దిశానిర్దేశం

366

భారతదేశం చాలా విచిత్రమైంది. ఇక్కడ ఒకడు ధ్వంసం చెయ్యడమే పనిగా పెట్టుకుంటాడు. మన విలువల్నీ, మన విశ్వాసాల్నీ, మనిషినీ, మనిషినీ కలిపే సామాజికబంధాలన్నిటినీ, ప్రతి ఒక్కటీ. మరొకడు, నిశ్శబ్దంగా వాటిని కలపడమే పనిగా పెట్టుకుంటాడు. ఓపిగ్గా, మన నమ్మకాల్ని, ఆశల్ని ప్రోదిచేస్తూంటాడు. కొత్తజీవితంలోకి మనకి ఎప్పటికప్పుడు తలుపులు తెరుస్తుంటాడు. ఒకడు నీకూ నాకూ మధ్య గోడలు కడుతూండటమే ధ్యేయంగా బతుకుతుంటాడు, మరొకడికి ఆ గోడలు కూల్చడమే జీవనవ్యాపారం. మనుషుల మధ్య గోడల్ని కూలుస్తూ, నమ్మకాలు నిలబెడుతూ వస్తున్న ఆ నిశ్శబ్దప్రేమికులు ఇంకా కొందరుండబట్టే ఈ దేశం ఇంకా జీవించదగ్గదిగా కనిపిస్తూ ఉంది.

కొత్త జీవితానికి అట్లా ఊపిరులూదుతున్న ప్రయత్నాల్లో ఈ మధ్య నా దృష్టికి వచ్చింది శ్రీ అరవిందో సొసైటీ వారు చేపడుతున్న ‘రూపాంతర్’ కార్యక్రమం.

గ్రామీణ విద్యారంగంలో, ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమికపాఠశాలల్లో ‘రూపాంతర్’ కార్యక్రమం ఒక నిశ్శబ్ద విప్లవం అని అర్థం కాగానే ఆ సొసైటీకి చెందిన కార్యకర్తల్ని మా సంస్థకి పిలిచి మాట్లాడించకుండా ఉండలేకపోయాం.

మన పాఠశాలల ప్రధాన సమస్య వనరులు లేకపోవడం కాదు, స్తబ్ధత అని కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. పిల్లవాణ్ణి engage చెయ్యలేకపోవడంలోనే పాఠశాలల వైఫల్యం ఉందని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను. కాని, పిల్లవాణ్ణి engage చెయ్యడం కన్నా ముందు ఉపాధ్యాయుణ్ణి engage చెయ్యవలసి ఉంటుంది. కాని, గ్రామీణ ఉపాధ్యాయుడు ఒక నిష్ఠుర, ఏకాంత ప్రపంచంలో కూరుకుపోయి తననొక అభిశప్తుడిగా భావించుకుంటూ ఉన్నాడు. అతణ్ణి సమీపించి, అతడు చేస్తున్న పని చూసి, అతడి భుజం తట్టడానికి ప్రభుత్వానికి సమయం లేదు. ప్రభుత్వానికి లెక్కలు కావాలి. అంకెలు కావాలి. కాని, పాఠశాలలకి ఉత్సాహం కావాలి, ఉత్తేజం కావాలి. అదివ్వగలిగినవాళ్ళు ఎవరు? ఎక్కడున్నారు?

విద్యపట్ల అరవిందులు, శ్రీమాత వ్యక్తం చేసిన దృక్పథం ఆధారంగా రూపొందిన శ్రీ అరవిందో సొసైటీ ఆ బాధ్యత తన భుజానికెత్తుకుంది. ఎక్కడ మొదలుపెట్టాలి? దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం, అక్షరాస్యతలో వెనకబడ్డ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ని కార్యస్థానంగా ఎంచుకుంది. దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో సుమారు రెండున్నరకోట్ల మంది బాలబాలికలు ప్రాథమిక విద్యలో ఉన్నారు. రెండున్నరలక్షల ప్రాథమికపాఠశాలలున్నాయి. వాటిలో ఆరున్నర లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. జనాభా రీత్యా ఉత్తరప్రదేశ్ ని ప్రపంచంలోనే ఆరవదేశంగా పరిగణించవచ్చు. అటువంటి చోట, పాఠశాలలకి కనీస సౌకర్యాలు సమకూర్చడమే పెద్ద సమస్య. ఇక, తరగతి గదుల్లో బోధన, అభ్యసన మరింత ఆసక్తికరంగా సాగటానికి అవసరమైన సామగ్రిని సమకూర్చడమెట్లాగ?

కాని అరవిందో సొసైటి ఇక్కడే కొత్త తరహాగా ఆలోచించింది. పాఠశాలల్లో బోధన-అభ్యసన మరింత ఆసక్తికరంగా కొనసాగటానికి, రూపాయి కూడా కర్చు చెయ్యనవసరం లేని పద్ధతులు, ప్రయోగాలు ఏవన్నా ఉన్నాయా? వాటిని మనం కొత్తగా మరే దేశం నుంచో లేదా మరే విద్యావేత్త పుస్తకాలనుంచో తెచ్చి పరిచయం చేసే బదులు, ఆ పాఠశాలల్లోనే, ఇప్పటికే ఆ ఉపాధ్యాయులే అమలు చేస్తున్న ప్రయోగాలేమన్నా ఉన్నాయా? ఈ ఆలోచనతో అరవిందో సొసైటీ, ఉత్తరప్రదేశ్ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ రెండు ప్రశ్నలడిగింది.

అ) పాఠశాలల్లో బోధన-అభ్యసన మరింత ఉజ్జీవంగా ఉండటానికి ఎట్లాంటి కర్చూ (Zero investment innovations) లేకుండా అమలు చెయ్యగల ప్రయోగాలేమన్నా ఉన్నాయా?

ఆ) అటువంటి ప్రయోగాలు మీరిప్పటికే మీ పాఠశాలల్లో ఏవైనా అమలుచేసి ఉన్నారా?

ఆరున్నరలక్షలమంది ఉపాధ్యాయుల్లో సుమారు మూడున్నరలక్షలమంది ఉపాధ్యాయుల్ని ఈ ప్రశ్నలు చేరగలిగాయి. అనూహ్యంగా దాదాపు లక్షమంది ఉపాధ్యాయులు ప్రతిస్పందించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త ప్రయోగం, ఒక్క రూపాయి కూడా కర్చుచేయనవసరం లేని ప్రయోగాల్ని, తమ పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ లక్ష ప్రయోగాల వివరాల్నీ శ్రీ అరవిందో సొసైటీ సేకరించింది. నిపుణులైన విద్యావేత్తల బృందాలు ఆ ప్రయోగాల్ని సాకల్యంగా చదివాయి, గంపలకెత్తి తూర్పారబట్టాయి. అనేక వడపోతల తర్వాత వాటన్నింటినీ 11 పద్ధతులుగా క్రోడీకరించాయి. ఇప్పుడు, తిరిగి మళ్ళా ఆ 11 పద్ధతుల్నీ పాఠశాలలన్నింటికీ పరిచయం చేసారు.

ఆ 11 పద్ధతుల వివరాలు చూడాలనుకున్నవారుhttp://ziiei.com/doc/Navachar_Book.pdf
లేదా ఇంగ్లీషు వెర్షన్ కోసం http://ziiei.com/epustika.php చూడొచ్చు.

2015 లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి ఎచ్.డి.ఎఫ్.సి బాంకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూరుస్తున్నది. బహుశా ప్రపంచంలోనే ఇంత mass-scale teacher outreach మరొకటి లేదని చెప్పవచ్చు. ఆలోచననుంచి అమలుదాకా కొంగొత్త తరహాలో సాగిన ఈ విద్యాకార్యక్రమం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాన్ని ఊహించలేనంతగా మార్చేసింది.

మామూలుగా ఇటువంటి కార్యక్రమం కేరళలో మొదలు కావాలి. అప్పుడు వేరే రాష్ట్రాల్ని ఈ ప్రయోగాన్ని అమలు చెయ్యమంటే ‘కేరళ పరిస్థితులు వేరు, మా పరిస్థితులు వేరు’ అంటో సన్నాయినొక్కులు నొక్కి ఉండేవి. కాని ఉత్తరప్రదేశ్ లోనే ఇటువంటి ఉద్యమం సాధ్యమయ్యాక, మరే రాష్ట్రంలో సాధ్యం కాదనే ప్రశ్న కలక్కుండా ఉండదు. అందుకనే, ఇప్పుడు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ప్రయోగాన్ని స్వాగతించాయి.

ఈ ఉద్యమానికి దూరంగా ఉండిపోయిన ఆరు రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి. (అక్షరాస్యతలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉత్తరప్రదేశ్ కన్నా కూడా వెనకబడి ఉన్నాయి. దేశంలో అక్షరాస్యతలో అధమ రాష్ట్రాలు అయిదింటిలోనూ మన రెండు రాష్ట్రాలూ ఉన్నాయని గుర్తుచెయ్యకతప్పట్లేదు). అందుకని, ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రాలకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో ముందు తెలంగాణా ప్రభుత్వానికి ఈ ప్రయోగాన్ని పరిచయం చెయ్యడం కోసం మా కార్యాలయంలో ఒక గోష్టి ఏర్పాటు చేసాం. శ్రీ అరవిందో సొసైటీ తరఫున ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రయోగాన్ని అమలు చేసిన మయాంక అగర్వాల్ నీ; పాఠశాల విద్యాశాఖకీ, సాంఘిక, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థకీ చెందిన ప్రతినిధుల్నీ ఒకచోట చేర్చి ఈ కార్యక్రమం గురించి చర్చించాం. నావరకూ నాకు ఇది గొప్ప teacher motivation కార్యక్రమం అనిపించింది. గ్రామీణ పాఠశాలల్లో పేరుకుపోయిన స్తబ్ధతని బద్దలుకొట్టి జీవజలాల్ని ప్రవహింపచేసే స్ఫూర్తి ఈ ప్రయత్నంలో పుష్కలంగా ఉందనిపించింది.

నా మిత్రుల్లో చాలమందికి విద్యారంగంలో, ముఖ్యంగా గ్రామీణపాఠశాలల్లో తమ వంతు తాము కూడా ఏదైనా చెయ్యాలన్న కోరిక బలంగా ఉందని నాకు తెలుసు. వారు ఈ కార్యక్రమం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వారిని ఒక్కసారి www.zieii.com,www.rupantar.in/ziiei,www.facebook.com/ZIIEIExhibitions సందర్శించమని కోరుకుంటున్నాను.

అన్నిటికన్నా గొప్ప విషయమేమిటంటే, పాఠశాలల్లో వ్యయరహితంగా అమలు చెయ్యగల ఈ ప్రయోగాల్ని ఉపాధ్యాయులనుంచి తెలుసుకున్న తరువాత, శ్రీ అరవిందో సొసైటీ, 1 వతరగతి నుంచి 5 వతరగతిదాకా అన్ని సబ్జెక్టుల్నీ, అన్ని పాఠాల్నీ ఈ పద్ధతుల ప్రకారం బోధించడానికి పాఠ్యప్రణాళికలు రూపొందించింది. వాటిని ఆన్ లైన్లో అందరికీ అందుబాటులో ఉంచింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు వాటిని ip.ziiei.com లో చూడవచ్చు. ఇటువంటిదేదో మన పాఠశాలల్లో కూడా సంభవిస్తే నాకన్నా సంతోషించేవాడు మరొకడుండడు.

ఎందుకంటే, పాఠశాలలు మారకుండా, గ్రామీణ విద్యార్థులకి దిశానిర్దేశం చెయ్యకుండా, ఈ దేశంలో ఎటువంటి రాజకీయ విప్లవాలూ, సామాజిక విప్లవాలూ సాధ్యమయ్యే ప్రసక్తి లేనే లేదన్నదే నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి.

18-4-2018

Leave a Reply

%d bloggers like this: