పక్షిభాషాకోవిదుడు

Reading Time: 2 minutes

309

ఈ నాలుగు వాక్యాలూ చల్లా వేణుమాధవ్ అనే నా మిత్రుడి గురించి అనేకన్నా, వేణు చల్లా అనే ఒక భాషాకోవిదుడి గురించి అని చెప్పొచ్చు.

వేణు నాకు ఇంటర్మీడియెట్లో క్లాస్ మేట్. నాగార్జున సాగర్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ కలిసి చదివాం. అతడు ఎం.పి.సి.నేను సి.ఇ.సి. కాబట్టి ఒక క్లాసు కాదు, కాని, మాకు ఇంగ్లీషు తరగతులు ఉమ్మడిగానే జరిగేవి అందువల్ల మేమంతా ఆ క్లాసులో కలుసుకునేవాళ్ళం. అన్ని గ్రూపుల వాళ్ళకీ ఇంగ్లీషు కామన్ క్లాసుగా ఉండాలన్న ఐడియా ఎవరిదో గాని, అది చాలా జీవితాల్నే మార్చేసింది. అందులో నాదీ ఒకటి.

మేం తాడికొండ స్కూల్లో చదివి అక్కడికి వెళ్ళినందుకు, తక్కిన అన్ని విషయాల్లో గర్వంగా ఉన్నా, మేము చదువుకున్నది తెలుగుమీడియం కాబట్టి, ఇంగ్లీషు క్లాసులో మాత్రం సిగ్గుగా, బెరుగ్గా ఉండేది. వేణు హైదరాబాదులో లిటిల్ ఫ్లవర్ లో చదువుకుని వచ్చినవాడు. అద్భుతంగానూ, ధారాళంగానూ ఇంగ్లీషు మాట్లాడేవాడు. పట్నంలో చదువుకుని వచ్చాడు కాబట్టి కలివిడిగా, ధైర్యంగా, చురుగ్గా మాట్లాడేసేవాడు. కాబట్టి సహజంగానే మా ఇంగ్లీషు లెక్చెరర్ అభిమానాన్ని కొల్లగొట్టేసుకున్నాడు. ఇంగ్లీషుక్లాసులో నేను ఎంత ముందుకు చొచ్చుకుపోవాలని చూసినా, వేణుకన్నా ఒక అడుగు వెనకనే ఉండేవాణ్ణి. అది నాలో గొప్ప నిస్పృహ రేకెత్తించేది, ఆ వెనకనే గొప్ప స్పర్థ కూడా. నేనెప్పటికన్నా వేణులాగా ఇంగ్లీషు చదవగలనా? మాటాడగలనా? ఆ ఆలోచనలమధ్యనే, 1980 లో, మేమా కాలేజీ వదిలిపెట్టేసాక ఎవరి దారుల్లో వాళ్ళం ముందుకు పోయాం.

వేణు ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేసాడు. మొదట్లో ఏదో ప్రైవేటు కంపెనీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసాడు. అప్పుడు సి.సి.ఎం.బిలో ఉద్యోగమొచ్చింది. ప్రభుత్వోద్యోగం. గెజెటెడ్ ఆఫీసరు స్థాయి ఉద్యోగం. కాని అతడిలో ఒక సాహసనావికుడున్నాడు. ఆ సాహసికుడు, లంచ్ బాక్సు కట్టుకుని ఆఫీసుకి పోయి కూచోడానికి పుట్టినవాడు కాడు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, మధ్యాసియాలో ఒక షిప్పింగ్ కంపెనీలో చేరాడు. ఒక బ్రిటిష్ బాస్ దగ్గర. ఆ బాస్ కి ఇంగ్లీషు రాదనేది వేణు బాధ. ఒకరోజు నలుగురిలో ఆ బాస్ తన ఇంగ్లీషుని ఎత్తి చూపిస్తే, మనవాడు ఆగలేకపోయాడు. అక్కడే ఉన్న డిక్షనరీ తీసి అందరి ఎదురుగుండా ఆ బాస్ నే సరిదిద్దాడు. ఒక బ్రిటిషర్ కి ఇంగ్లీషు రాదని నలుగురిముందూ నిరూపించడమా? ఆ బాస్ అతణ్ణి బైటకి గెంటేస్తాడని మీరీ పాటికి ఊహించే ఉంటారు.

కట్ చేస్తే-

కరీబియన్ దీవులు. మూడునాలుగేళ్ళు జమైకాలో పనిచేసాడు. ఈసారి తాను నేర్చుకున్న కంప్యూటర్ భాషల్లో తన ప్రావీణ్యాన్ని చూపించడం మొదలుపెట్టాడు. తాను పనిచేస్తున్న కంపెనీ కోసం అమెరికాలో ఒక శాఖ తెరిచాడు. రిటైల్, ఇన్సురెన్స్, ఇంటర్నేషనల్ షిప్పింగ్ లలో ఇరవయ్యేళ్ళకు పైగా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు ఆ సంస్థకి co-founder గా కూడా కొనసాగుతున్నాడు.

కాని, కంప్యూటర్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించినవాళ్ళూ, కోట్లకు పడగలెత్తినవాళ్ళూ ఎందరు లేరు? ఆ విషయం గురించయితే వేణు గురించి నాకేమీ ఆసక్తి లేదు. అతడి ఇంగ్లీషు చూసి అసూయ పడ్డానుగాని, అతడి సాఫ్ట్ వేర్ భాషల పట్ల నాకెట్లాంటి రోమాంచమూ లేదు.

కాని, ఈ భాషా కోవిదుడి కథ ఇక్కడితో ఆగిపోతే అతడు వేణు ఎట్లా అవుతాడు? 2013 నుంచనుకుంటాను, ఇప్పుడతడు పక్షి భాషలు నేర్చుకోడం మొదలుపెట్టాడు. ఈ నాలుగేళ్ళల్లోనూ వాటితో నిశ్శబ్దంగా సంభాషించే స్థాయికి చేరుకున్నాడు. వాటికీ తనకీ మధ్య జరిగే ఆ సంభాషణల్ని మనకి అందిస్తున్నాడు. అవి గొప్ప చిత్రలేఖనాలు, బషొ, ఎమిలి డికిన్ సన్, బ్లేక్, హేరీ మార్టిన్ సన్, ఇస్మాయిల్ కవితల్లాగా అవి గొప్ప మెడిటేషన్స్. వాటిని చూడాలనుకున్నవాళ్ళు ఇక్కడ చూడొచ్చు.

https://www.flickr.com/photos/34288079@N08/albums

ఇదిగో, ఈ వేణు మళ్ళా నాకు అసూయ కలిగిస్తున్నాడు. చిన్నప్పుడు అతడి ఇంగ్లీషు నాలో ఎంత స్పర్థ రేకెత్తించిందో, ఇప్పుడు ఈ ఛాయాచిత్రలేఖనాలు మళ్ళా నన్నంతగా కవ్విస్తున్నాయి. అన్నీ వదిలేసి అతడిలాగా ఒక కెమేరా పట్టుకుని చెరువులంటా, దొరువులంటా పడిపోవాలని ఉంది.

కబీరు కవిత్వాన్ని పుస్తకంగా తెస్తున్నప్పుడు దానికి ముఖచిత్రంగా ఏది చిత్రించాలని చాలా చాలా ఆలోచించాను. అప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడో వేణు తీసిన ఒక ఫొటో. అమెరికాలో ఒక సుప్రభాతవేళ ఒక సరసులో ధ్యానమగ్నంగా ఉన్న హంసల ఫొటో. దాన్ని నీటిరంగుల్లో చిత్రించి నా పుస్తకానికి ముఖచిత్రంగా పెట్టుకోడానికి వేణు అనుమతించాడు.

వేణూ, నువ్వా విషయాన్ని ఎంత గర్వంగా నలుగురికీ చెప్పుకున్నావు.

https://www.facebook.com/venu.challa.54/posts/10156004526095126

అది చదివి నాకు చాలా సంతోషమనిపించింది. యోగులు భగవంతుడిలో ఐక్యమయినట్టు, మనం కళాకారులం కళలో ఏకమవుతాం అని ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత ఫ్లాబే అన్నాడు. కళ పట్ల, రంగుల పట్ల, నిశ్శబ్దం పట్ల మనిద్దరి ప్రేమా ఒక్కలాంటిదే, అందుకనే, ఇదుగో, ఈ పూర్తిచిత్రాన్ని నీకు కానుక చేస్తున్నాను.

30-12-2017

 

Leave a Reply

%d bloggers like this: