రవీంద్రుణ్ణి నేను నా పదిహేనవ ఏటనే సమీపించగలిగాను, కాని అరవింద ప్రపంచంలోకి పూర్తిగా అడుగుపెట్టడానికి నా యాభై అయిదవ ఏటిదాకా ఆగవలసి వచ్చింది. అలాగని అరవిందుణ్ణి నేనింతకు ముందు చదవలేదని కాదు. అరవిందుల పైన ‘నవజాత’ రాసిన జీవితచరిత్ర, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, మా తాడికొండ లైబ్రరీలోనే చదవకపోలేదు. ఆ తరువాత ఎన్నో ఏళ్ళకు The Secret of the Veda, The Upanishads, Hymns to the Mystic Fire, The Future Poetry చదివాను కూడా. ‘సావిత్రి’ లోని మంత్రమయలోకాల్లోకి కొంతమేరకు ప్రయాణించగలిగాను, అది కూడా, ఎప్పుడో, నా రాజమండ్రిరోజుల్లో, సుదర్శనంగారు, డాంటేకీ, అరవిందుడికీ మధ్య పోలికలు చెప్పిన సమ్మోహనీయ ప్రసంగం కలిగించిన ప్రలోభంవల్ల.
ఇరవయ్యవశతాబ్ది భారతదేశాన్ని జాగృతం చేసిన మహనీయుల్లో, ఎవరేనా అత్యంత సులభంగా సమీపించగలిగిన మొదటి రచయిత మహాత్మాగాంధీ. ఆ తర్వాత, వివేకానందస్వామి, రమణమహర్షి, టాగోర్, రాధాకృష్ణన్, కృష్ణమూర్తి. కాని, శ్రీ అరవిందులు (1872-1950) వారందరిలాగా సులభసాధ్యుడు కాడు. అది ఆయన భాష గంభీరంగా ఉన్నందువల్ల కాదు, ఆయన భావనా ప్రపంచంలోని గాంభీర్యంవల్ల అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. అందుకు కారణం కూడా ఉంది. కృష్ణమూర్తి బుద్ధుడివల్లా, రాధాకృష్ణన్ శంకరుడివల్లా, టాగోర్ ఉపనిషత్తులవల్లా, మహాత్మాగాంధీ భగవద్గీత వల్లా ప్రభావితులైతే, అరవిందులు స్వయంగా వేదాలవల్ల ప్రభావితుడైన భావుకుడు, ఋషి.
ఎటువంటి జీవితం శ్రీ అరవిందులది! ఆయన తండ్రి ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉద్యోగి. పిల్లవాణ్ణి ఐ.సి.ఎస్. చేయించాలనుకున్నాడు. అంతదాకా, భారతదేశం గాలి సోకకూడదని, బెంగాలీ మాట వినబడకూడదని, శుద్ధోధనుడు సిద్ధార్థుణ్ణి పెంచినట్టుగా, భారతదేశానికి దూరంగా, ఇంగ్లాండులో పెంచాడు. తండ్రి కోరినట్టే అరవిందుడు ఐ.సి.ఎస్ పరీక్ష పాసయ్యాడు. అది కూడా గ్రీకు, లాటిన్ సాహిత్యాల్లో పరీక్ష రాసి మరీ. కాని,ఆయన మనసు బ్రిటిష్ ప్రభుత్వపు అధికారి కావడానికి ఇష్టపడలేదు. ఐ.సి.ఎస్ లో చేరకుండా, భారతదేశం తిరిగి వచ్చి, బరోడామహారాజు ఆస్థానంలో కొన్నాళ్ళు పనిచేసాడు. తాను ఇంగ్లాండులో ఉండగా అధ్యయనం చేసిన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ భాషలకి తోడు, ఇప్పుడు సంస్కృతం, బెంగాలీ, తమిళం, మరాఠీ అధ్యయనం మొదలుపెట్టాడు. అది మామూలు మామూలు అధ్యయనం కాదు. గ్రీకులో హోమర్ ని చదివినట్టు, ఇటాలియన్ లో డాంటేని చదివినట్టు, ఇంగ్లీషులో షేక్ స్పియర్ ను చదివినట్టు, సంస్కృతంలో వేదాల్ని, వ్యాసవాల్మీకుల్ని, కాళిదాసుని చదివాడు.
ఇంతలో బెంగాల్ విభజన, వందేమాతరం ఉద్యమం మొదలయ్యింది. బరోడాలో సౌకర్యవంతమైన ఉద్యోగం వదిలిపెట్టి, కలకత్తాలో గౌరవవేతనం మీద జాతీయ కళాశాలలో చేరాడు. జాతీయోద్యమంలో అతివాద పంథాని ఎంచుకున్నాడు. 1906 లో సూరత్ కాంగ్రెసులో తిలక్ పక్షాన నిలబడ్డాడు. 1908లో కుదీరాం బోస్ విసిరిన బాంబుకేసులో అరవిందుణ్ణి కూడా ప్రభుత్వం నిర్బంధించి జైల్లో పెట్టింది. అక్కడ, ఏడాది పాటు అనుభవించిన సాలిటరీ కన్ ఫైన్ మెంటులో అపూర్వమైన ఆధ్యాత్మికానుభవాలు సంప్రాప్తించాయి. ఆయన తరఫున దేశబంధు చిత్తరంజన దాస్ వాదించి ఆయన్ను నిర్దోషిగా విడుదల చేయించాడు. బయటికిరాగానే, సిస్టర్ నివేదిత సలహామీద, బ్రిటిష్ పాలిత భారతదేశం వదిలి ఫ్రెంచి కాలనీ పుదుచ్చేరికి వెళ్ళిపోయారు.
1910 నుంచి 1950 దాక నలభై ఏళ్ళు అక్కడే ఉండిపోయారు. చివరి 24 సంవత్సరాలు ఆయన పూర్తి ఏకాంతంలో తన మనస్సు, దేహం,ప్రజ్ఞ అన్నీ భగవంతుడికి అర్పితం చేసి, ‘దివ్యజీవితం’ సాధన చేస్తూ, తన ప్రయోగానుభవాల్ని గ్రంథస్థం చేస్తూ గడిపారు. ప్రపంచం రెండు మహాయుద్ధాల మధ్య అతలాకుతలం అవుతున్న కాలంలో ఆయన ఒక ప్రాచీన వైదిక ఋషిలా, ఉపనిషత్కారుడిలా, ద్యావాపృథ్వుల్ని తనలో తాను సమన్వయించుకుంటో గడిపారు. దాన్ని ఆయన సమగ్ర యోగం (Integral Yoga) అన్నారు. పూర్తి తాపసజీవితానికీ, పూర్తి ఐహిక జీవితానికీ మధ్య బుద్ధుడు ఒక మధ్యేమార్గాన్ని అన్వేషిస్తే, శ్రీ అరవిందులు, ఆ రెండింటినీ, సమన్వయం చేసే ఒక synthesis ని సరికొత్తగా ప్రతిపాదించారు.
అందువల్ల, ఆయన్ని అర్థం చేసుకోవాలంటే, హిమాలయాల అంచుల్లో విహరిస్తే చాలదు, మనం స్వయంగా ఆ పర్వతారోహణకు పూనుకోవాలి. కొన్ని అడుగులు పైకి ఎక్కామో లేదో, గాలి పీల్చడం కూడా కష్టంగా తోచే ఆ అత్యున్నతవాతావరణంలో ఎట్లానో ఒక్కొక్క అడుగే వేసుకుంటోపోవాలి. అన్నిటికన్నా ముందు ఒక సుశిక్షిత పర్వతారోహకుడి చేతుల్లో మనని మనం తర్ఫీదు చేసుకోవాలి.
అటువంటి ఒక శిక్షకుడి గురించి ఎదురుచూస్తూ ఉన్న నా చేతుల్లో ‘శ్రీ అరవింద సరిత్ సాగర’ (2018) వచ్చి వాలింది. చీరాల కు చెందిన రావి మోహనరావుగారు నడుపుతున్న ఆత్మజ్యోతి పత్రికకోసం అరవిందుడి సమగ్ర సాహిత్యం గురించి గత అయిదేళ్ళుగా ప్రేమా నందకుమార్ గారు రాసిన పరిచయ వ్యాసాలసంపుటి అది.
శ్రీ అరవిందుల శతజయంతి సందర్భంగా 1972 లో ఆయన రచనలు 30 సంపుటాలుగా, Sri Aurobindo Birth Centenary Library పేరిట వెలువడ్డాయి. (తిరిగి, ఆయన 125 వ జయంతి సందర్భంగా, మరికొన్ని రచనలు చేర్చి 37 సంపుటాలు 1992 లో వెలువరించారు. ఈ సంపుటాలన్నీ అరవిందాశ్రమం వారు పబ్లిక్ డొమైన్ లో అందరికీ అందుబాటులో పెట్టారు కూడా.)
ఇప్పుడు ఎనభయ్యేళ్ళు పైబడ్డ వయసులో ప్రేమా నందకుమార్ ఆ మొదటి 30 సంపుటాల్నీ పరిచయం చేస్తూ వ్యాసాలు రాస్తూ వచ్చారు. అందులో ఇప్పటిదాకా 15 సంపుటాల మీద రాసిన 47 వ్యాసాల్ని చీరాల కు చెందిన సంస్కృత పండితులు, అనువాదకులు చింతగుంట సుబ్బారావుగారు, ఇప్పుడు తన 86 ఏళ్ల వయసులో, తెలుగులోకి అనువదించారు. ఆ ఇంగ్లీషు, తెలుగు వ్యాసాల్ని కలిపి మోహనరావుగారు ‘శ్రీ అరవింద సరిత్ సాగర’ పేరిట పుస్తక రూపంగా వెలువరించారు.
ఆగస్టు 15 న అరవింద జయంతి సందర్భంగా చీరాలలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అరవిందాశ్రమాల కార్యకర్త శ్రీ పి.సి.స్వరూప్ ఆ గ్రంథాన్ని ఆవిష్కరించేరు. నెల్లూరుకు చెందిన భావుకులు, రచయిత, అనువాదకులు శ్రీ అల్లు భాస్కరరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో ఆ పుస్తకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు లభించింది.
ప్రేమా నందకుమార్ ప్రసిద్ధ ఇంగ్లీషు అచార్యులు, ఒకప్పుడు ఆంధ్రవిశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సెలర్ గా పనిచేసిన కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్ గారి కుమార్తె. ఆమె సావిత్రి పైన డాక్టొరల్ పరిశోధన చేసిన విదుషి. సుబ్రహ్మణ్య భారతి రచనలనీ, సంగం కావ్యం ‘మణిమేఖలై’ ని ఇంగ్లీషులోకి అనువదించారు. రామానుజులపైన ఒక జీవితచరిత ఇటీవలే వెలువరించారు. ఆమె శ్రీ అరవిందుల రచనలపైన ఇంత సమగ్ర పరిచయం చేయడం,ఆ పరిచయ వ్యాసాల్ని తెలుగులోకి అనువదించడం వల్ల అందరికన్నా ముందు, ఆ పుస్తకం మొదటి పాఠకుడిగా, అమితంగా లబ్ధి పొందింది నేనే. ఇప్పుడామె చిటికెన వేలు పట్టుకుని శ్రీ అరవిందుల తేజోమయలోకాల్లో సునాయాసంగా నడిపిపోగల ధైర్యం చిక్కింది నాకు.
18-8-2018