మార్తా

345

ప్రేమంటే ఏమిటి? ‘ఎవరూ ప్రేమలో పడరు, ఎగురుతారు తేలిగ్గా’ అన్నారు ఇస్మాయిల్ గారు.ఆ మాటల్లో నిజముంది. మనుషులకి ప్రేమలో ఒక irresponsible space దొరుకుతుంది. తల్లి కడుపులో లాగా చల్లగానో, వెచ్చగానో ఉండే చోటు. తండ్రి చేయి పట్టుకునడిపించినట్టుగా బాధ్యతలన్నీ వదిలి నిష్పూచీగా సంచరించగలిగే ఒక తావు. కానీ తొందర్లోనే ప్రేమ ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తుంది. ఎందుకని? మనుషులకి ప్రేమంటే తప్పించుకోలేని ఒక responsibility గా కనిపిస్తుంది కాబట్టి. తాము ప్రేమిస్తున్నవాళ్ళ పట్ల తమకొక జవాబుదారీతనం ఉందని, తాము వాళ్ళ పట్ల నెరవేర్చవలసిన బాధ్యత ఏదో ఉందనీ, దాన్ని సమగ్రంగానూ, సంతృప్తిగానూ నెరవేర్చడమే నిజమైన ప్రేమ అనీ నమ్మడం మొదలుపెడతారు. ఆ క్రమంలో తమ జీవితాన్నీ, తాము ప్రేమించినవాళ్ళ జీవితాన్నీ కూడా అనంతమైన నలుగులాటలోకి నెట్టేస్తారు.

ఇది ఇద్దరు స్త్రీపురుషుల మధ్య ప్రేమకి మాత్రమే వర్తించే మాట కాదు. మనుషుల్నీ, పశుపక్ష్యాదుల్నీ, చుట్టూ ఉండే సమాజాన్నీ, అసలు లోకం మొత్తాన్ని ప్రేమించే వాళ్ళందరి సమస్య ఇది.

చుట్టూ ఉన్న మనుషుల జీవితాలు ఇరుగ్గా ఉన్నాయనీ, వాళ్ళ ఇళ్ళల్లో, మనసుల్లో మరింత జాగా, మరింత వెలుతురు రావాలని కలలుగనడంతో ఆగిపోకుండా, ఆగ్రహించి, తిట్టి రొష్టు పడ్డ చలంగారు బహుశా తన జీవితమంతా ఈ ప్రశ్న మీదనే ఆలోచిస్తూ వచ్చారు. ‘శశిరేఖ’ (1921) నుంచి ‘జీవితాదర్శం’ (1948) దాకా దాదాపు ముఫ్ఫైయ్యేళ్ళ పాటు తన అంతర్మథనమంతా 8 నవలల్లో ఇమిడ్చిపెట్టారు. వాటిల్లో ‘అమీనా ‘ కావడానికి చిన్న నవలే అయినా రాయడానికి చాలాకాలం పట్టిన నవల. మొదటి రెండు భాగాలూ 1926 లో రాస్తే, తర్వాత రెండు భాగాలూ 1942 లో రాసారు. అంతకాలాం పాటు ఆయన దృష్టి పెట్టిన నవల కాబట్టే అమీనా చలంగారి అంత:కరణ చిత్రణ అని ఆర్.ఎస్.సుదర్శనంగారు చాలా చక్కగా వివరించారు.

చాలామంది దృష్టిలో ప్రేమగురించీ, జీవితం గురించీ, స్త్రీపురుష సంబంధాల గురించీ చలంగారి అన్వేషణ ‘పురూరవ ‘(1947) నాటకంతోనూ, ‘జీవితాదర్శం’ నవలతోనూ పరిపూర్ణతకి చేరుకున్నట్టు.

కాని చలంగారి జీవితకాల అన్వేషణ పరిపూర్ణతకి చేరుకున్న రచన ఇదేదీ కాదు. ఆయన అరుణాచలానికి వెళ్ళి పదేళ్ళు గడిచిన తర్వాత రాసిన నవల ‘మార్తా’ (1961). అందులో ఆయన తనను వేధిస్తున్న సామాజిక,మానసిక, కళాత్మక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒక సమాధానం కోసం వెతికారు. కానీ ఆ నవల గురించి ఎవరూ ఎక్కడా ఏమంత మాట్లాడినట్టు కనిపించదు. 1961 లో రాసిన ఆ పుస్తకాన్ని ఆళ్ళ గురుప్రసాదరావుగారు 2000 లో మళ్ళా ముద్రించిన దాకా అటువంటి రచన అంటూ ఒకటుందని కూడా ఎవరికీ పెద్దగా తెలిసినట్టు లేదు.

మార్తా బైబిల్లో సువార్తల్లో కనవచ్చే ఒక పాత్ర. ముఖ్యంగా లూకా సువార్తలో (10:38-42) లో నాలుగు వాక్యాల్లో పేర్కొన్న ఒక సంఘటన మీద చలంగారు ఆ నవల రాసారు. సువార్తలో ఆ సన్నివేశం ఇట్లా ఉంది:

‘యేసు, ఆయన శిష్యులు తమ దారిలో ఒక గ్రామాన్ని చేరుకున్నప్పుడు మార్తా అనే ఒక స్త్రీ ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఆమెకి మరియ అనే ఒక సోదరి కూడా ఉంది. ఆమె ఏసు పాదాల దగ్గరే కూర్చుండి ఆయనేది చెప్తే అది వింటూ కూచుంది. కాని ఇంటికొచ్చిన అతిథికి చెయ్యవలసిన ఏర్పాట్లలో మార్తా తలమున్కలుగా ఉండిపోయింది. ఆమె ఏసు దగ్గర కొచ్చి ‘ప్రభూ, చూడు మా చెల్లెలు పనులన్నీ నాకు వదిలేసి నీ దగ్గరకొచ్చి కూచుండిపోయింది. ఆమెని నాకు సాయం చెయ్యమని చెప్పవూ?’ అనడిగింది.

‘అందుకు ఏసు ‘మార్తా, మార్తా, నువ్వు చాలా వాటిగురించి ఆలోచిస్తున్నావు, ఆందోళన పడుతున్నావు. కాని నిజంగా పట్టించుకోవలసింది కొన్నివిషయాలే. ఆ మాటకొస్తే ఒకే ఒక్క విషయం మటుకే. ఏది మంచిదో దాన్నే మరియ ఎంచుకుంది,దాన్నామెనుంచి ఎవరూ తీసేసుకోలేరు’ అన్నాడు.’

నాలుగైదు వాక్యాల ఈ సన్నివేశం గొప్ప ఆధ్యాత్మిక చర్చకు కేంద్రంగా నిలబందింది. కర్మ, భక్తి యోగాలకు చిహ్నాలుగా నిలబడ్డ ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళనీ, యేసునీ కలిపి చిత్రించడానికి ప్రసిద్ధి చెందిన ప్రతి ఒక్క పాశ్చాత్య చిత్రకారుడూ ఉత్సాహపడ్డాడు.

అయితే చలంగారు ఆ కథని చెప్పాలనుకోవడానికీ , చెప్పిన సమయానికీ చాలా ప్రత్యేకత ఉంది. ఆయన జీవించిన జీవితం అంటే బ్రహ్మసమాజం రోజులనుంచీ, అరుణాచలంలో తొలినాళ్ళదాకా, మార్తా లాగా ‘చాలా విషయాల గురించీ ‘పట్టించుకున్న’ జీవితం, చాలావాటి గురించి ‘ఆందోళన చెందిన’ జీవితం. కాని మరియలాగా నిజంగా పట్టించుకోవలసినవి కొన్ని మాత్రమేననీ, ఆ మాటకొస్తే ఒకే ఒక్కటి మాత్రమేననే మెలకువ కలుగుతున్న కాలంలో ఆయన ఈ నవల రాసారు.

అంతే కాదు, చలంగారి మొదటి 8 నవలల్లో భాషకీ, శైలికీ, ఈ నవల్లో భాషకీ, శైలికీ మధ్య చాలా వ్యత్యాసముంది. అమీనా నవల చివరి భాగాలనాటికే చలంగారికి తన శైలిపట్ల అసహనం స్పష్టపడింది. ‘నా శైలీ, నా రచనలూ తగలబడనూ,నా అమీనా, నా అమీనా’ అన్న వాక్యం మీద సుదర్శనంగారు చాలానే చర్చించారు. మార్తా నవలాశైలి వేరు. అప్పటికి చలంగారు గీతాంజలితో సహా టాగోర్ కవిత్వాన్ని చాలానే తెలుగులోకి తీసుకువచ్చారు. గీతాంజలి అనుసృజన చేసిన కలం మాత్రమే మార్తా నవల రాయగలదనిపిస్తుంది.

కేవలం శైలి మాత్రమే కాదు, బైబిల్ ని నిర్దుష్టంగా చదువుకున్న వాడు మాత్రమే అటువంటి కథనానికి పూనుకోగలడు. అంత విస్పష్టమైన బైబిల్ పాండిత్యం మరే తెలుగురచయితలోనూ మనకి కనబడదు. అప్పటికే చలంగారు నాలుగు సువార్తల్నీ ‘శుభవార్తలు’ పేరిట తెలుగు చెయ్యడం కూడా అందుకు కారణం కావచ్చు.

అయితే సువార్తలను బట్టి చూస్తే చలంగారి రచనలో రెండు వైరుధ్యాలు మాత్రమే మనకి కనిపిస్తాయి. మొదటిది, సువార్తల ప్రకారం, మార్తా, మేరీ కూడా లాజరు చెల్లెళ్ళుకాగా, నవల్లో లాజరుని మార్తాకి తమ్ముడిగా పేర్కొన్నారు. ఇందుకు కారణం తెలియదు. ఇక రెండవ వైరుధ్యం సువార్తల్లో ఉన్నదే. అది మేరీ, మేరీ మాగ్దలేనూ ఒకరేనా లేక వేర్వేరా అన్నది.

సువార్తల్లో లూకా సువార్త తప్ప మిగిలిన మూడు సువార్తలూ మార్తా, మేరీ, లాజరులది యెరుషలేం దగ్గర బెతనీ గ్రామంగా పేర్కొన్నాయి. లూకా మాత్రం ఆ గ్రామం పేరేదో చెప్పలేదు. నాలుగు సువార్తల ప్రకారమూ కూడా చనిపోయిన లాజరుని యేసు జీవితంలో రమ్మని పిలిచిన దృశ్యానికి మార్తా, మేరీ ఇద్దరూ సాక్షులే. కానీ, యేసు శిలువకి గురికాకముందు ఆరగించిన విందులో ఆయన్ను ఒక స్త్రీ సుగంధ తైలంతో అభిషేకించిన సంఘటన ఉంది. లూకా ప్రకారం ఆమె ఒక పేరులేని పాపి. యోహాను సువార్త ప్రకారం ఆమె మేరీ మాగ్దలేను. తక్కిన రెండు సువార్తల ప్రకారం ఆమె మరియ. సువార్తలు విడివిడిగా పేర్కొన్న ఈ ముగ్గురు స్త్రీలూ ఒక్కరేనని రోమన్ కేథలిక్ సంప్రదాయం భావిస్తే, తూర్పుదేశాల క్రైస్తవం ప్రకారం, ప్రొటెస్టంటు సంప్రదాయం ప్రకారం ఆ ముగ్గురూ వేరువేరు. చలంగారు కూడా ఆ సంప్రదాయంలోనే మేరీనీ, మేరీ మాగ్దలేనునీ వేరు వేరు పాత్రలుగానే చూపించారు.

ఏసు ప్రేమనీ,ఆయన యెరుషలేంలో అడుగుపెట్టడాన్నీ, ఆయన్ను సుగంధతైలంతో మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యడాన్నీ, ఆయన్ను శిలువవెయ్యడాన్నీ, సమాధిలో ఉంచబడటాన్నీ, తిరిగి పునరుత్థానాన్నీ చూసిన మహిళలుగా మార్తా, మేరీ, మేరీ మాగ్దలేనూ బైబిల్లో ప్రసిద్ధి చెందారు. అందులో శిలువవెయ్యబడ్డ దృశ్యంవరకూ చలంగారు తన నవల్లో చిత్రించారు. ఏసు పునరుత్థానాన్ని ఆయన వదిలిపెట్టేసారు. కాని తన నవలని మరింత మాతృహృదయ స్ఫోరకంగా ముగించారు.

సువార్తల్లో చెదురుమదురుగా ఉన్న కొన్ని వాక్యాలు ఆధారంగా మార్తా కథ చెప్పడంలో చలంగారు చూపించిన కథన కౌశలం గురించి మరింత వివరంగా ముచ్చటించుకోవాలి. కాని ఆ కథ ద్వారా ఆయన తన జీవితకాల అన్వేషణకొక సమాధానం వెతుక్కున్నారని మాత్రం చెప్పితీరాలి.

మళ్ళా మన ప్రశ్న దగ్గరికే వద్దాం. ప్రేమంటే ఏమిటి? బహుశా దాన్ని మనం responsibility అనో irresponsibility అనో వివరించలేం. మనం ప్రేమ పేరిట ప్రతి అనుబంధాన్నీ బంధంగా మారుస్తున్నట్టున్నాం. అందుకే ఉక్కిరిబిక్కిరవుతున్నాం. కానీ నిజంగా చెయ్యవలసింది ప్రతి బంధాన్నీ అనుబంధంగా మార్చుకోవడం: రామాయణంలో రాముడు చేసిందీ, బైబిల్లో ఏసు చేసిందీ అదే. చలంగారు మార్తా నవల ద్వారా సాధించిన సమాధానమిదేననుకుంటాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s