రుద్రమ దేవి చూసాను.
సగం దాకా చరిత్రని చరిత్రగా చెప్పగలిగిన దర్శకుడు సగంనుంచి దారితప్పాడు. అక్కణ్ణుంచీ చరిత్ర మైథాలజీగా మారిపోయింది. అనుష్క ఒంటిచేత్తో నిలబెట్టడానికి ప్రయత్నించిన ఈ చిత్రానికి:
మైనస్ పాయింట్లు:
1) చక్కటి కళాదర్శకుడు లేకపోవడం. తెలుగువాళ్ళకి హాలీవుడ్ సినిమాలే పెద్ద దిక్కు కాబట్టి 13 వ శతాబ్ది ఏకశిల ని కూడా రోమన్ తరహా ఆర్కిటెక్చర్లో చూడకతప్పదు, ‘లింగ’ సినిమా సమీక్షిస్తూ నేను రాసిన మాటలు మళ్ళా రాయకతప్పట్లేదు, మన దర్శకులకి ఒక పీరియాడిక్ మూవీని తీసే విషయపరిజ్ఞానం లేనేలేదు.
2) సరైన కథకుడు లేకపోవడం. ఇంతకన్నా నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి నవలనో,అడివి బాపిరాజు గోనగన్నారెడ్డినో నేరుగా సినిమాగా తీసుంటే ఎంతబాగుండేది!
3)ఇళయరాజా సంగీతం, నిజంగా ఆయనేనా సంగీతం సమకూర్చింది?
4) సీతారామశాస్త్రి పాటలు, చరిత్ర అనగానే సిరివెన్నెల ఎట్లా రగిలిఉండాలి? కాని చప్పగా చల్లారిన పాటలే.
5) గ్రాఫిక్స్ అనబడే నాన్సెన్స్.
మంచి విషయాలు:
1) రుద్రమదేవి పాత్రని మలిచిన తీరు, రుద్రదేవుడిగా అనుష్క హావభావాలు, కంఠస్వరం,నడక, నడత అన్నీను.
2) కాకతీయుల వ్యావసాయిక, సామాజిక సంస్కరణల ప్రస్తావన, చిత్రీకరణ
3) శివదేవయ్య గా ప్రకాష్ రాజ్.
4) రుద్రమదేవి, ముక్తాంబల మధ్య సన్నివేశాలు.
బొత్తిగా అర్థం పర్థం లేని చిత్రణ:
గోనగన్నారెడ్డి పాత్ర, అతడి యాస ( ఆ యాస నిజంగా తెలంగాణా యాస అయిఉంటే ఎంత బాగుండేది!), బహుశా దర్శకుడు గోనగన్నారెడ్డి ద్వారా ప్రస్తుత తెలంగాణాలోని నక్సలైట్ శక్తుల్ని అలిగారికల్ గా స్ఫురింపచెయ్యడానికి ప్రయత్నించాడా?
మూడుగంటల సినిమా విసుగుపుట్టించలేదుగానీ, గుర్తుండేది కూడా ఏమీ లేదు. తెలుగువాళ్ళ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పదగ్గ ఒక చారిత్రిక కాలాన్ని చూసిన అనుభూతిగానీ, ప్రపంచస్థాయి రాజనీతిజ్ఞురాలిగా, యుద్ధవిశారదురాలిగా మనం గర్వించదగ్గ ఒక మహనీయురాలి గురించి మనసారా తలుచుకున్నామన్న సంతోషంగానీ ఏమీ లేవు.
ఒక్క ఓదార్పు ఏమిటంటే, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణా చరిత్రకు సంబంధించిన ఇతివృత్తంతో ఒక సినిమా వచ్చిందని మాత్రమే.
రేపు రాబోయే ప్రతాపరుద్రుడు కూడా ఇలానే ఉంటే, ఇదే చరిత్ర అని మన పిల్లలు నమ్మకుండా కాపాడటమెట్లా?
16-10-2015