మర్నాడు పొద్దున్నే, అంటే శనివారం గంగ ఒడ్డున సూర్యోదయ దర్శనం, గంగాస్నానం చెయ్యాలనుకున్నాం. మేము అయిదున్నరకి గంగ ఒడ్డుకి చేరుకునేటప్పటికే సూర్యోదయమైపోయింది. నాటకం అయిపోయిన మర్నాటి రంగస్థలం లాగా ఉంది దశాశ్వమేథ ఘాట్. అలాగని హడావిడి లేకపోలేదు. మేం మళ్ళా ఒక పడవ తీసుకుని గంగ ఆవలి ఒడ్డుకి చేరుకున్నాం. ముందు రోజు మేము చూడని ఘాట్లు మాకు చూపిస్తూ పడవనడిపే పిల్లవాడు మమ్మల్ని ఆవలి ఒడ్డుకి చేర్చాడు. అక్కడ కూడా కొందరు యాత్రీకులు స్నానాలు చేస్తూ ఉన్నారు.
పవిత్రమైన గంగ కాలుష్యప్రమాణాలు ఎంతగా మీరిపోయాయో నేను చదవకపోలేదు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నదుల్లో గంగ అయిదో స్థానంలో ఉంది. గంగ ఒడ్డున ఉన్న 29 పట్టణాల వ్యర్థపదార్థాలు, ఏటా గంగ పొడుగునా స్నానం చేసే సుమారు ఏడు కోట్ల మంది యాత్రీకులు, బొగ్గు, రసాయనాలు, జౌళి, తోళ్ళ పరిశ్రమల వ్యర్థాలు పవిత్ర గంగని అత్యంత విషపూరితమైన నదిగా మార్చేసాయి. ఒక రచయిత్రి అన్నదికదా, గంగని తల్లిగా భావించకుండా కొడుకుగా భావించి ఉంటే ఇంత నిర్లక్ష్యం చూపించిఉండేవాళ్ళమా అని.
గంగాస్నానం చేసాం. ఆ ఒడ్డున కూచుని సంధ్యకి నమస్కరించుకున్నాను. కొన్ని నీళ్ళు చేతుల్లోకి తీసుకుని నా తల్లిదండ్రుల్ని, మా పూర్వీకుల్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన నా గురువుల్ని, బంధుమిత్రుల్ని, సాహిత్యమిత్రుల్ని తలుచుకున్నాను. ఒక ఆరాధకుడి ప్రార్థన కాదనలేక ఆకాశాన్ని విడిచిపెట్టి ఈ నేలమీదకు రావడానికి సిద్ధపడ్డ ఆ కరుణామయి సన్నిధిన, వాళ్ళని తలుచుకుంటే నాకెంతో ఊరటగా అనిపించింది.
2
గంగనుంచి నేరుగా హోటల్ కి వచ్చి అల్పాహారం ముగించుకుని సారనాథ్ బయలుదేరాం. సారనాథ్ కాశీనుంచి 8 మైళ్ళ దూరంలో, ప్రస్తుత వారణాసిలో భాగంగా ఉన్న చిన్న పట్టణం. బుద్ధుడి జీవితంలో ప్రముఖ పాత్ర వహించిన నాలుగు స్థలాలూ, కపిలవస్తు, బుద్ధగయ, కుశీనగర్ లతో పాటు సారనాథ్ కూడా ఒకటి కావడం చేత ఇప్పుడది అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా మారింది.
తన ముప్పై అయిదేళ్ళ వయసులో తీవ్ర తపస్సు తర్వాత సిద్ధార్థ గౌతముడికి బుద్ధ గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తర్వాత ఏడువారాల పాటు ఆయన మౌనంగా ఉండిపోయాడు. తనకొక సత్యం తెలిసి, ఆ సత్యం వల్ల తనకొక గొప్ప శాంతి కలగ్గానే తాను తెలుసుకున్న సత్యాన్ని నలుగురితో పంచుకోవాలా వద్దా అన్న మీమాంసవల్ల అతడట్లా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తనలో తాను వితర్కించుకున్నమీదట తాను తెలుసుకున్నది నలుగురికీ చెప్పాలన్న కోరిక అతడికి బలపడింది. ముందాయనకి తన గురువులు గుర్తొచ్చారు. కాని వాళ్ళు జీవించి లేరని కూడా గుర్తొచ్చింది. అప్పుడాయనకి పూర్వం తనతో కలిసి తపస్సు చేసిన అయిదుగురు మిత్రులు గుర్తొచ్చారు. తాను వాళ్ళలాగా తీవ్రంగా తపస్సు చేయడంలేదని వాళ్ళు తనని వదిలిపెట్టేసారు. కాని ఇప్పుడాయనకి వాళ్ళని చూడాలనిపించింది. తాను తెలుసుకున్న సత్యాన్ని వాళ్ళకే చెప్పాలనిపించి వాళ్ళని వెతుక్కుంటూ ఆయన గయనుంచి వారణాసి దాకా సుమారు 150 మైళ్ళ పాటు నడుచుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు సారనాథ్ గా పిలవబడుతున్న ప్రాంతాన్ని అప్పుడు ఋషిపట్టణమని పిలిచేవారు. అక్కడొక లేళ్ళ అడవి కూడా ఉండేది. అందుకని ఆ ప్రాంతాన్ని ఇషిపట్టణ మృగయాదావం అని పిలిచేవారు. ఆ అడవిలో అతడు అడుగుపెట్టగానే ఆ పంచవర్గీయ భిక్షుకులు ఆయన్ని చూసారు. వాళ్ళకింకా సత్యం సాక్షాత్కరించలేదు. వాళ్ళక్కడే ఆ అడవిలోనే గమ్యరహితంగా తచ్చాడుతున్నారు. వాళ్ళు బుద్ధుణ్ణి దూరం నుంచి చూసి గుర్తుపట్టి, అతడు తపసు విరమించి ఉంటాడని భావించి, అతణ్ణి పలకరించకూడదనీ, అతడికి తమ దగ్గర కూచోడానికి చోటు చూపించకూడదనీ అనుకున్నారు. కాని, ఆయన వాళ్ళకి చేరువగా రాగానే అప్రయత్నంగా లేచి నిలబడ్డారు. ఆయనలో కనిపిస్తున్న జ్ఞానతేజస్సు ముందు కైమోడ్చారు. ‘సిద్ధార్థా, ఎలా ఉన్నావు?’ అని అడిగారు, కూచోమన్నారు, నీళ్ళందించారు. అప్పుడు బుద్ధుడు తానింకెంతమాత్రం సిద్ధారుణ్ణి కాననీ, జ్ఞానోదయం పొందినవాణ్ణనీ, బుద్ధుణ్ణయ్యాననీ చెప్పాడు. ‘నువ్వు తెలుసుకున్న జ్ఞానమేమిటో మాకు కూడా చెప్పరాదా’ అన్నారు వాళ్ళు.
ఆయన అపారమైన ప్రేమతో, కరుణతో గొంతు విప్పాడు: ‘భిక్షులారా, పరివ్రజించినవాడు రెండు తీవ్రతలని పరిహరించాలి. ఏమిటా రెండూ? ఒకటి కామగుణాల్లో కూరుకుపోవడం, మరొకటి, తపసు పేరిట తనను తాను శుష్కింపచేసుకోవడం..’
ఆ మాటలతో సారనాథ్ నేలమీద బౌద్ధధర్మం ప్రపంచంలోనే మొదటిసారి ప్రభవించింది. దమ్మచక్కపరివత్తన సుత్త (సంయుత్త నికాయం, 3:12:2) గా ప్రసిద్ధి చెందిన ఆ సుత్తంద్వారనే బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాల్నీ, దుక్ఖం నుంచి విముక్తినివ్వగల అష్టాంగమార్గాన్నీ ప్రతిపాదించాడు. ఆ ప్రబోధం వినగానే ఆ అయిదుగురు భిక్షువుల్లో కౌండిన్యుడనేవాడికి వెంటనే జ్ఞానోదయం కలిగింది. ఆ తర్వాత మిగిలినవాళ్ళకి కూడా. ఒకసారి సత్యం గోచరించాక, ఒకడూ అయితే తిరిగి జారిపోయే ప్రమాదముంది, ఒకరికొకరు తోడుగా నిలబడితే, మళ్ళా ప్రాపంచిక ప్రలోభాల్లోకి జారిపోవడం ఉందదని బుద్ధుడు తనకి శిష్యులుగా మారిన ఆ అయిదుగురు మిత్రులతో కలిసి ఒక సంఘాన్ని ఏర్పరచాడు. ఆ విధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ ధర్మం, బౌద్ధ సంఘం వారణాసిలో ప్రభవించాయి. అందుకని ఆ నేలమీద అడుగుపెట్టగానే గొప్ప ఉద్వేగం కలిగింది.
3
అక్కడ మా కోసం ఒక గైడు ఎదురుచూస్తున్నాడు. అతడి పేరు దేవాశీష్ ముఖర్జీ. బెంగాలీ కుర్రవాడు. ప్రభుత్వ నడుపుతున్న ఒక శిక్షణా సంస్థలో టూరిజం కోర్సు చేస్తున్నాడు. అతడు ముందు మమ్మల్ని అక్కడ సింహళ బౌద్ధులు నిర్మించిన బుద్ధదేవాలయానికి తీసుకువెళ్ళాడు. ఆనాగారిక (అంటే ఆగారం లేనివాడు, జంగమభిక్షువు) ధర్మపాలుడు (1864-1933) అనే ఒక సింహళ మతోద్ధారకుడు మహాబోధి సొసైటీ తరఫున నిర్మించిన బౌద్ధ ఆలయమది. ఆ అవరణలో ఒక దేవాలయంతో పాటు, బోధివృక్షం,ఆ చెట్టునీడన ధర్మచక్రప్రవచనం చేస్తున్న బుద్ధ విగ్రహం, అయిదుగురు శిష్యుల విగ్రహాలూ ఉన్నాయి. సిద్ధార్థుడు ఏ బోధివృక్షం నీడన జ్ఞానోదయం పొందాడో ఆ వృక్ష శాఖనొకదాన్ని అశోకుడి కుమార్తె సంఘమిత్ర సింహళానికి తీసుకువెళ్ళిన సంగతి మనకు తెలుసు. కాండీలో అవినాశిగా వర్ధిల్లుతున్న ఆ చెట్టు కొమ్మనొకదాన్ని తీసుకువచ్చి ఇక్కడ మళ్ళా నాటారు. కాబట్టి ఆ చెట్టు సత్త్వంలో సిద్ధార్థుడి తపోశ్వాస ఉందనుకోవచ్చు. ఆ దేవాలయంలోపల బుద్ధుడి జీవితసంఘటనల సుందర కుడ్యచిత్రాలున్నాయి. ప్రశాంతచిత్తుడైన బుద్ధమూర్తి ఆ మందిరంలో ఆసీనుడై కనిపిస్తున్నాడు.
మా గైడు మమ్మల్ని అక్కణ్ణుంచి థాయిలాండు బౌద్ధులు నిర్మించిన బుద్ధ విగ్రహం దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు బామియన్ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆ లోటు పూడ్చడం కోసం థాయి ప్రభుత్వం సారనాథ్ లో ప్రతిష్టించిన విగ్రహమది. 80 అడుగుల తొమ్మిది అంగుళాల ఆ మూర్తి భారతదేశంలోనే అత్యున్నత బుద్ధ ప్రతిమ. సుమారు రెండుకోట్ల వ్యయంతో 14 సంవత్సరాల పాటు చెక్కిన శిల్పం. ఆ మూర్తి చుట్టూ అందమైన ఉద్యానవనం. అంతటి గ్రీష్మ తాపంలో కూడా అక్కడికొలనుల్లో పద్మాలు వికసించి ఉన్నాయి. తుమ్మెదలు పూలరేకుల్లో మత్తిల్లి మూర్ఛపోయి ఉన్నాయి.
సింహళ బౌద్ధ మందిరం వెనక కొందరు నవదీక్షిత బౌద్ధుల కుటుంబాలకు పునరావాసం కల్పించారనీ, దలైలామా వాళ్ళకి 750 నేతమగ్గాలు సమకూర్చాడనీ వాళ్ళు నేసిన చీరలతో నడుస్తున్న ఒక గాలరీని కూడా మా గైడు చూపించాడు. బెనారస్ లో పట్టువస్త్రాలమీద ఇంకా మొఘల్ కాలీన చిహ్నాలే కనిపిస్తుండగా, ఇక్కడ థాయి, టిబెటన్ మోటిఫ్ లు కూడా కనిపిస్తుండటం విశేషంగా గోచరించింది.
అప్పుడు మేము ప్రధాన స్మారక శిథిలాల వైపు నడిచాం. ఆరిక్యాలజికల్ సర్వే వారి ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలో మూడు స్మారకాలున్నాయి. ఒకటి అశోకుడు నిర్మించిన స్తంభం అవశేషాలు. మరొకటి, మూలగంధకుటిగా ప్రసిద్ధి చెందిన బుద్ధుడి ప్రవచన వేదిక, మూడవది, అశోకుడే నిర్మించిన ధర్మచక్ర స్థూపం. ఆ ప్రాంగణానికి ఇవతలి వైపున పురావస్తుశాఖవారి మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో అడుగుపెట్టగానే మనల్ని తక్షణమే ఆపేసి నిలబెట్టేది అశోకస్తంభం పైన నిలబెట్టిన నాలుగు సింహాల శిల్పం. భారతప్రభుత్వ రాజచిహ్నంగా మనకు సుపరిచితమైన ఆ శిల్పం మనం ఊహించలేనంత కొత్తగా, అందంగా, గంభీరంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ శిల్పం నునుపు, దాని మెరుపు. వజ్రలేపమనే రసాయనం వల్ల ఆ మెరుపు కాలం తాకిడికి కందలేదని ఒక రచయిత రాసాడు. (బి.సి.భట్టాచార్య: The History of Saranatha or the Cradle of Buddhism(2009)).
మ్యూజియంలోపల ఉత్తరం వైపు మౌర్య, శుంగ, కుషాన, గుప్త కాలాలకు చెందిన శిల్పాలు ఉన్నాయి. అవన్నీ విశేషమైనవే కాని, సారనాథ్ శిల్పకళకి ప్రతినిధి శిల్పమని చెప్పదగ్గ ధర్మచక్రపరివర్తన బుద్ధ శిల్పం (బి(బి)181) శోభ మాత్రం చూసి తీరవలసిందే. నాలుగుసింహాల శిల్పం,ఆ బుద్ధ శిల్పం వీటిని చూడటానికైనా సారనాథ్ వెళ్ళితీరాలి.
మేం బయటికి వచ్చేటప్పటికి ఎర్రని ఎండ. అప్పుడు రుచి చూసాం మట్టిపాత్రల్లో అందించిన బనారసీ లస్సీని.
4
సారనాథ్ నుంచి నేరుగా మా బండి ప్రయాగ వైపు మళ్ళింది. రెండవ నంబరు జాతీయ రహదారి. ఒకప్పుడు షేర్ షా సూరి నిర్మించిన రహదారి. వారణాసి నుంచి అలహాబాద్ 130 కిలోమీటర్ల ప్రయాణం. కాని మేం అలహాబాదు ఊళ్ళోకి వెళ్ళకుండా నేరుగా ప్రయాగ సంగమానికే వెళ్ళాం. అక్కడ పడవలవాళ్ళు చుట్టుముట్టేరు. మొత్తానికి ఒక పడవ కుదుర్చుకుని సంగమస్థలానికి బయలుదేరాం. సంధ్యవాలబోతున్నది. యమునలో నౌకావిహారం చేస్తున్నానని స్ఫురించగానే హృదయానికెవరో గిలిగింత పెట్టినట్టనిపించింది. నెమ్మదిగా ఒకటీ ఒకటీ పడవలు నదిలో పయనించడం మొదలయ్యింది. కొంతదూరం పోయేక, అక్కడ చాలా పడవలు ఆగి ఉన్నాయి. అదే గంగా, యమునల సంగమస్థలి అని చెప్పాడు పడవవాడు. అక్బరు కట్టించిన కోటలోపల ఒక కుండముందనీ, అక్కణ్ణుంచి సరస్వతి అంతర్వాహినిగా యమునలో ప్రవహిస్తున్నదనీ చెప్పాడు. సంగమస్థలం దగ్గర బల్లకట్టులాగ కట్టి, అక్కడే ఒక పడవని వేదిక చేసుకుని ఒక బ్రాహ్మణుడు యాత్రీకులతో పూజలు చేయిస్తున్నాడు. మమ్మల్ని వేణీదానం చెయ్యమని బలవంతపెట్టాడు. కాని నా దృష్టి ఆ క్రతువుల మీద లేదు. నేను కొన్ని క్షణాల పాటు ఆ నదీసంగమాన్నట్లా చూస్తూ ఉండిపోయాను. ఎక్కడ పుట్టాయి, ఏ దారుల్లో పయనించాయి, ఇక్కడ ఒకటయ్యాయి కదా. గంగ దేవతల నది, సరస్వతి ఋషుల నది, యమున ప్రేమికుల నది. ఆ మూడు నదులూ కలిసి ఒక దేశాన్ని రూపొందించేయి, ఒక సంస్కృతిని నిర్మించేయి, అనశ్వరమైన సాహిత్యాన్ని సృష్టించేయి. ఆ నదుల కలయికని ఇప్పుడంటే నా కళ్ళముందు చూస్తున్నాను గాని, అసలు ఈ దేశంలో ప్రతి ఒక్క భావుకుడూ ఒక త్రివేణీ సంగమమే కదా. తిరిగి వారణాసికి ప్రయాణిస్తున్నంతసేపూ భారతీయ సాహిత్యంలో ఆ నదీప్రశంసలే నా మనసులో మెదుల్తూ ఉన్నాయి. ఆకాశంలో చంద్రుడు కూడా అలహాబాదునుంచి వారణాసిదాకా మాతో పాటే ప్రయాణిస్తూ ఉన్నాడు.
16-6-2017