పోరాటకారుడు

375

కొన్నేళ్ళ కిందట తూర్పుగోదావరి జిల్లా రచయితలు ఒక కథాసంకలనం వెలువరిస్తూ నన్ను కూడా ఒక కథ రాయమని అడిగారు. నాకు ఆ కథ గోదావరి జిల్లాకి సంబంధించింది అయి ఉంటే బాగుంటుందనిపించింది. కందుకూరి వీరేశలింగానికి సంబంధించిన కథ ఏదైనా రాయాలనుకున్నాను. కాని, మా అన్నయ్య వాడ్రేవు సుందరరావు వీరేశలింగం మీద అప్పటికే గొప్ప నాటకమొకటి రాసి ఉన్నాడు, ఆ నాటకాన్ని మించి వీరేశలింగం గురించి కొత్తగా ఏదీ రాయలేననిపించింది. ఆ స్థాయి అందుకోడం కూడా కష్టమనిపించింది.

కాని,వీరేశలింగానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పార్శ్వమొకటుంది. వీరేశలింగం సామాజిక దురాచారాలమీద పోరాటం చేసినవాడిగా, తెలుగు నేలమీద మొదటి వితంతు పునర్వివాహం చేయించినవాడిగా మనకు తెలుసు. అంతేకాదు,ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికుడిగా, నవల, వ్యాసం, ప్రసహసనం, పాఠ్యపుస్తకం, జీవితచరిత్ర, స్వీయచరిత్రలాంటి వచన ప్రక్రియల్లో గణనీయమైన రచనలు చేసిన మొదటి రచయితగా కూడా మనకి తెలుసు. కానీ,అన్నిటికన్నా ముందు అతడు మొదలుపెట్టిన వ్యాసంగం పత్రికారచన అనీ, అది కూడా సమాజంలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యడం కోసమే సాగించాడనీ, ఎందుకనో మనకి అంతగా గుర్తు రాదు.

కాని, అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటాల వల్లనే, వీరేశలింగం, ఇప్పుడు వందేళ్ళ తరువాత, మరింత స్మరణీయుడవుతున్నాడు. అవినీతిని ఎత్తిచూపడంలోనూ, తూర్పారబట్టడంలోనూ, వీరేశలింగం చేసిన పోరాటంలో రెండు ముఖ్యాంశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

మొదటిది, ఉన్నతస్థానాల్లో ఉన్న అవినీతిని ఎత్తిచూపాలన్నది ప్రతి ఒక్కరూ చెప్పేదే గాని, ఆ ఉన్నతస్థానాలు తమ దైనందిన జీవితంలో భాగమయినప్పుడు పోరాటం చేసేవాళ్ళు మనకేమంత ఎక్కువమంది కనబడరు. ఎక్కడో ఉన్న పాలకుల్ని విమర్శించడం చాలా సులువు. కాని, నీ కార్యాలయంలో నువ్వెవరికింద పనిచేస్తున్నావో వాడి అవినీతిని ప్రశ్నించడం చాలా కష్టం. రూపురేఖల్లేని ‘రాజ్యం’ అనే ఒక శక్తిని విమర్శించడం చాలా సులువు. కానీ, నీ స్థానిక శాసనసభ్యుణ్ని విమర్శించడం చాలా కష్టం. కాని, వీరేశలింగం తన చుట్టూ ఉన్న స్థలాల్లో , రోజూ తాను కలిసి పనిచేస్తున్న మనుషుల్లో, తన కన్నా ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్ళ అవినీతిని ఎత్తిచూపాడు. ఊహించండి. శారీరకంగా అర్భకుడైన ఒక ఉపాధ్యాయుడు తనకన్న సామాజికంగా ఎంతో బలవంతులైన ఉన్నతాధికారుల్నీ, న్యాయమూర్తుల్నీ తూర్పారబట్టాడంటే, తలుచుకుంటేనే నాకు వళ్ళు గగుర్పొడుస్తుంది. ఈనాడు, మన మధ్య ఉన్న పత్రికా సంపాదకుల్లో ఆ నైతిక స్థాయి, ఆ నిర్భీతి ఉన్నవారిని ఒక్కరినయినా చూడగలమా!

ఇక రెండవది, అంతకన్నా ముఖ్యమైంది ఒకటుంది. సాధారణంగా, ప్రభుత్వోద్యోగాల్లో అవినీతికి పాల్పడేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. తాను ఉత్తర్వులిచ్చే ఫైలుమీద రాసే రాతలనుంచి, తాను అవినీతిగా సంపాదించే ఆస్తుల్ని కాపాడుకోడందాకా చాలా అప్రమత్తంగా ఉంటాడు. చాలా ఆచితూచి అడుగులువేస్తాడు. వీలైనంతమందిని తన అవినీతిలో భాగస్వాముల్ని చేసుకుంటూపోతాడు. కాని, గమనించవలసిందేమంటే, నీతిగా ఉండాలనుకున్నవాడు, నీతిబద్ధంగా ప్రభుత్వ కార్యకలాపాన్ని నడపాలనుకున్నవాడు, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలకున్నవాడు మరింత జాగ్రత్తగా ఉండాలన్నది. చాలాసార్లు కోర్టు కేసుల్లో ప్రభుత్వం ఓడిపోతుండటానికి కారణం, ప్రభుత్వ పక్షాన నిలబడ్డవాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవలసినంతగా తీసుకోకపోవడమే.

ఈ రెండు అంశాలూ వీరేశలింగం జీవితంలో కనిపించినంతగా, మన కాలం నాటి పాత్రికేయుల జీవితాల్లో, ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రవర్తనలో, సామాజిక కార్యకర్తల పోరాటాల్లో నేనింకా చూడవలసే ఉంది. అందుకని, ఈ అంశం మీదనే కథ రాసి ఆ సంకలనకర్తలకిచ్చాను.

వీరేశలింగం మన మధ్యనుంచి నిష్క్రమించి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా, ఆయన్ని తలుచుకోడానికి, ఈ కథకన్నా మరొకటి స్ఫురించట్లేదు నాకు.

27-5-2018

 

Leave a Reply

%d bloggers like this: