ఋషి తుల్యురాలు

305

నిన్న ఫొటోగ్రఫీ డే సందర్భంగా గణేశ్వరరావుగారు జయతి లోహితాక్షన్ గారు తీసిన ఫొటో ఒకటి పరిచయం చేస్తూ ఆమె తీసే ఫొటోల్ని నేను మెచ్చుకుంటూండటం గురించి కూడా ప్రస్తావించేరు. కాని, నేను జయతి లోహితాక్షన్ గారికి అభిమానిని కాను, వీరాభిమానిని.

ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా నాకెంతో మంది సహృదయులైన భావుకులు, పండితులు, కళాకారులు పరిచయమయ్యారు. రోజువారీ జీవితంలో టైం దొరకనో, దూరాల వల్లనో వాళ్ళని కలుసుకోలేను, కాని ఈ మాధ్యమం వల్ల వాళ్ళతో ఒక నిరంతర సంభాషణ సాగించగలుగుతున్నాను. ఆ సంభాషణ మెసెంజర్ ద్వారానూ, లైకులు, కామెంట్ల రూపంలోనూ జరిగేది కాదు. వాళ్ళకీ నీకూ ఉన్న ఆసక్తులు దాదాపుగా ఒక్కలాంటివే అని ఒకసారంటూ తెలిసాక, వాళ్ళ పోస్టులు, రచనలు, కామెంట్లూ, చివరికి వాళ్ళు పెట్టే లైకులతో కూడా నీ సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళల్లో జయతి లోహితాక్షన్ కూడా ఒకరు.

ఏడాది కిందట, యాదృచ్ఛికంగా ఆమె పెట్టిన పోస్టు ఒకటి చూసాను. అది తూర్పుకనుమల్లో పెరిగే ఒక చెట్టు ఫొటో. దానికింద ఆమె ఇలా రాసారు:

‘…అడవినుండి తిరిగొచ్చిన ప్రతిసారీ కొన్ని రోజులు నిశ్శబ్దంలో గడిచిపోతుంటాయి. అడవిలో ఏరుకుని నా వెంట తెచ్చుకునే రాళ్ళూ, ఫ్రూట్ పాడ్స్, ఆకులు, ఆశ్చర్యాలు, అనుభూతులు తోడుగా నాకు నిశ్శబ్దాన్ని ఇచ్చి పంపుతుందనుకుంటాను అడవి. ‘

మై గాడ్! ఎవరీమె?

వెంటనే ఆత్రంగా ఆమె వాల్ అంతా కలయచూసాను. ఆ పోస్టు పెట్టినరోజునుంచి కొన్ని రోజుల వెనక్కీ ఆమె తన పోస్టుల ద్వారా తన జీవితాన్నీ, తన అంతరంగాన్నీ ఎట్లా వర్ణిస్తున్నదో చూస్తూ, విభ్రాంతిలో మునిగిపోయాను.

ఈమె మన కాలం నాటి మనిషేనా? ప్రాచీన చీనా కవి హాన్ షాన్, జపనీయ జెన్ సాధువు ర్యోకాన్, తంకా కవి సైగ్యొ, హైకూ కవి బషొ, గాంధీని గాఢాతిగాఢంగా ప్రభావితం చేసిన టాల్ స్టాయి, థోరో, రస్కిన్ ల వారసురాలు, ఋషి తుల్యురాలు, ఈమె నిజంగా మన కాలంలోనే మన మధ్యనే జీవిస్తున్నదా?

నేనా పోస్టు చూసింది పోయిన జూన్ లో. అప్పుడామె రాసిన పోస్టుల్ని బట్టి ఆమె అప్పుడు నర్సీపట్నంలో ఉన్నట్టు అర్థమయింది. అప్పుడు మేము వేసవి సెలవులకి రాజవొమ్మంగిలో ఉన్నాం. మాకు నర్సీపట్నం నలభై నిముషాల దూరం. ఉండబట్టలేక, నేను ఆమెకొక మెసేజి పెట్టాను, మిమ్మల్ని వచ్చి కలుసుకోవచ్చునా అని.

జవాబు లేదు. మరొక మెసేజి పెట్టడానికి మర్యాద అడ్డొచ్చింది. కాని, రోజూ ఆమె పోస్టులు చూసేవాణ్ణి. అప్పుడామె, లోహి తాక్షన్ గారూ, డిబ్రూగర్ నుంచి తిరువనంతపురం రైలు ప్రయాణం చేస్తున్నారు. రైల్లోంచి తీసిన ఫొటోలు అప్పుడప్పుడూ పోస్టు చేస్తూ వచ్చారు.

ఆ తర్వాత చాలా నెలల తర్వాత, ఎప్పుడో అనుకోకుండా ఆమె తన మెసెంజరు తెరిచి చూసాననీ, నా మెసేజి చాలా ఆలస్యంగా చూసినందుకూ, మేము కలుసుకోలేకపోయినందుకూ నొచ్చుకుంటూ, సాదరంగా పలకరించారు.కాని అప్పటికి ఆమెని ప్రత్యక్షంగా చూడాలన్న ఆసక్తి పోయిందినాకు, గొప్ప కవుల్నీ, గొప్ప ఋషుల్నీ మనం ప్రత్యక్షంగా చూడవలసిన పనేమిటి? బాహ్యావరణని దాటి వాళ్ళు మన హృదయానికి ఎప్పుడో చేరువగా వచ్చేసి ఉంటారు కాబట్టి.

ఆలోచించాను, ఏది ఆమెలో నన్ను అంత గాఢంగా ఆకర్షించిన విశేషమని? మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆమె దృష్టి. మనం మామూలుగా చూసే దృశ్యాల్ని మన కళ్ళు flat గా మాత్రమే రిజిస్టరు చేసుకుంటాయి. కాని ఆమె నేత్రాలు ఆ దృశ్యాన్ని పొరలు పొరలుగా విడగొట్టి అందులోని వెలుగునీడలన్నిటినీ పట్టుకోడానికి ప్రయత్నిస్తాయి. అవును, నీడలు. ఆ అడవులు, ఆ చెట్లు, ఆ కొండలు, ఆ పూలు, ఆ క్రిమి కీటకాలు, ఆమె నివసిస్తున్న, తపిస్తున్న, ప్రేమిస్తున్న ఆ ప్రపంచం నా ప్రపంచం కూడా. ఆ ప్రపంచంలో నా చిన్నప్పటి మా ఊరు, ఆ మట్టి అరుగులు, అపరాహ్ణవేళ ఇండ్ల కప్పుల మీంచి పడే ఎండలో పరుచుకునే ఇళ్ళ నీడలు, ఎండిన గడ్డికప్పుల మీద పాకే గుమ్మడి తీగలు, గోధూళివేళ చిమ్మే బంగారు దుమ్ము, చెట్లనీడల్లో నెమరేసుకునే మేకలు, మహారణ్యాల మీద పరుచుకునే మేఘాల నీడలు, ఆడుకునే పిల్లల మహామధురమయ నిశ్శబ్దం- నా మిత్రుడు వేణు చల్లా తీసే ఫొటోలు చిత్రలేఖనాలైతే, జయతి లోహితాక్షన్ తీసే ఫొటోల్లో కవిత్వముంది, సంగీతముంది, ఇస్మాయిల్ గారి కవిత్వంలో కనవచ్చే అపూర్వనిశ్శబ్దముంది.

రెండవది, ఆమె వాక్యాలు. ఆ వాక్యాలు గొప్ప జెన్ గురువుల్నీ, సూఫీ సాధకుల్నీ గుర్తుకు తెచ్చే వాక్యాలు. పడవలో నీళ్ళూ, ఇంట్లో వస్తువులూ వచ్చిపడుతుంటే, వాటిని రెండు చేతుల్తోటీ ఎత్తి పోసెయ్యలంటాడు కబీరు. తప్పదు, నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే మరో మార్గం లేదు. ఈ మాట వస్తువులకే కాదు, భావాలకి కూడా వర్తిస్తుంది. మనం సజీవంగా ఉండటానికి కావలసింది వస్తు సంచయం, భావసంచయం కాదు. పోగేసుకోని చిత్తవృత్తి గురించి నేను పుస్తకాల్లో చదివాను, కొంతమందిని ప్రత్యక్షంగా చూసాను. నా తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు. అటువంటి మనస్తత్వం మళ్ళా జయతి లోహితాక్షన్ గారిలో కనిపించింది. ఆమె మన కాలపు జెన్ యోగి, సూఫీ సాధువు, నిజమైన కబీర్ పంథీ.

ఇక మూడవది, జయతి, లోహితాక్షన్ -ఇద్దరూ సంచారులు. తామెక్కడుంటే అక్కడే ఆకాశాన్ని కప్పుగా, నేలని శయ్యగా మార్చుకోగలిగినవాళ్ళు. ఈ మధ్య తెలుగు లో యాత్రా సాహిత్యం గురించి ఒకాయన రాసిన వ్యాసం చూసాను. ఆయనకి జయతి లోహితాక్షన్ ల గురించి తెలియకపోవడం ఎంత దురదృష్టం అనిపించింది.

యాత్రీకులు మూడు రకాలుగా ఉంటారు. టూరిస్టులు మొదటితరహా. వాళ్ళు అన్నీ చూడాలనుకుంటారు, కానీ ఏదీ దర్శించలేరు. నేనొకసారి బెంగుళూరులో లాల్ బాగ్ కి వెళ్ళాను. అక్కడ గులాబీ పూల కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. అంటే ఆ స్థలం టూరిస్టు సెంటరు గా మారిపోయిందన్నమాట. తీర్థయాత్రలు చేసేవాళ్ళు తీర్థయాత్రీకులు. కానీ, వాళ్ళు తాము దర్శించాలనుకున్నది ఏదో ఒక ప్రత్యేక స్థలంలో మాత్రమే కనిపిస్తుందనుకుంటారు. సంచారులు వీళ్ళిద్దరికన్నా భిన్నం. వాళ్ళకి ప్రతీదీ ఆశ్చర్యమే. సాలీడు గూడు, గడ్డిపువ్వు, గోధుమవన్నె తాచు, వానకు తడిసే అడివి, కట్టెలేరుకునే గ్రామీణస్త్రీలు-దేన్ని చూసినా వాళ్ళు ఆనందం పట్టలేరు. అందుకనే, రాహుల్ సాంకృత్యాయన్ తన ‘లోక సంచారి’ పుస్తకం మొదలుపెడుతూనే, ‘అథాతో లోక జిజ్ఞాసా’ అంటాడు. పూర్వమీమాంస ‘అధాతో ధర్మ జిజ్ఞాసా’ అంటో, ఉత్తర మీమాంస ‘అధాతో బ్రహ్మ జిజ్ఞాసా’ అని మొదలయ్యాయని మనం గుర్తుపెట్టుకుంటే, రాహుల్జీ తన రచనాని ‘అధాతో లోక జిజ్ఞాసా’ అని మొదలుపెట్టడంలోని ఔచిత్యం బోధపడుతుంది.

రెండువారాల కిందట జయతి దంపతుల్ని మా ఇంటికి ఆహ్వానించేను. నగర కాలుష్యాన్ని తట్టుకుని వాళ్ళు మెహిదీపట్నం రాగలరా అని సంశయిస్తూనే. కాని, వారిద్దరూ ఎంతో ప్రేమతో, ఆదరంతో మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో భోంచేసారు. అత్రి, అనసూయలు మా ఇంటికి వచ్చి వెళ్ళినట్టుంది వాళ్ళ రాక.

వాళ్ళెలా జీవిస్తున్నారో తెలుసునా? వాళ్ళకి ఇల్లు లేదు,తమ ఇల్లు వదిలిపెట్టి, ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేసి రెండు సైకిళ్ళ మీద విజయనగరం నుంచి తెలంగాణా మీదుగా పులికాట్ దాకా ఈ మధ్యనే ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళకి ఏ ఉద్యోగమూ లేదు. రేపెలా గడుస్తుందన్న చింత లేదు. తమవెంట పోగేసుకున్న ఆస్తిపాస్తులూ లేవు, భావజాలమూ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ళని spiritual ecologists అనాలి.

మీ దినచర్య ఎట్లా గడుస్తుందని అడిగాను? అది పక్షుల కూజితాలతో మొదలై, కీచురాళ్ళ జోలపాటతో ముగుస్తుంది. ఇప్పుడు వాళ్ళు సాగర్ వెళ్ళే దారిలో, ఇబ్రహీం పట్నంలో ఎవరో చూపించిన ఒక తోటలో ఉంటున్నారు. అత్యుత్తమమైన, కవితాత్మకమైన చలనచిత్రాలు చూడటం, ఫొటోలు తీసుకోవడం, గొప్ప కవిత్వం చదువుకోవడం, పక్షుల్ని పోల్చుకోవడం, గడ్డిపరకల్తో సంభాషించడం- చలంగారు తన జీవితయానంలో చివరికి ఎక్కడికి చేరుకున్నారో, ఆ దంపతులు తమ నడివయసులోనే ఆ స్థితికి చేరుకోగలిగారు.

ఒకప్పుడు శ్రీ శ్రీ చైనా వెళ్ళినప్పుడు వారినుద్దేశించి ప్రసంగిస్తూ ‘మీరు జయించారు, మేమింకా పోరాడుతున్నాం’ అన్నాడు. జయతి లోహితాక్షన్ దంపతుల తో నేనీమాటే చెప్పాను: ‘మీరు సాధించారు, మేమింకా కలగంటూనే వున్నాం’ అని.

20-8-2017

Leave a Reply

%d bloggers like this: