మనం నాటకాలు ఎందుకు చూస్తాం? అసలు ఎందుకు రాసుకుంటాం? చదువుకుంటాం?
ఈ ప్రశ్నలకు జవాబులివ్వడానికే అలంకారశాస్త్రాలన్నీ పుట్టాయి. యూరోప్ లో అరిస్టాటిల్ నుంచి నీషే దాకా, భారతదేశంలో భరతముని నుంచి బాదల్ సర్కార్ దాకా ఎందరో ఈ ప్రశ్న వేసుకుని, తరచి చూసుకుని, ఎన్నో అద్భుతమైన సమాధానాలు చెప్పారు. వాటన్నింటి సారాంశమూ ఒక్కటే. నాటకం చూస్తున్నప్పుడు సామాజికంగా మనలో ఏదో జరుగుతుంది. ఏదో మలహరణం సంభవిస్తుంది. మనం తేటపడతాం. మళ్ళీ తెల్లవారాక మరొకసారి జీవితాన్ని మరింత శుభ్రంగానూ,మరింత తాజాగానూ సమీపిస్తాం అనే.
నాటకం ఒక సామాజిక క్రతువు. క్రతువు అంటే ఏమిటి? నలుగురూ ఏదైనా పని కలిసి చేసేముందు,ఎలా చేయాలో అభినయించుకోవడమే క్రతువు. ఒకప్పుడు ఆదిమానవులు మర్నాడు పొద్దున్న వేటకి పోవడానికి ముందురాత్రి, మర్నాడు ఎలా వేటాడాలో, నలుగురూ కలిసి అభినయించుకోవడం లోంచే అన్ని రకాల కళలూ, ఆరాధనాసంప్రదాయాలూ పుట్టుకొచ్చాయి. ప్రతి క్రతువూ ఒక ప్రతీకాత్మక పశువధ. ఆ పశువు బయటి పశువుగా ఉంటూనే లోపలి పశువుని కూడా సంకేతించడంలోంచే పురాణగాథలు పుట్టుకొచ్చాయి. ఆ పశువు ఒకటే పశువైతే మినోటారు, దానికి పదిముఖాలుంటే రామాయణం, వందముఖాలుంటే భారతం.
ఆ పురాణగాథలే రానురాను కథలుగా, కావ్యాలుగా, నాటకాలుగా వికసిస్తూ వచ్చాయి. ఒక నాటకం రాయడంలో రచయిత తన సమాజం తరఫున ఒక ప్రతీకాత్మక పశువధకు పూనుకుంటాడు. ఆ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, సామాజికులు రెండు రకాల అనుభూతికి లోనవుతారు. ఆ పశువు బయటి ప్రపంచానికి సంబంధించింది అనుకుంటే, ఆ పశువధ ఒక వీరగాథగా, ఒక ఉత్సవంగా పరిణమిస్తుంది. అది మోదాంతం. అలాకాక, ఆ పశువు మనలోపలి పశువు అనుకుంటే అది ఎంతో నిర్వేదంతోనూ, భయకారకంగానూ, అదే సమయంలో కరుణాస్పదంగానూ ఉంటుంది. అది విషాదాంతమేగాని, ఆ క్రమంలో మన అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తుంది కాబట్టి, అత్యంత మానవీయం.
ఇవన్నీ మీకు తెలిసినవే. మళ్ళీ రాయవలసిన పనిలేదు. కాని, SRK Moorty గారు ఒథెల్లో నాటకం మీద రాసిన వ్యాసం చదివాక నిన్న నాకు కొత్తగా అర్థమయిందేమంటే, ఒక నాటకం చూడటమే కాదు, ఆ నాటకం మీద విమర్శ చదవడం కూడా ఒక పవిత్రక్రతువేనని. ఎందుకంటే, ఏ నాటకాన్నైనా ప్రదర్శించడమంటే, దాన్ని ఒక నటబృందం మళ్ళా కొత్తగా interpret చెయ్యడం. అలాగే ఒక రసజ్ఞుడు, ఆ నాటకంలో ప్రతి పాత్రలోనూ తనని తాను చూసుకుంటూ, తనని తాను శోధించుకుంటూ, ఆ నాటకాన్ని వ్యాఖ్యానించడం కూడా interpret చేయడమే. ఇది కూడా ఒక ప్రదర్శననే. మనోయవనిక తొలగించి, ఆ రసజ్ఞుడు అంతరంగ రంగస్థలం మీద నాటకాన్ని సరికొత్తగా ప్రదర్శించడమే.
చదవండి. షేక్ స్పియర్ నాటకాల మీద SRK Moorthy గారు అందిస్తున్న వ్యాఖ్యానాల పరంపరలో ఇది అయిదవది. ఇదిగో, ఇక్కడ ఆ వ్యాసం లింక్ ఇస్తున్నాను. చదవండి.
https://drive.google.com/file/d/1II2XyON1oOFNAXdkWArOsEuZzLj2Rb6-/view
ప్రతి కొత్త వ్యాఖ్యానంతోనూ, సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు, మిత్రుడు ఆదిత్య అన్నట్లుగా, తాను అంతదాకా అధిరోహించిన ఎత్తుల్ని తానే అధిగమిస్తున్నారు.
చూడండి, ఎటువంటి వాక్యాలు! ఎటువంటి అంతర్దృష్టి!
ఒథెల్లో పరిశీలననుంచి
‘నాలుగు గోడల మధ్య కథ అనుకున్నది , గోడలు లేని నాటకం అయింది.’
‘ఒథెలో కేవలం నలుపు తెలుగు నాటకంగా మిగిలిపోయింది. ఆ రెంటి మధ్యలో కోపంలో కొన్ని కాలిపోయాయి, కన్నీళ్ళతో కొన్ని కారిపోయాయి.’
‘ఈ నాటకకథా ప్రారంభమే తల్లకిందులుగా ఉంది.’
‘ఒథెలో నాటకంలో భూతప్రేత పిశాచాలు లేవు, కనీసం ఆకాశవాణి కూడా లేదు, కథ మొత్తం నేలమీదనడుస్తుంది. ఇందులో దయ్యాలు మనిషిలో చేరిపోయాయి. మానవరూపాలలో కథను నడిపిస్తాయి…ఫాస్టస్ ను మెఫొస్టాఫిలిస్ నడిపించినట్టు.’
‘షేక్ స్పియర్ రచనల్లో ఒక మాటగాని, ఘటనగాని స్వప్నధర్మాన్ని అనుసరిస్తాయి. అంటే కావ్యరచన స్వప్నరచనను అనుకరిస్తుంది.’
‘నాటకంలో ఏ పాత్రనైనా తెలుసుకోవలనంటే, ఇయాగోను ఆశ్రయించాలి. ఎందుకంటే, అతడే నాటకం రాసిన షేక్ స్పియర్.’
‘అర్జునుడి విషాదం వట్ఠి ముసుగు అని భగవానుడు కొట్టేసాడని మనకు తెలుసు, ఇయాగోలో ధర్మభ్రష్టత విషాదం కలిగించదు, విద్వేషం రగిలిస్తుంది.’
‘షేక్ స్పియర్ ఏ ఒక్క జాతి పక్షము వహించడు. అసహనం ఏ జాతిదైనా అసహ్యం.’
‘ఒథెలో స్వభావంలో ఇయాగో ఒక మూల దాగి ఉండకపోతే, అంతటి ధీరోదాత్తుడు అలా పతనమవడు.’
‘స్త్రీకి అన్యాయం ఎక్కడ మొదలవుతుంది? ఆమెను దేవతను చేయడంతో, ..దేవత అయిన తరువాత శిలగా మారడం ఎంతో దూరం లేదు.’
‘మొత్తం మీద ఈ నాటకంలో పురుషపాత్రలందరూ మూఢులు, మూర్ఖులు. స్త్రీ పాత్రలే ఒక్కొక్కరు ఒక్కొక్కవిధంగా సచేతనులు. ఒకరు త్యాగం, ఒకరు ధర్మం, ఒకరు ఋజుత్వం ఆదర్శాలుగా నిలిచిపోయారు.’
‘ఎదురునిలిచిన శక్తులు ఎంత బలమైనవైతే, ఎదిరించిన వ్యక్తిత్వం అంత ఉదాత్తమై, ఉన్నతమై నిలుస్తుంది, ఎంత ఓడిపోతే అంత గెలుస్తుంది, నిలుస్తుంది.’
‘నాటకాలలో భావాలు పాత్రలవి. ఒక భావం మరొక భావంతో తలపడుతుంది. ఆ భావాలకల్లోలంలోనుండి ముందు హాలాహలం వస్తుంది. ఆ హాలాహలమే నాటకవస్తువు.’
‘స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని ఆలింగనం చేసుకోడంలో ఉండే విషాదం చెబుతున్నాడు. ఎంత చిత్తశుద్ధితో పరధర్మాన్ని అవలంబించినా, ఆ జాతి ధర్మం నిన్ను ఎప్పటికీ పరునిగానే చూస్తుంది,క్షణక్షణమూ నీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూనే ఉండవలె. .నీవు వదలినా స్వధర్మం ఎప్పటికీ నిన్ను వదలదు. ఈ రెండూ నాటకం పేరులోనే చెప్పాడు, ‘వెనిస్ లో మూర్ ‘. ఈ రెండు పేర్లకూ ఈనాడు ఎన్నైనా పర్యాయపదాలు దొరుకుతాయి.’
‘ఇందులో ప్రధాన ఘర్షణ కామవిషయం.’ The beast with two backs.’..అవును, విడివిడిగా స్త్రీపురుషులు పశువులే. కాని దాంపత్యంలో వీరు రెండు వీపుల పశుపతి, కాంతాసమ్మిశ్రదేహం.’
21-8-2018