సుకృతుడు

Reading Time: 2 minutes

300

సూర్యుడి ప్రకారమే కాదు, చంద్రుడి ప్రకారం కూడా ఒక ఏడాది గడిచిపోయిందని గుర్తు చేసుకుంటూ నిన్న సాయంకాలం మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘కవితాత్మీయం’ పేరిట కవితా ప్రసాద్ కుటుంబసభ్యులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసారు.

తన కుటుంబాన్నీ, మిత్రుల్నీ, సాహిత్యాన్నీ ఉన్నట్టుండి వదిలేసి వెళ్ళిపోయిన కవి గురించి దుఃఖిస్తూనే ఒక ఏడాది గడిపేసాం. ఆ లోటు పూడ్చలేనిదనీ, ఆ ఆఘాతం తట్టుకోలేనిదనీ అనుకుంటూండగానే కాలం గడిచిపోయింది. కృష్ణదేవరాయలు అన్నట్టుగా పడవ ఉన్నట్టే ఉండి ఇంతలోనే అవతలి ఒడ్డుకి చేరినట్టు కాలం కూడా కదలనట్టే కనిపిస్తూ మనని మోసపుచ్చుతూంటుంది.

కాని నిన్న కవితా ప్రసాద్ ను తలుచుకున్న తీరు వేరు. ఇక ఆ పార్థివజీవిత చర్చ ముగిసిపొయింది. అపార్థివ జీవన వైభవ గానం మొదలయ్యింది.

ఒక మనిషి జీవితంలో కోరుకోవలసిందేమిటి? అస్యవామీయ సూక్తానికి వివరంగా వ్యాఖ్యానం రాస్తూ కున్హన్ని రాజా ఈ ప్రశ్నే వేసాడు. వేదకాల యువకుడు ఏమి కోరుకుని ఉంటాడని? అతడిప్పట్లాగా, ముఫ్ఫై ఏళ్ళు నిండకుండానే ఒక మళ్టీ నేషనల్ కి సి.ఇ.ఓ కావాలని కోరుకోలేదు. రాజ్యం, సంపద మరే మానుషానందాన్నీ కోరుకోలేదు. వేదకాల మానవుడు కోరుకున్నది తన జీవితానుభవమంతటితోటీ ఒక చక్కని సూక్తం చెప్పాలనిమాత్రమే.

చాలా ఏళ్ళ కిందట శేషేంద్ర నాకొక ఉత్తరం రాస్తూ ఈ మాటే రాసాడు. ‘అనుభవం అక్షరంగా రూపాంతరం చెందాలి’ అని.

కవితాప్రసాద్ లోని మృత్తిక మృత్తికలో కలిసిపోయింది. కాని అతడిలోని శ్వాస అక్షరంగా మారిపోయింది.

నిన్న సాయంకాలం ‘బాల చైతన్యం’ పేరిట పదిమంది చిన్నారులు, ఎల్.కె.జి చదువుతున్న శిశువునుండి తొమ్మిదో తరగతి విద్యార్థిదాకా గొంతెత్తి ‘ప్రణవసుమదామ/నిగమపరాగసీమ/సప్తగిరిధామ కలియుగసార్వభౌమ’ అని ‘సప్తగిరిధామ’ పద్యాలు, ‘త్రిపురసుందరి మాకు ప్రసన్నమయ్యెడిన్’ అంటూ ‘కాదంబినీ పద్యాలు చదువుతుంటే, కవితాప్రసాద్ కూడా ఒక గోగులపాటి కూర్మనాథకవిలాగా, ఒక కాసులపురుషోత్తమకవిలాగా తెలుగుసాహిత్యంలో చిరంజీవిగా నిలిచిపోగలడనిపించింది.

పిల్లలట్లా పద్యాలు పాడేక, నాట్యాచార్య కె.వి.సత్యనారాయణ నిర్దేశనలో కవితాప్రసాద్ రాసిన నృత్యనాటికలనుండి కొన్ని ఘట్టాలు ప్రదర్శించారు. ‘ఇది భువనవిజయం’ పేరిట ఒక నృత్యం, ఆముక్తమాల్యద నుండి గోదా, శ్రీరంగనాథుల ప్రణయం, మనుచరిత్రనుండి వరూధినీ, ప్రవరుల సంభాషణ, పారిజాతాపహరణం నుంచి సత్యభామ ప్రవేశ దరువులతో పాటు శివపార్వతుల తాండవ, లాస్య విన్యాసం దాదాపు గంటసేపు అక్కడున్నవారందరినీ మరోలోకానికి తీసుకుపోయేయి. ప్రాచీన కూచిపూడి యక్షగానకర్తల కోవలోకి కవితాప్రసాద్ కూడా చేరిపోయాడు. ఒక వక్త అన్నట్టుగా, బహుశా, వాళ్ళంతా ఇప్పుడు ఇంద్రసభలో ఈ నాట్యం గురించే మాట్లాడుకుంటూ ఉండవచ్చు.

మనిషి ప్రాణంతో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా రెండు జీవితాలు జీవిస్తాడు. దేహంతో జీవించే జీవితం ఒకటి, భావంతో జీవించే జీవితం ఒకటి. దేహంతో జీవించే జీవితానికి చాలా పరిమితులున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అది నశ్వరమని మనకు తెలుసు. కాని భావానికి జరామరణాలు లేవు.

జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః

2-4-2016

Leave a Reply

%d bloggers like this: