వంట ఒక వ్యాపకంగా

Reading Time: 2 minutes
54

 

ఇన్నాళ్ళూ సమయం చిక్కితే ఒక నీటిరంగుల చిత్రం వెయ్యాలని ఉండేది. ఇప్పుడు సాయంకాలం కాగానే, ఇంటికి పోగానే ఏ కొత్త వంటకం నేర్చుకుందామా అన్నదే వ్యాపకమైపోయింది.

కాని నీటిరంగుల చిత్రలేఖనానికీ, వంటకీ మధ్య చక్కని సారూప్యత ఒకటి కనిపించింది. నీటిరంగుల్తో చిత్రించడమంటే నీటితో ఒక సంవాదం. కాగితం మీద తడి ఎంత ఉంది, రంగులో కుంచె ఎంతముంచామూ, కుంచెలో నీటితడి ఎంత ఉంది, ఒక సారి రంగుపూత పూసాక, ఆ మొదటి పూత ఆరిందాలేదా-

నీటిరంగుల్తో చిత్రించడమంటే చీనావాడు రాసిన ఆర్ట్ ఆఫ్ వార్ ప్రాక్టీసు చెయ్యడం లాంటిది. నీ దృష్టి ఎంతసేపూ ఆ నీటిమీదా, ఆ తడిపూత మీదా మటుకే ఉండాలి, ఏమరుపాటు రవ్వంత కూడా కూడదు. అదను చూసి కత్తిదెబ్బ వేసినట్టుగా, కుంచె కదిలించాలి.

ఇప్పుడు అర్థమయ్యిందేమంటే, వంట వండటమంటే, నిప్పుతో సంవాదం. వేడి తో సంభాషణ. గిన్నె వేడెక్కడం నుంచి, కూరగాయలు ఉడకడం దగ్గర్నుంచి, పోపు వేయించడం దాకా క్షణం కూడా ఏమరుపాటు కూడదు.

నీటిరంగులు నేర్చుకున్న కొత్తలో, రంగులు ఎట్లా కలపాలో పుస్తకంలో చదువుతుంటే అంతా తెలిసినట్టే ఉండేది, తీరా రంగులపళ్ళెం ముందు కూచోగానే మైండ్ లో ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయేది. ఇప్పుడు స్టవ్ ముందు కూడా అదే పరిస్థితి.

ఇక్కడ కూడా ఎప్పుడు మూతపెట్టాలో, ఎప్పుడు మూత తియ్యాలో, ఎప్పుడు వేడెక్కించాలో, ఎప్పుడు వేడి తగ్గించాలో-అదంతా ఒక యుద్ధకళ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సున్- జు రాసినట్టు in the midst of chaos, there is also opportunity అని కూడా ఒప్పుకోవాలి.

నా చిన్నప్పుడు నేను ఎన్నో సార్లు చదివిన పుస్తకాలు రెండు: ఒకటి, శ్రీమహాభక్తవిజయము, మరొకటి, మాలతీచందూరు ‘వంటలు-పిండివంటలు’ అయిదు సంపుటాలూను. ఆ పసితనంలో నా పుస్తకదాహం తీర్చడానికి మరే పుస్తకాలూ దొరకనప్పుడు మరేం చెయ్యాలో తెలియక, వాటినే పున: పున: పఠించేవాణ్ణి. మహాభక్తవిజయం చదివినా భక్తుణ్ణెట్లా కాలేకపోయానో, ఆ వంటల పుస్తకాలు అన్నిసార్లు చదివి కూడా వంట నేర్చుకోలేకపోయాను.

ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు ఎమెస్కో విజయకుమార్ యద్దనపూడి సులోచనారాణి గారితో వంటలు-పిండివంటలు పుస్తకాలు రాయించేడు. ఆ పుస్తకాల ఆవిష్కరణ లో నన్ను మాట్లాడమంటే, మాలతీ చందూరు నుంచి సులోచనారాణిదాకా వంటలు పిండివంటల పుస్తకాల్లో వచ్చిన మార్పులో ఒక సోషియాలజీ ఉందని చెప్పాను.

మాలతీ చందూరు పుస్తకాల్లో వంటలకి ఇచ్చిన కొలతలు సమష్టి కుటుంబాలకు పనికొచ్చే కొలతలు. ఆ గిన్నెలు, ఆ వంటపాత్రలు ఒక యుగానికి ముందు కాలానివి. సులోచనారాణి పుస్తకాల్లో కొలతలు స్పష్టంగా న్యూక్లియర్ కుటుంబాలకు పనికొచ్చే కొలతలు.

అట్లాంటి పుస్తకాల కోసం వెతుకుతున్న నాకు Cooking At Home With Pedatha (2005) అనే పుస్తకం చాలా ఆసక్తికరంగా కనిపించింది. ఇందులో మంత్రాల నరసింహశర్మగారు కోరుకున్న పనసపొట్టు కూర తప్ప, తక్కిన ఆంధ్రా శాకాహారమంతా ఉంది.

ఈ పుస్తకం రచయితలు జిగ్యాసా గిరి, ప్రతిభా జైన్ వాళ్ళ పెద్దత్తయ్య పాకశాస్త్రప్రావీణ్యాన్ని ఇందులో వడపోసి పట్టుకొచ్చారు. ఇంతకీ ఆ పెద్దత్త, సుభద్రాకృష్ణారావు పరిగి, సరస్వతీ గిరి గారి పెద్దమ్మాయి, అవును, మీరు సరిగ్గానే చదివారు, వి.వి.గిరి గారి పెద్దమ్మాయన్నమాట. ఆమె తన భర్త ఉద్యోగరీత్యా బర్మానుంచి పాండిచ్చేరిదాకా ఎన్నో ప్రాంతాల్లో పనిచేసినా,ఆమె పుట్టిల్లు గుంటూరు కావడంతో ఆ తెలుగు వంటకాల తీపి, కారం మరవలేదు.

ఈ పుస్తకాన్ని చాలా అందంగా, అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేసారు. ఇటాలియన్ కుక్ బుక్, చైనీస్ కుక్ బుక్ మాత్రమే దొరికే పుస్తకాల షాపుల్లో పచ్చళ్ళు, పొడులు, కూరల గురించి రాసిన ఆంధ్రావంటకాల పుస్తకం కూడా ఉండటమే ఒక సంతోషమైతే, పుస్తకం లే ఔట్, డిజైన్ లలో అత్యున్నత స్థాయి లో కనిపించడం మరీ సంతోషమనిపించింది. ఈ పుస్తకానికి ప్రపంచంలో శాకాహారానికి సంబంధించి అత్యుత్తమ రచనగా అవార్డు కూడా వచ్చిందట.

రకరకాల కూరలూ, పచ్చళ్ళూ, తీపివంటకాల మీద రచనతో పాటు, చివరలో ‘చేతిరుచి’ పేరిట కొన్ని సలహాలు, కొన్ని సాంపిల్ మెను, పండగ మెనూ కూడా ఉన్నాయి.

ఏమైతేనేం, మొత్తానికి ఒకటిరెండు వంటకాలు పెద్దత్త సలహాల ప్రకారం మొదలుపెట్టాను. మొత్తం పుస్తకం పూర్తవడానికి ఒక నెలరోజులు పడుతుందనుకుంటాను.

 

29-9-2016

Leave a Reply

%d bloggers like this: