నా కాశీయాత్ర-4

Reading Time: 5 minutes

364

ఆదివారం పొద్దున్నే ఇంకా తెల్లవారకుండానే మళ్ళా విశ్వనాథుడి దర్శనం చేసుకున్నాం. కాశీలో పండాలు పీడిస్తారంటారు కానీ, తెల్లవారుజామునే దర్శనానికి వెళ్తే ఎవరి మీదా ఆధారపడకుండానే దర్శనం చేసుకోవచ్చని అర్థమయింది. మరొకసారి అన్నపూర్ణ దర్శనం చేసుకుని, గంగ చెంతకు పోయి దశాశ్వమేథ ఘాట్ లో కొంతసేపు కూచున్నాం. గంగలో స్నానాలు మొదలయ్యాయి. పడవల్లో యాత్రీకుల సంచారం మొదలయ్యింది. చాలామంది విదేశీయులే కనిపిస్తున్నారు. నార్వే నుంచి వచ్చిన ఒక బృందం లో స్త్రీలంతా చక్కటి పట్టు చీరలు కట్టుకుని ఉల్లాసంగా తిరుగాడుతున్నారు. శుభ్రత, అపరిశుభ్రతలతో నిమిత్తం లేకుండా గంగ ప్రవహిస్తూనే ఉంది.

కాశీ అంటేనే ప్రకాశించేది అని అర్థం. ఏ పూర్వకాలంలోనో ఇక్కడ సూర్యారాధకులు ఉండేవారని హావెల్ రాసాడు. ఇప్పుడు మాత్రం ఇక్కడ పొద్దున్నే సంధ్యావందనం చేస్తున్నవాళ్ళంతా సూర్యారాధకులు కారా! భారతీయ ఆధ్యాత్మిక అన్వేషణలోనే వెలుగు గురించిన పరితాపముంది. అసలు భారతమంటేనే, (భ అంటే వెలుగు, రతి అంటే ప్రేమ) వెలుగుని ప్రేమించడమనే కదా. యాభై ఏళ్ళకు పైబడ్డ నా జీవితంలో నేనేంతో చీకటిని, దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, వంచనని, ద్రోహాన్ని, అసమానతల్ని చూసాను, చూస్తూనేవున్నాను . ఆ మాటకొస్తే చాలామంది కన్నా చాలా ఎక్కువ చూసాను. కాని, ఎందుకనో వాటిగురించి చెప్పడానికి, మాట్లాడటానికీ నాకేమంత ఆసక్తి కలగడం లేదు. వాటికన్నా మించిన వెలుగుని, ప్రకృతిలో, మనుషుల ప్రేమలో, దయాపూర్వకమైన చిన్ని చిన్ని ప్రయత్నాల్లో, గొప్ప కవిత్వాల్లో, చిత్రలేఖనాల్లో, సంగీతంలో చూస్తూ ఉన్నాను. అపారమైన ఆ ప్రకాశాన్ని ఇంకా ఇంకా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. అట్లా చూసినప్పుడల్లా, ఆ వెలుగుని మాటల్లోకి పిండుకుని వడగట్టుకోవాలని, వివిధ రూపాల్లో పునః చిత్రించాలన్నదే బహుశా నా జీవితానికి మిగిలిన ఏకైక ఉత్సాహం.

2

అప్పుడు హోటల్ కి పోయి, బ్రేక్ ఫాస్ట్ ముగించి, మా సామానంతా సర్దుకుని హోటల్ ఖాళీ చేసేసాం. కాశీ వచ్చినప్పణ్ణుంచీ చూడాలని తహతహలాడుతున్న కబీరు మఠానికి బయల్దేరాం. ముందు మా హోటల్ కి దగ్గర్లోనే ఉన్న లహర్ తారా మఠానికి వెళ్ళాం. అక్కడ లహర్ తారా చెరువు దగ్గర నీరూ, నీమా దంపతులకి కబీర్ (1440-1518) ఒక శిశువుగా దొరికాడని ఐతిహ్యం. ఇప్పుడక్కడ మూడంతస్థుల కబీర్ మందిరం నిర్మించారు. రెండవ అంతస్థులో కబీర్ విగ్రహం ప్రతిష్టించిన పూజామందిరం, విశాలమైన ధ్యానమందిరం ఉన్నాయి. అక్కడ నుంచి మేం కబీర్ చౌరా దగ్గర ఉన్న కబీర్ మందిరం వెతుక్కుంటూ వెళ్ళాం. మేం కబీర్ చౌరాకి వెళ్ళాలనుకుంటున్నామంటే, ఆ డ్రైవరు మమ్మల్ని కబీర్ చౌరా లో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు!

మొత్తానికి సరైన చిరునామా కనుక్కుని, కబీర్ చౌరా దగ్గరకు వెళ్ళగానే నాలుగురోడ్ల కూడలిలో కబీరూ, మరొక నలుగురు భక్తికవులూ సంకీర్తనా యాత్ర చేస్తున్న శిల్పం ఉత్తేజపూరితంగా స్వాగతమిచ్చింది. ఆ కూడలిలోంచి ఒక ఇరుకైన వీథిలో ముందుకు వెళ్ళి, అక్కడ లోపలకీ ఉన్న మఠంలో అడుగుపెట్టగానే నా ప్రాణానికి తెలియని సాంత్వన కలిగింది. వేసవి సాయంకాలాల్లో గోదావరి ఒడ్డున రావిచెట్లమీంచి వీచే చల్లటిగాలిలాంటిదేదో నా మనసుని తాకింది. ఆ లోపల విశాలమైన మందిరం, మందిరం మధ్యలో ఖాళీ స్థలంలో నీడనిచ్చే చెట్లూ, ప్రతి ఒక్క చెట్టు కీంద ఒక్కొక్క భక్తి కవి శిల్పం సాక్షాత్కరించాయి. రవిదాస్, దాదూ, పల్టూ, పీపా, మీరా లతో పాటు గాంధీ, టాగోర్, వినోబాల సుందర శిల్పాలు కూడా కనిపించాయి.

కాశీలో కబీరు మందిరం చూడటంలో చెప్పలేని అనుభూతి ఉంది. కాశీలో రెండు క్షేత్రాలున్నాయి, ఆ మాటకొస్తే, మానవదేహంలోనూ, దేశంలోనూ కూడా. అంతః క్షేత్రాన్ని మలినపరుచుకుంటూ, బాహ్యక్షేత్రాన్ని కీర్తించడం ఆత్మలో దివాలాకోరుతనం. దాన్ని అందరికన్నా తీవ్రంగా ఎత్తిచూపినవాడు కబీరు. ఆత్మవంచనతో కూడుకున్న ప్రపంచంలో అన్నిటికన్నా ముందు తనని తాను కాపాడుకోవడం చాలా కష్టం. కాని, అట్లా కాపాడుకోవాలన్నా, నీలోని దైవం నిన్ను కాపాడవలసిందే. అందుకనే కబీరు ఇట్లా అంటున్నాడు:

వాళ్ళు కాశీనెందుకు వదులుకుంటారు మురారీ?
నీ సేవపేరు చెప్పి దొంగలైపోయారు వనమాలీ!

యోగులు, యతులు, సన్న్యాసులు, తాపసులు
మఠాల్లో, దేవళాల్లో తిష్టవేసి కూచున్నారు కాశీలో.
రోజుకి మూడు సార్లు మునుగుతారు గంగలో,
కాని తమ దేహం లోపల ఎంత మురికిఉందో గుర్తుపట్టరు
గుడినుంచి గుడికి ఒకటే తిరుగాడుతుంటారు
కాని నిరంజనుడి నామం ఒక్కసారి కూడా నోట్లో ఆడదు.

నేనిట్లా ఉన్నానంటే, ఆ ఘనత కాశీది కాదు, నరకంలో
పడేసినా సరే, నీ చరణాలదే ప్రభూ అంటాడు కబీరు. (కబీర్ గ్రంథావళి, 290)

మేమట్లా ఆ శిల్పాలు చూస్తూ, అటుగా వెళ్తున్న ఒకాయన్ని, కబీరు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని అడిగితే, ఆయన, ‘భోజనాల సమయమైంది, గంట కొట్టారు. ముందు భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం’ అన్నాడు.

ఆ మాట వినగానే నా మనోబుద్ధ్యాత్మలన్నీ ద్రవీభూతమైపోయాయి. ఈ ప్రపంచంలో ఇప్పుడిట్లాంటి ఆహ్వానం ఎక్కడ లభిస్తుంది? జీవించిఉండిఉంటే, మా అమ్మ నుంచి వినవచ్చే పిలుపు. ‘ముందు అన్నం తినండి, తర్వాత మాట్లాడుకుందాం’ అనే మాట మా నాన్నగారి మాట. నాకు గుండెలో కన్నీళ్ళు ఉబికాయి.

అంతకు రెండు రోజులముందే, అంటే శుక్రవారం, జ్యేష్ట పూర్ణిమ, కబీరు జయంతి అని అప్పుడు తెలిసింది. అంటే కబీరు తన పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని భోజనానికి పిలిచాడా!

అక్కడ మఠం ఆవరణలోనే పండిన కూరగాయలతో వండిన పప్పు. జాతిమతాలప్రసక్తిలేని ఆహ్వానం. కబీరు నమ్మిన విలువలు అక్కడింకా కొనసాగుతున్నట్టే ఉంది. భోజనం చేసాక, ఆ అవరణలో మహాత్మాగాంధీ శిల్పం కింద రాసిన మహాత్మా గాంధీ ప్రసంగం చదువుతూ ఉన్నాను. గాంధీజీ ఆ మఠానికి వచ్చారట. ఆ సందర్భంగా ఆయన తన తల్లి కబీర్ పంథీ అనీ, తన పెళ్ళి జరిగినప్పుడు కబీర్ పంథీల ఆశీస్సులు కూడా లభించాయనీ చెప్తూ, తనకి కూడ కబీరు స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. అక్కడ రాసి ఉన్న ఆ ప్రసంగంలో చివరి వాక్యం నాకు అర్థం కాకపోతే, అక్కడున్న ఒకాయన దాన్ని నాకు వివరించాడు. ఆయన పేరు ఉమేష్ కబీరు. ఆయన ఆ మందిరం నిర్వాహకుల్లో ఒకడు. కబీరు పంథీ. ఆయన మమ్మల్ని ఆ మందిరమంతా తిప్పి చూపించాడు. అక్కడ ‘బీజక్ మందిర్’ లో కబీరు వాడిన మగ్గం, వంటపాత్రలు భద్రపరిచి వున్నాయి. లహర్ తారా దగ్గర దొరికిన కబీరు ని నీరూ, నీమా తెచ్చుకుని పెంచుకున్న చోటు అది. ఇప్పుడక్కడ వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. కబీరు అక్కడే పెరిగి, అక్కడే నేత నేసుకుంటూ, పాటలు పాడుకుంటూ జీవించాడు.

అక్కడ ఆయన సమాధి మందిరం కూడా ఉంది. ‘మీరు పుస్తకాల్లో చదివి ఉంటారు కదా, కబీరు మఘర్ లో మరణించాడని, మరి ఇక్కడ ఈ సమాధి మందిరమేమిటని ఆశ్చర్యపోతున్నారు కదా’ అన్నాడు ఉమేష్. ‘మీరు ఇది కూడా చదివే ఉంటారు, కబీరు మరణించినప్పుడు ఆయన మా వాడంటే మా వాడని హిందువులూ, మహ్మదీయులూ ఇద్దరూ పోట్లాడుకున్నారనీ, అప్పుడాయన కళేబరం ఉండవలసిన చోట, పువ్వులు ప్రత్యక్షమయ్యాయనీ. ఆ పువ్వుల్లో కొన్ని ఇక్కడికి తెచ్చి ఈ సమాధి మందిరం నిర్మించారు’ అని చెప్పాడతడు. ఏమైతేనేం, కబీరు కాశీని వదిలిపెట్టగలిగాడుకానీ, కాశీ కబీరుని వదిలిపెట్టలేకపోయిందనుకున్నాను.

కబీరు పుస్తకాల గురించి అడిగితే, ఉమేష్ కబీరు నాకు ‘మహాబీజక్ ‘ (2000) గ్రంథం చూపించాడు. ఇంతదాకా కబీరు పేరుమీద వచ్చిన అన్ని రకాల రచనల, సంకలనాల సమగ్ర సంపుటమది. ఎక్కడెక్కడో, ఒకటీ, ఒకటీ చొప్పున వెతుక్కుంటున్న తన రచనలన్నిటినీ ఒక్కచోట కూర్చి కబీరు నా చేతుల్లో పెట్టాడని ఆ గ్రంథాన్ని గుండెకి హత్తుకున్నాను.

3

కబీర్ చౌరా నుండి మేం నేరుగా లమహి గ్రామానికి వెళ్ళాం. వారాణసి నుంచి అజంగర్ వెళ్ళే తోవలో నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న లమహి అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవిదేశాలనుండి యాత్రీకుల్ని ఆకర్షిస్తోంది. అది 20 వ శతాబ్ది భారతీయ సాహిత్యానికి వాస్తవికతావాదాన్ని, ప్రగతిశీల దృక్పథాన్ని పరిచయం చేసిన మున్షీ ప్రేమచంద్ (1880-1936) పుట్టిన ఊరు కావడమే అందుకు కారణం.

ప్రేమ చంద్ జీవితంలో చివరిరాత్రి ఆయన మరణశయ్య పై ఉన్నప్పుడు, తాను అంతదాకా నడుపుతున్న ‘హంస్’ పత్రిక తన తర్వాత ఏమవుతోందోనన్న వ్యథలో ఉన్నప్పుడు, ఆయన చెంతన మరొక సుప్రసిద్ధ హిందీ రచయిత జైనేంద్ర కుమార్ ఉన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణలో ప్రేమ చంద్ మాట్లాడిన చివరిమాట: ‘ఆదర్శాలు అన్ని వేళలా పనిచేయవు’ అని. జైనేంద్ర ఆయనమాటకి అడ్డుతగలబోయి, ఆ సమయంలో ఆయనతో వాదించడం ఉచితం కాదని ఊరుకున్నాడు. కాని నాకు తెలిసిన ఆదర్శవాద రచయితలందరికన్నా మించిన ఆదర్శవాది ప్రేమ చంద్. నిష్టుర జీవితవాస్తవాన్ని ఆయన ఎంత బలీయంగా చిత్రించినా ఆ క్రూర వాస్తవం వెనక, సుదూరంగా, మినుకు మినుకుమంటూనైనా ఒక ఆదర్శజ్యోతి జ్వలిస్తూ కనిపిస్తూనే ఉంటుంది.

ఎర్రటి ఎండలో లమహి గ్రామం చేరగానే ప్రేమ్‌చంద్ స్మారక తోరణం స్వాగతం పలికింది. అటువంటి ఆర్చి లేదా కమాను గురజాడకి విజయనగరంలో, పుట్టపర్తినారాయణాచార్యులుకి పొద్దుటూరులో , కాళోజీకి వరంగల్ లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించాం. మరీ లోపలదాకా పోనక్కరలేకుండానే ప్రేమ్ చంద్ స్మారక గృహం కనిపించింది. కాని తలుపులు మూసి ఉన్నాయి. ఇంతదూరం వచ్చింది ఇట్లా మూసి ఉన్న గృహాన్ని చూసి పోవడానికి అనుకుంటూ ఉండగా అక్కడ గోడ మీద ఒక కాంటాక్ట్ నంబరు కనిపించింది. మా అమృత ఫోన్ చేస్తే, ఒకాయన ఆ ఎండలో సైకిలు తొక్కుకుంటూ ఆతృతతో వచ్చి మమ్మల్ని పలకరించాడు. మమ్మల్ని లోపలకి తీసుకువెళ్ళి, ఆ మందిరం తలుపులు తెరిచాడు.

ఆ మందిరం ప్రాంగణంలో ప్రేమ్ చంద్ విగ్రహం, రెండు గదుల ఇల్లు ఉన్నాయి. ఒక గదిలో ప్రేమ్ చంద్ పుస్తకాలన్నీ ప్రదర్శనకు పెట్టి ఉన్నాయి. ప్రేమ్‌చంద్, జయశంకర ప్రసాద్ ల ఫోటోతో పాటు, ప్రేమ్‌చంద్ కుమారుల, తమ్ముళ్ళ ఫొటోలు కూడా ఉన్నాయి. ఆ మందిరం వెనక, సందర్శకుల కోసం ఒక గెస్ట్ హవుస్, రోడ్డుకి అవతల పక్క, ప్రేమ్‌చంద్ రచనలపైన పరిశోధన చేయాలనుకునేవారికోసం రెండంతస్థుల భవనం ప్రభుత్వం నిర్మించినవి ఉన్నాయి.

ఆ పెద్దమనిషి పేరు సురేష్ చంద్ర డూబే. ఆ స్మారకకేంద్రానికి ప్రభుత్వం భవనాలు, రోడ్డు మీద కమాను మాత్రమే నిర్మించింది. కాని ఆ పుస్తకాలన్నీ ఈయనే సేకరించాడు. ఒక వలంటీరుగా ఆ స్మారకకేంద్రం నడుపుతున్నాడు. ఎవరు వచ్చినా రెక్కలు కట్టుకు వాలిపోయి వారికి ప్రేమ్‌చంద్ గురించి వివరించడమే జీవితంగా గడుపుతున్నాడు.

ఆ రోజు ఆయన మమ్మల్ని చూస్తూనే ఉద్వేగం ఆపుకోలేకపోయాడు. మాతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన మరొక ఇద్దరు సందర్శకులు కూడా ఉన్నారు. ‘ఇంత ఎండలో ప్రేమ్‌చంద్ ని తలుచుకుంటూ ఇక్కడకు వచ్చిన మీ సాహిత్యప్రేమకు నేను పరవశిస్తున్నాను. మీకు లమహి గ్రామం తరఫునా, హిందీ సాహిత్యం తరఫునా స్వాగతం పలుకుతున్నాను’ అని మొదలుపెట్టాడాయన. ఆ ఎండలో సైకిలు తొక్కుకుంటూ వచ్చిన ఆయాసం కన్నా, ప్రేమ్‌చంద్ కోసం కొందరు సందర్శకులు వచ్చారన్న ఆనందానికే ఆయన గుండె ఎక్కువకొట్టుకుంటూవుంది. ఆ తరవాత ఆయన పది నిముషాల పాటు ప్రేమ్‌చంద్ గురించి అద్భుతమైన ప్రసంగం చేసాడు. ఆయన ప్రసంగం పూర్తి చేసాక, రికార్డు చేసుకుని ఉంటే బాగుంటుంది కదా అనిపించి మళ్ళా మాట్లాడమన్నాను, ఆయన మాట్లాడటమైతే మాట్లాడేడు కాని, ఉహు, మునపటి ఆ ఉద్వేగం, ఆ రక్తసంచలనం తప్పిపోయేయి.

కాని మర్చిపోలేని మాటలు మాట్లాడేడు. ‘ప్రేమచంద్ లేకపోతే ఆధునిక హిందీ సాహిత్యం అసంపూర్తిగా ఉండిపోయేది. ఆయనకి హిందీ, ఉర్దూ తప్ప మరే భారతీయ భాషా తెలీదు, కాని ప్రతి భాషాసాహిత్యాన్నీ ఆయన ప్రభావితం చేసాడు. ఆయన దేశంలో ఉత్తరప్రదేశ్, ముంబై లు తప్ప మరెక్కడకీ వెళ్ళలేదు. కాని దేశంలో ప్రతి ప్రాంతంలోకీ ఆయన సందేశం చొచ్చుకుపోయింది’ అన్నాడు.

భారతీయ సాహిత్యంలో ప్రేమ్ చంద్ వంటి రచయిత మరొకరు లేరు. గ్రామీణభారతదేశాన్ని చిత్రించడానికి ప్రయత్నించిన ఆధునిక భారతీయ నవలాకారులు వ్యంకటేష్ మాడ్గూళ్కర్, ఫణీశ్వర నాథ్ వర్మ రేణు, శివశంకర పిళ్ళై, శివరామకారంత, మహాశ్వేతాదేవి వంటివారికందరికీ ప్రేమ్‌చంద్ నే వరవడి. తెలుగుసాహిత్యాన్ని, ముఖ్యంగా అభ్యుదయ రచయితల్ని ప్రేమ్‌చంద్ ప్రభావితం చేసినప్పటికీ, ఆ స్థాయి నవలారచయిత ఇంకా తెలుగులో పుట్టవలసే ఉంది.

4

లమహి నుంచి మేం మళ్ళా వారాణసి వచ్చి బాటీ చోఖా రెస్టరెంటుకి వెళ్ళాం. కాశీ ప్రయాణం లో అది మా చివరి మజిలీ. కాశీలో మాకు లోకల్ ట్రావెల్ ఏర్పాట్లు చూసిన ట్రావెల్ కన్సల్టెంట్ అంశు పాఠక్ ఆ రెస్టారెంట్ గురించి చెప్పాడు. ముందు రాత్రి అక్కడకు వెళ్ళాం కాని కూచోడానికి చోటు దొరకలేదు. అందుకని ఆ మధ్యాహ్నం మళ్ళా వెళ్ళాం. ఆ రెస్టారెంటు బయటా, లోపలా కూడా పూర్వాంచల గ్రామీణ గృహాల్ని తలపించే విధంగా రూపొందించారు. అక్కడ వడ్డించే ఆహారం కూడా వారణాసి పల్లె పట్టుల్లో తినే ఆహారమే. నీళ్ళూ, పెరుగు, పాయసం, లస్సీ అన్నీ మట్టిపాత్రల్లోనే అందిస్తున్నారు. అదంతా ఒక పల్లెసీమలో రైతు ఇంట్లో ఆతిథ్యం లాగా ఉంది.

విమానాశ్రయానికి వెళ్ళే ముందు పిల్లలు స్నేహితులకి కానుకలు కొనుక్కుంటామనడంతో మళ్ళా గొధౌలియా సెంటర్ కి వెళ్ళాం. వారణాసిలో చూడవలసినవి చాలానే ఉండిపోయాయని తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా దాల్ మండిలో బిస్మిల్లా ఖాన్ ఇల్లు చూడాలని ఎంతగానో అనుకున్నాను. సమయం చిక్కలేదు. సారనాథ్ లో బౌద్ధ దేవాలయాలు చూడటంతోనే సరిపోయింది, అక్కడున్న దిగంబర జైనశాఖవారి దేవాలయం చూడలేకపోయాను. భారతేందు హరిశ్చంద్ర, జయశంకర ప్రసాద్ లు తిరుగాడిన ప్రాంతాలు కూడా చూడలేదు. త్రైలింగస్వామి, కరపాత్రీస్వామి వంటి సాధుసత్పురుషులు పునీతం చేసిన పుడమిని దర్శించుకోనేలేదు. చిన్నప్పుడు, మా అక్క చెప్పిన కథ, జగన్నాథ పండిత రాయలు తన ప్రియురాలు లవంగితో కలిసి గంగాస్తోత్రం చేస్తూ గంగైక్యం చెందిన పంచగంగా ఘాట్ ని ముద్దాడనే లేదు.

పిల్లలు తిరిగి వచ్చి బండి ఎక్కారు. ఆ క్షణాన సన్నని బెంగ ఏదో నాలో చాయగా కదిలింది. ఆ అపరాహ్ణవేళ, దశాశ్వమేథ ఘాట్ లో సాధువులూ, పడవలూ, నీడలూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయని స్ఫురించగానే, ఎప్పటెప్పటి అడవులూ, అపరాహ్ణాలవేళ, ఆ కొండలమీదా, ఆ అడవులమీదా పరుచుకునే మేఘాల నీడలూ, వాటి వెనక వెలుగులూ గుర్తొచ్చాయి. బండి కదిలింది.

17-6-2017

Leave a Reply

%d bloggers like this: