బండి శ్రీహర్ష గారు నిన్న నాకో మెసేజి పెట్టారు. చిత్రకళమీద అభిమానం ఉంది కాబట్టి, రాజా రవి వర్మ మీద తీసిన సినిమా రంగ్ రసియా ఒకసారి చూడకూడదా అని. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ లింక్ కూడా పంపించారు. చాలా రోజుల తర్వాత మళ్ళా ఒక పూర్తి సినిమా చూసాను.
రంగ్ రసియా చూడండి. రాజా రవివర్మ చిత్రించిన బొమ్మలు చూస్తూనే మనం పెరిగి పెద్దయ్యాంగానీ,ఆయన జీవితంలో ఇంత నాటకీయత ఉందని ఈ సినిమా చూసాకే తెలిసింది.
సంస్కృతిని పరిరక్షిస్తున్నామనే పేరుతో సృజనాత్మకతని అడ్డగించడం భారతదేశ చరిత్రలో ఇంతకు ముందు లేదు. ఒకప్పుడు మధ్యయుగాల్లో ఈ లక్షణం యూరోప్ లో ఉండేది. కాని ఇప్పుడు భారతదేశానికి కూడా అంటుకుంది. ఈ జాడ్యం వల్లనే ఎం. ఎఫ్ హుస్సేన్ లాంటి సున్నితమనస్కుడైన చిత్రకారుడు దేశం వదిలి పోయి ఎక్కడో ప్రవాసిగా ఈ లోకంనుంచి నిష్క్రమించవలసివచ్చింది. రవివర్మ కాలంలో రవివర్మ కూడా ఎం.ఎఫ్.హుసేన్ లానే క్షోభకు గురయ్యాడన్నది ఆశ్చర్యం కలిగించే అంశమే.
కళ ఎక్కడ స్ఫూరిగా, సృజనగా ఉంటుందో, ఎక్కడ మోహంగా, ప్రేమగా, జీవితాల్ని నిలవనివ్వని తుపానుగా మారుతుందో చెప్పడం కష్టం. తన కళాసృజన నలుగురినీ చేరాలని కోరుకోని కళాకారుడెవరుంటారు? కాని ఆ ప్రయత్నంలో కళ వ్యాపారం కాకుండా ఆగడం కష్టం, వ్యాపారమయిన తర్వాత వివాదం కాకుండా ఉండటమూ కష్టమే.కళాకారుల మీద సాంస్కృతిక పోలీసింగ్ మొదలయినప్పుడు అది ఆ కళాకారుల సృజనమీదనా, లేక ఆ కళ సంతరించుకుంటున్న వ్యాపార ప్రమాణాలమీదనా అన్నది చెప్పడం కష్టం.
కాని, ఏ కారణాలవల్లనైనా కళాకారుడి సృజనని అడ్డగించాలనుకునే జాతికి వికాసం సాధ్యం కాదు. కవులూ, కళాకారులూ unacknowledged legislators అని అంటే దాని అర్థం శాసనసభల్లో వివిధ రాజకీయ దృక్పథాలు శాసనసభల్లో ప్రజలంతా చూస్తూ ఉండగా చర్చించుకున్నట్టు, ఒక కవి దృక్పథమో, ఒక కళాకారుడి చిత్రణో నచ్చనివాళ్ళు తిరిగి తమ కవిత్వం ద్వారా, కళ ద్వారానూమాత్రమే వారిని ఎదుర్కోవలసిఉంటుంది. అలా ఎదురుకుంటున్నప్పుడు ఆ వ్యతిరేకవర్గాల వాళ్ళు తాము ఎవరిని వ్యతిరేకిస్తున్నారో వారితో సమానమైన శిల్పప్రమాణాలూ, శ్రేష్టతా చూపించవలసిఉంటుంది. ఆ సంఘర్షణ కళాత్మకంగా జరగవలసిఉంటుంది. అందులో ఎవరి వైఖరి సత్యసమ్మతమో ప్రజలే తీర్పు తీర్చవలసిఉంటుంది. అటువంటి కళాపరీక్షకు నిలబడలేని వాళ్ళూ, సృజనాత్మక సామర్థ్యం లేనివాళ్ళే అశక్తదౌర్జన్యానికీ, గూండాయిజానికీ తెగబడతారు. హుసేన్ ని విమర్శించి వేధించిన వర్గాలనుంచి ఇంతదాకా చెప్పుకోదగ్గ ఒక్క కళాకారుడు కూడా ప్రత్యక్షం కాకపోవడమే ఇందుకు తార్కాణ.
కాని కేతన్ మెహతా రంగ్ రసియా చూస్తున్నంతసేపూ ఆ ఇతివృత్తం రేకెత్తించే ప్రశ్నలమీద కాక, ఆ రంగులు, ఆ సంగీతం, ఆ మహామోహపారవశ్యం మీదనే మనసు లగ్నమైపోతుంది.
శ్రీహర్షగారూ, చాలా సంతోషం,ఒక వేసవి సాయంకాలం నా మనసుమీద మీరు పన్నీరు చిలకరించారు.
26-9-2015