ప్రగాఢ నిశ్శబ్దం

Reading Time: 4 minutes

390

మొన్న నిర్మల తాను జయతిని చూడటానికి వెళ్తున్నానని నన్ను కూడా రమ్మంటే వెళ్ళాను. జయతి, లోహితాక్షణ్ లు ఇబ్రహీం పట్నం లో ఉంటున్నామనీ, ఎప్పుడేనా ఒకసారి వచ్చివెళ్ళమని అడిగి ఏడాది పైనే అయిపోయింది. కాని, వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఏమి చెప్పను? ఆ సాధువులదగ్గరికి వెళ్ళినప్పుడు నా కూడా ప్రపంచపు దుమ్మునీ, గడబిడనీ తీసుకుపోతానేమోనన్న సంకోచం కావచ్చు.

ఒకప్పుడు జపనీయ హైకూ కవీశ్వరుడు, జెన్ బౌద్ధుడు మత్సువొ బషొ రాసుకున్న కొన్ని డైరీల్నీ, యాత్రాకథనాల్ని నేను అనువదించాను. అందులో ఒక చోట ఆయనిలా రాసుకున్నాడు:

‘ఎవరైనా నిన్ను చూడటానికి వచ్చారా, ఊసుపోకమాటలు సాగుతాయి. నేనెవరినైనా చూడటానికి వెళ్ళానా? వాళ్ళ పని పాడుచేస్తున్నానేమో అనిపిస్తుంది ‘ అని.

తన కారు అమ్మేసుకుని హిమాలయాల్లో సంచరించిన ఒక సాధువు గురించి ఒకాయన పుస్తకం రాస్తే ముప్పై లక్షల కాపీలు అమ్ముడుపోయింది. అది కథ. కాని జయతి నిజమైన మాంక్ అని ఎందరికి తెలుసు?

ఇబ్రహీంపట్నం దాటిన తరువాత ఊరు పొలిమేరలకి ఆవల ఒక ప్రశాంత గురుకుల ప్రాంగణంలో ఒక మునివాటిక లాంటి కుటీరం. ఆ ఇంటిని చూస్తూనే నాకు బషొ అరటిచెట్ల కుటీరం గుర్తొచ్చింది. ఆయనిట్లా రాసుకున్నాడు:

‘నేను కూడా పట్టణ జీవితం పదేళ్ళ కిందటే వదిలిపెట్టేసాను. ఇప్పుడు నా వయసు దాదాపు ఏభై ఏళ్ళు. ఒక రకంగా నేను వేరువదిలిపెట్టిన వేరుపురుగువంటివాణ్ణి. గుల్లవదలిపెట్టిన నత్తని. ఉత్తరదేశపు లోతట్టు భూముల్లో, కిసకతలో మండే ఎండల్లో నా దేహాన్ని మాడ్చుకున్నవాణ్ణి. ఉత్తరసముద్ర తీరపు ఇసుకనేలల్లో పాదాలు అరిగిపోయేలా నడిచినవాణ్ణి. ఒకేఒక్క రెల్లుకొమ్మనీడన ఊగిసలాడే గూటికి చేరుకున్న తోకలేని పిట్టలాగ నేనీ కుటీరం చూరు మళ్ళా సరిచేసి తిరిగి కంచె కట్టుకున్నాను..’

బషొ కి కూడా అతడి ముందు తావో యువాన్ మింగ్, సోగి , సైగ్యో వంటి కవులూ, సౌందర్యారాధకులూ నమూనాలుగా ఉన్నారు. తావో యువాన్ మింగ్ తన ఇంటికి తూర్పువేపున చామంతులు నాటుకున్నాడనీ, వాంగ్ షి యు ఇంటికి ఉత్తరం వేపున వెదురుపొదలున్నాయనీ, ఒక విల్లోకొమ్మను చూడటానికి సైగ్యో కాలినడకన ఉత్తరజపాన్ పర్యటించాడనీ బషొకి తెలుసు. కాని ఈమె ఏ కవుల్ని, ఏ పరివ్రాజకుల్ని నమూనాగా పెట్టుకుని ఈ దీక్షకు పూనుకున్నది?

అక్కడ అడుగుపెట్టిన క్షణమే అదొక ప్రగాఢమౌనప్రాంగణమని నాకు అర్థమయ్యింది.కొన్ని స్థలాల్లో అడుగుపెట్టగానే నీకు మరేమీ చెయ్యాలనిపించదు. ఏదో ఒక అలౌకిక ప్రశాంతినిన్ను ఆవరిస్తుంది. మరేమీ కావాలనిపించదు. మాట్లాడాలని కూడా అనిపించదు. అటువంటి నిశ్శబ్దమేదో అక్కడ పరుచుకుని ఉండి ఉంటుందని నాలోపల్లోపల ఏదో నమ్మకం ఉండిఉండాలి. అది నిజమయ్యింది.

వెళ్ళాక కొంత సేపు కుశలప్రశ్నలు. ఆ తర్వాత, ఆమె రాసిన యాత్రానుభవాల్ని పుస్తకంగా తీసుకురావడం గురించి మాట్లాడుకున్నాం. ఆ పుస్తకానికి కవర్ పేజి మీద ఏ ఫొటో పెడితే బాగుంటుందా అని ఆమె తీసిన ఫోటోలన్నీ చూసాం. అపారమైన వెలుతురు, దట్టమైన నీడలు, అపరాహ్ణాల్లో అడవులమీదా, కొండలమీదా పరుచుకునే ఎండపొడ, సీతాకోకచిలుకలు, సాలీళ్ళు, గొంగళిపురుగులు, భగవత్ సృష్టిలోని మహాసౌందర్యశకలాలైన ఎన్నో కీటకాలు-వాటినట్లా చూస్తూ ఉంటే నా హృదయం నా చిన్నప్పటి అడవిబాటల్లోకి పరుగులుపెట్టింది.

అన్నం తిన్నాక అడవిలో అడుగుపెట్టాం. ఆ ఇంటిని ఆనుకుని వెనకంతా రిజర్వ్ ఫారెస్టు. యూకలిప్టస్ తోటలూ, కూరగాయ మళ్ళూ దాటి అడవి వైపు అడుగులేస్తూండగానే ఒక పక్షి అరుచుకుంటూ మమ్మల్ని దాటి వెళ్ళిపోయింది. అదేమిటి అనడిగాను.

‘బేబ్లర్’ అందామె. తెలుగు పదం కోసం వెతుక్కుంటూ ఉంది. కాని వాగుడుకాయలాగా అరుచుకుంటూ పోతున్న ఆ పిట్టకి మరోపేరు అవసరంలేదనిపించింది.

‘ఇక్కడొక చెట్టు చూపించాలి మీకు’ అన్నదామె. ఆ దారిన అడవి అంచుల్లో అడుగుపెట్టామో లేదో ఆకాశంలో మరో రెండు పిట్టలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. అవేమిటి అనడిగాను.

‘తీతువులు’ అందామె.

‘మనం వాటి ప్రాంతంలో అడుగుపెట్టాం. ఊరిపొలిమేరల్లోనూ, చెరువులదగ్గరా, అడవి అంచుల్లోనూ ఉంటాయవి. వాటి పరిథిలోకి కొత్త మనిషి ప్రవేశిస్తే చాలు అరుస్తాయి. తక్కిన పశుపక్షి ప్రపంచాన్ని నిద్దరలేపేస్తాయి. తీతువు అరిస్తే అపశకునమని అనుకుంటారు పల్లెల్లో. కాని, ఆ అరుపులు నిజానికి హెచ్చరికలు. మనసమాజానికి కాదు, వాటి సమాజానికి. చూడండి, మనం ఉన్నంతసేపూ ఇవి మన నెత్తిపైనే గిరికీలు కొడుతుంటాయి’ అన్నదామే.

ఆ అడవిలో ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళిందామె. దాన్ని చిన్నప్పుడే ఎదగనివ్వకుండా ఎవరో నరికేసారు. ఆ తర్వాత దానిగురించి మర్చిపోయారు. మామూలుగా ఎదిగిఉంటే ఎలా పెరిగిఉండేదోగాని, చిన్నప్పుడే తగిలిన గాయం దానిలోని జీవశక్తిని నాలుగువేపులా వికసింపచేసింది. చాచిన అరచేతిలాగా అయిదు వేపులా దాని కాండాలు. ఆ చెట్టుని స్పృశించాలనిపించింది. అక్కడే చాలాసేపు కూచునిపోయాం. మా పైన ఆకాశాన్నీ, అడవినీ కూడా ఆ తీతువులు నిద్రలేపేసాయేమో అడవిలో ఏవేవో పక్షులు, కీచురాళ్ళు, బహుశా చెట్లకొమ్మలు కూడా మాట్లాడటం మొదలుపెట్టాయి. ఆ చప్పుళ్ళవల్ల అడవి నిశ్శబ్దం మరింత చిక్కబడుతూ ఉంది.

నాకు పదే పదే బషొ గుర్తువస్తూ ఉన్నాడు. ఆయన ఇట్లాంటిదే ఒక స్థలం గురించి ఇలా రాసుకున్నాడు:

‘వసంతం సెలవు తీసుకుని మరీ ఆట్టే కాలం గడవలేదు. తెల్లసంపెంగపూవులింకా వికసిస్తూనే ఉన్నాయి. కొండలమీద పూసే నీలిలతలు పైన్ చెట్లకి వేలాడుతున్నాయి. అప్పుడప్పుడూ ఒక కోకిల ఎగురుతూ కనవస్తున్నది. నీలిరెక్కల బూడిదరంగుపిట్టలేవేవో వార్తలు మోసుకొస్తున్నాయి. చివరికి అడవిలో వడ్రంగిపిట్ట చేసే చప్పుడు కూడా చిరాకు తెప్పించకపోగా ఆహ్లాదభరితంగానే ఉంది..ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామం చుట్టూ దట్టంగా అల్లుకున్న చెట్లనీడల్నీ, కాలువగట్టున చేపలు పట్టేవాళ్ళనీ చూస్తుంటే అదంతా ప్రాచీన కవితాసంకలనం మన్యోషూ లో వర్ణించినట్టే కనబడుతున్నది.. నేనింతాచేసి కొండలంటే ఇష్టపడే ఓ సోమరిని మాత్రమే.ఎత్తైన కొండకొమ్ము మీద కార్లు బారజాపుకుని పేలుకుక్కుకునేవాణ్ణి మాత్రమే..’

అక్కడ ఆ అడవిలో, ఆ చిన్ని గుట్టమీద, నాలుగువేపులా కాండాలు చాపుకున్న ఆ ఏగిశమానో, బండారుచెట్టో దాని నీడన కూచున్నప్పుడు, నన్ను కూడా నా అత్యంత ప్రేమాస్పదమైన సోమరితనం పూర్తిగా ఆవహించింది.

నాకు ఫొటోలు ఎలా తియ్యాలో నేర్పమని అడగటానికి డి.ఎస్.ఎల్.ఆర్ పట్టుకెళ్ళాను. కెమేరా ఎలా పట్టుకోవాలో, వెలుగు ఎట్లా సరిచూసుకోవాలో, ఆమె నాకు కొంత పాఠం చెప్పిందిగానీ, జీవజాలాన్ని ఆమె చూసినట్టు నేను చూడాలంటే ఒక్కరోజు సరిపోతుందా? మాతో మాట్లాడుతూనే ఆమె మా ఎదట ఉన్న గడ్డిపువ్వుల్ని ఫొటో తీసింది. ఆ పూల ఫొటో చూసాను. ‘తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను చక్రవర్తి కూడా అంత అందంగా అలకంరించబడలేదని’ ప్రభువు ఎందుకన్నాడో అర్థమయ్యింది.

ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. ఒకటి రెండు చినుకులు పడటం మొదలయ్యింది. మేం లేచి ఇంటిబాటపట్టాం. మేం అడవి సరిహద్దుదాటగానే అప్పటిదాకా పైలటు పోలీసుల సైరన్లలాగా మోగుతున్న తీతువుల అరుపులు ఒక్కసారిగా ఆగిపోయేయి. ఆ నిశ్శబ్దంలో మాకప్పటిదాకా వినబడని నెమళ్ళ క్రేంకారాలు వినబడటం మొదలయ్యింది. ఆ దారిన వస్తూ ఉండగా ఆమె చెముడుకాకుల్నీ, ఏట్రింతల్నీ, డేగల్నీ, మొత్తం పక్షిప్రపంచాన్నంతా మాకు చూపిస్తూ ఉంది.

ఆమె ఇంటిపక్కన పెద్ద జామతోట. ఆ యజమానులు దాన్ని ఈ ఏడాది వేలం వెయ్యకుండా వదిలిపెట్టేసారట. పళ్ళు చెట్లమీదనే ముగ్గి రాలిపోతున్నాయి. కిందంతా అడవిలాగా పెరిగిన గడ్డి. ఆ తోటలో తిరుగాడేం. ఆ పళ్ళు తినడం కన్నా, చెట్టుకొమ్మల మీద ముగ్గిపోయిన, చిలుకలు సగం తినేసి వదిలిపెట్టిన ఆ పండ్లని చూస్తుంటే చెప్పలేని ఏదో సంతోషం. జీవితసాఫల్యసందర్శనం.

సాయంకాలమైంది. వెచ్చని తేనీరు. మేమెలానూ వెనక్కి రాక తప్పదు. మేము వచ్చేసిన తర్వాత, ఆ కుటీరంలో ఆమె ఒక్కతే ఎలా ఉంటుందో కదా అనిపించింది. మళ్ళా బషొ గుర్తొచ్చాడు. ఆయనిట్లా రాసుకున్నాడు:

‘దూరంగా పర్వతం మీంచి సూర్యుడు దిగిపోతూ ఉన్నప్పుడు నేనా సాయంసంధ్యవేళలో చంద్రోదయం కోసం ప్రశాంతంగా ఎదురుచూస్తూ కూర్చుంటాను. నా నీడ ఒక్కటే నాకు తోడుగా నిలిచి ఉంటుంది. దీపం వెలిగిస్తాను. దీపకాంతివల్ల ఏర్పడ్డ ఛాయ ప్రచ్ఛాయలను చూస్తూ సదసద్విచారం కొనసాగిస్తుంటాను..’

ఆమె జీవితం నుంచి నువ్వే సందేశం గ్రహించావు?

బషొ కవిత్వం నుంచి ఏ సందేశం గ్రహించానో అదే. బషొ రాసుకున్నాడు:

‘నా కవిత్వం వేసవిలో నెగడులాంటిది, చలికాలంలో విసనకర్రలాంటిది. వ్యావహారిక అభిరుచికి వ్యతిరేకదిశలో సాగుతుందది. లోకం దృష్టిలో చూస్తే దానికెట్లాంటి ప్రయోజనం లేదు..’

కాని అట్లాంటి కవిత్వాలకీ, అటువంటి జీవితాలకీ ఉన్న ప్రయోజనం అదే. అవి మనల్ని లోకం దృష్టిలో కూరుకుపోకుండా బయటపడేస్తాయి. నువ్వు నీ సంతోషానికి నీ చుట్టూ ఉన్నవాళ్ళ ఆమోదం కోసం వెంపర్లాడకుండా కాపాడతాయి.

మేం సెలవుతీసుకున్నాం. ‘ఈసారి రెండు రోజులుండేటట్టు రండి’ అన్నదామె. సన్నగా పడుతున్న చినుకులమధ్య ఆ ప్రాంగణం వదిలిపెట్టాం. అక్కణ్ణుంచి కాలినడకన, షేర్ ఆటోల్లో, సిటీబస్సులమీద, మళ్ళా ఆటోల్లో ఇంటికి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది.

‘బాగా స్ట్రెయిన్ అయ్యారా’ అని వాట్సప్ మెసేజి, మర్నాడు పొద్దున్న నిర్మల నుంచి.

‘లేదు, బాగా నిద్రపోయాను’ అని జవాబిచ్చాను. అంత ప్రగాఢనిశ్శబ్దాన్ని నా వెంటతెచ్చుకున్నాను మరి.

24-7-2018

Leave a Reply

%d bloggers like this: