సాహిత్యం ఏం చేస్తుంది?

Reading Time: 4 minutes

378

బుచ్చిబాబు గొప్ప కథకుడు, ఒకే ఒక్క నవల రాసినా, అజరామరంగా మిగిలిపోయిన నవల మనకి అందించిన, నవలాకారుడు. కవి, రూపకకర్తా, చిత్రకారుడూ కూడా. కాని, ఆ సృజనాత్మక సాహిత్యం మనకి లభ్యం కాకుండా, ఆయన సాహిత్యవ్యాసాలు ఒక్కటే మనకు మిగిలివున్నా కూడా నేనాయన్ని అగ్రశ్రేణి సాహిత్యవేత్తగా పరిగణిస్తాను. ఆయన ఒక సత్యాన్వేషి, సత్యాన్వేషణతో సాహిత్యాన్ని పరిశీలించినవాడు అనే అంశాన్ని ఎందుకనో బుచ్చిబాబు గురించి మాట్లాడేవాళ్ళు మర్చిపోతుంటారు. అందుకని, నిన్న బుచ్చిబాబుగారి మీద రేడియో కోసం ఒక ప్రసంగం చెయ్యమని సి.ఎస్.రాంబాబు గారు అడిగితే, బుచ్చిబాబు సాహిత్యవ్యాసాలమీదనే ప్రసంగించాను.

చలంగారి గురించి రాస్తూ బుచ్చిబాబు ప్రతి సాహిత్యకారుడికీ, తన పట్ల, సమకాలికుల పట్ల, భవిష్యత్తు పట్ల మూడు బాధ్యతలున్నాయంటాడు. రచయితకి తన పట్ల ఉన్న బాధ్యత వల్ల స్వీయచరిత్ర రాసుకుంటాడనీ, భవిష్యత్తు పట్ల ఉన్న బాధ్యత వల్ల రానున్న తరాలకు మార్గదర్శకంగా ఉండే కళాకృతుల్ని విడిచిపెట్టి వెళతాడనీ చెప్తూ, సమకాలికుల పట్ల ఉండే బాధ్యత వల్ల ఉపన్యాసాలకూ, వ్యాసాలకూ పూనుకుంటాడనీ అంటాడు. ఆ విధంగా చూస్తే ఆయన సాహిత్య వ్యాసాలు తన సమకాలికుల పట్ల బాధ్యత నిర్వహించే క్రమంలో రాసినవని అర్థమవుతుంది. తన సమకాలికులైన తెలుగు రచయితలు కృష్ణశాస్త్రి, చలం, అడివిబాపిరాజు, తిలక్, గోపీచంద్ ల గురించి రాయడంతో పాటు, ఎలియట్, మామ్, రసెల్, హక్స్ లీ వంటి ఇంగ్లీషు రచయితల సాహిత్యానుశీలన చెయ్యడానికి కారణమిదే అనిపిస్తుంది.

సాధారణంగా మనకొక సందేహం కలుగుతూ ఉంటుంది. అత్యధికసంఖ్యాకులైన పాఠకుల్ని ఆకర్షిస్తూ, వాణిజ్యపరంగా కూడా జయప్రదమైన రచయితలకీ, బుచ్చిబాబు వంటి రచయితలకీ తేడా ఏమిటని? పుస్తకాల దుకాణాలకు వెళ్తే, అక్కడ fiction అనీ, literary fiction అనీ వేరే వేరే గా పుస్తకాలు అమ్మకానికి పెట్టి ఉంటాయి. మామూలు కల్పనా సాహిత్యం నుంచి, ఈ ‘సాహిత్యాత్మక కల్పన’ ను వేరు చేసేదేమిటి?

దీనికి బుచ్చిబాబు వ్యాసాల్లో ఒక సమాధానం ఉంది. అడవి బాపిరాజు గురించి రాస్తూ ఆయనిలా అన్నాడు:

కళలో కూడా సౌందర్యతృష్ణ, రేఖా చిత్రణలో ప్రతిభ మాత్రం చాలవు. శిక్షణకు గురైన ఉద్రేకం ఒక దర్శనానికి (vision) ఆహుతి అయితేగాని గొప్ప చిత్రం రాదు’

అని. ఆయన ఈ మాటలు చిత్రకళ గురించి రాసినప్పటికీ, సాహిత్యకళకి కూడా వర్తించే మాటలే. ఇక్కడ, మూడు అంశాలున్నాయి: ఉద్రేకం,శిక్షణ, దర్శనం. మామూలుగా రచయితల్లో ఉద్రేకం మాత్రమే కనబడుతుంది. తమని నిలవనివ్వని ఉద్వేగం వల్లనే వాళ్ళు రచనలకి పూనుకుంటారు. వారు చెప్పే జీవితానుభవాలు, తమవో, ఇతరులవో, వాటి పచ్చిదనంవల్లా, వెచ్చదనం వల్లా,ఆ రచనలు మనల్ని చప్పున ఆకర్షించకుండా ఉండవు. కాని అంతమాత్రాన వాటిని ఉత్తమ సాహిత్యంగా పరిగణించలేం. వాటిని వ్యక్తీకరించడంలో కొంత శిక్షణ అవసరమవుతుంది. ఆ శిక్షణ, ఐరోపీయ చిత్రకారుల్లాగా, పూర్వకళాకారుల కళాకృతుల్ని అనుకరించడం ద్వారా లభ్యమయ్యేది కావచ్చు, లేదా ప్రాచీన భారతీయ గురుశిష్య సంప్రదాయంలోలాగా,ఒక గురువుని పట్టుకుని శుశ్రూష చెయ్యడం ద్వారా కావచ్చు. కానీ, శిక్షణ అయితే తప్పని సరి. ఇక మూడవది, అత్యంత కీలకమైన మాట, దర్శనం. దర్శనమంటే నీ కన్నా ముందే ఎవరో ఒకరు నిర్మించిపెట్టిన సిద్ధాంతం కాదు. అది నీకై నువ్వు నీ జీవితానుభవమ్మీంచి, నీ అంతర్దృష్టి మీంచీ ఏర్పరచుకునే ఒక జీవనవైఖరి. విశ్వాస సంపుటి. ఒక సిద్ధాంతాన్ని అనుసరించి రాసినప్పుడు కూడా, ఆ సిద్ధాంతాన్ని నీకై నువ్వు పరీక్షకు పెట్టుకుని, తర్కించుకుని, నీకోసం నువ్వు మళ్ళా విశదీకరించుకుంటేనే దర్శనంగా మారుతుంది. నీ దర్శనంగా. అటువంటి దర్శనానికి ఆహుతి అయిన సాహిత్యాన్నే మనం literary fiction అంటాం. బుచ్చిబాబు, గోపీచంద్, చలం, కుటుంబరావు వంటివారి రచనలన్నమాట.

అటువంటి దృక్పథాన్ని తనకై తాను ఏర్పరచుకునే క్రమంలో బుచ్చిబాబు కథానికా ప్రక్రియ గురించీ, కథకుడి అంతరంగం గురించీ కూడా కొంత అనుశీలన చేసాడు. కొత్తగా కథలు రాస్తున్న రచయితలకీ, చాలా కాలంగా రాస్తున్న రచయితలకీ కూడా ఆ అనుశీలన కొంత అంతర్దృష్టిని ప్రసాదిస్తుంది.

ఉదాహరణకి, కథలకి అవసరమైన వృత్తాంతం (theme) గురించి చెప్తూ, నువ్వో సంగతి విన్నప్పుడో, అనుభవానికొచ్చినప్పుడో వెంటనే కథగా రాసెయ్యొద్దని చెప్తూ, ఇలా అంటున్నాడు:

‘… ఆ వృత్తాంతం మనమీద ఒత్తిడి చెయ్యాలి. అందులో ఒక విశేషం ఉంది- కాలం, స్థలం, వీటికతీతమై మానవత్వాన్ని ఋజువు చేసే లక్షణం ఉంది, దానికి కళారంగంలో స్థానం ఉంది అని గట్టిగా నమ్మినప్పుడే ఆ కథకి పూనుకోవాలి.’

వృత్తాంతం లేదా ఇతివృత్తం కొంతకాలం కథకుడి అంతరంగంలో నలగాలని చెప్తూ ఇలా రాస్తున్నాడు:

‘..ఇతివృత్తం ఊహలో కొంతకాలం తిప్పుకుంటే గాని, కథకి స్వరూపం ఏర్పడదు. ఆ స్వరూపమే స్థిరమైందని రాసేసి వూరుకోకూడదు. వస్తువును స్వీకరించడం, ఊహలో వస్తువుల రూపకల్పన చెయ్యడం ఒకెత్తూ, రాసేటప్పుడు, కళానుగుణమైన ఆవేశానికి లొంగిపోయి కళానుగుణమైన సత్యాన్ని ప్రదర్శించడం ఒకెత్తూ. ఆ సత్యం కథకుణ్ణి చకితుణ్ణి చేస్తుంది. తనలోపలి చీకటితెరలు తొలగినట్లవుతుంది. ఒక్క క్షణం వూపిరి బిగపెట్టి ఒక వెలుగును చూస్తాడు. ఆ క్షణం ఆధ్యాత్మికానుభూతి పొందుతాడు. అట్లా పొంది, అందులో కాస్తో కూస్తో పాఠకుడితో పంచుకోగలిగితేనే, అతని కథ గొప్ప కథ అవుతుందనుకుంటాను.’

ఇక్కడ ఆయన ఆధ్యాత్మికానుభూతి అన్నదాన్నే జాయిస్ epiphany అన్నాడు. తనలోనూ, పాఠకుడిలోనూ ఆ సాక్షాత్కారాన్ని సిద్ధింపచేసుకోడమే కథనకళ.

‘అనుభవాల సంఖ్య ముఖ్యం కాదు, అనుభవం తీవ్రత, ఒత్తిడి, పదును-ఇవి ముఖ్యం’ అని చెప్తూ ‘నిజాయితీతో పాటు కథకుడిలో జీవితం పట్ల గౌరవం, కాస్తంత అమాయికత్వం కూడా వుండాలనుకుంటా. డి.హెచ్.లారెన్సులో ఆ గౌరవభావం లేదు, శరత్ లో వుంది’ అంటాడు. అయితే ఆ అనుభవాలు తనవే కానక్కర్లేదని చెప్తో, ఇలా కూడా అంటున్నాడు:

‘అనుభవాలన్నీ అతనికే సంభవం కానక్కర్లేదు. సజీవమైన ఇంద్రియాలతో ప్రతిదాన్ని పరిశీలించడం నేర్చుకున్న కథకుడు యితరుల అనుభవాన్ని తనదిగా చేసుకోగలడు. తనవి యితరులవిగా భావించగలగడం, యితరులవి తనవిగా చేసుకోగలగడం-కథకుడి ప్రధాన నైజం.’

ఇంకా ఇలా రాస్తున్నాడు:

‘సత్యాన్ని అన్వేషిస్తాడు కథకుడు. మనిషికి సమాజం, చరిత్ర ముసుగులు తగిలిస్తాయి. డబ్బు, మతం, కులం, కుటుంబసంప్రదాయం, పరిసరాలు, విద్య, వృత్తి, సంఘకట్టుబాట్లు-అన్నీ తలో ముసుగూ కప్పుతాయి. ఒక్కొక్కదాన్నే లాగి లోపల వున్న దృశ్యాన్ని చూడాలంటాడు కథకుడు. సిద్ధాంతాలు, మతాలు, రాజకీయాలు, శాస్త్రాలు-యివన్నీ తెలుసుకుంటాడు. కానీ దేన్నీ ఆమోదించి దాని ప్రచారానికి పూనుకోడు. ‘

అయితే ‘తనకి జీవితం పట్ల వున్న దృక్పథం ఇతరులు అలవర్చుకోవాలన్న కాంక్ష రహస్యంగా వుంటుంది అతనిలో. ఆ కాంక్షతో కథారచనకి పూనుకోడు. వివరికి అది జరుగుతుందని ఏదో నమ్మకం. ‘

కాని, ఈ మాటలు కూడా చెప్తున్నాడు:

‘రచన చేసేటప్పుడు కథకుడు ప్రదర్శించేది ఉద్వేగం. నిత్యజీవితంలో ఒక బాధకి, అనుభవానికి గురైనప్పుడు, ఉద్రేకానికి లొంగిపోయి, ఉద్వేగ స్థితిలో లీనమై జిజ్ఞాస, చైతన్యం కోల్పోతాడు. మిగతా మనుషులకి మల్లె కథకుడు కూడా-కాని దాన్ని మళ్ళీ స్మరించగలగడు-ఆ స్మరణప్పుడు, అంతటి ఉద్రేకం, ఉద్వేగం తిరిగి తెచ్చుకోగలవాడే కథకుడు. అన్యాయం జరిగినప్పుడు కథకుడికి కోపం వస్తుంది. మూర్ఖత్వం పట్ల అసహనం ఉంటుంది. కొందరి వైఖరిని నిర్మూలం చెయ్యాలన్న ‘కసి’వుంటుంది. -వీటి అన్నిటి వెనక, శ్రుతిలాగా, జాలి, సానుభూతి, ప్రేమ ఉంటాయి. …వీటి సమన్వయమే, ఉద్రేకం. ఒక్క నిట్టూర్పుతో ఆ కథని సమాప్తం చేసి ఇంక మరణానికి సిద్ధపడే వాడు గొప్ప కథకుడు. నీతి, న్యాయం, చట్టం, గొప్ప, పిన్న..వీటి పరామర్శ, సంఘర్షణ అంతటితో సమాప్తం.అవి లేవని కాదు. వాటిని ముంచెత్తివేసే మానవత్వం, కెరటాల తుంపరలో ఐక్యమై ‘ప్రశాంతం’ అనే ఒడ్డున, వొళ్ళు విరుచుకుని, పరమార్థచింతనలో పవ్వళించడం నేర్చిన వ్యక్తి కథకుడు.’

ఇంకా ఇలా రాస్తున్నాడు:

‘పక్షి గూడు కట్టాలనుకుంటుంది. దాని కోసం కావల్సిన ఆకు, అలము, గడ్డి, పుల్ల-ఎన్నెన్నో పోగు చేసుకొచ్చి గూడు కడుతుంది. అందులొ గుడ్డు పెడుతుంది. అనుక్షణమూ ఏదో సేకరిస్తూ, శోధిస్తూ, పోగుచేస్తూనే వుంటాడు కథకుడు. ఆ కృషికి విరామం లేదు. బోలెడు పోగవుతాయి. అతనిలో ఏదో జరుగుతుంది.-బాహ్య జగత్తు అనే గూడులోకి పారిపోయి కూర్చుంటాడు. అతనూ గుడ్లు పెడతాడు. పెద్దగాలికి గూడుపడి గుడ్డు పగులుతుంది. మళ్ళా మరో కథ రాస్తాడు. అంతే. అది అతని నైజం. తుపానుకి ఆ చెట్టు కూలుతుంది. మరో చోటుకి పోతాడు. మనుష్యుల్ని కూలని చెట్లుగా భ్రమించి వారి హృదయాలలోకి చొరబడి వారి ఆనందానికి కృషి చేసే జీవి కథకుడు.’

ఎందుకంటే-

‘రచయిత సంఘంతో బంధనాలు తెంచుకోలేని ఏకాంత జీవి.’

అంతిమంగా, సాహిత్య ప్రయోజనం ఏమిటి? కుటుంబరావు ఈ విషయంగా చెప్పిన మాట ఒకటి నాకు శిరోధార్యంగా ఉంటూవచ్చింది. ‘చట్టం చేయలేని పని సాహిత్య సంస్కారం చేస్తుంది’ అనేది. బుచ్చిబాబు కూడా అందుకు సమానమైన ఒక వాక్యం రాసాడు:

‘ఏమయ్యా, నువ్వేదో కొండల్లోకి వెళ్ళి ఒక్కడవూ తపస్సు చేస్తే ప్రపంచానికి ఏమిటి ప్రయోజనం అని రామకృష్ణ పరమహంసని అడిగారుట. ‘నాలో ఒక భావతరంగం లేచి ప్రపంచం అంతటా వ్యాపించింది’ అన్నాడుట. కథకుడి వంద కథలలో ఒక్క కథ అట్లాంటి అనుభూతి తరంగం విశ్వమంతా వ్యాప్తిచెందుతుందని నా విశ్వాసం. ఎవరో అన్నట్లు,

‘సాహిత్యం ఆత్మని రక్షించలేదు-రక్షించ తగిందిగా చేస్తుంది.’

9-6-2018

 

Leave a Reply

%d bloggers like this: