మూర్తీభవించిన వర్ష ఋతువు

395

నా చాలా చిన్నప్పటి సంగతి. మా ఊళ్ళో మాదొక పెద్ద తాటాకుల ఇల్లు. వానాకాలంలో ఊరంతా ముసురుపట్టి అడవి, కొండ, నింగి, నేల అన్నీ తడిసిపోయి ఉండేవి. అడుగు బయటపెట్టడం కూడా కష్టంగా ఉండేది. అట్లాంటి రోజుల్లో రాత్రిళ్ళు అన్నాలు తిన్నాక, మా అమ్మ అరుగుమీంచే ధారాపాతంగా కారే ఆ చూరునీళ్ళకిందనే గిన్నెలు తొలిచిపెట్టేది. బయట చిమ్మచీకటి. లోపల హరికెన్ లాంతరు వెలుగు. ఆ వెలుగులో ఆ చూరునీళ్ళకింద కంచాలు కడుగుతున్నప్పుడు, ఆ చీకట్లో అవి మెరుస్తుండేవి. అట్లాంటి ఒక వానాకాలపు రాత్రి, అట్లా చూరునీళ్ళకింద కడుగుతున్నప్పుడు చీకట్లో ఆ గిన్నెల మెరుపులు చూస్తూ మా అక్క ‘శ్రీకృష్ణదేవరాయలు సరిగ్గా ఈ విషయాన్నే పద్యం రాసాడు తెలుసా’ అంది. అప్పుడామె రాజమండ్రిలో సంస్కృత కళాశాలలో చదువుకుంటూ ఉండేది. కృష్ణదేవరాయలనే ఒక చక్రవర్తి వానాకాలపు పూరిళ్ళల్లో చూరునీళ్ళకింద గిన్నెలు కడుక్కోడం గురించి వర్ణించాడని ఆమె చెప్పిన మాట నా మనసులో అమాంతం నాటుకుంది.

చాలా ఏళ్ళ తరువాత, తంగిరాల సుబ్బారావుగారికోసం ప్రాచీన కవుల మీద తన అభిప్రాయాల్ని ఒకటి రెండు వాక్యాల్లో చెప్తూ మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు ‘శ్రీకృష్ణదేవరాయలు మూర్తీభవించిన వర్ష ఋతువు’ అన్నారు. ఈ సారి ఆ మాట నన్ను మరింత మోహపెట్టింది. ఆయన్ని వివరించమని అడగవచ్చుగాని, అప్పటికి నా అంతట నేను పద్యాలు చదువుకోగలను కాబట్టి, ఆముక్తమాల్యద తెరిచి ఆ వర్ష ఋతు వర్ణన నాకై నేను చదువుకున్నాను.

చదువుకోవడమంటే, సునాయాసంగా చదువుకున్నానని కాదు, కూడబలుక్కుని చదువుకున్నాను. ఎందుకంటే, తెలుగుకవుల్లో శ్రీకృష్ణదేవరాయలంతటి ప్రౌఢ కవి మరొకరు లేరు. ఆ కవిత్వంలో అన్వయక్లిష్టత, ఊహాశబలత చాలా ఎక్కువ. విశ్వనాథ సత్యనారాయణ అంతటివాడే అముక్తమాల్యదలోని భాష కష్టమైన భాష అని అన్నాడంటే మన సంగతి ఏమిటి! కాని, ఆ కష్టానికి ఊహించనంత ప్రతిఫలం ఉంటుంది. అందులోని కథలుగాని, ఋతువర్ణనలు గాని కష్టపడిచదువుకున్న తర్వాత, అర్థం చేసుకున్నతర్వాత, అవి మనలో అంతర్గతం కావడం మొదలుపెట్టినతరువాత, మనకి లభించే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఆ సాహిత్యసంతోషం ముందు మరే ఐశ్వర్యమూ కొరగాదనిపిస్తుంది. ముఖ్యంగా, ఆ వర్షర్తు వర్ణన.

నిన్న జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు కృష్ణదేవరాయల్ని తలుచుకుంటూ ఏర్పాటు చేసిన ఒక సభకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పుడు నేను ఆ వర్షర్తు వర్ణన గురించే మాట్లాడాను. చంద్రశేఖరరెడ్డిగారు కృష్ణరాయల వీరాభిమాని. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆయన కృష్ణ రాయల పట్టాభిషేక ఉత్సవం జరుపుతూ ఉంటారు. నిన్న కూడా, ఆ ఉత్సవంలో భాగంగా, తెలుగు, కన్నడ, తమిళ, సంస్కృత పండితులు ఎనిమిదిమందిని ఆయన ఆ సభలో సత్కరించారు. అటువంటి అష్టదిగ్గజాల మధ్య, నా అరకొర పాండిత్యంతోనే నేను కూడా కృష్ణరాయల కవిత్వం గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాను.

ఆముక్తమాల్యదలో వర్షర్తువర్ణన నాలుగవ ఆశ్వాసంలో అరవై పద్యాలు. దాని వెన్నంటి ఉన్న శరదృతువర్ణనతో కలిపి ఆ రెండు వర్ణనలూ మొత్తం కావ్యంలో ఎనిమిదివ వంతు. సంస్కృతంలో వాల్మీకి, కాళిదాసు, శూద్రకుడు చేసిన వర్షర్తువర్ణనలు, సంగంకవులు, గాథాసప్తశతి, వజ్జాలగ్గం కవితలు కూర్చిన ప్రాకృత కవులు, ఆండాళ్ తిరుప్పావై తన మనసులో మెదులుతుండగా, ఆ వర్ణనలకన్నా భిన్నంగా, కొత్తగా, హృద్యంగా వర్షాన్ని చిత్రించిన పద్యాలవి. వట్టి వర్షం కాదు, వర్షానుభవాన్ని చిత్రించిన పద్యాలనాలి. ఆ అనుభవం కూడా వట్టి మానవానుభవం కాదు. ఆకాశం, దిగంతం, మేఘాలు, మెరుపులు, నదులు, సముద్రం, అడవులు, కొండలు మొదలుకుని పల్లెపట్టులు, రాజాంతఃపురాలదాకా చిత్రించిన మహాకుడ్యచిత్రాలవి. ఐరావతం నుంచి ఆరుద్రపురుగులదాకా, పండినమేడిపండులో కుక్కుకున్న దోమలగుంపునుంచి, ఇంద్రధనుసుదాకా, నగరంలో వానపడ్డప్పుడు నాలుగురోడ్ల కూడలి దగ్గర నాలుగు నిమిషాలపాటు ఆగి రాజకీయాలు మాట్లాడుకునే బాటసారులు మొదలుకుని, వానాకాలం నిప్పు పుట్టక, పుట్టిన నిప్పు రాజుకోక, వంట త్వరగా పూర్తవక, పూర్తయినా ఆ వంట నలుగురికీ చాలక ఇబ్బందిపడే గృహిణులదాకా ఆయన చూడనిది లేదు. చిత్రించనిది లేదు.

కవిత్వం భావాల కోసం చదవడం మరీ ఇటీవలి వైఖరి. ఒక భావం గొప్పదైనంతమాత్రాన ఆ కవిత గొప్పది కాలేదు. ఆ భావాన్ని ప్రకటించడానికి ఎటువంటి భాష వాడుతున్నావన్నది ముఖ్యం. నిజానికి, భాష, భావం వేరువేరు కావని గొప్ప కవుల్ని చదివితే తెలుస్తుంది. వాళ్ళు భాషని వాడే పద్ధతిలోనే ఒక అద్వితీయత ఉంటుంది. ఆ విలక్షణత వాళ్ళ భావాల్లోని విశిష్ఠత. వాళ్ళు తమ జీవితానుభవాల్ని అర్థం చేసుకోవడంలోని ప్రత్యేకత. నీ కవిత కూడా విశిష్ఠంగా ఉండాలంటే, నీ దర్శనంలోనే ఆ విశిష్ఠత ఉండితీరాలి.

వర్షర్తు వర్ణన పద్యాలన్నీ వర్ణచిత్రాలు. ఆయన ఒక కవిగా కాక, ఒక చిత్రకారుడిగా ఆ పద్యాలు నిర్మించాడు. అందులో కొన్ని కుడ్యచిత్రాలు, కొన్ని తైలవర్ణ చిత్రాలు, కొన్ని నీటిరంగుల చిత్రాలు.కాని, ఆ రంగులు మామూలు రంగులు కావు. ఎంతకాలం గడిచినా వన్నె తగ్గని రంగులు. ఆ మాటలపొందికలో కనిపించే ఆ మెరుపు అటువంటిది.

‘వాత్యారేణుమూర్తి’(వడగాడ్పులకి పైకి లేచిన సుడిగాలి), ‘ఇరమ్మదదావంబులు’ (మెరుపుల మంటలు), ‘నవగంధ లుబ్ధ భుజగి’ (వానపడ్డప్పుడు నేలలోంచి లేచే కొత్త ఆవిరిలోని తీయదనానికి మోహపడే ఆడపాము), ‘మణికార్ముక రక్తిమ’ (ఇంద్రధనుసు లోని ఎరుపు), ‘విదూర శిలాంకురచ్ఛటోత్పులకిని’ (వైడూర్యాల మొలకలే ఒళ్ళంతా పులకలుగా కలిగినది),’ దారవియోగజవహ్ని’ (భార్యనుంచి ఎడబాటు వల్ల కలిగే తాపం), ‘గమగమవత్సుమ గంధరాజం’ (గమగమలు చిందించే పుష్పరాజం), ‘చిరోష్ణమజ్జనాలు’(తీరిగ్గా చాలాసేపు చేసే వేణ్ణీళ్ళ స్నానాలు), ‘నభశ్చ్యుతాంగారశిశుప్రతానం’ (ఆకాశం నుంచి పడుతున్న నిప్పుకణికల్లాంటి వడగళ్ళు), ‘స్థూల పరిపక్వ కాననోదుంబరం’( బాగా పండిన అడివి మేడిపండు) లాంటి తత్సమ పదబంధాల్లోనే కాదు, భానుడనే కొలిమి, ఆకాశమనే పెద్ద డేగిసా, ఇంద్రధనుస్సనే పెద్ద పలువన్నె కట్లజెర్రి, ఆకుబూదికెంపుల మూడురంగులు అలుముకున్న చెరకుగెడ, మొగలిరేకుల కటారి లాంటి తెలుగుపదాల్లో కూడా ఆ రంగులు మనకి ప్రగాఢంగా కనిపిస్తాయి.

ఆ పద్యాలు కలిగించే సంతోషం ఎవరికి వారు ఆ పద్యాలు చదువుకుంటూ తమ అనుభవంలోకి తెచ్చుకోవలసిందే. నేను చెయ్యగల్గిందల్లా, ఆ రుచి ఎట్లాంటిదో ఈ నాలుగు పద్యాల్ని మీ ముందు పెట్టడమే:

వర్ష ఋతువు

1
పుట్ట వెడలి నభోభిత్తిఁబట్టు శక్ర
కార్ముకపుఁబెద్దపలువన్నె కట్లజెర్రి
దైన నడచెడి కాళ్ళ గుంపనఁగగాలి
గార్కొని దిగంతముల వానకాళ్ళు నడిచె (4:89)

(పుట్టనుంచి బయట పడి ఆకాశమనే గోడను అంటిపెట్టుకుని పైకి పాకుతున్న రంగురంగుల పెద్ద కట్లపాము కాళ్ళ గుంపులాగా, ఇంద్రధనుస్సు, గాలికి తగులుకుని వానకాళ్ళతో నడుస్తున్నట్టుంది.)

2
స్థూలపరిపక్వకాననోదుంబరాగ్ర
రంధ్రముల వాననీరు సొరంగ వెడలె
మశకపంక్తులు దావధూమంబులడఁగ
రచ్చసేయంగ వెడలె విశ్రాంతి కనఁగ (4:111)

(అడవిలో మిగలముగ్గి పండిపోయిన మేడిపండుమీద వాననీళ్ళకి కన్నాలు పడి, అందులోంచి దోమలగుంపులు బయటికొచ్చాయి. వేసవిగాలులు అణిగిపోయిన సంతోషంలో తీరిగ్గా గోలచెయ్యడానికి బయటపడ్డాయవి.)

3
తడి తల డిగ్గి ముంప, జడతం దుదరెప్పలఁగన్ను విప్పి, పు
ల్పొడుచూచు నీరు ముంగరల పోలిక ముక్కున గూడ, నోటఁగొం
తొడియుచు, గూఁటికర్ర సగమొత్తుచు, రెక్క విదుర్పు మున్నుగా
వడఁకుటే గాక చేష్టడిగె వక్షము పక్షులు జానువుల్ చొరన్ (4:118)

(వానతడి తలమీంచి కొద్దిగా కొద్దిగా దిగుతుంటే, కదలాలని లేక, ఎట్లానో కన్రెప్పలు కొంతగా తెరిచి, రెప్పవేయకుండా చూస్తూ, ముక్కుమీంచి జారుతున్న నీటిబొట్లు ముక్కెరలాగా వేలాడుతుంటే, కొంత నోటితో విడుస్తూ, మరికొంత గూటికర్రకు రాచుకుంటూ, వణుకుతూ, రెక్క కూడా విదల్చకుండా, పక్షులు తమ మోకాళ్ళు తమ గుండెదగ్గరికీ లాక్కుని మరీ పడుకుని ఉన్నాయి.)

4
ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి, యబ్బెనేనింటిలోఁబూరి యిడి విసరక
రాఁజదు; రాఁజిన రవులుకోల్వాసాలఁగాని కల్గదు; మరి దానఁగలిగె
నేని కూడగుట మందైనఁబెన్పొగసుఖ భుక్తి సేకూర; దాభుక్తి కిడినఁ
బ్రాగ్భోక్తలకె తీరు బహునాన్నము; దీరనారుల కొదవుఁ బునః ప్రయత్న;
మాజ్యపటముఖ్యలయమెన్నర; రాలయాంగ
దారులయమెన్నరంతిక; కారజనిక
పచన నాంధోగృహిణి రామిఁబడుక మరుఁడు
వెడవెడనె యార్పనొగిలి రజ్జడిని గృహులు (4:127)

(ఆ వానాకాలంలో ఇంటింటికీ తిరిగితేగాని ఇంత నిప్పు పుట్టదు. పుట్టినా కూడా ఇంత పూరిగడ్డి వేసి ఊదితేగాని నిప్పు రాజుకోదు. రాజుకున్నా కూడా మంట మండాలంటే వాసాలు తెచ్చి పడెయ్యాలి. అంత చేసినా కూడా అన్నం ఉడకడం కష్టం. ఎట్లానో ఉడికినా, ఆ ఉడికీ ఉడకని అన్నం తింటే తిన్నట్టనిపించదు. ఆ వండిన అన్నం కూడా ముందు కూచున్నవాళ్ళకే సరిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళ కోసం మళ్ళీ వంట మొదలుపెట్టవలసిందే. ఇక అప్పుడు మంట మండటానికి ఇంట్లో గుడ్డలు నేతిలో ముంచి మంటపెట్టడానికీ, లేదా ఇంట్లో ఉన్న చెక్కలూ, సామాన్లూ కూడా తగలపెట్టడానికీ ఆలోచించరు. రాత్రంతా ఆ వంట నడుస్తూనే ఉన్నా, గృహిణిదాకా ఆ అన్నమింకా రానేరాదు. కానీ ఈ లోపల ఆ మగమహారాజు మాత్రం పడకటింట్లో పరుపుమీద పడుకుని, గృహిణి ఎప్పుడు వస్తుందా అని, ఒకటే అస్తిమితంగా దొర్లుతుంటాడు.)

8-8-2018

 

Leave a Reply

%d bloggers like this: