మహాకవిత్వదీక్షావిధి

392

కవులు, ముఖ్యంగా కొత్త తరహా కవిత్వం రాసేవారు, తమ కవిత్వ కళని నిర్వచించుకుంటూ రాసే కవితలు ప్రపంచమంతా కనిపిస్తాయి. ఇంగ్లీషులోనూ, పాశ్చాత్యప్రపంచంలోనూ అటువంటి కవితల్ని ars poetica కవితలని పిలుచుకోడం పరిపాటి. క్రీ.శ మొదటిశతాబ్దానికి చెందిన లాటిన్ కవి హొరేస్ ars poetica పేరుతో రాసిన ఒక పద్యరూపాత్మకమైన లేఖ ఈ కవితలకి నమూనా.

ఆధునిక కాలంలో చాలా మంది పాశ్చాత్య కవులు తమ కావ్యకళనో లేదా అసలు కావ్యకళనో వివరిస్తో రాసిన కవితలు సుప్రసిద్ధమైనవి చాలానే ఉన్నాయి. ఉదాహరణకి ఆర్చిబాల్డ్ మెక్లీషు అనే అమెరికన్ కవి రాసిన కవితలో ఈ వాక్యాలు చాలా ప్రసిద్ధాలు:

A poem should be equal to:
Not true.
….
A poem should not mean
But be.

అర్జెంటీనియన్ కథకుడు, మాజికల్ రియలిజం సృష్టికర్త బోర్హెస్ గొప్ప కవి కూడా. నిజానికి ఆయన దృష్టిలో తాను ముందు కవి, తర్వాతే కథకుడు. ఆయన రాసిన Ars Poetica కవితలో ఇలా అంటున్నాడు:

To see in the day or in the year a symbol
Of mankind’s days and of his years,
To transform the outrage of the years
Into a music, a rumor and a symbol,

To see in death a sleep, and in the sunset
A sad gold, of such is Poetry
Immortal and a pauper. For Poetry
Returns like the dawn and the sunset.

పాల్ వెర్లేన్ అనే ఫ్రెంచి గీతకారుడు కూడా తన కావ్యకళని వివరిస్తూ రాసిన కవిత కూడా సుప్రసిద్ధమైనదే:

Let your verse be aimless chance, delighting
In good-omened fortune, sprinkled over
Dawn’s wind, bristling scents of mint, thyme, clover . . .
All the rest is nothing more than writing.

కాని, ఈ కవిత్వవీథుల్లో తిరుగాడుతున్న నాకు హఠాత్తుగా మన తెలుగు మహాకవులు కూడా ars poetica పద్యాలు రాసుకున్నారని గుర్తొచ్చింది. అందరికన్నా ముందు, అందరికన్నా మిన్నగా, తిక్కన రాసుకున్న ఈ సుప్రసిద్ధ పద్యం (విరాటపర్వం: 1:30) :

కావున భారతామృతము కర్ణపుటంబుల నారఁగ్రోలి యాం
ధ్రావలి మోదముంబొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి
శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ
క్షావిధి నొంది పద్యముల, గద్యములన్ రచియించెదంగృతుల్

(కాబట్టి, భారతమనే అమృతాన్ని చెవులారా తాగి, సాత్యవతేయమైన చక్కటి స్మృతిసంపదతో కూడిన మనసుతో, గొప్ప కవిత్వం రాయాలనే గొప్ప దీక్షనీ, గొప్ప బాధ్యతనీ స్వీకరించి, తెలుగువాళ్ళంతా సంతోషించేటట్టు, పద్యాలతోనూ, గద్యాలతోనూ కృతులు రచించాలనుకుంటున్నాను.)

ఇక్కడ నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది ‘మహాకవిత్వదీక్షావిధి’ అనే పదబంధం. చాలా సార్లు ఇట్లానే జరుగుతుంది. చింతామణిని ఇంట్లో పెట్టుకుంటాం, దేశాలు గాలిస్తుంటాం. ఎంత సుప్రసిద్ధ పద్యం. కాని, ఇందులో రత్నాంగుళీయకంలాంటి ఈ మాట ఉందనే మర్చిపోయేనే.

కాని ఇంతకీ ఈ పదబంధంలోని ‘మహా’ అనే విశేషణం కవిత్వానికా లేక కవిత్వదీక్షావిధికా? తిరుమల తిరుపతి దేవస్థానాలకోసం విరాటపర్వాన్ని పరిష్కరించిన జి.వి.సుబ్రహ్మణ్యంగారు, ‘మహాకవిత్వ’మనే వివరిస్తూ, గద్యపద్యాత్మకమైన కవిత్వాన్నే తిక్కన మహాకవిత్వంగా భావించాడు అని రాసారు. (పీఠిక, పే.14-15, పద్యప్రతిపదార్థం,పే.16).

నిజమే, కవిత్వం రాయడానికి పూనుకున్నప్పుడు, తిక్కన మామూలు కవుల ఆమోదాన్ని కాదు, మహాకవుల సమ్మోదాన్ని కోరుకున్నాడు. అసలు కావ్యకళ గురించిన ఆయన వైఖరి మొత్తం నిర్వచనోత్తర రామాయణం ప్రథమాశ్వాసంలోని పద్యాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా:

ఎట్టికవికైనఁదన కృతి యింపుఁబెంపఁ
జాలుఁగావునఁ గావ్యంబు సరసులైన
కవుల చెవులకునెక్కినఁగాని నమ్మఁ
డెందుఁబరిణతి గలుగు కవీశ్వరుండు. (9)

(ఎటువంటి కవికైనా తాను రాసిన కవిత తన చెవులకు బాగానే వినిపిస్తుంది. కాని, పరిణతి చెందిన మహాకవి సరసులైన కవుల చెవికెక్కితేగాని తనది కవిత్వమని నమ్మలేడు.)

నిర్వచనోత్తర రామాయణం చంపూ కావ్యం కాదనీ, తెలుగులో నన్నయ మొదలుపెట్టిన గద్యపద్యాత్మక చంపూ కావ్యమే మహాకావ్య ప్రక్రియ అనీ, అందుకని భారతాన్ని చంపూ పద్ధతిలో రాయడానికి పూనుకుని దాన్ని మహాకవిత్వమని అంటున్నాడనీ పండితుల అభిప్రాయం.

కాని నాకెందుకో, ఈ ‘మహా ‘ కేవలం కవిత్వానికి కాక, ‘కవిత్వ దీక్షావిధి’ అనే మొత్తం కర్తవ్యానికే విశేషణమని అనిపిస్తూ ఉంది. అది కవిత్వం రాయడమనే గొప్ప దీక్షా, గొప్ప బాధ్యతా కూడా. లేదా ‘మహా’ అనే విశేషణం ఏకకాలంలో కవిత్వానికీ, దీక్షావిధికీ కూడా వర్తిస్తుందని అనుకోవచ్చు. ఏమైనప్పటికీ, గమనించవలసింది, నిర్వనోత్తరరామాయణం నాటికి ఒక కళగా (ని.ఉ.రా, ప్రథమాశ్వాసం,5-16) మాత్రమే భావించిన కవిత్వాన్ని, తిక్కన, భారతరచన మొదలుపెట్టేటప్పటికి, దీక్షావిధిగా భావించాడని మాత్రం అర్థమవుతోంది.

ప్రపంచమంతా, కావ్యకళ గురించిన ars poetica పద్యాలు కనిపిస్తున్నాయిగాని, కవిత్వదీక్షావిధి గురించిన పద్యాలు కనిపించడం లేదు. నా చిన్న ప్రపంచాన్ని మళ్ళా ఒకసారి దివిటీ పెట్టి గాలిస్తే, మరొక మహాకవి మాత్రమే ఇటువంటి దీక్షావిధితో తన కవిత్వం గురించి చెప్పుకున్నాడని గుర్తొచ్చింది:

‘కావున లోకపు టన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చేవేదన
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
నాలొ కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్చనంగా, సమర్పణంగా-‘

‘నేనేదో విరచిస్తానని
నా రచనలలో లోకం ప్రతిఫలించి
నా తపస్సు ఫలించి
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకునే
మంత్రంగా మ్రోగించాలని..’

ప్రతి కవీ గొప్ప కవిత్వం రాయాలనే అనుకుంటాడు. కాని, గొప్ప కవిత్వం రాయాలన్న సంకల్పాన్ని గొప్ప దీక్షగానూ, విధిగానూ మార్చుకున్నవాడూ మాత్రమే గొప్ప కవిత్వం రాయగలుగుతాడు.

2-8-2018

Leave a Reply

%d bloggers like this: