దొరికింది.
ముప్పై ఏళ్ళ కిందటి ఫొటో. పాతఫొటోలన్నీ మూటగట్టి లోపల దాచేసినవన్నీ ముందేసుకుని ఒకటీ ఒకటీ వెతుక్కుంటూపోగా, దొరికింది ఆ ఫొటో. ఒకటి కాదు, మూడున్నాయి.
చాలా ఏళ్ళ కిందట నేను పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు, త్రిపురగారి అమ్మాయి వింధ్య, ఆమె భర్త సుధాకర్ శ్రీకాకుళం గిరిజన ఉద్యమంలో పనిచేసినవారి మీద అధ్యయనం చేయడానికి వచ్చినప్పటి సంగతి.
అప్పుడు వారికి ఆ ప్రాంతాలు పరిచయం చెయ్యమని భూషణంగారిని అడిగేను. ఆ రోజు నాతో పాటు మా చెల్లెళ్ళు నలుగురూ చిన్నపిల్లలు నా దగ్గరే ఉన్నారు. అడవిలోకి వెళ్ళడమంటే సరదా పడి వాళ్ళు కూడా వింధ్యగారితో బయలుదేరారు. ఆ నలుగురు పిల్లల్లో అనసూయ, హైమా మరీ చిన్నపిల్లలు. ఏడెనిమిది తరగతులు చదువుతూ ఉండవచ్చు. కానీ భూషణంగారు వాళ్ళందరినీ తీసుకుని కొండలెక్కుతారని ఊహించలేదు. అప్పట్లో, అందరికన్నా ముందు ఆయనకే సమస్య. చాలా తీవ్రమైన అల్సర్ ఉండేదాయనకి. పట్టుమని ఒక మైలు కూడా నడవలేని పరిస్థితిలో ఉండేవారు. కాని, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, ఉజ్జ్వలమైన స్ఫూర్తిని తన శరీరంలోని ప్రత్యణువులోనూ నింపిన ఆ శ్రీకాకుళం గిరిజన పోరాటం గురించి ఎవరో తెలుసుకుందామని రావడం ఆయన్ను మళ్ళా నవయువకుణ్ణి చేసేసింది.
ఆ రోజు ఆయన వాళ్ళని ఒకప్పటి శ్రీకాకుళం జిల్లాలో భద్రగిరి ప్రాంతానికి చెందిన ఊళ్ళు, ఇప్పుడు విజయనగరం జిల్లాలో కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఊళ్ళు-చిలకం, సొబ్బ-తీసుకువెళ్ళారు. ఆ రోజుల్లో సొబ్బలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో వెంపటాపు సత్యం మాష్టారి భార్య, గిరిజన స్త్రీ, వంటమనిషిగా పనిచేసేది. ఆమెను చూపించడం కోసం ఆయన ఆ కొండలమ్మట వాళ్ళను నడిపించుకుంటూపోయేరు.
ఇప్పట్లో రోడ్డు పడిందేమో తెలీదుగానీ, కురుపాం నుంచి కొంతదూరం, పొడి అనే ఊరుదాకా మనం జీపుమీద పోవచ్చు. కాని అక్కణ్ణుంచి కొండచిలకం అనే ఊరు కాలినడకన కొండ ఎక్కి వెళ్ళవలసిందే. అక్కణ్ణుంచి సొబ్బ అనే ఊరు. అది శిఖరాగ్రం. ఆ తర్వాత మళ్ళా కొండదిగితే, భద్రగిరినుంచి డోనుబాయి వెళ్ళే రోడ్డుమీద ధర్మలక్ష్మిపురం దగ్గర తేలతాం. కఠినాతికఠినమైన దారి. కాని చారిత్రాత్మకమైన దారి, పోరుబాట.
ఇప్పుడు ఆ ఫొటో కోసం ఎందుకు వెతికానంటే ఇదిగో, భూషణంగారు రాసిన ఈ ‘రుణం’ కథ మళ్ళా చదవడంతో. ఇది కథనా? కాదు, chronicle. అత్యంత సత్యసంధుడైన ఒక మానవుడు అక్షరబద్ధం చేసిన ఒక ఆత్మచరిత్రశకలం. పోరాటాలు చేసేవాళ్ళూ, విప్లవాలు కోరుకునేవాళ్ళూ, ప్రజల మేలుకోరేవాళ్ళూ ఎలా ఆలోచిస్తారో, ఎలా నడుస్తారో, ఎలా జీవిస్తారో, ఈ కథలో ప్రతి అక్షరం ఒక నిరూపణ.
గిరిజన శ్రేయోభిలాషుల్ని, వారికోసం జీవితాన్ని తృణప్రాయంగా త్యాగం చేసినవాళ్ళని, నా తండ్రితో సహా, ఎందర్నో నేను చూసాను. వాళ్ళల్లో భూషణంగారి స్థానం ప్రత్యేకం. ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు, నా హృదయం తలుపు బెరుగ్గా తెరిచి, నెమ్మదిగా లోపల అడుగుపెట్టి, అక్కడే తిష్ట వేసిన అతికొద్దిమందిలో ఆయన ఒకడు, అగ్రేసరుడు.
ఈ కథ భూషణంగారు 1991 లో రాసారు. ఆయన వింధ్య, సుధాకర్ లతో ఆ ఊళ్ళు వెళ్ళింది, 1989లో, శ్రీకాకుళం ఉద్యమం ముగిసిన ఇరవయ్యేళ్ళ తరువాత. ఆయన మళ్ళా ఆ ఊరువెళ్ళి ఇప్పటికి ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి. మళ్ళా ఎవరేనా జిజ్ఞాసువు ఈ కథ పట్టుకుని, చిలకం, సొబ్బ వెళ్తే,ఈ యాభయ్యేళ్ళల్లో ఆ కొండగాలి ఎట్లా మారిపోయిందో కనుక్కోగలుగుతాడు. ఈ కథలో ఒకచోట, ‘కొండగాలి లేదు’ అనే మాట కనిపిస్తుంది. అది వట్టి వర్ణన కాదు. తెలుగు సాహిత్యానికి గిరిజన సమస్యలని మొట్టమొదటగా పరిచయం చేసిన కథ ‘కొండగాలి’ భూషణంగారు రాసిన కథ. అది 1970-75 లో వచ్చిన కథ. 1989 నాటికి ఆ ఊళ్ళల్లో ఆ కొండగాలి కనిపించడం లేదంటున్నాడు ఆ రచయిత.
ఎందరో రచయితలమీద ఎన్నో పరిశోధనలు చేయిస్తున్న విశ్వవిద్యాలయాలు భూషణంగారిని ఎందుకు మర్చిపోయేయో నాకు అర్థం కాదు. ఇప్పుడేనా సరే ‘కొండగాలి’ (1975) నుంచి ‘కొత్తగాలి’ (1998) దాకా భూషణంగారి సాహిత్యప్రస్థానాన్ని అధ్యయనం చేయిస్తే అది ఉత్తరాంధ్ర గిరిజన పోరాటాల చరిత్రమీద కొత్తవెలుగును ప్రసరింపచేస్తుంది.
11-7-2018