ఫిన్నిష్ కవయిత్రులు

313
ఒక్కొక్కప్పుడు ఒక్కోదేశాల కవిత్వం మనల్ని పట్టుకుంటూ ఉంటుంది. ఆ దేశాలనుంచీ, పట్టణాలనుంచీ, గ్రామాలమీంచీ, పొలాలమీంచీ ప్రవహించిన ప్రతి ఒక్క పాటనీ వినాలనిపిస్తుంది, అచ్చులో దొరికిన ప్రతి పుస్తకం వెంటనే సంపాదించాలనిపిస్తుంది, ఆతృతగా చదివెయ్యాలనిపిస్తుంది.

ఏ ముహూర్తాన తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ నాకు పరిచయమయ్యాడో అప్పణ్ణుంచీ స్వీడిష్ కవిత్వం పట్ల అట్లాంటి దాహం మొదలయ్యింది. ఆ ఇష్టం హేరీ మార్టిన్ సన్, గున్నార్ ఎకెలాఫ్ ల మీదుగా ఇప్పుడు మొత్తం స్కాండినేవియా అంతటికీ విస్తరించింది.

ఫిన్లాండ్ జాతీయ ఇతిహాసం ‘కలెవల’ చదవాలని చాలాకాలంగానే అనుకుంటున్నప్పటికీ, ఫిన్నిష్ కవిత్వం రుచి చూపిస్తూ అన్నె ఫ్రైడ్ (1903-1998) అనే సాహిత్యవేత్త అనువదించి సంకలనం చేసిన అయిదుగురు ఆధునిక ఫిన్నిష్ కవయిత్రుల సంకలనమొకటి నా చేతుల్లొకి వచ్చింది. ‘Thank You for These Illusions (1981) అనే ఈ సంకలనానికి ఫ్రిఎడ్ చాలా చక్కని ముందుమాట కూడా రాసింది. దాదాపు ఉత్తరధృవం అంచులనుంచి వచ్చిన ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ముందుమాట నాకెంతో ఉపకరించింది. ఈ కవిత్వమనే కాదు, అసలు కవిత్వాన్నే అర్థం చేసుకోవడానికి దారిచూపే ఎంతో అనుశీలన ఆ ముందుమాటలో ఉంది.

ఆమె రాసిన కొన్ని వాక్యాలు:

‘కవిత్వం గురించి బాగా చెప్పగలిగింది కవిత్వమే.. సింబలిజం గురించి చర్చిస్తూ వైనో కిర్ స్టీనా మరొక ఫిన్నిష్ కవయిత్రి ఐలా మెరిలిటో రాసిన వాక్యాలు ప్రస్తావించింది. మెరిలిటో ఇట్లా రాసింది: ‘ఒక కవిత పాఠకురాలిలో రేకెత్తించే పదచిత్రాలు, మానసిక స్ఫురణలు, అవేమిటో మనం స్పష్టంగా వివరించలేకపోయినప్పటికీ, ఆ పాఠకురాలికి సంబంధించినంతవరకూ వాస్తవమే.,వాటివల్ల ఆ కవిత్వంతో ఆ పాఠకురాలికి ఒక సాన్నిహిత్యం కలుగుతుంది.’ ఆ వ్యాసంలోనే మరొకచోట, కిర్ స్టినా మరొక ఫిన్నిష్ రచయిత రాసిన వాక్యాన్ని ప్రస్తావిస్తుంది. ఆ రచయిత అన్నాడట: కవిత్వం సత్యంకాదు, కాని సత్యసంధతలో కవిత్వాన్ని మించింది లేదు’ అని.

ఫ్రైడ్ ఇంకా ఇలా రాసింది:

‘ప్రతి ఒక్క కవితా పాఠకుణ్ణి చేరదు. కాని ఒకసారి చేరగలిగిందా, ఇక అప్పుడు ఆ పాఠకుడు తన ఆంతరంగిక ప్రపంచంలో తాను ఒంటరి కాడనీ, తాను విశ్వసించడానికి సాహసించలేకపోతున్న తన ఆంతరంగిక ప్రపంచంలో తనలాంటి మనిషే మరొకడు మసలుతున్నాడనీ, దానిగురించి మాట్లాడుతున్నాడనీ, అట్లా మాట్లాడటం ద్వారా ఆంతరంగిక ప్రపంచమంటూ ఒకటున్నదని నిరూపిస్తున్నాడనీ గ్రహిస్తాడు. కేవలం సంగీతమూ, కవిత్వమూ మాత్రమే జాగృతం చెయ్యగల అగోచర, నిష్కారణ సంతోషం వెల్లువలాగా ముంచెత్తి అతడికి గొప్ప ఉపశమనాన్నిస్తుంది…’

అప్పుడామె ఫిన్నిష్ కవిత్వం గురించి ఇలా రాసింది:

‘ఏదైనా సృజించకుండా ఉండనివ్వని ఆందోళన ఫిన్నిష్ జీవితంలో ఒక ముఖ్య లక్షణం. సుదీర్ఘమైన చీకటికాలం, మరీ గడ్డకట్టినట్టుండే వాతావరణం, ఎంతో చెమటోడిస్తే తప్ప ఫలితాన్నివ్వని నేల, ఉత్తరధృవపు తీవ్ర ఏకాంతం ఈ ఆందోళనకి మూలకారణాలు. ఇక్కడ మనుగడ సాగించాలంటే రెండుమార్గాలు: బయటి ప్రపంచంలో- ప్రకృతి ఇచ్చేదేదో, ఇవ్వకుండా అట్టిపెట్టేదేదో పూర్తిగా తెలుసుకోవడం, భూమిని ఆశ్రయంగా మార్చుకోవడానికి చెయ్యవలసిందంతా చెయ్యడం. ఇక లోపల ప్రపంచంలో-అంతరంగపు లోతుల్లోకీ దూకడం. అట్లా తరచిచూసుకున్న అంతరంగ అగాధాల్లోంచే దేవుడి పట్ల విశ్వాసం, ఆచారాలూ, స్వీయ ఆంతరంగిక సంకేతాల పట్ల నమ్మకం, సృజనాత్మక శక్తులూ పొంగిపొర్లుతాయి… ఫిన్నిష్ సాహిత్యమూ, కవిత్వమూ ఈ దేశం తాలూకు, ఈ మనుషుల తాలూకు సృజనాత్మక శక్తులకు సాక్ష్యంగా నిలబడతాయి. సాహిత్య ప్రక్రియలన్నిటిలోనూ కవిత్వం మరీ ఆంతరంగిక ప్రక్రియ. కాబట్టే మరే దేశంలోకన్నా కూడా ఎక్కువగా ఫిన్లాండ్ లో కవిత్వం మరింత సజీవంగా ఉంది, మరింత రాయబడుతోంది, ప్రచురించబడుతోంది, చదవబడుతోంది..’

ఈ పుస్తకంలో అన్నె ఫ్రైడ్ సిర్కా సెల్జా, ఎయిలా కివిక్కహో, యిరిజొ తెరవైనెన్, మిర్కా రెకొలా, ఎయిలా పెన్ననెన్ అనే అయిదుగురు కవయిత్రుల కవితల్ని అనువదించి అందించింది. ఆ కవయిత్రుల ఆంతరంగిక ప్రపంచాన్ని ఎట్లా సమీపించాలో, అర్థం చేసుకోవాలో తన ముందుమాటలో వివరంగా చర్చించింది. ఫిన్నిష్ యథార్థపు రెండు ప్రపంచాల్నీ, ఆ ప్రపంచాలు కవయిత్రుల్లో కలిగించే మానసి క ఆందోళననీ ఆ కవిత్వం గొప్ప అందంతోనూ, గాఢతతోనూ ప్రతిబింబించిందని ఆమె వివరించింది.

ఆ సంకలనంలోంచి ఇదరు కవయిత్రుల కవితలు మీ కోసం.

ఐలా కవిక్కహో

మొదటగా, ఐలా కవిక్కహో. ఆమె గురించి ఫ్రైడ్ ఇలా రాసింది:

‘డిప్రెషన్ ఒక ధోరణిగా చాలామంది ఫిన్నీయుల్లో కనిపిస్తుంది. మరీ సాంప్రదాయికంగా ఉండమంటూ నిర్బంధించే మతాచారాల వల్ల ఏ ప్రాచీన అజ్ఞాతభయాలో మనసులో రేకెత్తించే అలజడి కావచ్చు, లేదా నేటి జీవితం ముందుకు నెడుతున్న వైయక్తిక సమస్యలు కావచ్చు. చాలాసార్లు ఈ భయాలకు పేర్లుండవు, రూపముండదు. ఇవి చివరికి తీవ్రమద్యవ్యసనంలోనో, మానసికరుగ్మతగానో లేదా ఆత్మహత్యాధోరణిగానో బయట పడుతుంటాయి. ఈ ధోరణులు ఇక్కడి జీవితంలో ఒక భాగమైపోయాయి. వాటిని సహించకతప్పని పరిస్థితి. ఎయిలా కవిక్కహో కవితల మీద ఆ ధోరణుల పొడవాటినీడలు పడుతుంటాయి. కాని ఆమె ఆ భయాల్ని సూత్రీకరించే ప్రయత్నం చెయ్యదు. కవయిత్రి సున్నితమానసం ఆ భయాల్ని పదచిత్రాలుగా మార్చి పాఠకుడికి విడిచిపెడుతుంది. ఆ దుఃఖాన్ని స్వయంగా అనుభవించి విలపించడమో లేదా దాన్నుంచి విడుదలకావడమో పాఠకుడు తనకై తాను చూసుకోవలసిఉంటుంది…అయితే ప్రతి దృశ్యమానవేదనకీ చివర కవయిత్రి ఒక ఆశావహమైన మలుపు పొందుపరుస్తుంది. పద్యంలో పదాలు దాచిపెడుతున్నదాన్ని సంగీతం పఠితకు అందిస్తుంది.’ ఆ కవిత్వానికొక ఉదాహరణ.

‘సాయంకాల మనఃస్థితి ‘

కిటికీ అద్దం వెనగ్గా శోకిస్తున్న సరుగుడుచెట్టులాగా
పొడవైన వానచెట్టు రాగంతీస్తోంది.
కొమ్మలు అద్దాన్ని రాపాడుతున్నాయి
దాని చిత్తడిగుబుర్లమధ్య
బూడిదరంగుపిట్ట- పాట,
దాని చిటారుకొమ్మన
ఊయలూగుతూ
ముసిలి తల్లిపిట్ట,
స్వప్నం.

ఎర్రటి నిద్రాపుష్పమా
వాన ముత్యాలనేత్రాలదాకా సాగిపో
తెల్లవారగానే సూర్యుడి గొడ్డలి ఎలానూ తళుకులీనుతుంది
రాగంతీసే పొడవైన వానచెట్టు తెగిపడుతుంది.

ఎయిలా పెన్ననేన్

రెండవ కవయిత్రి, ఎయిలా పెన్ననేన్ గురించి రాస్తూ సంకలనకర్త ఆమె మాటల్నే ఇట్లా ఉల్లేఖించింది.

‘ఎయిలా పెన్ననేన్ ఇలా అంటున్నది. కవితలు సద్య: స్పందనల్లోంచి పుడతాయి. కవిత్వం రాయడమంటే ఆత్మవిమోచన, సంతోషానుభవం, ఆ కవితలు చివరికి విషాద అనుభవాలనుంచి పుట్టినా సరే. కవిత్వం రాయడం ఒక విజయం. కవిత్వం సంగీతం, ఆనందం. అది మనిషికి శాంతినీ, నూతనజవసత్త్వాల్నీ అందిస్తుంది. కవిత్వం మనల్ని ఆందోళననుంచి బయటపడేస్తుంది కనుకనే ఫిన్లాండులో ఎందరో కవిత్వం రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు, చదువుతున్నారు. కవిత్వం ఎటువంటి ఆందోళననైనా, ముఖ్యంగా మద్యవ్యసనం నుంచి తలెత్తే ఆందోళననుంచి, బయటపడేస్తుంది. కవిత్వానికీ, మద్యపానానికీ మూలాలు మన సుదీర్ఘశీతాకాలాల చీకటీ, మన ఏకాంతమూను. కవిత్వం చదవడమంటే మనుషులు మనకి దగ్గరగా ఉన్నట్టు. అక్కడ కవీ, పాఠకుడూ పరస్పరం సాంగత్యాన్నీ, ఉపశమనాన్నీ, ఒకింత వెచ్చదనాన్నీ అందించుకుంటారు..’ ఆమె కవిత్వానికొక ఉదాహరణ:

‘ఈ భ్రాంతులకి నా కృతజ్ఞతలు ‘

ఈ సున్నితమైన తలపులు
వీటిని జాగ్రత్తగా పట్టుకో
సత్యం ఇక్కడ చేతికందుతోంది
ఇంతలో కోమలం, ఇంతలో కర్కశం
యథార్థ జీవితం ఎంతైనా పెనగులాడనీ,
ఈ భ్రాంతి చెక్కుచెదరదు.
మానవాళికొక ఆశ.

నేలా నీళ్ళూ ఒకనాటికి శుభ్రపడతాయని
వాళ్ళు విషాల్నీ, ఆయుధాల్నీ ఉత్పత్తిచెయ్యడం మానేసిన రోజున
ఊపిరిపీల్చడానికొకింత చక్కటి గాలి దొరుకుతుందని.
మళ్ళా మరొక్కసారి మనం చెట్లనీడన కూచుని
కవితలు చదువుకుంటామని,
సోక్రటీస్ మాటలు వినగలుగుతామని,
కొత్త భావావేశాలు కలుగుతాయని,
కొత్త సంవేదనలు రేకెత్తుతాయని.

ఓ భ్రాంతిశకలమా, నువ్వింకా సజీవంగానే ఉన్నావు కద,
నా అమాయక హృదయంతో ఎలుగెత్తి పిలుస్తున్నాను నిన్ను.

 

18-5-2015

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s