఉంటుందనుకోను.

22-4-2018

One Reply to “”

  1. మీకు పెన్నిధిలా దొరికిన పదమే కాదు. మాకు ఓ నిధిలా అందచేసారు. ధన్యవాదాలు!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading