చాలా కాలం కిందట, బహుశా పదేళ్ళ కిందట కావొచ్చు, ఒక ఆదివారం సెలూన్ లో నా వంతుకోసం ఎదురుచూస్తున్నాను. అలా వేచి ఉండటంలోని కొద్దిపాటి విసుగునీ భరించలేక, అక్కడున్న ఆంధ్రజ్యోతి పేపరు తిరగేసాను. సాధారణంగా తెలుగుపత్రికలు నేను తిరగేసేది అక్కడే.
ఆ రోజు ఆ పేపర్ని నాలాగే వేచి ఉన్న మరో ముగ్గురు మూడు భాగాలుగా పంచుకుని చదువుతున్నారు. కొంతసేపటికి ఆదివారం ప్రత్యేక సంచిక నా చేతులకి దొరికింది. మొదటిపేజీలు తిరగేసాను.సంపాదకీయం కనిపించింది. ‘సండే కామెంట్’ పేరిట. మొత్తం చదవడానికి ఒక నిముషం పట్టి ఉండొచ్చు. కాని నా వళ్ళు జలదరించింది. నేను ఎక్కడ కూచున్నాను, అక్కడికి ఎందుకు వెళ్ళాను అన్నీ మర్చిపోయేను. ప్రపంచమంతా పగలూ రాత్రీ ఎందరో దివిటీలు వెలిగించి మరీ గాలిస్తున్న సత్యం ఆ సండే కామెంటు రూపంలో నిశ్శబ్దంగా, కొంత చిలిపిగా, కొంత అమాయకంగా, కానీ గొప్ప వాత్సల్యంతో, ప్రేమతో నా ఎదటపడ్డట్టనిపించింది.
ఆ కామెంటు శీర్షిక ‘ఫ్యూచర్ టెన్స్’. రాసిందెవరో తెలీదు. ఆ పేపర్లో పనిచేస్తున్నవాళ్ళల్లో నాకు తెలిసిందీ, నేను చనువుగా వెంటనే ఫోన్ చెయ్యగలిగిందీ వసంతలక్ష్మిగారికే. ఆమెకే ఫోన్ చేసాను. ఆ వ్యాఖ్య రాసిందెవరని అడిగాను. ఆమె సంకోచం లేకుండా తనే అని చెప్పారు.
నాకొక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు.
పత్రికా సంపాదకీయాలు ముసుగు వేసుకుని కథలుగా, కథా విమర్శగా, కథావిశ్లేషణలుగా చలామణి అవుతున్న కాలంలో, కథలు ముసుగేసుకుని పత్రికా సంపాదకీయాలుగా ప్రత్యక్షమవుతున్నాయా?
వసంతలక్ష్మిగారు నాకు తెలుసు. బాలగోపాల్ సహచరిగానే కాదు, వసంతలక్ష్మిగా కూడా తెలుసు. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి తర్వాత, నా కథలు ఎక్కువ కథలు అచ్చేసిన సంపాదకురాలిగా నేనామెకు మరింత ఋణగ్రస్తుణ్ణి. కాని,ఆమె కథారచయితగా నాకెప్పుడూ తెలీదే.
అది కూడా సాదాసీదా కథారచయితగా కాదు. నా ముందున్న కథ మళ్ళీ మళ్ళీ చదివాను. అది ప్రపంచసాహిత్యంలోని అగ్రశ్రేణి కథలపంక్తిన చేరగల కథ. కిర్క్ గార్డ్, కాఫ్కా, బోర్హెస్ వంటి modern/ postmodern parabulists లు మాత్రమే రాయగల కథ. తెలుగులో, అది కూడా ఒక క్షౌరశాలలో, ఒక ఆదివారం పొద్దున్నే ఒక నిజమైన కథకుణ్ణి కనుగొన్న సంతోషంలోనో, ఉద్రేకంలోనో నేనామెతో ఏమేమో మాట్లాడాను, ఏదేదో చెప్పాను. కాని, పూర్తిగా మాట్లాడలేకపోయాను, పూర్తిగా చెప్పలేకపోయాను.
ఆ తర్వాత మరికొన్నేళ్ళకి పెర్ స్పెక్టివ్స్ ఆర్.కె గారు నాకు ఫోన్ చేసి ఆ సండే కామెంట్సు పుస్తకరూపంలో తేబోతున్నామని చెప్పారు. కాని, ఆ మాట చెప్పి కూడా అయిదారేళ్ళు దాటిపోయింది. ఆ పుస్తకం తప్పనిసరిగా తేవాలనీ, దానికోసం పాఠకులు క్యూ కడితే అందరికన్నా ముందు నేనే ఉంటాననీ చెప్పాను. కానీ,ఏళ్ళు గడిచిపోయాయి, ఆ విషయం మర్చిపోయాను.
మొన్న వసంతలక్ష్మిగారు, ఆర్.కె గారు మా ఇంటికొచ్చీ మరీ ఆ పుస్తకం నా చేతుల్లో పెట్టారు. నాకు సంతోషంతో పాటు గొప్ప గర్వం కూడా కలిగింది. రచయిత, ప్రచురణకర్త ఒక పాఠకుణ్ణి వెతుక్కుని ఇంటికివెళ్ళి మరీ పుస్తకం ఇచ్చే సత్కారం ఎంతమందికి లభిస్తుంది?
చదివేసాను. రెండు రోజుల్లో మొత్తం అన్ని కథలూ, 104 కథలూ, చదివేసాను. అవి సామాన్యమైన కథలు కాదు. అవి చదువుతున్నంతసేపూ, రెండవప్రపంచ యుద్ధకాలంలో పారబుల్స్ చెప్పిన ప్రసిద్ధ అబ్సర్డిస్టు రచయిత, సోవియెట్ యుగపు సర్రియలిస్టు రచయిత, డనీల్ ఖార్మ్స్ (1905-1942) గుర్తొస్తూ ఉన్నాడు. చెప్పవలసింది, చెప్పుకోవలసింది సూటిగా చెప్పుకోనివ్వని వాతావరణం చుట్టూ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కథలు పుడతాయి.
వసంతలక్ష్మి ఇట్లా రాస్తున్నారు:
‘చాలా సందర్భాల్లో మన చుట్టూ జరుగుతున్న పరిణామాల మీద వచ్చిన విపరీతమైన కోపాన్ని, బాధనే నేను ఈ కాలమ్స్ లో వెళ్ళగక్కాను. అయితే వందశాతం కోపాన్ని పదిశాతంగా, వంద శాతం ఆక్రోశాన్ని ఇరవై శాతం ఆక్రోశంగా మార్చి మృదువుగా, నిష్టూరంగా, వెక్కిరింతగా చెప్పడం అలవాటు చేసుకున్నా. ఇది మంచి ఇది చెడు అని పెద్దవాళ్ళకు చెప్పేటప్పుడు తీక్షణ స్వరం సత్ఫలితాన్ని ఇవ్వదన్న ఉద్దేశ్యంతోనే ఆ జాగ్రత్త పాటించాను.’
ఇది పేదవాళ్ళ ఆగ్రహం. పేదవాడి ఆగ్రహం పెదవికి చేటు కాకూడదంటే, పారబుల్ రాయడమొక్కటే మార్గం. అప్పుడే శ్రీ శ్రీ చెప్పినట్టు ‘పేదవాళ్ళ ఆగ్రహం’ ‘పదిపిల్లల్ని నూరు పువ్వులుగా కూర్చే ఆగ్రహం’ గా మారుతుంది.
చదవండి. ఈ పుస్తకం అవశ్యం చదవండి. కథావార్షికసంకలనాల సంకలనకర్తలూ, విశ్లేషకులూ ఆదమరిచి నిద్రపోతూ ఉండగా,ఈ కథాసంపుటి నిశ్శబ్దంగా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన కొత్త నక్షత్రంలాగా మన సాహిత్యాకాశం మీద ప్రత్యక్షమయింది. పగటిపూట కూడా చుక్కలు చూపించే కథలివి.
ఇంతా చెప్పి, ఆ ‘ఫ్యూచర్ టెన్స్’ కథ ఏమిటో చదవాలని మీకు అనిపించకుండా ఎలా ఉంటుంది? అందుకని, ఇదిగో, ఇక్కడ ఎత్తి రాస్తున్నాను, చదవండి:
ఫ్యూచర్ టెన్స్
ఫ్యూచర్ టెన్స్ అని ఒక ప్రోగ్రాం వస్తోంది టివిలో.
‘నేణు ఒకతన్ని చంపాను’ అనే వాక్యానికి భవిష్యత్ కాలం చెప్పమని క్విజ్ మాస్టర్ అడుగుతున్నాడు.
పాల్గొంటున్నవారిలో ఒకాయన వెంటనే బజర్ మోగించి ‘నేను ఒకతన్ని చంపబోతున్నాను’ అని చెప్పాడు.
‘నువ్వు చెప్పింది కరెక్టేగాని ఇంకెవరైనా కాస్త సృజనాత్మకంగా చెప్పగలరా?’ అడిగాడు క్విజ్ మాస్టర్.
‘నేను జైలుకు వెళ్తాను’ అన్నాడొకతను సీరియస్ గా.
అందరూ నవ్వారు.
నిజమే. హంతకుడు ఎప్పటికైనా జైలుకు వెళ్ళాల్సిందే కదా. క్విజ్ మాస్టర్ కి ఆ సమాధానం నచ్చింది కాని ఎందుకైనా మంచిదని అభ్యర్థుల వైపు మరోసారి చూశాడు.
మరొకతను బజర్ మోగించాడు.
‘భగవంతుడు ఒకతన్ని చంపబోతున్నాడు’ అన్నాడతను. నవ్వబోయి మానేశారందరూ.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు?
చంపెడివాడెవడు? చచ్చే వాడెవడు? అన్నీ నేనే అన్నాడు కదా! దాని ప్రకారం అతడి వాక్యం కరెక్టే.
వాతావరణం గంభీరంగా మారింది.
భగవంతుడు ఎవరి ప్రాణమైనా తీసుకుంటే దాన్ని చంపడం అనొచ్చా అనే అనుమానం వచ్చింది కొందరికి.
‘మన చుట్టూ ఇన్ని హత్యలు జరుగుతుంటే ఈ చచ్చుపుచ్చు జవాబులేమిటి? నేను ఇంకెవర్నీ చంపను. ఇదీ ఆ వాక్యం భవిష్యత్ కాలం’ అని ఒకతను బజర్ నొక్కకుండానే గట్టిగా అరిచి చెప్పాడు.
31-7-2018