స్వీడిష్ కవిత్వంతో మరోసారి

340

తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ ని చదివిన తర్వాత స్వీడిష్ కవిత్వం మీద ఆసక్తి పెరగకుండా ఉండటం కష్టం. హేరీ మార్టిన్ సన్ ని చదివిన తరువాత, స్వీడన్ నీ, స్వీడిష్ ప్రకృతితో, అక్కడి పూలతో, పొదల్తో, పిట్టల్తో, ఫలాల్తో ప్రేమలో పడిపోకుండా ఉండటం అసాధ్యం. ఆ తొలివలపు లో గున్నార్ ఎకెలాఫ్ ని కూడా చదివాను. ఆ ముగ్గురు కవులూ రగిలించిన దాహాన్ని, ఇదిగో, ఇప్పుడు The Star by my Head: Poets From Sweeden (మిల్క్ వీడ్, 2013) మరింత రగిలించింది.

మలేనా మోర్లింగ్ (జ్.1965), జోనాస్ ఎల్లెర్ స్ట్రోమ్ (జ.1958) అనే స్వీడిష్ అనువాదకులిద్దరు ఈ కవితల సంకలనాన్ని ఎంతో ఇష్టంగా ఇంగ్లీషులో వెలువరించారు. ఆక్టేవియో పాజ్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడట: కవిత్వం అనువదించడం ప్రేమతో చేసే పని అని. ప్రేమతో చేసేవి కాకపోతే ఆ అనువాదాలకు అర్థమే లేదన్నాడట. ఈ అనువాదకులు ఆ మాటలు తలుచుకుంటూ మనకోసం అందించిన కానుక ఇది.

ఇందులో ఎనిమిది మంది కవులు, 1892 నుంచి 1951 మధ్యకాలంలో పుట్టినవాళ్ళు,స్వీడిష్ కవిత్వాన్ని ప్రపంచ పటం మీద నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఉన్న డెబ్బై కవితలూ ఇరవయ్యవ శతాబ్ది స్వీడిష్ కవిత్వానికి ప్రతినిధి పద్యాలని చెప్పవచ్చు.

అనువాదాలతో పాటు, మలేనా మోర్లింగ్ రాసిన ఒక ముందుమాట, స్వీడిష్ కవిత్వ చరిత్రమీద జోనాస్ ఎల్లెర్ స్ట్రోమ్ రాసిన ఒక సంగ్రహ సమీక్షా కూడా ఉన్నాయి.

ఈ కవితల్లో ఒక దేశం నెమ్మదిగా మేల్కోవడం, తనని తాను తెలుసుకోవడానికి తపించడం, తనని తాను గుర్తుపట్టుకోవడం కనిపిస్తాయి. ఒక జాతి ఆ సమాజంలో వ్యక్తుల మధ్య సంభవించే సంబంధాల్లో, కలయికల్లో, విడిపోవడాల్లో, ఆశనిరాశల్లో తనని తాను పోల్చుకుంటుంది. ఆ క్షణాల్ని కవిత్వం చాలా శక్తిమంతంగా పట్టుకుంటుంది కాబట్టే, ప్రతి జాతీ తన కవుల్ని ప్రేమిస్తుంది.

అట్లాంటి అపురూపమైన క్షణాల్ని పట్టుకోవడంలో స్వీడిష్ కవుల ప్రతిభ నన్ను ముగ్ధుణ్ణి చేస్తూనే ఉంటుంది. ఆ సుగంధమయ క్షణాల్ని ఈ అనువాదాలు ఎంతో జాగ్రత్తగా మనదాకా తీసుకొస్తున్నాయి.

అనువాదాల గురించి చెప్తూ తోమస్ ట్రాన్స్ ట్రోమర్ ఇలా అన్నాడట:

‘ప్రతి కవితా మనకు తెలిసిన సాంప్రదాయిక భాషలకి అవతల ఉండే ఒక అదృశ్య పద్యానికి వ్యక్తీకరణ. కాబట్టి ఒక కవితను మనమొక కొత్త భాషలోకి అనువదిస్తున్నామంటే, ఆ అదృశ్యభాషలో కవితను మరోమారు చదవడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట.’

ఈ కవితలు చదువుతుంటే, మనకి కూడా ఆ అదృశ్యభాష తెలుసననీ, నిజానికి, ప్రపంచవ్యాప్తంగా కవిత్వ ప్రేమికులందరి మాతృభాషా ఆ అదృశ్యభాషనే అనీ నమ్మకం కలుగుతుంది.

మూడు కవితలు మీకోసం:

నిర్ణయం

ఎడిత్ సోడెర్ గ్రాన్ (1892-1923)

నేను చాలా పరిణతురాల్ని, ప్రత్యేకమైనదాన్ని

కాని ఎవరికీ సంగతి తెలీదు.

నా స్నేహితులు నా గురించి మరోలా ఊహించుకుంటారు.

కాని నేను మెత్తటిమనిషి కాను.

నా గద్దగోళ్ళతో మెత్తదనమెట్లాంటిదో

తూచి మరీ తెలుసుకున్నాను.

గృధ్రరాజమా, చాపుకున్న నీ రెక్కల్లో ఎంత మాధుర్యం

నువ్వు కూడా అందరిలానే నిశ్శబ్దంగా ఉండిపోగలవా?

బహుశా నీకేదైనా రాయాలనిపిస్తుందేమో కదా.

చూడు, మళ్ళీ మళ్ళీ రాయలేవు.

ఒక కవిత రాయడమంటే మరొక కవితను చింపెయ్యడమే,

ఒక కవిత అంటే వట్టి పద్యం కాదు, గోళ్ళతో గీరడం.

అలంకార శాస్త్రం

గున్నార్ ఎకెలోఫ్ (1907-1968)

నువ్వా నిశ్శబ్దాన్ని వినితీరాలి.

ప్రకటనలవెనక, పూర్వస్ఫురణలవెనక ఉన్న నిశ్శబ్దాన్ని,

వాక్పటిమలో నిశ్శబ్దాన్ని,

లేదా ఆలంకారికంగా పరిపూర్ణమైనదానిలో నిశ్శబ్దాన్ని.

అర్థవంతమైనదానిలో

అర్థరాహిత్యంకోసం అన్వేషణ ఇది

లేదా ఇంకోలా చెప్పాలంటే

అత్యంత కళాత్మకంగా నేను కూర్చాలనుకుంటున్నదంతా

కళారహితంగా ఉండటం గురించే.

పరిపూర్ణమైనదంతా పూర్తిశూన్యమే.

నేనేది రాసానో అదంతా

పంక్తికీ పంక్తికీమధ్య ఖాళీలోనే.

ఆదివారం

వెర్నెర్ ఏస్పెన్ స్ట్రోమ్ (1918-1997)

రోజు మళ్ళీ రాదు కాబట్టి

దీన్ని నేనెప్పటికీ మర్చిపోలేను.

సూర్యుడు తూర్పున ఉదయించాడు, పడమట అస్తమించాడు

అకాశాన్ని నక్షత్రాలకు అప్పగించాడు.

ఒక వ్యోమనౌక ఒక్కటే ఈదులాడుతోంది.

కిటికీ తెరిచి ఉంది, వాడిపోని ఎర్రటి జెరేనియాల

వెనగ్గా రేడియో పాటలు పాడింది, మాట్లాడింది.

ఆమె నల్లటి ద్రాక్ష గుత్తులు కత్తిరించి

వంటింట్లోకి తెచ్చుకుంది.

అక్కడ బయట ముంగిట్లో,

సాయంకాలం వార్తలు వినిపించేసమయానికి

పిల్లవాడు స్కూటర్ మీద వాలి

స్పార్క్ ప్లగ్గు కక్కుతున్న నిప్పుతునకలు

చూసుకుంటూ మురిసిపోతున్నాడు.

 

27-8-2017

 

Leave a Reply

%d bloggers like this: