మోసగించడం కష్టం

349

నిన్న రాత్రి లింగ చూసి వచ్చేటప్పటికి అర్థరాత్రి దాటిపోవడమే కాదు, మెడ పట్టేసింది కూడా. అయినా శంకర్, రజనికాంత్ లాంటి వాళ్ళ సినిమాలు చూడకుండా ఉండటం కష్టం. దేశంలో, సమాజంలో popular psyche ఎట్లా ఆలోచిస్తోందో, ఏం కోరుకుంటోందో, దేనికి బాధపడుతోందో తెలుసుకోడానికి వాళ్ళ సినిమాలు కూడా ఒక బెరోమీటర్ లాంటివి.

థియేటర్ కి వెళ్ళేటప్పటికే చాలా వరకు అర్థమైపోయింది. ప్రపంచమంతటా 3000 హాళ్ళల్లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. సినిమా ఎక్కడో ప్రేక్షకుల్ని ఎక్సైట్ చెయ్యలేకపోయిందని అర్థమయింది. హాల్లో అడుగుపెట్టిన రెండవ ప్రేక్షకుణ్ణి నేనే. సినిమా మొదలైన చాలాసేపటికి గానీ హాలు నిండలేదు. నిండిన తరువాత కూడా చంద్రముఖి, రోబో లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో కనబడే పిచ్చి పారవశ్యమేదీ ఈ సినిమా నడుస్తున్నప్పుడు కనిపించలేదు. చప్పట్లూ, ఈలలూ వినిపించాయిగానీ, ఆశ్చర్యంగా అవి రాజా లింగేశ్వర ప్రసాద్ దేశభక్తిపూరితంగా మాట్లాడిన మాటలు విన్నప్పుడు మాత్రమే.

‘లింగ ‘ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది అని తెలుస్తూనే ఉందిగాని, ఎందుకన్నది అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. నేను సినిమా సమీక్షకుణ్ణి కాను. కాబట్టి చెప్పదలుచుకున్నదేదో నేరుగా చెప్పేస్తాను.

సినిమా విఫలం కావడానికి నాకు తోచిన కారణాలు రెండు: ఒకటి, ఆ సినిమాలో ప్రధాన కథ, బ్రిటిష్ కాలంలో ఒక జమీందారు తన యావదాస్తినీ త్యాగం చేసి ఒక డాం నిర్మించడం. బహుశా ప్రేక్షకులు ఆ కథ చూడవలసివస్తుందని ఊహించి ఉండరు. ఏదన్నా ఒక దెయ్యం కథనో, మరమనిషి కథనో చూడవలసి వస్తే ఆ థ్రిల్ వేరు. రజనీకాంత్ ని సాహసహీరో గా చూడాలనుకుంటారుగాని, ఔదార్యం, త్యాగం లాంటి విలువలవెనక ఉండే సాహసాన్ని చూపించడమూ కష్టమే, ఒప్పించడమూ కష్టమే. ఇంతకు ముందు శివాజిలో కూడా ఇటువంటి ప్రయత్నమే చేసినా ఆ కథని నడిపించిన తీరు వేరు.

ఇంక రెండో ముఖ్యమైన కారణం, రాజా లింగేశ్వర ప్రసాద్ కథని 1939 లో జరిగిన కథగా చెప్తూ దర్శకుడు చిత్రించిన చారిత్రిక నేపథ్యమంతా చాలా కృత్రిమంగానూ, కొని చోట్లా హాస్యాస్పదంగానూ ఉంది. ఒక periodic movie ని తియ్యగల సత్తా ఆ దర్శకుడికి లేదు. ఆ మాటకొస్తే ఇప్పుడున్న ఏ దర్శకుడికీ లేదు. 1939 లో సంస్థానాధీశుల్నీ, బ్రిటిష్ పాలననీ, యంత్రాల్నీ, యంత్రాంగాన్నీ, మనుషుల్నీ, మాటల్నీ చిత్రించడంలో ఆ దర్శకుడి అపరిపక్వత, అజ్ఞానం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 18 వ శతాబ్దంలా, కొన్ని చోట్ల 19 వ శతాబ్దంలా, కొన్ని చోట్ల అకస్మాత్తుగా 21 వ శతాబ్దంలా కూడా ఆ కథానేపథ్యం కనిపిస్తుంది. (కలెక్టర్ల సమావేశంలో మధ్యలో పెట్టిన పూలగుత్తి చూడండి.). అంతేకాదు, కనీస చారిత్రిక యథార్థాల్ని కూడా అందులో పట్టించుకోలేదు. గద్వాల సంస్థానం నిజాం కి సామంతసంస్థానంగా ఉండేదనీ, అది కర్నూలు కలెక్టరు పాలనకిందకు రాదనీ, పైగా అది ఒకప్పుడు రాయచూరు జిల్లాలో భాగంగా ఉండేదనీ కూడా ఆ కథారచయితకి తెలియదు. కలెక్టరు 1939 లో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు జోసెఫ్ కాంప్ బెల్ రాసిన The Hero with Thousand Faces చదువుతూ కనిపిస్తాడు. కాని అ పుస్తకాన్ని కాంప్ బెల్1949 లో రాసాడు. ఇట్లాంటివి ఆర్ట్ సినిమాకి ముఖ్యమేమోగాని కమర్షియల్ సినిమాకి ముఖ్యంకావనవచ్చు. కాని ఇప్పటి ప్రేక్షకులు తమకు తెలియకుండానే కమర్షియల్ సినిమాల్లో కూడా ఇటువంటి క్వాలిటీని ఆశిస్తున్నారు.

ఒక చారిత్రిక కథని సినిమాగా తీస్తున్నప్పుడు, ముఖ్యంగా బడ్జెటు గురించి వెనకాడని నిర్మాతలు తీస్తున్నప్పుడు ఆ కథని వీలైనంత విశ్వసనీయంగా తీసిఉంటే సినిమా ఇలా ఉండి ఉండేదికాదు. ఇదంతా ప్రేక్షకులకి తెలియదుగానీ, ఈ disappointment మాత్రం వాళ్ళకి అనుభవమయ్యింది. అందుకనే అంత నిరుత్సాహం అక్కడ.

మన చిత్రదర్శకులు యానిమేషన్లూ, ఫాంటసీలూ తియ్యగలరేమోగానీ, చరిత్రని చూపించలేరు. అందుకు కావలసిన పరిజ్ఞానం, కళాదర్శకత్వం, పరిశీలనానైపుణ్యం తెలుగు, తమిళ దర్శకులెవ్వరికీ లేదు. ముఖ్యంగా కళాదర్శకత్వం, మల్లీశ్వరిలో ఆ దర్శకుడు 16 వ శతాబ్దాన్ని ఎట్లా పున:సృష్టించాడో చూడండి.

ఈ నాలుగు మాటలూ ఎందుకు రాసానంటే, తెలుగులో సినిమా ఉత్సాహం ఉన్న రచయితలు చాలామందే ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఒక periodic movie తియ్యదలుచుకుంటే అది అటెన్ బరో ‘గాంధి’ లాగా, సత్యజిత్ రాయ్ ‘ షత్రంజ్ కే ఖిలాడి’ లా గా నమ్మదగ్గదిగా, చూడదగ్గదిగా ఉండాలి.

మన ప్రేక్షకులు ఎక్కువ చదువుకోలేదుగాని, వివేకవంతులు, వాళ్ళని మోసగించడం చాలా కష్టం.

16-12-2014

 

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading