సాహిత్యసేవకుడు

310

ఈ మధ్య నిర్వహించిన తెలుగుమహాసభల్లో మహోన్నత కవి, రచయిత, నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, సాహిత్యసేవకుడు, దళిత, గిరిజన ప్రేమికుడు సి.వి.కృష్ణారావుగారిని తెలంగాణా ప్రభుత్వం గౌరవించుకుంటుందేమో అని చూసాను. ఒకప్పుడు నిజాంను ఎదిరించిన యోధానుయోధుల్లో ఇప్పటికీ సజీవంగా మనమధ్య సంచరిస్తున్న అతికొద్దిమంది మహనీయుల్లో కృష్ణారావుగారు కూడా ఒకరని ఆ నిర్వాహకులకు తెలియకపోయి ఉండాలి!

అదేమంత ఆశ్చర్యం కాదు. నేను ‘వందేళ్ళ తెలుగు కథ’ (2001) సంకలనం చేసినప్పుడు అందులో కృష్ణారావుగారి ‘నోటీస్’ (1948) ను చేర్చినప్పుడు ప్రసిద్ధ పాత్రికేయుడొకాయన నన్ను అవహేళన చేస్తూ ఒక సమీక్ష రాసాడు. ఈ ఆంధ్రప్రాంతపు సంపాదకుడికి, అంటే నాకు, నిజాం వ్యతిరేక పోరాట సాహిత్యంలోంచి ఎంపికచేయడానికి మరొక ఆంధ్రప్రాంత రచయిత కథనే దొరికిందా అని. కాని, ఆ మేధావికి తెలియనిదేమంటే కృష్ణారావుగారు నైజాం పౌరుడిగానే జన్మించారనీ, వారి తల్లిగారు మునగాల పరగణాలోని రేవూరు ఆడబిడ్డ అనీ ! అంతేనా? నిజాం మీద తెలంగాణా సాయుధపోరాటం జరుగుతున్న రోజుల్లో సి.వి.కృష్ణారావు అనే ఇరవై రెండేళ్ళ యువకుడు నిజాం మీద గ్రామాల్లో నోటీసులు అంటిస్తున్నందుకు అతడు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చివెయ్యమనే ఉత్తర్వులుండేవనీ! అంతేనా? ఆ తర్వాత ఆయన తన జీవితంలో సింహభాగం పూర్వపు అదిలాబాదు, కరీం నగర్, ఖమ్మం,మహబూబ్ నగర్ జిల్లాల్లో దళితులమధ్యా, గిరిజనుల మధ్యా సంచరిస్తూ ‘లక్ష బొటమనవేళ్ళు చదివినవాడు’ అనీ!

కానీ కృష్ణారావు గారు అదృష్టవంతులు. ఆయన చేసిన కృషిని ప్రభుత్వం మర్చిపోయినా ఆయన మనమలూ, మనమరాళ్ళూ మర్చిపోలేదు.

వాళ్ళంతా నిన్న ఒక వేడుక జరిపి మరీ తమ తాతయ్యనీ, అమ్మమ్మనీ ఘనంగా సత్కరించుకున్నారు.కాని, తమ సంతోషాన్ని తమ కుటుంబాలకే పరిమితం చేసుకోకుండా కృష్ణారావుగారి మిత్రుల్నీ, నాలాంటి శిష్యుల్నీ కూడా ఆ సంతోషంలో పాలుపంచుకోడానికి ఆహ్వానించేరు.

నిజంగా అది ఒక చారిత్రిక సన్నివేశం. చరిత్రగమనం గురించి తెలిసినవారికి ఒక విషయం బాగా అర్థమవుతుంది. చరిత్ర ఎప్పుడూ చిన్న చిన్న బృందాల్లోనూ, ఆత్మీయగోష్ఠుల్లోనూ ముందు తలెత్తుతుందని. (మహాప్రజాసమూహాలు విశాలమైదానాల్లో కదం తొక్కడం ఆ తర్వాతి సంగతి.) చరిత్రను కళ్ళారా చూడటం అంత సులువుగా లభించే అవకాశం కూడా కాదు. కృష్ణారావుగారు ఒక సామాజిక చరిత్రసంపుటి, సాహిత్యచరిత్రసంపుటి, కానీ, తానో మరొకడో ఎవరో ఒకరు మటుకే జీవించవలసివస్తే తన తోటిమనిషికి జీవితావకాశాల్ని అందించి తాను వెనకవరసలో నిలబడిపోగలిగిన వ్యక్తి.

నిన్న ఆ సందర్భంలో అక్కడ ఉండగలగడం నా భాగ్యం మటుకే. కృష్ణారావుగారి సుదీర్ఘజీవనయానాన్ని ప్రతిబింబించే చిన్నపుస్తకమొకటి ‘నడకనావ’ పేరిట ఆయన మనమలూ, మునిమనవలూ సంకలనం చేసారు. ఆ పుస్తకాన్ని వరవరరావుగారితో కలిసి ఆవిష్కరించే అవకాశం ఆ పిల్లలు నాక్కూడా ఇవ్వడం నాకు లభించిన అరుదైన కానుక.

రావెలసోమయ్యగారు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, శీలావీర్రాజుగారు, సుభద్రాదేవిగారు, కొండపల్లి నీహారిణిగారు, సిద్ధార్థ, గంగారెడ్డి, ఆదిత్య, ఎమ్మెస్ నాయుడు, మా సాయిప్రమోద్ లతో పాటు మరికొందరు సాహిత్యమిత్రులుకూడా ఆ వేడుకలో పాల్గొన్నారు. పెద్దలంతా కృష్ణారావుగారి వ్యక్తిత్వం గురించీ, సాహిత్య, సామాజిక కృషి గురించీ తలుచుకున్నారు. కాని అన్నిటికన్నా, వారి కుటుంబసభ్యుడొకాయన చెప్పిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆయన కృష్ణారావుగారి జీవితాన్ని సాంఘికసంబంధాలు, కుటుంబసంబంధాలు, కృష్ణారావుగారు, సీతాదేవిగార్ల దాంపత్యసంబంధం అనే మూడు అంశాలుగా విడదీసి కృష్ణారావుగారు మూడు సంబంధాల్నీ కూడా నిబద్ధతతో నిర్వహించుకోగలిగేరని చెప్పాడు.

కుటుంబాల్ని పక్కనపెట్టి సమాజసేవచెయ్యడం లేదా సామాజిక బాధ్యతని పక్కనపెట్టి కుటుంబాల్లోనే కూరుకుపోడం- ఈ రెండు అపరాధాలనుంచీ బయటపడ్డ వ్యక్తి కాబట్టే కృష్ణారావుగారు ఇందరికి స్ఫూర్తిదాయకులుగా ఉంటున్నారనేది మరోసారి ఆయన మాటల్తో తేటతెల్లమయింది.

27-1-2018

Leave a Reply

%d bloggers like this: