సమ్మోహనం

354

ఏ పసితనంలోనో నా మనసుమీద గాఢంగా ముద్రవేసుకున్న రంగుల కలల్లో హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్ కథలు కూడా ఉన్నాయి. అవి ఏండర్సన్ రాసిన కథలు అని తెలియకముందే ఆ కథలు నా హృదయంలో సీతాకోక చిలుకల్లాగా వాలి గూడుకట్టుకున్నాయి. చాలా చాలా ఏళ్ళకిందట, మా ఊళ్ళో, నా పసినాట నేను చదివిన బొమ్మల కథ, ఏడు పరుపుల కింద ఒక్క బఠానీ గింజకి నిద్ర పట్టక వళ్ళంతా కందిపోయిన సుకుమారి రాకుమారి కథ-The Princess and the Pea (1835) అని ఎన్నో ఏళ్ళకిగానీ తెలియలేదు.

ఏండర్సన్ కథలు నాలో ఉన్న ఒక పసితనాన్ని, ఒక నిర్మలహృత్ స్థానాన్ని నాకు గుర్తుచేస్తాయి. ఆ కథల్ని అంటిపెట్టుకుని ఒక దిగులు ఉంటుంది. కోమలమైన పసిపాపల అమాయికత్వం ఉంటుంది. ఈ లోకం లోకి వచ్చే ప్రతి శిశువూ దేవుడింకా ఈ లోకం పట్ల నిరాశ చెందలేదని గుర్తుచేస్తూంటుందని అన్నాడు టాగోర్. ఏండర్సన్ కథలు చదివినప్పుడు, ఏ ఒక్క కథ చదివినా, ఈ లోకం పట్ల మనమింకా నిరాశ చెందనవసరవం లేదనిపిస్తూంటుంది. ఏళ్ళ కిందట అతడి Angel (1843) కథ చదివాను. అతడు ఆ కథ రాసినప్పుడు డెన్మార్క్ అత్యంత బీదదేశాల్లో ఒకటి. పసిపాపలు బతకడానికి అవకాశంలేని దుర్భరదారిద్ర్యం ఆ దేశంలో. ఈ రోజు డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. ఆ దేశాన్ని సుభిక్షంగా చేసిన శక్తుల్లో ఏండర్సన్ కథలు కూడా ఉన్నాయనడానికి నాకు సంకోచం లేదు. మన చుట్టూ భరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, వాటినుంచి మరింత మెరుగైన జీవితం వైపు నడవాలన్న ప్రేరణలోంచో, లేదా ప్రేరణకోసమో, ఎవరో ఒకరు మనకు అందమైన కొన్ని కథల్నీ, కొన్ని కలల్నీ పంచకతప్పదు.

‘సమ్మోహనం’ అట్లాంటి కథ. కథగా అందులో ఏమీ లేదు. కానీ ఒక కలగా ఆ కథనం అద్భుతం. సమ్మోహనం కథ ఏండర్సన్ కథ కాదు. కాని, స్ఫూర్తిలో, ఆ సినిమా చూస్తున్నంతసేపూ, నాకు ఏండర్సన్ పదే పదే గుర్తొస్తూ ఉన్నాడు. ముఖ్యం, ఆ చిత్రనాయిక, సమీర, ఏండర్సన్ కథల్లో మాత్రమే కనిపించే ఒక యాంజెల్.

ఈ చిత్రదర్శకుడు అది చెయ్యగలిగాడనో, ఇదింకా బాగా చెయ్యలేకపోయాడనో, అట్లాంటి విశ్లేషణ ఏదీ రాయాలని లేదు నాకు. అన్నిటికన్నా ముఖ్యం, అత్యవసరంగా అతడు మనకొక ఫెయిరీ టేల్ చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి, సమీర పాత్ర పోషించిన ఆ యువతి, (ఆమె పేరు అదితిరావు అని మా అమ్మాయి చెప్పింది) ద్వారా ఒక యాంజెల్ ని మనకి పరిచయం చేసాడు.

సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పటికి, అర్థరాత్రి దాటింది. ఆకాశంలో ద్వాదశి చంద్రుడు మరింత ప్రకాశమానంగా ఉన్నాడు. చెట్లు తమలో తాము నిద్రలో నవ్వుకుంటూ ఉన్నాయి. ఏ దేవదూత, ఏ చిన్నారిశిశువు కోసం రెక్కలు చాపి, దిగివస్తున్నదోగాని సుమనోహరమైన ఒక తెమ్మెర నన్ను తాకిపోయింది.

నిష్టురమైన వాస్తవం చిత్రించడం పట్ల తెలుగు కథకులకి చాల ఆసక్తి. కాని నిష్టుర వాస్తవం ఎలా ఉంటుందో వాళ్ళకి నిజంగా తెలుసునా అని నాకు సందేహం. కలలు పండించడం పట్ల మన చిత్రదర్శకులకి చాలా మక్కువ. కాని వాళ్ళకి కలగనడమే రాదు. కలలు ఎలా ఉంటాయో, ఏ ఒక్క చిత్రదర్శకుడికీ, సినిమాకవికీ, కథకుడికీ తెలీదన్నది నాకు నిశ్చయం. నిజమైన దర్శకుడు కలల్ని చిత్రించడు. అతడి చిత్రం చూస్తుంటే మనం కలలుగంటాం. మనలోని పసిపాపకి మరింత చేరువగా జరుగుతాం. సమ్మోహనం చేసిందదే.

25-6-2018

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s