ప్రేమ మతం

394

మిత్రుడు, పుస్తకదూత షేక్ సాదిక్ ఆలీ నా గురించి ఎంతో ప్రేమతో రాసిన వాక్యాలు నన్నింకా సంపెంగపూల తావిలాగా అంటిపెట్టుకునే ఉన్నాయి. ప్రేమ తప్ప మరేదైనా దొరికే ఈ ప్రపంచంలో, నీకేమీకాని ఒక మనిషి నిన్ను సంతోషంగా తలుచుకోవడం కన్నా కావలసిందేముంది? అటువంటి ప్రేమ అంత తేలిగ్గా బదులివ్వగలిగేది కాదు. అలాగని మౌనంగా ఒక్క నమస్కారంతో సరిపెట్టేదీ కాదు.

సోదరుడా, స్నేహంతో నువ్వు చాపిన చేతుల్లో ఒక పూల గుత్తి పెట్టడంతో పాటు, మంచి కవిత్వమేదన్నా నీకు వినిపించాలనిపించింది. ఎవరి కవిత్వం వినిపించాలా అనుకుంటే, ఇట్లాంటి వేళల్లో రూమీ కన్నా ప్రభావంతమైన, ప్రభావశీలమైన కవి మరెవరు కనిపిస్తారు?

‘జీవితం ఎండిపోయి గడ్డకట్టినప్పుడు ఒక కృపావర్షంగా వచ్చి నన్ను తడిపెయ్యి’ అంటాడు టాగోర్. రూమీ కవిత్వానికి ఆ మాట వర్తిస్తుంది. జీవితపు వాకిట్లో చీకటి ముసురుకున్నప్పుడు, లేదా పైన నల్లటి దిగులు మబ్బు కమ్మినప్పుడు, తెలియని శూన్యమేదో చుట్టుముట్టినప్పుడు, రూమీనుంచి ఒక్క వాక్యం తెరిచినా, ఒక పూలబండి మనపక్కనుంచి వెళ్ళినట్టు, సాయంకాలం వీథిదీపాలన్నీ ఒక్కసారి వెలిగినట్టు, ఎండాకాలపు చివరిదినాంతాన ఋతుపవనమేఘం ఆకాశం మీద ప్రత్యక్షమయినట్టు ఉంటుంది.

ఇరవయ్యవశతాబ్దపు చివరి రోజుల్లో రూమీని మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసిన కోలమన్ బార్క్స్ రూమీ కవిత్వాన్ని ఎన్నో సంపుటాలుగా వెలువరించాడు. వాటిల్లోంచి A Year with Rumi (2006) తెరిచాను. మొదటి కవితనే ఇలా ఉంది:

*
పూర్తిగా జ్వాలగా మారడానికే కొవ్వొత్తి తయారయింది
తనను తాను పూర్తిగా అదృశ్యం చేసుకునే
ఆ చివరి క్షణంలో
దాని చుట్టూ మరే నీడా లేదు.

అదిప్పుడొక భద్రమనఃస్థితిని
ప్రకటించే కాంతిజిహ్వ.

ఇక ఈ క్షణమో, మరుక్షణమో
పూర్తిగా కరిగిపోనున్న
ఈ కొవ్వొత్తి తునక చూడు:

పాపపుణ్యాలనుంచీ
మానావమానాలనుంచీ
బయటపడ్డవాడిలాగా
కనిపించడం లేదూ!

*

మరొక రెండు పేజీలు తిప్పాను. ఈ కవిత:

*

ప్రేమించడమెట్లానో నీ వెలుగులో నేర్చుకున్నాను
కవితలల్లడమెట్లానో నీ సౌందర్యం నుంచి.

ఎవరికీ కనబడని
నా హృదయవేదిక మీద నీ నాట్యం.

ఆ నాట్యమెట్లాంటిదో కొన్నిసార్లు నేను చూసాను
అట్లాంటి క్షణాల్లోనే కాంతి ఇట్లా కవితగా మారుతుంది.

*

బార్క్స్ దృష్టిలో రూమీ కవిత్వం వట్టి కవిత్వం కాదు. దాన్నాయన soul book అన్నాడు. ప్రతి పాఠకుడికీ ఒక soul book ఉంటుందని చెప్తూ, అతడిట్లా అంటున్నాడు:

‘ఎమర్సన్ కి మాంటేన్ వ్యాసాల్లాగా, రూసోకి హాజ్లిట్ లాగా, హెమింగ్వేకి తుర్జనీవ్ రాసిన ‘ఎ స్పోర్ట్స్ మన్ స్కెచెస్’ లాగా, రేమాండ్ కార్వర్ కి చెహోవ్ లాగా, ఫాక్నర్ కి డికెన్సు లాగా, రాబర్ట్ బ్లైకి దావోయిస్టు కవిత్వం లాగా, ఆండ్రూ డిక్ కి జి.కె.చెస్టర్ సన్ లాగా, టాగోర్ కి బెనెడిట్టో క్రోసే లాగా, ఎడ్విన్ మూర్ కి నీషే లాగా, ..ఎడ్వర్డ్ హిర్ష్ కి ఇబన్ అరాబి లాగా, డొనాల్డ్ హాల్ కి మార్కు సువార్త, హార్డీ కవిత్వం లాగా, సి.ఎస్.లూవిస్ కి యురిపిడిస్ లాగా, ఎల్న్ విలియమ్స్ కి హామ్లెట్, కింగ్ లియర్ లాగా.. నేను కూడా నాకొక soul book practice మొదలుపెట్టాను. అది తొందర్లోనే రూమీ కవిత్వంగా, ఆ కవిత్వలాస్యంగా పరిణమించింది.’

బహుశా, నేను కూడా అటువంటి soul book practice చేస్తూనే ఉన్నాననుకుంటాను. జీవితపు ప్రతిదశలోనూ, ఒక కొత్త కవి నన్ను సమ్మోహపరుస్తూనే ఉన్నాడు. ఇట్లాంటి soulmates ని వెతుక్కునే క్రమంలో మనం మనతోటి మనుషులకి, మన చుట్టూ ఉన్న మనుషులకి మరింత సన్నిహితమవుతాం. నిజానికి, నువ్వెంత గొప్ప కవిత్వం చదివినా నీ చుట్టూ ఉండే సజీవమానవుల స్నేహం వల్ల మాత్రమే ఆ కవిత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతావు.

సరిగ్గా రూమీ చెప్పేదిదే. కవిత్వం వల్ల మనుషులు మరింత ప్రేమాస్పదులవుతారు, మనుషుల వల్ల కవిత్వం మరింత సమ్మోహనీయమవుతుంది. ఎందరు మిత్రులు, ఎందరు కవులు ఈ జీవితాన్ని సంపూర్ణం చెయ్యగలుగుతారు!

ఈ హృదయం ఎంతో చిన్నదేగాని, ఇది ప్రపంచాన్నంతా తనలో ఇముడ్చుకోగలదు. ఈ మాటే చెప్తూ బార్క్స్, ఇబన్ అరాబి (1165-1240) రాసిన ఈ కవితను గుర్తు చేస్తున్నాడు:

ప్రేమ మతం

మనం హృదయమనిపిలుస్తామే
ఆ మనలోపలి చోటు-
అక్కడెన్నో సజీవదృశ్యాలు,
సజీవ కథనాలు.

అది సుందరహరిణశాద్వలం
క్రైస్తవ సాధువుల మఠం
శివతాండవ వేదిక
విశ్వాసుల కాబా.

ఈ హృదయంలో ఉన్నవి
మోషే శిలాశాసనాలతో పాటు
కొరాను, వేదాలు
సూత్రాలు, సువార్తలు.

నాది ప్రేమ మతం.
ప్రేమ అనే ఒంటే నన్నేదారిన నడిపిస్తే
అదే నా విశ్వాస పథం,
నా సౌందర్యకేంద్రం,
నా జీవితసమస్తం మీదా పరుచుకున్న
పవిత్రప్రకాశం.

4-8-2018

Leave a Reply

%d bloggers like this: