సాహిత్యవేత్త

383

నేను సాహిత్యాన్ని ప్రత్యేకం ఏ గురువు దగ్గరా అభ్యసించలేదు. జీవితం అట్లాంటి అవకాశం నాకివ్వలేదు. అందరిలానే తెలుగు కూడా ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియేట్ దాకా చదువుకున్నానుగాని, ప్రత్యేకం, ఒక కావ్యమో, కావ్యపాఠమో ఎవరిదగ్గరా చెప్పించుకోలేదు. కాని, నాకు ఒకరు కాదు, అనేకమంది గొప్ప గురువుల సాంగత్యం, సాన్నిహిత్యం లభించింది. ఏదో ఒక రీతిన వారి శుశ్రూష చేసుకోవడం ద్వారా కొద్దో గొప్పో సాహిత్యప్రపంచంలోకి నాకొక ప్రవేశం లభించింది. రాజమండ్రిలో ఉన్నకాలంలో శరభయ్యగారితో గడిపిన సాయంకాలాల్లో ఆయన ఏం చెప్పినా నా చెవులు దోసిటపట్టి మరీ వినేవాణ్ణి. ఆ రోజుల్లో ఆయన ఎక్కడ మాట్లాడినా, సదనం, గౌతమీగ్రంథాలయం, విక్రమహాలు, ఆర్ట్స్ కాలేజి-ఎక్కడ మాట్లాడినా పోయి వినేవాణ్ణి. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, కవిత్రయం, శ్రీనాథుడు, ప్రబంధకవులు-వారందరిమీదా, ప్రతి కవి మీదా కనీసం ఒక ప్రసంగమేనా విన్నాను.సుదర్శనంగారితో గడిపిన కాలం కూడా అట్లాంటిదే. ఆయన ప్రసంగాలు కూడా అట్లానే పోయి ముందువరసలో కూచుని వినేవాణ్ణి. ఏదన్నా మాట్లాడాలనిపిస్తే ఇంటికిపోయేవాణ్ణి. విసుగులేకుండా ఆయన గంటల తరబడి మాట్లాడేవారు. ఇక ఆధునిక తెలుగు సాహిత్యం, నవల, ముఖ్యంగా కథ గురించి భమిడిపాటి జగన్నాథరావుగారికి నేనూ, మా అక్కా జీవితకాలం ఋణపడి ఉంటాం. మాకు తెలుగు కథల గురించి చెప్పడమే కాక, మాతో కథలు రాయించారాయన. హీరాలాల్ మాష్టారు, సి.వి.కృష్ణరావుగారు, మందేశ్వరరావుగారు, డా.యు.ఏ.నరసింహమూర్తి-పొద్దున్నే తలుచుకోవలసిన మహనీయులు, నా జీవితాన్ని సుసంపన్నం చేసినవారు, మరికొందరున్నారు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, సాహిత్యం పేరు చెప్పి ఎవరేనా నాకు తారసపడ్డప్పుడు, నేను అతడినుంచి ఏమి నేర్చుకోగలనా అని చూస్తాను. నాకు తెలియని సాహిత్యలోకాలేవైనా అతడు చూసాడా, నాకు చూపించగలడా, లేక నాకు తెలిసిన లోకాల మీదనే అతడేదైనా కొత్త వెలుగు ప్రసరింపచేయలడా అని చూస్తాను. అతడి అంతరాంతర జ్యోతిస్సీమల్ని వెతుక్కుంటాను. మూడవ వ్యక్తినో, కవినో, కథకుడినో ద్వేషించడం, దూషించడం కాకుండా, మేం కలిసి కూచున్న కొద్దిసేపూ నాలో కొత్త స్ఫురణలేమైనా రేకెత్తించగలడా అని ఆశపడుతుంటాను.

చాలా ఏళ్ళ తరువాత అటువంటి ఒక మహనీయ సాహిత్యవేత్త నాకు ఈ మాధ్యమంలో తారసపడ్డారు. శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తికి మనం సమకాలికులం కావడం మన అదృష్టమని భావిస్తాను. నేను ఎటువంటి సాహిత్యవేత్తకోసం అన్వేషిస్తుంటానో, అటువంటి సాహిత్యసహృదయుడు ఆయన. తూర్పు పశ్చిమ సాహిత్యకృతుల్ని సాకల్యంగా చదువుకున్నవాడు. సంస్కృతంలో సాహిత్యం మాత్రమే కాదు, ఉపనిషత్తుల్నీ, గీతనీ చదువుకుని, వ్యాఖ్యానించిన వాడు. కవిత్రయాన్ని, ముఖ్యం, తిక్కనని సంపూర్ణంగా చదువుకున్నవాడు. ఆధునిక తెలుగుసాహిత్యంతో పాటు, టాల్ స్టాయినీ, డాస్టొవిస్కీ, కిర్క్ గార్డు, కాఫ్కా, కామూ లను చదువుకున్నవాడు. చదువుకున్నదాన్ని సమన్వయం చేసుకోగలిగినవాడు. సాహిత్యసారాంశాన్ని రక్తాస్థిగతం చేసుకుని. అట్లా చేసుకున్నదాన్ని మాత్రమే తిరిగి మనతో పంచుకోడానికి ఇష్టపడేవాడు.

ఆయనకిప్పుడు ఎనభై రెండేళ్ళు. ఆరేడేళ్ళ కిందట, తన మనవడిదగ్గర కంప్యూటరు చూసి దాన్నెట్లా ఆపరేట్ చెయ్యాలో నేర్చుకున్నారు. అది మన అదృష్టం. ఈ రెండేళ్ళుగా ఆయన తన జీవితకాల సాహిత్యసంపదనంతా దోసిళ్ళతో విరజిమ్ముతున్నారు. మొదట టి.ఎస్.ఇలియట్ ‘వేస్ట్ లాండ్’ మరి నాలుగు కవితలమీద ధారావాహికంగా పరిచయ వ్యాసాలు రాసారు. ప్రస్తుతం మహారాష్ట్ర సంత్ కవి జ్ఞానేశ్వర్ రాసిన ‘అనుభవామృతం’ తెలుగు చేస్తున్నారు. మిత్రుడు గంగారెడ్డి అడిగాడని, ప్రతి శనివారం ఇరవై ఓవీల చొప్పున, తెలుగులో అందిస్తున్నారు. ఈ మధ్యలోనే తీరికచేసుకుని, షేక్ స్పియర్ నాటకాలు పెరిక్లీజ్ పైనా, మేక్బెత్ పైనా సమగ్రమైన సమీక్షావ్యాసాలు అందించారు. ఇక, వారం రోజుల కిందట, ‘టెంపెస్ట్’ నాటకం మీద మరొక వ్యాసం మనకి అందించారు.

43 పేజీల వ్యాసం! ఒక్క వ్యర్థ పదం, అనవసరమైన ఒక్క విరామచిహ్నం కూడా లేని వ్యాసమది. సాహిత్య విద్యార్థులే కాదు, సాహిత్యవిమర్శకులు కూడా, ప్రతి ఒక్కరూ, చదివి అధ్యయనం చేయవలసిన వ్యాసం అది. ఒకప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక మాటన్నారు. ‘మన విమర్శకులు టెక్స్ట్ వదిలిపెట్టి చంక్రమణం చేస్తారు’ అని. టెక్స్ట్ ని ఎలా చదవాలో, టెక్స్ట్ ని మాత్రమే ఎందుకు చదవాలో ఈ వ్యాసం చదివితే తెలుస్తుంది.

ఈ వ్యాసం చదివినతర్వాత, నాకు గొప్ప సాంత్వన కలిగింది. తెలుగు సాహిత్యాన్నీ,ఈ మాధ్యమాన్నీ నేను వదిలిపెట్టేసుకోవలసిన అవసరం లేదనిపించింది. నా మిత్రులు కూడా నాలాంటి పిపాసులేనని నమ్ముతూ, ఈ వ్యాసం మీకు పరిచయం చేస్తున్నాను. తీరిగ్గా చదవండి. తీరిక చేసుకుని చదవండి. గత ఇరవయ్యేళ్ళుగా టెంపెస్ట్ నాటకం మీద ఇంగ్లీషులో వచ్చిన గొప్ప విమర్శ చాలానే చదివాను. కాని, ఇంత సమగ్రమైన విమర్శ, ఇంత సమన్వయపూర్వకమైన అధ్యయనం నేనింతదాకా చదవలేదు. మీరు చదవండి, మీ మిత్రులతో చదివించండి,మీ పిల్లలతో చదివించండి. మనం విద్యావంతులమని చెప్పుకోగలిగేది ఇటువంటి సాహిత్యానుశీలన చేసినప్పుడూ, ఇటువంటి అనుశీలన చదివినప్పుడూ మాత్రమే.

5-7-2018

Leave a Reply

%d bloggers like this: