కవి, కథకుడు, సాహిత్యారాధకుడు, మహామనిషి మునిపల్లె రాజుగారు మొన్న రాత్రి ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు. నిన్న ఆయన పార్థివదేహాన్ని దర్శించుకున్నప్పుడు అస్తిత్వనదపు ఆవలితీరానికి చేరుకున్న ఆ మానవుడు నిశ్చింతగా కనిపించాడు.
మునిపల్లె బక్కరాజు (1925-2018) ఒక శతాబ్దానికి నిలువెత్తు దర్పణం. ఆయన కళ్ళుతెరిచేటప్పటికి, ఉధృతమైన జాతీయోద్యమం,ప్రపంచంలోని ప్రతి ఒక్క తాత్త్వికదర్శనానికీ ప్రతిధ్వనులు వినిపిస్తున్న తెనాలి, సంఘసంస్కరణోద్యం, బ్రహ్మసమాజం, వెళ్ళిపోతున్న ఒక యుగం తాలూకు ఆశ్వాసాంతం. ఆయన ఈలోకం నుంచి సెలవుతీసుకునేటప్పటికి ఉవ్వెత్తున చెలరేగిన ఐడెంటిటీ ఉద్యమాలు, సాహిత్యాలు. 20వశతాబ్దంలోనూ, 21 వ శతాబ్దపు ప్రారంభంలోనూ తెలుగునేల లోనైన సామాజిక పరివర్తన ఎట్లాంటిదో అర్థం చేసుకోవటానికి ఆయన సాహిత్యమొక విస్పష్టమైన వాజ్మూలం.
కానీ, ఈ క్షణాన, నాకు, గత ఇరవయ్యేళ్ళకు పైగా ఆయన నా మీద వర్షించిన వాత్స్యల్యం, ప్రేమాతిశయాలే గుర్తొస్తూన్నాయి. ఏ సుకృతంవల్ల నాకు ఆయన పరిచయం లభించిందో గాని, అది నా జీవితాన్ని అపురూపంగా వెలిగించింది.
94 లో అనుకుంటాను, ఆయన ఆహ్వానం పత్రికలో, ఒక ఉత్తరమో, వ్యాసమో రాస్తూ, అందులో అక్కనీ, నన్నూ తన అభిమాన రచయితలుగా ప్రస్తావించడం నేను ఊహించని వరప్రదానం. ఎక్కడో విశాఖ మన్యంలో కొండలమీద తిరుగుతున్న నేనాయన దృష్టిలో ఎట్లా పడ్డానో నాకు అర్థం కాలేదు.
నేను హైదరాబాదు వచ్చినతర్వాత ఆయన్ని మొదటిసారి ముఖాముఖి కలుసుకున్నాను. నన్ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేరు. ఆ రోజే నాకాయన దేవుడిచ్చిన పెద్దదిక్కు అని అర్థమైపోయింది. ఎంత పెద్దదిక్కుకాకపోతే, నేనెక్కడో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఒక ప్రముఖ పత్రిక నామీద ఆరోపణలు ప్రచురిస్తే,ఆయన స్వయంగా ఒక లేఖ రాసుకుని మరీ పోయి ఆ సంపాదకుణ్ణి కలుస్తారు! ఆ మాట ఆయన నాతో ఎప్పుడూ చెప్పకపోవడం ఆయన సంస్కారం. (ఆ సంగతి కృష్ణారావుగారు చెప్తే తప్ప నాకు తెలియలేదు.)
2002 లో అనుకుంటాను, డా.సుమనశ్రీ ఆయనకి సన్మానం చేసాడు. ఆ సందర్భంగా ఆయన పుస్తకాలమీద ‘నెలనెలా వెన్నెల’ లో కృష్ణారావుగారు ఒక గోష్టి నిర్వహించారు. ఆ సభలో తన గురించి మాట్లాడమని మా ఇంటికొచ్చి మరీ అడిగారు. ఫోన్ చేస్తే సరిపోయే పని. కాని, అది ఆయన సంస్కారం.
అదొక వైశాఖపూర్ణిమ రాత్రి. ఆయన కథల గురించి మాట్లాడినప్పుడు నాకొక యోగి గురించిమాట్లాడేనని అనిపించింది. ఆ మర్నాడు ఇండియా టుడేలో నా కాలంలో ఇట్లా రాసుకున్నాను:
‘రాగద్వేష భరితంగా మారిన నేటి సాహిత్యవాతావరణంలో మునిపల్లె రాజు ఒక ఇండుగపిక్కలాగా తానున్నచోట కలుషిత జలాల్ని శుభ్రపరుస్తూ ఒక నిశ్శబ్ద ఉద్యమం చేస్తున్నారు. ఆయనకథలు, గొప్ప సాహిత్యమంతటిలానే, బాహ్య ఆంతరంగిక ప్రపంచాల సమన్వయంలోంచి వచ్చిన సృజనలు. బాహ్యప్రపంచపు యథార్థాన్ని, అదెంత క్లేశకారకంగా ఉన్నా, చూపించడానికి ఆయన వెనుకాడలేదు. కానీ, ఆయన దృష్టి ఉన్నది అక్కడ కాదు. యుద్ధం, కరువు, వలసలు,హింస, పేదరికం,మనుషులు అమ్ముకుపోవడం తాను చూసారు కానుక మనకి కూడా చూపించారు. అటువంటి దృశ్యాలకు తాను బాగా అలవాటుపడిపోయాననీ, ‘యుద్ధంలో ప్రతి క్షణమూ, ప్రతి వస్తువులో, ప్రాణిలో, జీవిలో, ఆత్మలో, మృత్యువూ, అపనమ్మకమూ దర్శించాననీ’ చెప్పుకున్నారొకచోట, చుట్టూ ఉన్న సమాజాన్ని సరిదిద్దడానికి పోరాడవలసి ఉంటుందా, పోరాడమనే ఆయన చెప్తారు, కానీ అదేమంత పెద్ద విషయం కాదు, మన జీవితంలోని చిన్నా పెద్దా కర్తవ్యాల్లొ అదొకటీ. కాని ఆయన దృష్టిలో ‘ఏ స్వాతంత్ర్య సంగ్రామమూ తనకు తానై అది శిలాశాశ్వతమై, సంపూర్ణమై, పరిపూర్ణతను పొంది చరిత్ర పుటలలో మాత్రమే నిద్రించలేదు. తండ్రులు జయించామనుకున్న స్వాతంత్ర్యం బిడ్డలు తిరిగి రక్తమోడ్చి నిలబెట్టుకోవాలి, అలా పోరాటాన్ని కొనసాగించకపోతే, బానిసత్వం, తాడన, పీడన, కొత్త రూపంలో, కొత్త నిరంకుశుల ద్వారా, కొత్త యుద్ధోన్మాదుల ద్వారా, కొత్త మతదురహంకారుల ద్వారా వచ్చి వాకిలి ముందు నిలుస్తాయి. స్వేచ్ఛా వృక్షానికి తరతరంలోనూ నిరంకుశులదో, యుద్ధరాక్షసులదో రక్తం ఎరువుగా కావాలి.’
ఎన్ని జ్ఞాపకాలు! మా అమ్మ పోయినప్పుడు మాఇంటికొచ్చి మమ్మల్ని ఊరడించినవాళ్లల్లో ఆయన మొదటివారు.
ఆయన కథాసంపుటి ‘అస్తిత్వనదం ఆవలితీరాన’ కు సాహిత్య అకాదెమీ పురస్కారం లభించినప్పుడు, ఆంధ్రజ్యోతిలో నేనొక వ్యాసం రాసాను. అది చదివి ముళ్ళపూడి వెంకటరమణ నేను మునిపల్లె రాజును మేడ్ డిఫికల్టు చేసానంటూ అవహేళనాత్మకంగా ఆంధ్రజ్యోతికి ఒక ఉత్తరం రాసాడు. జీవితాన్ని మేడీజీగా చూడటానికి అలవాటుపడ్డ ముళ్ళపూడికి నా రచన మేడ్ డిఫికల్టుగా ఉండటం ఆశ్చర్యమనిపించలేదుగాని, రాజుగారు ఆ ఉత్తరం చదివి ఎక్కడ నొచ్చుకుంటారో అని నా మనసు అల్లల్లాడింది.
కాని, 29-12-2006 తేదీతో ఆయన్నుంచి ఒక కార్డు:
Your article in Andhra Jyothi had mad a terrific impact. I received hundreds of calls and letters. Very many thanks.
మళ్ళా రాజుగారి సంస్కారంముందు సాష్టాంగపడ్డాను.
వరంగల్ లో ఉన్న ‘సహృదయ’ వారు ఉత్త్తమ కథాసంపుటాలకిచ్చే పురస్కారానికి నన్ను న్యాయనిర్ణేతగా ఉండమన్నారు. అందులో రాజుగారి సంపుటమున్నాక వేరే సంపుటాన్ని ఎట్లా ఎంచగలను? ఆ సంపుటాన్ని ఎందుకు ఎంచానో వివరించమని గన్నమరాజు గిరిజామనోహర బాబు నన్ను ఆ పురస్కార సభలో ప్రసంగించమన్నారు. ఆ సభకోసం రాజుగారితో పాటు నేనూ,కవితా ప్రసాద్ కలిసి చేసిన ప్రయాణం మరవలేని జ్ఞాపకం. రాజుగార్ని మరింత దగ్గరచేసిన సందర్భం అది. ఆకాశవాణికోసం చెన్నూరి సీతారాంబాబు గారు ఆయన్ని నాతో ఇంటర్వ్యూ చేయించారు. అది కూడా గొప్ప జ్ఞాపకం.
నా ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ (2012) సంపుటాన్ని ఆయన చేతులమీదనే ఆవిష్కరించాలని కోరుకున్నాను. వకుళాభరణం రామకృష్ణగారూ,కాళీపట్నం రామారావుగారూ, సోమయ్యగారూ అలంకరించిన ఆ వేదిక నా హృదయవేదిక కాక మరేమిటి?
ఈ పది పదిహేనేళ్ళ కాలంలో రాజుగారితో కలిసి ఎన్నో సాహిత్యసమావేశాల్లో వేదికలు పంచుకున్నాను. చివరిగా, రెండుమూడు నెలలకిందట, జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన్ని సత్కరించినప్పుడు, ఆ సభలో కూడా ప్రసంగించాను.
రాజు గారు ఈ లోకంలో జీవించారుగాని, ఇక్కడ కూరుకుపోలేదు. ఆయన కథకుడూ, కవీ అని గీతగీసి చూపలేం. ఆ రెండింటికన్నా ఆయన గొప్ప యోగి, విముక్తుడు. ఆయన ‘అలసిపోయినవాడి ఆరణ్యకాలు’ చదివితే బైరాగి కవిత్వం చదివినట్టే ఉంటుంది. (ఇద్దరూ 1925 లో పుట్టినవాళ్ళే. అసలు ’25 తరానికే ఆ విశిష్టత ఉందనుకుంటాను.) ఆయన ఒక అమృతలోకాన్ని చూసాడు. మనం మాట్లాడుకునే తెలుగుభాషలో ఆ లోకం గురించి వివరించడానికే ప్రయత్నిస్తూ వచ్చాడు. ఏ పూర్వజన్మ సుకృతంవల్లనో నేనా భాషని మరికొంతదగ్గరగా వినగలిగాను.
మనుషులు కలుస్తారు, విడిపోతారు. మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూనే, చెప్పకుండా వెళ్ళిపోతారు. కాని, ఆ కలుసుకున్న క్షణాలు, నిండుగా భుజం మీద చెయ్యి వేసి, ప్రేమగా దగ్గరకు తీసుకున్న పలకరింపులు-ఇవి మటుకు మిగిలిపోతాయి, కథలరూపంలోనూ, కరచాలనాల రూపంలోనూ.
25-2-2018