నా చరిత్ర

381

మహామహోపాధ్యాయ యు.వి.స్వామినాథ అయ్యరు ఆత్మకథ ‘నా చరిత్ర ‘ నా ఆరాధ్య గ్రంథం అని రాసానే గాని, ఆ పుస్తకం నేనింతకుముందు చదివింది రెండుసార్లే. మొదటిసారి ఎప్పుడో రాజమండ్రి రోజుల్లో చదివాను. పన్నెండేళ్ళ కిందట మరోసారి. సంగం కవిత్వం మీద ఒక వ్యాసం రాస్తున్నప్పుడు, ఆ పుస్తకం కోసం గాలిస్తుంటే, మా అన్నయ్య ఎవరిదగ్గరో తీసుకుని పంపించాడు. నా వ్యాసం పూర్తవగానే మళ్ళా వెనక్కి ఇచ్చేసే షరతు మీద. ఇన్నాళ్ళకు మరొకసారి ఆ పుస్తకం చదివే అవకాశం లభించింది. మూడు దినాల కిందట సంగం కవిత్వం గురించి రాస్తూ ఆ పుస్తకాన్ని తలుచుకోగానే ఏకంగా ఆ పుస్తకం సాఫ్ట్ కాపీనే నా చేతుల్లోకి వచ్చి వాలింది.

ఈ రెండు మూడు రోజులుగానూ ఆ పుస్తకంలోనే జీవిస్తున్నాను. మొదట అక్కడక్కడ కొన్ని పేరాలో, పేజీలో చదవాలనుకున్నవాణ్ణి కాస్తా, వెనకనుంచి ముందుకీ, ముందు నించి మధ్యలోకీ, మధ్యనుంచి ముందుకీ మొత్తం పుస్తకం చదివేసాను, ఉబికివచ్చే కన్నీళ్ళమధ్య, పూడుకుపోతున్న గొంతుతో.

ఇంతకీ అందులో విషాదమయమైన విషయమేదీ లేదు. అది ఒళ్ళుపులకింపచేసే ఒక సారస్వత ప్రయాణం, ఒక వాజ్మయ యాత్ర. ఒక జాతి తన పూర్వ ఔన్నత్యాన్ని కనుగొన్న సాహసోజ్జ్వల చరిత్ర. కానీ, మరి నాకు కన్నీళ్ళెందుకు పొంగుకొచ్చాయంటారా?

అవును. ఎందుకు? ఎందుకు నా గుండె గళస్థమైపోయింది?

ఎందుకో తెలియాలంటే మీరీ పుస్తకం చదవాలి.

భాష కొంత గ్రాంథికమే. కాని, మొదటి పదిపేజీలు పూర్తిచేసేదాకానే మీకు ఇబ్బంది. ఆ తర్వాత మీరు పందొమ్మిదో శతాబ్ది తమిళదేశంలో ప్రయాణించడం మొదలుపెడతారు. ప్రాచీన చోళ, పాండ్యదేశాల్లో, కావేరినుంచి వైగై దాకా ఒక మహామానవుడి అడుగుజాడల్లో నడవడం మొదలుపెడతారు. పుస్తకం పూర్తి చేసేటప్పటికి, ఎక్కడో గొప్ప సాన్నిధ్యంలో అప్పటిదాకా గడిపారని మీకు బోధపడుతుంది. మీ జీవితం మీకు చాలా అమూల్యమైనదనే స్ఫురణ కలుగుతుంది. మీ రోజువారీ జీవితంలోనే మీదైన ఒక మహిమాన్విత ప్రయోజనమేదో వెతుక్కుని దానికోసమే బతకాలనే తపన మొదలవుతుంది.

ఇందులో ఇతివృత్తం చాలా సరళమైంది. ఉత్తమాదానాపురం వెంకటసుబ్బయ్య స్వామినాథ అయ్యర్ (1855-1942) అనే ఒక తమిళ విద్వాంసుడి జీవితకథ ఇది. ఆయన కుంభకోణందగ్గర ఉన్న సూర్యమూల అనే గ్రామంలో జన్మించాడు. ఆయనకి చిన్నప్పణ్ణుంచీ తమిళం మీద మక్కువ. ఊళ్ళో ఉన్న పెద్దలు ఇంగ్లీషు చదువుకొమ్మని చెప్పారు. కాని అతడి హృదయం తమిళంకోసం కొట్టుకుపోతూ ఉంది. అప్పుడందరూ అతడు మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద చదువుకోవలసిందే అని చెప్తూ వచ్చారు. ఆ రోజుల్లో సాంప్రదాయిక విద్య గురుకులపద్ధతిలో నడిచేది. మహావిద్వాంసుడు మీనాక్షి సుందరం పిళ్ళై గారి దగ్గర కూడా అటువంటి గురుకులం నడిచేది. అప్పట్లో కొన్ని వీరశైవమఠాలు తమిళదేశంలో ఉండేవి. వాటిని ఆధీనాలు అంటారు. ఆ మఠాధిపతిని దేశిగర్ అని అంటారు. ఇప్పటి నాగపట్నం జిల్లాలో ఉన్న తిరువాడుదురై ఆధీనానికి చెందిన సుబ్రహ్మణ్యదేశికులు అనే మఠాధిపతి మీనాక్షి సుందరం పిళ్ళైగారినీ, వారి గురుకులాన్నీ ఆదరించేవారు. అటువంటి గురుకులంలో అయ్యరు కూడా చేరి చదువుమొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు పిళ్ళైగారు శిష్యులతో కూడా సుబ్రహ్మణ్యదేశికుల సన్నిధికే తరలిపోయారు. అక్కడ అయ్యరు పిళ్ళైగారివద్దా, దేశికుల వద్దా కూడా విద్యాభ్యాసం కొనసాగించారు. 1871 నుంచి 1876 వరకు ఆయన మీనాక్షి సుందరం పిళ్ళైదగ్గర ఒక గురుకులవాసిగా, పూర్తికాలపు విద్యార్థిగా జీవితం గడిపారు. 1876లో పిళ్ళైగారు పరమపదించిన తరువాత సుబ్రహ్మణ్యదేశికులు ఆయన స్థానంలో మఠంలో విద్యాబోధన చెయ్యవలసిందిగా అయ్యరును ఆదేశించి అందుకు ఏర్పాట్లన్నీ చేసిపెట్టారు. అట్లా ఒక నాలుగేళ్ళు గడిచిన తర్వాత, 1880లో కుంభకోణంలో కళాశాలలో తమిళపండితుడిగా పనిచేస్తున్న త్యాగరాజ చెట్టియార్ అనే ఆయన పదవీవిరమణ చేస్తూ తన స్థానంలో స్వామినాథ అయ్యర్ ను నియమించేందుకు ఏర్పాట్లు చేసాడు. స్వామినాథ అయ్యరు 1880 నుంచి 1903 దాకా కుంభకోణంలోనూ, 1903 నుంచి 1919 దాకా చెన్నైలోనూ పనిచేసారు.

కాని, ఆయన తన ముప్పై అయిదవ ఏట, అంటే, 1890 లో, కుంభకోణంలో సేలం రామస్వామి మొదలియారు అనే ఒక జిల్లా మున్సిఫ్ ను కలుసుకోవడం ఆయన జీవితగతిని మార్చేసింది. అదంతా ఒక అద్భుతమైన ఘట్టం. కనీసం మీరు ఆ ఒక్క సన్నివేశం (పే.276-283) చదివినా చాలు, ఈ పుస్తకాన్ని జీవితంలో మరిచిపోలేరు. ఆయనద్వారా మొదటిసారి సంగం కాలం నాటి కావ్యమైన ‘జీవకచింతామణి’ గురించి వినడంతో, ఆ కావ్యాన్ని వెతికిపట్టుకుని పరిష్కరించి ప్రచురించడంతో ఆయన తమిళ వాజ్మయపరిశోధన మొదలయ్యింది.

ఆ రోజు మొదలైన ఆ యజ్ఞాన్ని ఆయన 1942 దాకా అవిశ్రాంతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తమిళగ్రామాలు, మఠాలు, గ్రంథాలయాలు, సత్రాలు, మూలమూలలా శోధించి దాదాపు మూడువేల తాళపత్రగ్రంథాలు సేకరించారు. 91 పుస్తకాలు ప్రచురించారు. జీవకచింతామణితో మొదలుపెట్టి ‘పత్తుప్పాట్టు’ (పది దీర్ఘకవితలు), ‘ఎట్టుత్తొగై’ (ఎనిమిది కవితాసంకలనాలు), ‘మణిమేఖలై’ -అప్పటిదాకా మంచులో కప్పడిపోయిన హిమాలయ శిఖరాలు సూర్యకాంతిలో ఒకటొకటే బయటపడ్డట్టుగా, ఒక్కొక్క ప్రాచీన కావ్యాన్నే ఆయన పరిష్కరించి, వెలువరిస్తూండగా, ఆధునిక తమిళదేశం, యావత్ప్రపంచం నివ్వెరపోయి చూస్తూండింది. ఆ ఒక్క మానవుడి కృషితో తమిళం సంస్కృతంతో సమానమైన ప్రాచీనభాషగా, కావ్యభాషగా, సర్వశ్రేష్ఠభాషల్లో ఒకటిగా మారిపోయింది. తమిళులు ఆయన్ని ‘తమిళ తాత’ (తమిళ పితామహుడు) అని ప్రేమగా, సగౌరవంగా, ఆరాధనాపూర్వకంగా పిలుచుకోవడం మొదలుపెట్టారు.

ఈ జీవితప్రస్థానంలోని మొదటి 44 ఏళ్ళ కథ ఈ ‘నా చరిత్ర ‘ (ఎన్ సరితిరమ్, 1940-42). ఈ చరిత్ర పందొమ్మిదో శతాబ్ది తమిళసమాజ చరిత్ర అనుకోవచ్చు. చాలామంది దృష్టిలో ఈ రచన ప్రాశస్త్యం అదే. ప్రాచీన గురుకుల వ్యవస్థ, మఠాల ఔదార్యం మీద నడిచిన విద్యాబోధన నుంచి కళాశాలలు, పాఠ్యపుస్తకాలు, ప్రింటింగ్ ప్రెస్సూ, పరీక్షలూ, పట్టాలతో కూడిన ఆధునిక వ్యవస్థకు సంభవించిన ఒక యుగపరివర్తన కూడా ఇక్కడ కనిపిస్తుండవచ్చు. ఒక వాజ్ఞ్మయపరిశోధకుడు తన జీవితాయుష్షు మొత్తం ధారపోసి తన భాషనెట్లా బతికించుకున్నాడో ఆ త్యాగమయగాథగా కూడా దీన్ని చదవవచ్చు.

కాని, ఈ రచన వాటన్నిటికన్నా మించిన మరోమహావిషయాన్ని నా కళ్ళముందు స్పష్టం చేస్తూవచ్చింది.

ఒక మనిషి రాసుకున్న ఆత్మకథగా, ఒక సామాజిక చరిత్రగా మాత్రమే దీన్ని భావించలేను. అన్నిటికన్నా మిన్నగా ఇదొక సంస్కృతి చరిత్ర. మనుషులు ప్రేమతో, పరస్పర గౌరవంతో, నమ్మకంతో, ఆర్తిత్తో, జిజ్ఞాసతో తమ దైనందిన జీవితంలోంచే ఒక జాతిసంస్కృతినెట్లా నిర్మిస్తారో చూపించిన కథ. నేను మొదటిసారి చదివినప్పుడు, ఆ గురుశిష్యుల ప్రేమానుబంధం, ఆ పూర్వకాలపు గురుకుల విద్యావ్యవస్థ నన్ను బలంగా ఆకట్టుకున్నాయి. రెండవ సారి చదివినప్పుడు, ఆయన సంగం కాలం నాటి సాహిత్యాన్ని ఎట్లా అన్వేషించాడో, ఎట్లా వెలుగులోకి తెచ్చాడో, ఆ పరిశోధన చాల విలువైందిగా అనిపించింది. కానీ, ఈసారి నా దృష్టి అక్కడ ఆగలేదు. ఆ మనుషులు, వాళ్ళ అన్వేషణ, వాళ్ళ ప్రేమౌదార్యం- కొన్ని ఘట్టాలు, కొన్ని వాక్యాలు, చివరికి కొన్ని పదప్రయోగాలదగ్గర కూడా నేను నిశ్చేష్టుడిగా నిలబడిపోయాను. ఏరీ అటువంటి మనుషులు? ఏదీ అటువంటి పరస్పర ప్రేమాలింగనం? ఏవీ అటువంటి విలువలు? ఎట్లాంటి కాలంలో జీవిస్తున్నాన్నేను? నాకు దుఃఖం ఆగలేదు.

గురువు శైవుడు. శిష్యుడు స్మార్తుడు. ఆదరించిన మఠం వీరశైవులది. అన్వేషించి, అధ్యయనం చేసి అచ్చెత్తొంచిన గ్రంథాలు జైన, బౌద్ధపారాయణకావ్యాలు. ఆ గురువు అంత్యసమయంలో ఆయన్ని తన ఒడిలో చేర్చుకుని కన్నీళ్ళతో అభిషేకించిన శిష్యుడు శవేరినాథ పిళ్ళై క్రైస్తవుడు. వారినందరినీ కలిపింది తమిళమనే ఒకే ఒక్క స్ఫూర్తి.

‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’

అని మహాకవి రాసిన మాటలకి ఇంతకన్నా నిరూపణా ఉంటుందా?

నాకు అట్లాంటి మనుషులు కావాలి. వాళ్ళ కులంతో, మతంతో, ప్రాంతంతో నాకు పనిలేదు. వాళ్ళు భాషకోసం, సాహిత్యం కోసం పనిచేసేవారే కానక్కర్లేదు. ఏదో ఒక స్ఫూర్తి, వారినీ, నన్నూ వెలిగించేది, పదేపదే కలుసుకోవాలని పించేది, ఏదో ఒక పరమార్థం కోసం నడిపించేది, కవి అన్నట్లుగా, ‘మునుముందుకు నడిపించేది, పరిపూర్ణపు బతుకిచ్చేది’, అటువంటిదేదో కావాలి. ద్వేషం కాదు, ధ్యేయం పంచుకునేవాళ్ళు కావాలి. ఎక్కడున్నారు వాళ్ళు? అటువంటి ఒక మీనాక్షి సుందరం పిళ్ళై, ఒక సుబ్రహ్మణ్య దేశికులు, ఒక త్యాగరాజ చెట్టియారు, ఒక రామస్వామి మొదలియారు- ఎక్కడున్నారు వాళ్ళు?

15-6-2018

 

 

Leave a Reply

%d bloggers like this: