జయతి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఏ పూలగుత్తి ఇవ్వగలనా అని ఆలోచించాను. ఇప్పుడు మీరు హాన్ షాన్ కవిత్వంలో మునిగితేలుతున్నారు కదా. అందుకని ఆయన కవిత్వమే మీకు కానుక చేస్తున్నాను.
చైనీస్ లో హాన్ అంటే మంచు, షాన్ అంటే కొండ. అంటే హిమాలయం. మన కవుల్ని ఉత్తరాదిని ఉన్న హిమాలయాలు ఎంతగా ప్రలోభపరిచాయో, చైనాలో దక్షిణాదిన ఉన్న హిమాలయాలు కూడా ఆ కవుల్ని అంతగా ప్రలోభపరుస్తూనే ఉన్నాయి. అటువంటి హిమాలయాల గురించి రాసిన ఒక హిమాలయ కవి ఆయన.
ఆయన ఏ కాలంవాడో ఎవరో ఇతమిత్థంగా తేల్చలేకపోయారు. కొన్ని సంకలనాల్లో ఆయన్ని మరీ ప్రాచీనకాలంలో చూపిస్తే, కొన్ని సంకలనాలు మరీ ఆర్వాచీన కవిగా చూపిస్తాయి. ఆయన పేరుమీద లభ్యమవుతున్న 310 కవితలు కనీసం ఇద్దరు కవులు రాసారని కొందరంటారు. మన వేమనలాగా, తమిళ అవ్వయ్యారు లాగా, ఈ లెక్క తేలేది కాదు. ఆయన్ని చివరిసారి కొండలమీదనే చూసారనీ, ఒక కొండనెర్రె విచ్చుకుని అందులోనే ఆయన అదృశ్యమైపోయాడనీ ఐతిహ్యం. ఒక్కటి మటుకు స్పష్టం. కవీ, కొండా ఒకటైపోయిన ఇటువంటి ఉదాహరణ ప్రపంచసాహిత్యంలోనే మరొకటి లేదు.
రెండు పుస్తకాలు. ఒకటి ప్రాచీన చీనా హిమాలయ కవుల కవితాసంపుటి. మరొకటి హాన్ షాన్ కవిత్వానికి రెడ్ పైన్ చేసిన అనువాదం.
ముందుగా, హాన్ షాన్ దే ఒక కవిత. :
హిమాలయం
ఆశ్రయం కోరుకునేవాళ్ళకి
హిమాలయం మంచి దిక్కు.
చిక్కటి దేవదారు తరువులమధ్య
కొండగాలి తేలిపోతుంటుంది,
చేరువ కాగలిగావా
సంగీతం మరింత వినిపిస్తుంది.
చెట్లకింద ఎవరో సాధువు
వైరాగ్యశతకం పఠిస్తున్నాడు.
పదేళ్ళయింది ఇల్లుచూసి,
ఇప్పుడా దారి మర్చిపోయాడు.
(హాన్ షాన్, 3)
24-8-2018