నీలకురింజి

379

పన్నెండేళ్ళకొకసారి మాత్రమే పూసే నీలకురింజి ఈ ఏడాది వికసించబోతోంది. నీలగిరులన్నీ నీలిసముద్రాలుగా మారిపోనున్నాయనీ, ఈ ఆగస్టుకి ఈ పూలని చూడటానికి ఎనిమిదిలక్షలమంది మున్నారు రానున్నారనీ కేరళ టూరిజం శాఖ అంచనావేస్తోంది.

ఆకాశం కొండలమీద కురిసినట్టు దక్షిణదేశాన్ని ముంచెత్తబోయే ఈ గడ్డిపూలు, ఈ కొండపూల తేనెలోంచే ప్రాచీన తమిళ కవిత్వం ఊరిందని చెప్పడం అతిశయోక్తి కాదు.

చెర్రీపూల చుట్టూ జపాన్ కవులు తుమ్మెదల్లాగా పరిభ్రమించారని మనకు తెలుసు. కాని, జపాన్లో కవిత మొగ్గ తొడగడానికి వెయ్యేళ్ళముందే ప్రాచీన తమిళదేశంలో కురింజి, ముల్లై, పాలై, మరుదం, నెయిదల్ అనే అయిదు పూల చుట్టూ అపూర్వమైన, అత్యున్నతమైన, అత్యంత ప్రగాఢమూ, ప్రభావశీలమైన కవిత్వం వికసించిందని ఎందరికి తెలుసు?

ప్రాచీన తమిళదేశంలో క్రీస్తుపూర్వం 3-2 శతాబ్దాల కాలం నుండీ, క్రీస్తు తర్వాత 2-3 శతాబ్దాల కాలం దాకా మధురై కేంద్రంగా ఒక సాహిత్య సంగముండేది. బౌద్ధ, జైన సాహిత్యవేత్తల ప్రభావంతో ఏర్పడ్డ ఆ సాహిత్యసంగం, తమిళదేశంలో పొలాల్లో, పల్లెల్లో, వీథుల్లో, అడవుల్లో పాటలు పాడుకుంటూ సంచరించే గాయకుల నుంచి కవిత్వం సేకరించి సంకలనాలుగా వెలువరించింది. అట్లా ఒకటి, రెండు కాదు, పద్ధెనిమిది సంకలనాలను వెలువరించింది.

కాలం గడిచినకొద్దీ, తాళపత్రాల్లో మరుగునపడిపోయిన ఆ మహోన్నత కవిత్వాన్ని ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో ప్రసిద్ధ తమిళపండితుడు, తమిళపితామహుడు యు.వి.స్వామినాథ అయ్యర్ ( 1855-1942 ) వెలుగులోకి తెచ్చాడు. అదంతా ఒళ్ళు పులకింపచేసే కథ. సాహిత్య అకాడెమీ అనువదించి ప్రచురించిన ‘నా చరిత్ర’ (1965) నా ఆరాధ్యగ్రంథాల్లో ఒకటి.

ఆ తర్వాత రోజుల్లో ఎ.కె.రామానుజన్ ఆ కవిత్వాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయగానే, ప్రపంచం నలుమూలలనుంచీ రసజ్ఞులూ, పరిశోధకులూ, చరిత్రకారులూ, విమర్శకులూ తుమ్మెదల గుంపులాగా ఆ కవిత్వాన్ని చుట్టుముట్టేసారు. రామానుజన్ సంగం కవిత్వాన్ని అనువదించి పరిచయం చేసిన రెండు పుస్తకాలూ The Interior Landscape: Love Poems from a Classical Tamil Anthology(1967), Poems of Love and War: From the Eight Anthologies and the Ten Long Poems of Classical Tamil(1985) తమిళాన్ని ఒక ప్రపంచభాషగా మార్చేసాయి. గత అయిదారు దశాబ్దాలుగా, సంగం కవిత్వం, ఒక పరిశ్రమ. ప్రతి ఏడాదీ కనీసం ఒకటేనా కొత్త అనువాదం, కొత్త పరిశోధన ఆ కవిత్వం మీద వెలువడుతూనే ఉంది.

సంగం కవిత్వంలో రెండు సంప్రదాయాలున్నాయి. ఒకటి అకం, రెండోది పురం. అకం ప్రణయ కవిత్వం. ఆ ప్రణయాన్ని వర్ణించడానికి ఆ కవులు ఏడు రకాల అవస్థల్ని ఊహించారు. ఆ అవస్థల్ని ]తిణై’ అన్నారు. అందులో మొదటి, చివరి అవస్థలు కావ్యవస్తువులు కావని పక్కన పెట్టేసారు. ఇక మిగిలిన అయిదు అవస్థలూ, ప్రణయారంభం, ఎదురుచూపు, సమాగమం, అలక, ఎడబాటు. వాటిలో ప్రతి ఒక్కదానికీ, ఒక వేళ, ఒక ఋతువు, ఒక ప్రాంతం, ఒక పువ్వు, ఒక పక్షి సంకేతాలుగా ఉన్నాయి. తర్వాత కాలంలో తమిళదేశాన్నీ, తద్వారా యావద్భారతదేశాన్నీ ప్రభావితం చేసిన నాయన్మార్ల, ఆళ్వార్ల భక్తి కవిత్వం ప్రజాహృదయాల్ని కైవసం చేసుకోవడానికి అవి సంగం కావ్యసంప్రదాయాలను కొల్లగొట్టుకోవడం కూడా ఒక కారణమని ఇప్పుడు మనకి అర్థమవుతోంది.

ఆ తిణైల్లో కురింజి ఒక అవస్థ. పన్నెండేళ్ళకొకసారి పూసే నీలకురింజి పేరుమీద ఆ అవస్థకి ఆ పేరు పెట్టారు. అది పర్వతప్రాంతాల్లో ప్రణయచిత్రణ. కురింజి ఋతుపవనకాలంలో పూసే పువ్వయినప్పటికీ, కవిత్వంలో మాత్రం, అది శారద, హేమంతాల ఋతురాగం. ప్రణయసమాగం కావ్యవస్తువు. చలికాలపు రాత్రులు, ఇంకా తగ్గని వానలు, కంకుల్లో పాలు పోసుకునే జొన్నచేలు, నెమళ్ళ క్రేంకారాలు, కొండల్లో మధువులూరే తేనెపట్టులు, అర్థరాత్రివేళల్లో పొలాల్లో మంచెమీద కలుసుకోడం కోసం రోజంతా ఎదురుచూసే ప్రేయసీప్రేమికులు ‘కురింజి’ ప్రణయావస్థకి కావ్యవస్తువులు.

ఇప్పుడు నీలగిరులనుంచి దక్షిణతమిళదేశం పొడుగునా కొండచరియలమీద భూమితలుపులు తెరుచుకుని బయటికి తొంగిచూస్తున్న కురింజిమొగ్గల్ని తలుచుకుంటూ, మరొకసారి ఆ మహాకవిత్వం తిరగేసాను.

ఇటీవలే పరమపదించిన, తమిళ పండితుడు ఎం.ఎల్. తంగప్ప చేసిన అనువాదం Love Stands Alone: Selections from Tamil Sangam Poetry(2010)నుంచి రెండు కవితలు మీకోసం.

 

అవ్వయ్యార్

నీకు జాలీ దయాంతఃకరణా లేవా?

గాలివానలతో ముంచెత్తుతున్న
ఋతుపవనాలు.
ఉరుముల్తో, పిడుగుల్తో
ధారపాతంగా వర్షం.
కొండల్లో మహాసర్పాల్నే
మట్టుపెట్టేంత వాన.
నీకు జాలీ, దయాంతఃకరణా లేవా?
హిమలయాల్నే పిండిచెయ్యగలవాడివి
ఈ దిక్కులేని స్త్రీలనెందుకిట్లా
హింసపెడుతున్నావు?
( తన ప్రియుడి చెవిలో పడేట్టు ఆమె తన చెలికత్తెతో ఋతుపవనం గురించి చెప్పినమాటలు)
(కురుంతొగై: 158)

సెంపులపెయనీరార్

ఎర్రమట్టినీళ్ళు

మీ అమ్మా, మా అమ్మా
ఒకరికొకరు తెలీదు.
మీనాన్నా, మా నాన్నా
చుట్టాలేమీ కాదు.
మరి నువ్వూ, నేనూ
మనం మాత్రం ఒకరికొకరం
ఏం తెలుసని?
కాని, చూడు,
ఎర్రమట్టిలో కలిసిపోయిన
వాననీటిలాగా
మన హృదయాలెట్లా కలిసిపోయాయో.
(మొదటిసారి కలుసుకోగానే ఆమె అతడితో చెప్పినమాటలు)
(కురుంతొగై: 40)

కపిలార్

ఆ కొంగ ఒక్కటే సాక్ష్యం

వాడు నన్ను
రహస్యంగా పెళ్ళాడినప్పుడు
మరో సాక్షి లేడు.
ఇప్పుడు వాడు మాటతప్పితే
నేనేం చెయ్యగలను?
కాని, అక్కడ
ఆ పల్చటి ఏటినీటిలో
జొన్నకంకిలాంటి
సన్నటి కాళ్ళమీద నిలబడి
ముక్కుతో చేపలు వెతుక్కుంటున్న
ఆ కొంగ ఒకటి అక్కడున్నట్టు గుర్తు.
(తనప్రియుడు ముఖం చాటేసినప్పుడు ఆమె తన చెలికత్తెతో చెప్పినమాటలు)
(కురుంతొగై: 25)
24-7-2018

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s