వర్డ్స్ వర్త్ కవితానుశీలన

369

చాలా రోజుల కిందట ఒక మిత్రుడు ఆధునిక కవిత్వం గురించి రాస్తూ మన పూర్వ లాక్షణికులు కవిత్వం గురించి చేసిన సూత్రీకరణలు ఇప్పటి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించవని రాసాడు.

నాక్కూడా మొదట్లో ఇలాంటి అభిప్రాయాలే ఉండేవి. కాని, ఆధునిక కవిత్వం వెనక ఉన్న అశాంతినీ, spontaneity ని అర్థం చేసుకోడానికి ప్రాచీన ఆలంకారికులు తోడ్పడలేకపోవచ్చుగానీ, మన అనుభూతిని, అశాంతిని, ఆవేదనని, కవిత్వంగా మార్చడమెట్లా అనే విషయంలో మాత్రం వాళ్ళు మనకి చాలానే సహాయపడతారు. కవితానిర్మాణం, వ్యూహం, శిల్పం వంటి వాటిని పరిశీలించవలసి వచ్చినప్పుడు, ఆధునిక విమర్శ పనిముట్లు చాలా చిన్నవి. ఇందుకు పాశ్చాత్యవిమర్శకూడా మినహాయింపు కాదు.

ఒక కవితని మనం మళ్ళా మళ్ళా చదివేటట్లు చెయ్యగలిగేదేది? కేవలం కొన్ని అభిప్రాయాల్ని ప్రకటించినందువల్లనో, లేదా చారిత్రక కారణాలవల్లనో కాక, కవిత తనకై తాను బతకాలంటే, శిల్పం తప్పనిసరి. ఐడియాలజీ మీద ఆధారపడ్డ కవిత, ఆ ఐడియాలజీని పంచుకునేవారినే కలపగలుగుతుంది. కాని దేశ, కాల, దృక్పథాల సరిహద్దుల్ని దాటి మనిషిని మనిషిని చేరువచేసే కవితలకి శిల్పబలం తప్పని సరి. ఆ శిల్పనిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, భారతీయ అలంకారికులు చాలా సామగ్రి మనకి అమర్చిపెట్టారు. కాని ఆ పద్ధతిలో కవిత్వాన్ని చదివే exercises మాత్రం మనకోసం ఎవరూ రాసిపెట్టలేదు.

ఉదాహరణకి, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని పాలించిన రోజుల్లో, వర్డ్స్ వర్త్ రాసిన Daffodils కవిత ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాని, భారతీయ రసదృష్టితో ఆ కవితను చదివినప్పుడు, అది ఎంత పేలవమైన కవితనో, సి.డి. నరసింహయ్య ఒక చోట రాసారు.

ఆయన వ్యాసం నాకొక కనువిప్పు. ఈ పద్ధతిలోనే మన కవుల కవిత్వాన్ని కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా, మమ్మటుడు ‘కావ్యప్రకాశం’ లో పేర్కొన్న పద, వాక్య, అర్థ దోషాల నుంచి మన కవులు ఎట్లా తప్పించుకోలేకపోతున్నారో చూడవచ్చు.

మీకు ఆసక్తి కరంగా ఉంటుందని, నరసింహయ్యగారి వ్యాసంలోంచి కొన్ని భాగాలు (East West Poetics At Work, Sahitya Akademi, 1994, p.12-15) ఇక్కడ అనువదించి ఇస్తున్నాను.

“ఇప్పుడు మనం మరొక కవిత చూద్దాం. వర్డ్స్ వర్త్ రాసిన Daffodils. ఈ కవిత చాలా సంకలనాల్లోకి ఎక్కిన కవిత. కాని ఆ కవిత లో ఉన్న ప్రతిభ కన్నా ఎక్కువ కీర్తినే గడించిన కవిత. కవిత చూడండి:

మొదటి వాక్యాల్లో కవితాత్మకమైన ఒక కవిసమయం మన నేత్రాల్ని పలకరిస్తుంది:

I wandered lonely as a cloud
That flows on high over vales and hills

మనిషిని సమాజం నుంచి విడదీయడం-ఎందుకంటే అతడు పుట్టడం స్వేచ్ఛగా పుట్టినా అన్నివైపులా సంకెళ్ళతో చుట్టుముట్టి వున్నాడు.అందుకని ఆ ‘ఒంటరి’ వ్యక్తి కోసం, కవి మొత్తం భూమ్యాకాశాల్ని, ‘మేఘం’, ‘కొండలూ, లోయలూ’, ‘పైని తేలిపోవడం’ వంటివాటితో చుట్టబెట్టి చూపాలనుకుంటున్నాడు. పాఠకుడిలో ఒక భావుకమనఃస్థితిని మేల్కొల్పడం కోసం ఒక కాల్పనికచిత్రాన్ని చిత్రిస్తున్నాడు.

When all at once I saw a crowd

కాని ‘పూలు’ అనే పదానికి ఎంతమాత్రం పొసగని crowd అనే పదం వాడటంతో పాఠకుడి ప్రతిస్పందనకి ‘రసవిఘ్నం’ అడ్డుపడుతుంది. ఇది చిన్ని లోపమే కావచ్చు, అదృష్టవశాత్తూ, ఆ వెంటనే host of golden daffodils అనే అత్యంత స్మరణీయ పదచిత్రాన్ని వాడతాడు. కాని ఆ చిత్రానికి ఇంతలోనే మళ్ళా మరొక రసవిఘ్నం, ఆ పూలు ‘చెరువు పక్కనా, చెట్ల చెంతనా’ ఉన్నాయని అనడంతో,ఆ అనుభూతి చెరిగిపోతుంది. కవిత కాస్తా గణేష్ బీడీ కంపెనీ వాణిజ్యప్రకటనగానో, లేదా ప్రభుత్వ పర్యాటకశాఖవాళ్ళ కాలెండరులానో మారిపోతుంది!

కవి ఇట్లా ప్రకటించే కొద్దీ మన అనుమానం బలపడటం మొదలవుతుంది. ఎందుకంటే కవి ‘పాడటం’ మానేసి ‘ప్రకటించడం’ మొదలుపెట్టాడు కాబట్టి.

Continuous as the stars that shine
And twinkle on the Milky way

ఈ వాక్యాలు మొత్తం నిలవసరుకుతో నిండిపోయాయి. పైగా నక్షత్రాలు continuous గా ఉన్నాయి చూడమంటాడు. కాని, తన పారవశ్యంలో హాప్కిన్స్ ఏమంటున్నాడో చూడండి:

I kiss my hand to the stars lovely asunder

అలవాటుగా పడికట్టుపదాల్ని దొర్లించుకుంటూ పోయే కవికీ, ‘నక్షత్రాలు వెదజల్లిన అకాశాన్ని’ నిజంగా చూసి అనుభూతి చెందిన కవికీ తేడా ఇదే.

మళ్ళా మరొక రసవిఘ్నం:

ten thousand at a glance

ముందేమో crowd అంటాడు, ఆ తర్వాత host, ఇంక ఇప్పుడేమో, ten thousand. ఇక్కడ సాధారణీకరణ, objective correlative పూర్తిగా కలగాపులగమైపోతున్నది. మనకి చూపిస్తున్న దృశ్యాలు మన మనసులో సరిగ్గా నాటుకోకుండా, అనౌచిత్యదోషంలో పర్యవసిస్తున్నాయి. ఇప్పుడు ఆ పూలు మళ్ళా

fluttering and dancing in the breeze

ఇదేమంత పెద్ద లోపం కాదుగానీ, కొద్దిగా అతిగా ‘విపరీత’ దోషానికి పాల్పడతున్నది.

ఆ పూలు ఉల్లాసపూరితమైన dance లో తలలాడిస్తున్నాయి(మళ్ళా మరొకసారి dance అనే పదం వాడాడు) అంటున్నప్పుడు మళ్ళా ‘విపరీత’ దోషానికి పాల్పడుతూ ఇట్లా అంటున్నాడు:

The waves beside them danced (మళ్ళా మూడోసారి Dance)
but they overdid the sparkling waves in glee

ఇలా రాయడం కవిగా అతడి సోమరితనాన్ని సూచించుకోవడమే.

ఈ వాక్యాలు చూడండి, మరొక రసవిఘ్నంతో మనమీద విరుచుకుపడుతున్నాడు.:

A poet could not but be gay
In such a jocund company

‘కవి అంటే మానవులతో మాట్లాడే మనిషి’ అని తన మానిఫెస్టో లో ప్రకటించిన కవి ఇతడు. కాని ఇక్కడ, ఇతడు మనతో మాట్లాడటం లేదు. కవికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన స్థానాన్నిచ్చి తక్కిన మనుషులనుంచి విడదీస్తున్నాడు. కాబట్టే, అతడు cannot but be gay. కాని, అదే సమయంలో ఆనందకుమారస్వామి ఏమంటున్నాడో చూడండి: A poet is not a special kind of man, every man is a special kind of poet అని. కుమారస్వామి కవి కాడు, కాని కవులు మనుషులనుంచి వేరుపడకుండా సరిదిద్దుతున్నాడు.

వర్డ్స్ వర్త్ తన కవితలో డాఫొడిల్స్ లోని ‘డాఫొడిల్ తనాన్ని’ మనకి పరిచయం చేయకుండానే మరింత మరింతగా డాఫోడిల్స్ నుంచి దూరంగా జరిగిపోతుంటాడు. అదే సమయంలో, Tiger కవిత (బ్లేక్ రాసిన ప్రసిద్ధ కవిత) tigritude తాలుకు ప్రతి చిన్న విశేషాన్నీ మనకు అందించడంలో కృతకృత్యమవుతున్నది…

మళ్ళా కవిత దగ్గరికొద్దాం, ఈ కవి మనల్నింకా ఇలా హింసిస్తున్నాడు:

I gazed and gazed but little thought
What wealth to me the show had brought

A poet could not be gay in such a jocund company అంటూ ఇంటికప్పు ఎక్కి మరీ ప్రకటించిన కవి , ఇప్పుడు గాలితీసేసిన బుడగలాగా ఇలా అంటున్నాడు చూడండి:

I gazed and gazed but little thought
What wealth to me the show had brought

ఇంక thought అనే పదానికి brought తో అంత్యప్రాస, hatho, gatho, patho లాగా. ఇతనేనా Poetry is emotion recollected in tranquility అని నోరారా అన్నది. కాని, ఈ కవిత చూస్తే ఇతడు చెప్పింది అబద్ధమని తెలిసిపోతోంది. నిజంగానే ఇతడు ఆ పూలని చూసిన ఆ క్షణంలో తన ఆనందాన్ని తాత్కాలికంగా స్తంభింపచేసుకుని, ఫుడ్ పార్సెల్లాగా ఇంటికి తెచ్చుకున్నాడా?

Oft when on my couch I lie
In vacant or pensive mood
They dance upon my inward eye
Which is the bliss of solitude (ఇంత చిన్నకవితలో మళ్ళా నాలుగోసారి dance అనే పదప్రయోగం)

కీట్స్ లాంటి కవికి కవిత్వమంటే, పొరుగువాడితో గుసగుస, కానీ, ఈ కవితలో ఈ చరణం మటుకు లౌడ్ స్పీకర్లలో హోరెత్తించే ప్రభుత్వప్రకటనలాగా ఉంది. అందుకనే ఇలియట్ ఆ ప్రకటనని నిరాకరించేడంటే ఆశ్చర్యమేముంది? కవి అనుభవించిందీ, మనకి ఈ కవితలో ఇస్తున్నదీ ఒకే emotion కాదు, అది recollected కానే కాదు, ఇంకా చెప్పాలంటే tranquility లో పొంగిప్రవహించిన కవితావాక్యం అసలే కాదు….”

డాఫొడిల్స్ కవిత పూర్తిపాఠం రిఫరెన్సుకోసం:

I wandered lonely as a cloud (1807)

William Wordsworth

I wandered lonely as a cloud
That floats on high o’er vales and hills,
When all at once I saw a crowd,
A host, of golden daffodils;
Beside the lake, beneath the trees,
Fluttering and dancing in the breeze.

Continuous as the stars that shine
And twinkle on the milky way,
They stretched in never-ending line
Along the margin of a bay:
Ten thousand saw I at a glance,
Tossing their heads in sprightly dance.

The waves beside them danced; but they
Out-did the sparkling waves in glee:
A poet could not but be gay,
In such a jocund company:
I gazed—and gazed—but little thought
What wealth the show to me had brought:

For oft, when on my couch I lie
In vacant or in pensive mood,
They flash upon that inward eye
Which is the bliss of solitude;
And then my heart with pleasure fills,
And dances with the daffodils.

(sprightly: ఉల్లాసంగా , jocund: ఉల్లాసంగా, ఉత్సాహంగా, couch: శయ్య, pensive: గంభీరమైన , solitude: ఏకాంతం)

24-4-2018

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading