సాహితీవేత్త

Reading Time: 3 minutes

303

డా.నారాయణరెడ్డి ఈ లోకాన్ని వదిలిపెట్టడంతో, విలువైన ఒక సాహిత్యవేత్త తెలుగుసాహిత్యానికి శాశ్వతంగా దూరమయ్యాడు. ఆయన కవి, గీతకారుడు, పరిశోధకుడు, పండితుడు, పాలనాదక్షుడు, వక్త, వ్యాఖ్యాత. కానీ ఈ పార్శ్వాలన్నిటి ద్వారా ఆయనలోని సాహితీవేత్తనే ప్రముఖంగా కనిపిస్తూ వచ్చాడు, ఆకర్షిస్తూ వచ్చాడు, నలుగురినీ ఒప్పిస్తూ వచ్చాడు. సాహిత్యం పట్ల ఆయనకున్న ప్రీతి, అభినివేశం ఎటువంటివో నేను చాలా దగ్గరగా చూసాను. ఇప్పుడు ఆయన గురించి నా మదిలో మెదుల్తున్నవన్నీ ఆ జ్ఞాపకాలే.

2
నా చిన్నప్పుడు హైస్కూల్లో ఏవో పోటీల్లో బహుమతులుగా ‘మనిషీ-చిలక’, ‘మంటలూ-మానవుడూ’ పుస్తకాలు లభించాయి. అది నారాయణరెడ్డిగారి కవిత్వంతో నా తొలిపరిచయం. కాని ఆ రోజుల్లోనే మా తెలుగు మాష్టారు పాతకోట రాధాకృష్ణమూర్తిగారి దగ్గర ‘ఆధునిక ఆంధ్ర కవిత్వం-సంప్రదాయములు, ప్రయోగములు’ పుస్తకం చూసేను. ఆ పుస్తకం నన్ను గాఢాతిగాఢంగా ఆకట్టుకుంది. 20 వ శతాబ్ది తెలుగు కవిత్వం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికీ ఆ పుస్తకమే దిక్సూచి. ఆధునిక తెలుగు కవిత్వం గురించి, కవిత్వ పరిణామం గురించి ఆ పుస్తకం ఒక కథనాన్ని నిర్మించింది. ఇప్పటిదాకా ఏ సాహిత్యవిమర్శకుడు కూడా ఆ narrative ని దాటి బయటకు అడుగుపెట్టలేకపోయాడు. ఆధునిక తెలుగు కవిత్వం గురించిన నా అవగాహనకి ఆ పుస్తకానికి నేనెప్పటికీ ఋణగ్రస్తుడిగానే ఉంటాను.

3
నేను రాజమండ్రిలో ఉండే రోజుల్లో నారాయణరెడ్డిగారు అక్కడికొచ్చారు. ఆ సందర్భంగా ఆయన మీద ఒక వ్యాసం రాసిమ్మని సమాచారం సుబ్రహ్మణ్యం నన్నడిగాడు. నేను నారాయణరెడ్డిని కవిగా అంగీకరించలేననీ, ఆయన విశ్వంభర నన్ను ఆకట్టుకోలేదనీ చెప్పాను. అప్పుడు సుబ్రహ్మణ్యం నన్ను మందలించాడు. ఒక సాహిత్యవేత్త సమాజానికిచ్చిన ఉపాదానాన్ని సమగ్రంగా చూడాలనీ, ఏ విలువలవల్ల నారాయణరెడ్డి సమకాలిక తెలుగుసాహిత్యంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాడో చూడడానికి ప్రయత్నించమనీ చెప్పాడు. నేను హైదరాబాదు వచ్చిన తరువాత, నారాయణరెడ్డిగారిని దగ్గరగా చూసిన తరువాత సుబ్రహ్మణ్యం చెప్పిన మాట ఎంత యథార్థమో బోధపడింది.

4
పదిహేనేళ్ళకిందటి మాట. మిత్రుడు చైతన్యప్రసాద్ దీర్ఘకావ్యం ‘సహస్రవర్ష’ ని నారాయణరెడ్డిగారు ఆవిష్కరించారు. ఆ రోజు సభాధ్యక్షత వహించవలసిన గోపి గారు ఎందుచాతనో రాలేకపోయారు. మిత్రుడు నన్నా సభకి అధ్యక్షత వహించమన్నాడు. నాకు చాలా జంకు కలిగింది. నేనెక్కడ, నారాయణరెడ్డిగారెక్కడ! ఆయన ఏమనుకుంటారో అన్నాను. ఆయన ఏమీ అనుకోడు, మీరు సభని నిర్వహించండి అనాడు. ఆ రోజు నారాయణరెడ్డి గారు ఆ పుస్తకం మీద ఒక గంట సేపేనా మాట్లాడి ఉంటారు, మాట్లాడేరు అనడం కన్నా పాఠం చెప్పారనడం సరిపోతుంది. అటువంటి ప్రసంగం నేనాయననుంచి మళ్ళా వినలేదు. సభ అయిపోయిన తర్వాత ఆయనతో ‘మీ ప్రసంగం చక్కటి పాఠంలాగా ఉంది’ అంటే, ‘నా పాఠాలు వినడంకోసమే తాను నూజివీడు వదిలి ఉస్మానియాలో చేరానని ఎమ్వీయల్ నాతో చెప్పేవాడు’ అన్నారాయన. అన్నిటికన్నా ముందు నారాయణరెడ్డి గొప్ప ఉపాధ్యాయుడు.

5
ఆయన సాహిత్యంలోకి శబ్ద మాధ్యమం ద్వారా ప్రవేశించాడనిపిస్తుంది. ఆధునిక తెలుగు కవులు చాలామంది తమ భావస్థితినో, అభిప్రాయాల్నో, దృక్పథాన్నో పంచుకోవడానికి కవిత్వం చెప్పారు. కాని నారాయణరెడ్డిగారిని అన్నిటికన్నా మొదట శబ్ద సంస్కారం ఆకర్షించేదనిపిస్తుంది. వివిధ పుస్తకాల మీద ఆయన ప్రసంగాలు విన్నవాళ్ళకి, ఆయన్ని ఆ పుస్తకాల్లో శబ్ద ప్రయోగాలు, ఔచిత్యమూ, శబ్దాల తాలూకు లక్షణ, వ్యంజన వ్యాపారమే అన్నిటికన్నా ఎక్కువగా ఆకర్షించేవని అర్థమవుతుంది. బహుశా శ్రీ శ్రీ తర్వాత తెలుగులో శబ్దానికి అంత ప్రాధాన్యతనిచ్చిన కవి నారాయణరెడ్డి అనే అనిపిస్తున్నది. శబ్ద ప్రయోగ రహస్యం తెలిసినవాడు కాబట్టే ఆయన సినిమా పాటలు అంతగా జనాదరణ పొందేయి. అలాగని అర్థాలంకారాలు ఉండవని కాదు, ‘అగ్గిలోన తేలి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వే/నెగ్గేవమ్మా ఒకనాడు/నింగీ నేలా నీతోడు’ అంటున్నప్పుడు, అగ్గి/మొగ్గ అనడం ఏ కవికైనా సాధ్యమవుతుంది.కాని ‘నెగ్గేవమ్మా ఒకనాడు’ అన్న మాటలో వాగర్థాలు రెండూ ఒకదాన్నొకటి కరుచుకుపోయి పెనవైచుకోవడం కనిపిస్తుంది.

6
మరొక విలువైన జ్ఞాపకం: ఆయనొక రోజు ఆంధ్రసాహిత్యపరిషత్తుకి నన్నూ, కవితా ప్రసాద్ నీ పిలిపించారు. అప్పుడు కవితా ప్రసాద్ సాంస్కృతిక శాఖ డైరక్టరుగా ఉండేవాడు.’ప్రాచీన తెలుగు సాహిత్యంలో గిరిజనులు’ అనే అంశం మీద ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ప్రభుత్వం తరఫున పూనుకోగలమా అని అడిగారు. అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రెడ్యానాయక్ గారితో మాట్లాడేం. ప్రాచీన తెలుగు కవిత్వంలో గిరిజన నృత్యాలు అనే అంశం మీద అయిదారు గిరిజన నృత్యాల ప్రదర్శన ఏర్పాటు చేసాం. ఉస్మానియాలో తెలుగు ఆచార్యులు కిషన్ రావు గారూ, నేనూ ప్రతి నృత్యాన్నీ పరిచయం చేసాం. ఆ నృత్యం తాలూకు పద్య ప్రస్తావనలు ఆయనా, ఆ తెగతాలూకు సాంస్కృతిక విశిష్టత నేనూ, పరిచయం చేసాం. ఆ కార్యక్రమం మేమూహించలేనంత గొప్పగా జరిగింది.

7
రెండేళ్ళ కిందట ఆయన పుట్టినరోజు నాడు ‘క్షేత్రబంధం’ అనే కవితాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా దానిమీద నేను మాట్లాడాలని కోరుకున్నారు. కాని నేను మాట్లాడటానికి లేవబోతుండగా ‘ఆ క్షేత్రబంధం అన్న ఆ ఒక్క కవితని మాత్రం ప్రస్తావించకు, దాన్ని నాకు వదిలిపెట్టు’ అన్నారు. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అది ఆయన తన మనవరాలిమీద రాసుకున్న కవిత. కాని తన మనవరాలు ఇంగ్లీషులో రాసిన కవితల సంపుటికి నన్ను పరిచయం రాయమని కూడా అడిగారాయన. ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున బైరాగి స్మారక ప్రసంగం చెయ్యవలసిందిగా పోయిన ఏడాది నన్ను ఆహ్వానించేరు. ఆ ప్రసంగం ఆసాంతం దగ్గర కూచుని విన్నారు. అదే ఆయన్ని చివరిసారి చూడటం.

8
శబ్ద ప్రయోగంలో ఆయన పాటించే మర్యాద, ఔచిత్యంలాంటిదే ఆయన సభల్లోనూ, తన ప్రసంగాల్లోనూ కూడా చూపించేవారు. ఆయన ముఖ్య అతిథిగా ఉన్న మరొక సమావేశానికి కూడా నేను అధ్యక్షుడిగా ఉండవలసివచ్చింది. నా పేరు మొదట పిలిచారు. వేదిక మీద ఉన్న కుర్చీల్లో మధ్య కుర్చీ వదిలి నేను పక్క కుర్చీలో కూచున్నాను. ఆయన అప్పటికే కిందనుంచి సైగ చేస్తూ ఉన్నారు, నేను ఆ మధ్య కుర్చీలో, అంటే అధ్యక్ష స్థానంలో కూర్చోవలసిందే అని. నేనూ, ఆయనా కలిసి పాల్గొన్న చాలా సమావేశాల్లో కొన్నిసార్లు ఆయన ‘తర్వాత ఈ పుస్తకం గురించి మాట్లాడటానికి వీరభద్రుడున్నాడు’ అని తన ప్రసంగాన్ని క్లుప్తం చేసేవాడు. నేనూ ఆయనా పాల్గొన్న సమావేశాల్లో ఆయన సభ పూర్తయ్యేదాకా కూర్చోవడం కూడా నాకు గుర్తుంది. ఒకరోజు ఆయన అనుచరులు ఆయన ప్రసంగం పూర్తవగానే వెళ్ళిపోదామని ఆయన చెవిలో గుసగుసలాడుతుంటే, ‘వీరభద్రుణ్ణి విని వెళ్దాం’ అని కూడా అన్నారు. ఇటువంటి ఆదరాన్నే ఆయన ఎందరో సాహిత్య విద్యార్థుల పట్ల, పరిశోధకుల పట్ల, కవుల పట్ల చూపించడం నేనెరుగుదును. బహుశా నారాయణరెడ్డిగారు తెలుగు సాహిత్యరంగానికి అందించిన ఇటువంటి వ్యక్తిగత ఆదరణ మన కాలంలో మరొకవరెవరూ అందించలేదనే అనాలి.

13-6-2017

Leave a Reply

%d bloggers like this: