సమకాలీన ఋషి

15

ఏప్రిల్ 28 వ తేదీ మధ్యాహ్నం.

కర్నూల్లో కథారచయితల శిబిరంలో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, భోజనవిరామంలో, ఒక మిత్రురాలు నా దగ్గరకొచ్చి ‘వీరభద్రుడు గారూ, మీరు అదిలాబాదు గురూజీ గురించి పుస్తకం రాస్తున్నారని విన్నాను, ఎంతదాకా వచ్చింది?’ అనడిగారు.

‘అవునండీ, నేను రాయవలసి ఉంది. ఇంకా మొదలుపెట్టలేదు. ఈలోపు ఆయనమీద మరొక పుస్తకం ఎడిట్ చేస్తున్నాను. బి.మురళీధర్ గారు ఆయన్ని అదిలాబాదు రేడియో కోసం ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూల్ని ట్రాన్స్ క్రైబు చేయించాను. వాటిని కూడా పుస్తక రూపంలో తీసుకురావలసి ఉంది. మొత్తం పుస్తకం పూర్తయిపోయింది. నా ముందుమాట కోసం ఆగి ఉంది’ అన్నాను.

ఆటల్లో పడి బడికి వెళ్ళడం మర్చిపోయిన పిల్లవాణ్ణి అనునయిస్తున్నట్టుగా సాదరనేత్రాలతో ‘చూడండి సార్, నేను మీకు చెప్పేదాన్ని గాను, కాని,పెద్దవాళ్ళ విషయంలో ఒకటి అనుకుంటే వెంటనే పూర్తి చేసెయ్యడం మంచిది. ఆలస్యం చెయ్యడం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి’ అన్నదామె.

ఆ రాత్రి ఇంటికి తిరిగివస్తూ, ఈ సారి గురూజీని కలిసినప్పుడు, ఈ మాటలు చెప్పాలనుకున్నాను.

ఒక్క రాత్రి గడిచింది.

29 వ తేదీ ఉదయం.

యాథాలాపంగా ఈ మెయిల్ తెరిచి చూస్తే ప్రొ.జయప్రకాశరావునుండి మెసేజి.

‘ఈ ఉదయం గురూజీ అదిలాబాదులో పరమపదించారని చెప్పడానికి చింతిస్తున్నాను’ అని.

రెండు వారాలు గడిచింది. నాలుగు దినాల కిందట, అదిలాబాదు వెళ్ళి మేడం నీ, గురూజీ పిల్లలు శంకిని, గుడియాని పలకరించి వచ్చాను. కాని, గురూజీ లేరన్న వార్త నాలోకి ఇంకా ఇంకలేదు. ఆయన లేడని నమ్మలేకపోతున్నాను.

అక్కడ ఆ అదిలాబాదు ఎర్రటి ఎండలో, ఆ కళాశ్రమం ముంగిట్లో దేశం నలుమూలలనుంచి వచ్చిన మిత్రులు, శిష్యులు విచారవదనాలతో కనబడుతున్నా కూడా, నాకెందుకో,ఇప్పుడో, మరునిముషంలోనో, గురూజీ ఇంట్లోంచి బయటకి వచ్చి, ఆ వేపచెట్టుకింద కుర్చీలో కాళ్ళు పైకి మడిచి కూచుని ‘పాశ్చాత్ కిస్కో బోలేగే ఓర్ భారతీయ్ కిస్కో బోలేగే? కిస్కా క్యా ఫరక్ హై? లాగేసుకుంటే భారతీయుడు కాడా! ధోతి కట్టుకుంటేనే భారతీయుడా!’ అంటో మాటలు మొదలుపెడతారనే అనుకుంటూ ఉన్నాను.

కానీ, నిజమే. ఆ మానవుడు మనమధ్యనుంచి వెళ్ళిపోయాడు. నూరేళ్ళు జీవించవలసిన ఆ ఋషీశ్వరుడు గొంతుకాన్సర్ తో అరవై ఆరేళ్ళ కే ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను.

‘చివరిదినాల్లో మిమ్మల్ని ఒకటే యాద్ చేస్తుండె’ అంటున్నాడు ప్రసాద్, స్థానిక కొలాం ఆశ్రమపాఠశాల ప్రధానోపాధ్యాయుడు. బరోడా మహారాజా శాయాజీ గయక్వాడ్ విశ్వవిద్యాలయంలో తనకి ఉద్యోగమిస్తానంటే పారిపోయి వచ్చి గురూజీ తన జీవితమంతా కొలాం పిల్లలతో గడిపింది ఆ పాఠశాలలోనే.

పదే పదే నాకు అనిపిస్తూ ఉన్నదొకటే. ‘భగవంతుడా! ఈ మనిషిని నాకెందుకు పరిచయం చేసావ్?’ అనే. నాకు ఆయన తెలియకపోయి ఉంటే, నిజమే, గొప్ప పెన్నిధి నాకు పరిచయం అయి ఉండేది కాదు. కాని, నన్ను లోపల్లోపల తినేస్తున్న ఈ క్లేశం కూడా తప్పి ఉండేది కదా. హిమాలయాల్లో నేను చూడని ఓషధీవనాల్లాగా, పసిఫిక్ మహాసముద్రంలో పగడపు దీవుల్లాగా, ఆ కళాశ్రమం కూడా నా కంటబడి ఉండేది కాదు. ఏది పొందానని గర్విస్తూ ఉన్నానో, ఆ భాగ్యాన్ని నేను అర్థం చేసుకుని నలుగురికీ చెప్పేలోపలే, చేజారిపోయిందే.

రవీంద్రకుమార శర్మ అత్యంత అరుదైన మహామానవుడు. ఆయన మనమధ్యనే జీవిస్తూ, మన నిష్టుర ప్రపంచాన్నొక నైమిశారణ్యంగా మార్చడానికే తపించిపోయాడు. ఆయన్ని ఏమని వివరించాలి? కళాకారుడందామా? అటువంటి కళాకారుడు మరొకడు కనబడడు. సాంస్కృతిక వేత్త అందామా? భారతీయ సంస్కృతిని అంత స్పష్టంగా టాగోరూ, అరవిందులూ కూడా అర్థం చేసుకోలేదు. ఆర్థిక వేత్త అందామా? బహుశా గాంధీజీ తర్వాత భారతీయ గ్రామీణ వ్యవస్థ గురించి అంత సాధికారికంగా మాట్లాడగలిగింది ఆయనొక్కడే.

ఉహు. ఏదో రాద్దామని చూస్తున్నాను గాని, మనసు మొరాయిస్తున్నది. ఆయన ఇవేవీ కాదు, అరుదైన ప్రేమైక జీవి. మనుషుల్ని మాగ్నెట్ లాగా దగ్గరగా లాక్కున్నాడు. అయస్కాంతమైనా వదిలిపెడుతుందేమోగాని, ఆయన వదిలిపెట్టడు.

ఇక్కడ, హైదరాబాదులో కూపస్థమండూకంలాగా బతుకుతున్న నన్ను ఏ రాత్రివేళనో ‘ఏం చేస్తున్నార్ సార్!’ అంటో ఆయన పలకరిస్తాడనే ఒక ఊహ నన్ను వదలదు.

13-5-2018

 

Leave a Reply

%d bloggers like this: