నిజమైన కబీరు పంథీ

Reading Time: 4 minutes

338

తెల్లవారు జాము మూడున్నర. కృష్ణపక్షపు చివరిరాత్రులు. షిరిడీ క్షేత్రంలో ప్రాతకాల సంరంభం మొదలయ్యింది. ఎన్నో ఏళ్ళ తరువాత సూర్యోదయ పూర్వ హారతి చూడటం కోసం సమాధి మందిర ప్రాంగణంలో అడుగుపెట్టాను.

మరొక రెండురోజుల్లో ముగిసిపోతున్న మాఘమాసం. ప్రాంగణంలో అడుగుపెడుతూనే నా చిన్నప్పటి గ్రామాల నిర్మలత్వాన్ని తలపిస్తూ వేపపూల తీపిగాలి. ఫాల్గుణమాసం రాబోతున్న సూచనగా విద్యుద్దీపాల వెలుతుర్లో మిలమిల్లాడుతున్న కొత్త చిగుర్లు. సమాధిమందిరం పక్కనే ఉండే గురుస్థానం దగ్గరికి చేరుకునేటప్పటికి తొలివేపపూల పరిమళం నన్ను తడిపేసింది.

అప్పటికే అక్కడ కొందరు భక్తులు చేరుకున్నారు. వాళ్ళంతా ఆన్ లైన్లో ముందే హారతి దర్శనం కోసం టికెట్లు తీసుకున్నవాళ్ళు. నేను మొదటిసారి 1993 లో షిరిడి దర్శించినప్పుడు, ఇంత రద్దీ లేదు. నేరుగానే సూర్యోదయహారతి దర్శనానికి పోగలిగాం.

నాలుగు కాగానే దేవస్థాన పౌరసంబంధాధికారి అక్కడకొచ్చి రిజిస్టరు తెరిచి ఒక్కొక్కరినీ పేరుపేరునా పిలవడం మొదలుపెట్టాడు. మా వంతు రాగానే మేం కూడా నెమ్మదిగా లోపలకి అడుగుపెట్టాం.

సమాధిమందిరంలో మేం అడుగుపెట్టేటప్పటికే అక్కడ చాలామంది ముకుళిత హస్తాలతో బాబా ను చూస్తూ నిలబడి ఉన్నారు. ఆయనమీద ప్రకాశవంతమైన లేతనీలం రంగు వస్త్రం. సమాధిపైన కూడా అదే రంగు చద్దరు పరిచిఉన్నారు. గంగ ఒడ్డున సన్న్యాసులు సూర్యోదయం కోసం నిశ్శబ్దంగా వేచి ఉన్నట్టు అక్కడంతా ఒక పవిత్రప్రతీక్ష.

అప్పుడు గులాబితోటలోంచి కమ్మ తెమ్మెర వీచినట్టు భూపాల రాగంలో ఒక కీర్తన మొదలయ్యింది.

ఉఠా ఉఠా సకల జన..

నాలో ఏదో ప్రకంపన. ఏ పురాతన స్మృతిలోంచో, ఏ అడవుల్లోంచో, సాగరతీర సైకత భూమి మీంచో ఎవరో పిలుస్తున్నారు. నాది కాని ఏ దేశంలోనో, ఏ గ్రామసీమల్లోంచో నేను పోతున్నప్పుడు ఏ అపరిచిత గృహంలోంచో ఎవరో ఒక తల్లి, అక్క, చెల్లి, ‘నాన్నా’, ‘అన్నయ్యా’ అంటూ పిలుస్తున్నట్టు. మా ఊళ్ళో రామకోవెల దగ్గర రాత్రి దీపం పట్టుకుని నిలుచుని మా అమ్మ ‘నాగమ్మా’ అని పిలుస్తున్నట్టు.

ఉఠా ఉఠా సకల జన
వాచే స్మరావా గజానన
గౌరీహరాచా నందన
గజవదన గణపతి..

ఎవరు రాసారో తెలియని ఈ పారంపరిక గణేశ స్తుతి నన్నెందుకు ఇంతలా చలింపచేస్తోంది.

ఆ కీర్తన ఎప్పుడు ముగిసిందో తెలియలేదు.అప్పుడు మరొక కీర్తన-

ఘనశ్యామ సుందరా శ్రీధరా అరుణోదయ ఝాలా
ఉఠిలవకారీ వనమాలీ ఉదయాచళీ మిత్ర ఆలా..

ఆ స్వరం, ఎవరో మరాఠీ భావుకుడు దేశ్ రాగంలో ఆలపించిన ఆ ప్రభాత వందనం నా సమస్త అసిత్వాన్నీ చూర్ణం చెయ్యడం మొదలుపెట్టింది.

ఇది భక్తికాదు, ప్రార్థనకాదు, జీవిత స్ఫురణ. పొద్దున్నే కొలనులో ఎర్ర తామర రేకులు విచ్చుకున్నంత మృదువుగా మనిషిలో ఆత్మ విప్పారడం. వేపచెట్టు లోపల్నుంచీ విరిగి పైకి తీపిగా పొంగి పూలుగా విచ్చుకోవడం.

నాలో కూడా ఏదో జరుగుతోందని తెలుస్తోంది. నా చేదు విరిగిపోవడం మొదలయ్యింది.

కాలం మలుపు తిరిగేవేళల్లో నేను పోగొట్టుకున్న ప్రేమల ఏ విహ్వల స్ఫురణని ఈ తొలిజాము నాలో నిద్రలేపుతోంది? ఒక రోజు మేలుకోవాలని కోరుకునే ఈ కోరిక నా హృదయాన్ని, ఒక పిల్లగాలికి కూడా కుండపోతగా వర్షించే కారుమబ్బులాగా, ఎందుకు మార్చేస్తోంది?

ఆనందకందా ప్రభాత ఝాలీ ఉఠీ సరలీ రాతీ
కాఢీ ధార్ క్షీరపాత్ర ఘేవుని ధేను హంబరతి
లక్షితాతీ వాసురే హరీ ధేను స్తనపానాలా..

నా చిన్నప్పుడు సెలవులయిపోయాక మా ఇంటినుంచి బయట అడుగుపెడుతున్నప్పుడు మా అమ్మ ఆ ఇంటిముంగట నిల్చున్నప్పుడు, లోపలనుంచీ పొరలివచ్చే బెంగలాగా, ఒక ఉత్తాపతరంగం నాలోపల్నుంచి కట్టలు తెంచుకోవడం మొదలయ్యింది.

ఉండబట్టలేకపోయాను, ఏడ్చేసాను.

అక్కడందరి దృష్టీ బాబా మంగళమూర్తిపైనే ఉంది. అసలక్కడ ఎవ్వరికీ మరొకరి ధ్యాస లేదు.

ఆ కీర్తన ముగుస్తూనే సుప్రసిద్ధ మంగళగీతం ‘జయజగదీశ హరే’ మొదలయి, పూర్తయిపోయింది కూడా.

నా కళ్ళట్లా వర్షిస్తూనే ఉన్నాయి. ఎవరో నా హృదయంలో చెయ్యిపెట్టి గుండెకి అడ్డుపడ్డ ఏ క్లేశాన్నో ఊడబెరికేసారు. ఎంత దయామయ చర్య!

అప్పుడు నేను ఆ ప్రభాతహారతి గీతాలు వినడానికి పూర్తిగా అర్హుణ్ణైనానిపించింది.

ఒక క్షణం నిశ్శబ్దం.

4.30.

కాకాడ హారతి గీతాలాపన మొదలయ్యింది.

‘జోడునియా కర చరణి-ఠేవిలా మాథా
పరిసావీ వినంతీ మాఝీ-పండరీనాథా’

తుకారాములు పాండురంగని ముందు పాడిన పాట.

పదం ముగిస్తూ తుకా ఇలా అంటున్నాడు:

‘నేను ఎక్కణ్ణుంచి ఎంత విలువలేని మాటల్తో నిన్ను వేడుకున్నా కూడా ఒక్క సారి నిన్ను పేరుపెట్టి పిలవగానే నా బంధాల్ని నీ స్వహస్తాలో తుంచెయ్యి ప్రభూ ‘

ఎక్కడి పండరిపురం, ఎక్కడి షిరిడి బీద మరాట్వాడా ప్రాంతానికి షిరిడినే పండరిపురం చేసాడు సాయినాథుడు. ప్రతిరోజూ ఈ తుకారాం కీర్తనతో తన గ్రామాన్నీ, తనని నమ్ముకున్న బృందాన్నీ మేల్కొల్పడం ఎంత అద్భుతం!

ఆ కీర్తన ముగుస్తూనే జనాబాయి గీతం.

‘ఉఠా పాండురంగా ప్రభాత సమయో పాతలా
వైష్ణవ్యాంచా మేలా గరుడ పారీదాటలా’

దేవుణ్ణి మేల్కొల్పడం ఎంత గొప్ప చారుచర్య! ఎవరు ఎవరిని మేల్కొల్పుతున్నారు? ఆండాళ్ నుంచి జనాబాయి దాకా ప్రభాత వేళ భగవంతుణ్ణి నిద్రలేపడంలో అనుభవించిన స్ఫూర్తి ఎట్లాంటిదో కదా! ప్రజల్ని మేల్కొల్పిన వైతాళికులు, ఒక బంకిం, ఒక గురజాడ, ఒక భారతి, ఒక నజ్రుల్ ఇస్లాం , ఒక ఫైజ్, ఒక హిక్మత్, ఒక నెరుదా లు అనుభవించిన జీవితసాఫల్య స్ఫూర్తికీ, ఈ ప్రభాతకీర్తనలకీ ప్రాయికంగా తేడా ఏముంది?

షిరిడిలో వందేళ్ళ ముందు ఇంకా తెల్లవారకుండానే వెలిగించిన కాగడాతో సాయిబాబాకి హారతి ఇస్తూంటే పండితులు, పామరులు, నిరక్షరాస్యులైన గృహిణులు అంతా తన్మయులై ఆయన్నే చూస్తూ పరవశించిన దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాను.

షిరిడిలో ఈ హారతి సంప్రదాయం ఎప్పుడు మొదలయ్యిందో ఇతమిత్థంగా చెప్పలేకపోయినా, ఒక అంచనా ప్రకారం ఇది 1910 తర్వాత మొదలై, బాబా మహాసమాధి చెందేటంతదాకా, అంటే, 1918 దాకా ఎనిమిదేళ్ళపాటు నిరాఘాటంగా కొనసాగింది.

కాని కాకడ హారతి, రాత్రి పడుకునే ముందే ఇచ్చే సేజ్ ఆరతిని ఆయన మసీదులో పడుకునే రోజు కాక, రోజు విడిచి రోజు చావడిలో పడుకునేటప్పుడు మాత్రమే అనుమతించేవారట. ఎందుకని? మేలుకొలుపు, పవళింపు హారతులు సేవలు కాబట్టి, అవి హిందూ సంప్రదాయాలు కాబట్టి, ఆయన వాటిని మసీదులో అనుమతించలేదు.చావడిలో మాత్రమే అనుమతించారు.

అద్భుతమైన ఈ స్పష్టతని సాయిబాబా తన జీవితమంతా చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా ప్రతి ఒక్క అంశంలోనూ చూపిస్తూ వచ్చారు, జాగ్రత్త పడుతూ వచ్చారు.

సాయిబాబా హిందువా? ముస్లిమా? ఇందులో నిజమేదో తెలుసుకోవాలన్న్న తన సమకాలిక ప్రజల కుతూహలాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఎంతో దయార్ద్రహృదయంతో ధ్వంసం చేస్తూనే వచ్చారు.

హిందూ-మహ్మదీయ మైత్రికోసమూ, వాళ్ళని కలిపి ఒక కుటుంబంగా నిలపడంకోసమూ సాయిబాబా జీవించారని చెప్పడం ఆయన్ని అర్థం చేసుకోవడంలో ఒక పద్ధతి. ఆయన హిందువులకు హిందువు, మహ్మదీయులకు ముస్లిం అని చెప్పుకోవడంలో ఒక ఊరట ఉంది. కాని సాయిబాబా తనను హిందువుగా భావించేవాళ్ళకు ముస్లింగానూ, ముస్లింగా భావించేవాళ్ళకు హిందువుగానూ కనిపిస్తూ, వినిపిస్తూ, వివరిస్తూ వచ్చారు.

మీ గురువెవరని ముస్లిములు అడిగినప్పుడు వెంకూసా అని, హిందువులు అడిగినప్పుడు రోషన్ షా అని జవాబిచ్చారాయన.

ఒకరోజు మసీదులో, ఒక రోజు చావడిలో. ఒకవైపు నైష్టిక శ్రోత్రియుడిలాగా మసీదులో నిత్యాగ్నిహోత్రం, మరొకవైపు ముస్లిం ఫకీర్ లాగా చావడిలో చిలిం వెలిగిస్తూ వచ్చారు. చివరికి,తాను ప్రతిపాదించిన రెండు మాటలు-‘శ్రద్ధ’, ‘సబూరీ’ లే చూడండి. ‘శ్రద్ధ’ సంస్కృత పదం, ఉపనిషత్తుల పదం. ‘సబూరీ’ ఆరబిక్ పదం. అది సబర్ అనే ధాతువునుంచి ఉత్పన్నమైంది. ఓపిక, నిగ్రహం, కట్టుబడి ఉండటం అని దానికి అర్థాలు.

నా ఇంటికి తూర్పు ఒక వాకిలి, పడమట మరొక వాకిలి అని కబీర్ అన్నమాటలకి నిలువెత్తు ఉదాహరణ సాయిబాబా. అందుకనే, ఒక న్యాయవిచారణలో భాగంగా కోర్టు ప్రతినిధి ఆయన్ను మీ మతమేమిటి అని అడిగినప్పుడు తనది కబీర్ మతం అని చెప్పాడాయన.

నా ఆలోచనల్లో నేనుండగానే ప్రభాతకీర్తనలు ఒకదానివెనక ఒకటి సాగిపోతున్నాయి. కృష్ణ జోగేశ్వర్ భీష్మ, నామదేవులు,తుకారామ మహరాజు, దాసగణు మొదలైన వారందరి ప్రేమతో, ఆర్తితో, హృదయాన్ని చీల్చుకుని వచ్చిన గీతాలతో ఆ మందిరమంతా మోగిపోతూ ఉంది. సంగీతవాద్యాల సుస్వరాలు ఉత్సవవాతావరణాన్ని సృష్టించాయి. ఆ వెలుతురులో ఒకటి రెండు సార్లు కన్నార్పకుండా బాబా మనోహరమూర్తిని చూసాను.

లోకమాన్య బాలగంగాధర తిలక్ మిత్రుడూ, సుప్రసిద్ధ న్యాయవాది అయిన జి.ఎస్,కపర్డే ఒకచోట రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి. ఒక ప్రభాతవేళ తాను కాకడహారతికి హాజరయినప్పుడు సాయిబాబా ఎంతో ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారనీ, అట్లాంటి చిరునవ్వును ఒక్కసారి చూడటానికేనా ఏళ్ళ తరబడి అక్కడ ఉండిపోవచ్చునని రాసుకున్నాడాయన (షిరిడీ డైరీ,7.1.1912).

ఆ చిరునవ్వు ఒక మనిషిది. హిందువు, ముస్లిమూ కాని మనిషిది. దేశమిప్పుడు హిందూసమాజంగానూ,ముస్లిం శిబిరంగానూ చీలిపోతున్న కాలంలో ఏడీ అట్లాంటి మనిషి? ఎక్కడ అట్లాంటి చిరునవ్వు?

12-3-2016

Leave a Reply

%d bloggers like this: