నా కాశీయాత్ర-2

362

మమ్మల్ని పొద్దున్నే విశ్వనాథుని ఆలయానికి తీసుకువెళ్ళిన గైడు పేరు బాబా దిలీప్. అతడు కాశీలోనే పుట్టాడు. చాలా భాషలు, ముఖ్యం ఐరోపీయ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలనని చెప్పాడు. తెలుగు కూడా కొద్దికొద్దిగా మాట్లాడేడు. అతడి కొడుకు కూడా గైడుగా స్థిరపడాలనే ఉద్దేశ్యంతో ఇటాలియన్ నేర్చుకుంటున్నాడట. వాళ్ళు నేతకారుల కుటుంబానికి చెందినవాళ్ళు. మా డ్రైవరు-గైడు సంతోష్ మేము కాశీలో ఏమి చూసినా చూడకపోయినా, ‘బనారసీ సాడీ-పాన్-మలయా రబ్డీ’ రుచిచూడక తప్పదన్నాడు. అందుకని మాతో వచ్చిన గైడు నేతకారుల కుటుంబాలకు చెందినవాడని తెలియడంతో నేనతణ్ణి బనారస్ చేనేత గురించీ, చీరల గురించీ అడుగుతుంటే, అతడు మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ జ్ఞానేశ్వర మహరాజ్ మందిరం కూడా ఉంది. పక్కనే ఇంట్లోనే చీరల దుకాణం.అది పూర్వకాలపు బనారస్ గృహం కావడంతో బయట ఎండమండుతున్నా ఆ లోపల చాలా చల్లగా ఉంది. అక్కడ వాళ్ళ చేనేత గురువు ఉన్నాడు. ఆయనే వాళ్ళ చీరలకి డిజైన్లూ, మోటిఫ్ లూ ఇతర నాణ్యతా ప్రమాణాలూ చూస్తుంటాడు. అతడు మా ముందు రకరకాల పట్టు వస్త్రాలు పరిచి చూపిస్తున్నాడు. అవి చూస్తుంటే, ఆముక్త మాల్యద కావ్యం గురించి విశ్వనాథ రాస్తూ, ఆ కావ్యం తెలుగు సాహిత్యానికి అలంకరించిన బనారసు పట్టు చీర అని రాసింది గుర్తొచ్చింది. అంటే మా ముందు ఆ ప్రభాతవేళ అన్ని ఆముక్తమాల్యద కావ్యాలు ప్రత్యక్షమయ్యాయన్నమాట.

2
కాశీ అన్నప్పణ్ణుంచీ నా మదిలో భక్తికవులే మెదుల్తూ ఉన్నారు. తులసీ, కబీర్, రైదాస్, మీరా లు నడయాడిన భక్తిసాహిత్యభూమి అది. అందుకని కాశీ విశ్వేశ్వరుడి సన్నిధినుండి మేము తిరిగి హోటల్ కి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక, మధ్యాహ్నభోజనం చేసి గురు రవిదాస్ మందిరానికి వెళ్ళాం.

గురు రవిదాస్ (1414-1540 లేదా 1450-1520) వారాణసి పొలిమేరల్లో జన్మించాడు. వృత్తిరీత్యా చెప్పులు కుట్టుకునేవాడు. అతడికి రామానందుల అనుగ్రహం లభించింది. కాని అతడి భక్తి, ప్రవచనం సనాతన సమాజానికి రుచించలేదు. అతడితో వాళ్ళు చాలాకాలం పాటు తలపడి అతణ్ణి వేధిస్తూనే ఉన్నారు. కాని భక్తకవులందరి జీవితాల్లో సంభవించినట్టే, అతడి జీవితంలోనూ దైవం అతడి పక్షాన నిలబడి అతణ్ణి కాచుకుంటూ ఉన్నాడు. చివరికి మహారాజులు, రాణులు, కూడా అతడికి శిష్యులుగా మారిపోయారు.

ఆయన పాడుకున్న 40 కీర్తనలు ‘ఆదిగ్రంథం’ (1604) లో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయన పేరు మీద గీతాలు, సాఖీలు అన్నీ కలిపి 194 దాకా లభ్యమవుతున్నాయి. ఇటీవలి కాలంలో రవిదాస్ దళిత ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తి ప్రదాతగా ఉంటున్నాడు. కులాల అణచివేతలేని ఒక ‘బే-గమ్-పురా’ ని రైదాసు స్వప్నించాడు. అటువంటి స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని తపించేవాళ్ళందరికీ రైదాసు ఇప్పుడు సజీవస్ఫూర్తిగా ఉన్నాడు.

డ్రైవరు మమ్మల్ని దక్షిణ కాశీలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పక్కన రవిదాస్ జన్మస్థలంగా గుర్తించబడ్డ చోటకి తీసుకువెళ్ళాడు.అక్కడ ఇప్పుడొక పెద్ద మందిరం నిర్మించారు. ఆ మందిరగోపురానికి బంగారు తాపడం కూడా చేసారు. లోపల గురు రవిదాస్ విగ్రహం, ప్రార్థనామందిరం ఉన్నాయి. భక్తులకోసం ఒక భోజనాలయం కూడా ఉంది.

మేము రైదాసు మూర్తి ఎదట నిలబడి ఉండగా పక్కనొక భక్తుడూ, కొందరు యాత్రీకులూ కూడా అక్కడ కనిపించారు. ఆ భక్తుడు జలంధర్ కి చెందిన ఒక చమర్. ఆయన రైదాసు వాణిని జపిస్తూ ఉన్నాడు. ఆయన పక్కన నిలబడ్డ యాత్రీకులు మీర్జాపూర్, వింధ్యాచల్ ల నుంచి వచ్చిన చమర్లు. వాళ్ళు చాలా చిన్నకారు రైతులు. ఒక్కొక్కరికీ ఎకరం కన్నా ఎక్కువ భూమి లేనివాళ్ళు. గొట్టపు బావుల మీద వ్యవసాయం చేస్తున్నారట.

వాళ్ళ గురువుగా ఉన్న ఆ భక్తుడి చేతిలో రైదాస్ కీర్తనల సంపుటి ఉంది. ‘మీరు మా కోసం ఒక కీర్తన వినిపించగలరా’ అని అడిగాను.

తప్పకుండా, లోపలకి రండి అని అక్కడ ఉన్న మరో గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ మరికొందరు యాత్రీకులున్నారు. వాళ్ళు శిఖ్ఖుల్లాగా కనిపిస్తున్నారు.

‘వీరు శిఖ్ఖులా?’ అని అడిగాను.

‘తెలియదు, నేను కూడా వారి కులమతాలేమిటో తెలుసుకోలేదు’ అన్నాడు ఆ రైదాసీ. నాకు సిగ్గనిపించింది. ‘జాతి న పూఛో సాధు కీ’ అన్న కబీర్ వాక్యం గుర్తొచ్చింది. వారు మా కులమతాలేవో ప్రశ్నించకుండానే మమ్మల్ని లోపలకి రమ్మన్నారు కదా అని తట్టింది.

అప్పుడాయన రైదాసు జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని వివరించి, ఒక కీర్తన ఆలపించాడు. రైదాసుమీద సనాతనులు రాజుకి ఫిర్యాదు చేసినప్పుడు రాజు పెట్టిన పరీక్షలో దేవుడు రైదాసుని నెగ్గించాడు. అప్పుడు అతణ్ణి విమర్శించినవారే అతడికి పల్లకీ పట్టి ఊరేగించారు. ఆ సందర్భంలో రైదాసు దేవుణ్ణి కీర్తిస్తూ పాడిన గీతం:

ఐసీ లాల్ తుఝ్ బిన్ కౌణి కరే
గరీబ్ నివాజ్ గుసైయియా మేరా మాథే ఛతర్ ధరే
జా కీ చోట్ జగత్ కఔ లాగై త పార్ తున్హీ ధరే
నీచో ఊఛ్ కరాయి మేరా గోబింద్ కహూ తే న డరే
నామదేవ్ కబీర్ తిలోచన్ సాధ్నా సాయిన్ తరే
కే రవిదాస్ సునో రే సంతో హర్ జీఓ తె సభ్ సరే

(హే ప్రభూ, నువ్వు కాక మరెవ్వరీ మహిమ చూపగలరు? బీదల రక్షకుడివి, లోకపాలకుడివి, నీ అనుగ్రహంతో నాకు గొడుగుపట్టారు. ఎవరి స్పర్శకి ప్రపంచం మైల పడుతుందంటారో అతడివైపే నువ్వు నిలబడ్డావు. కిందకు నెట్టబడ్డవాణ్ణి పైకి లేవనెత్తావు. ప్రభూ, నీకు ఎవరి భయమూ లేదు. నామదేవుడు, కబీరు, త్రిలోచనుడు, సాయి ఈ సంసారసాగరాన్ని నీ మహిమవల్లే తరించారు. సాధువులారా, రవిదాస్ చెప్తున్నాడు వినండి, ప్రభువుకి సాధ్యం కానిదేదీ లేదు.)

ఆ గీతం వింటున్నంతసేపూ నాకు పెరియాళ్వారు పాండ్యరాజు కొలువులో గెలిచినప్పటి వృత్తాంతమే గుర్తొస్తూ ఉంది.

ఆ గురువు కీర్తన పాడిన తరువాత, ఆ కీర్తన భావార్థాన్ని మాకు హిందీలో వివరించేక ‘మీరెంతో భాగ్యశాలులు, కాబట్టే గురు రవిదాస్ దర్శనం చేసుకోగలిగారు’ అన్నాడు.

మేం బయటకివస్తుంటే, ఆ దేవాలయ సిబ్బంది మమ్మల్ని మళ్ళా లోపలకి పిలిచారు. కొద్దిగా టీ తాగి వెళ్ళమని అడిగారు. అక్కడ భోజనాలయంలో ఎందరో బీదయాత్రీకులు, పేదరైతులు కూచుని టీ తాగుతూ ఉన్నారు. మేము కూడా వారితో కలిసి తేనీరు తాగాం. బయట ఒక కిరాణా దుకాణం ముందు భక్తి సాహిత్యం అమ్ముతూ ఉన్నారు. ఆ పుస్తకాల మధ్య Bhagat Poets of Sri Guru Grantha Sahib (2005) కనబడింది, నా కోసమే వేచి ఉన్నట్టు.

3
అక్కణ్ణుంచి మేము బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో కొంతసేపు తిరుగాడేం. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కొడవటిగంటి, పద్మరాజు, త్రిపుర ఎందరో రచయితలిక్కడే చదువుకున్నారు. ఆ విశ్వవిద్యాలయం ఎదురుగుండా మదన్ మోహన్ మాలవ్యా నిర్మించిన కాశీ విశ్వనాథ మందిరం కూడా చూసేం. అక్కణ్ణుంచి సంకట మోచన హనుమాన్ మందిరం చూసిన తరువాత తులసీ మానస మందిరానికి వెళ్ళాం.

తులసీదాస్ (1532-1623) వారణాసిలో పుట్టకపోయినా వారణాసిలో చాలాకాలమే నివసించి అక్కడే గంగాతీరంలో దేహత్యాగం చేసాడు. సంకట మోచన హనుమాన్ దర్శనం పొందాడనీ, ఆయన ఆశీస్సులతోనే రామచరిత మానస్ రాయగలిగాడనీ అంటారు. ఆయన రామచరిత మానస్ రచించాడని భావించే చోట తులసీ మానస్ మందిర్ పేరిట రెండంతస్థుల మందిరం నిర్మించారు. కలకత్తాకి చెందిన ఒక సేఠ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన ఆ తెల్ల పాలరాతి మందిరం గోడలమీద రామచరిత మానస్ కావ్యాన్ని పూర్తిగా తాపడం చేసారు.

మహాత్మా గాంధీ, సరస్వతీపుత్ర పుట్టపర్తి కాక, నాకు సన్నిహితంగా తెలిసిన వాళ్ళల్లో కూడా రామచరిత మానస్ ని గాఢాతిగాఢంగా ఆరాధించేవారు ఇద్దరున్నారు. ఒకరు, మా మాష్టారు స్వర్గీయులు హీరాలాల్ కామ్లేకర్ గారు, మరొకరు అదిలాబాద్ వాసి, మహాశిల్పి రవీంద్రకుమార్ శర్మ. వారి స్ఫూర్తితో కొన్నేళ్ళకిందట రామచరిత మానస్ కావ్యాన్ని నాకై నేను స్వయంగా చదువుకున్నాను. రామకథకి మధ్యయుగాల మహామనోహర వ్యాఖ్యానమైన ఆ కావ్యాన్ని తలుచుకోగానే నాకు గుర్తొచ్చేవి సుందరవర్ణనలు, ఉపమానాలూ, అత్యంత లలితమైన ప్రాకృతగంధి అవధి హిందీ.

రామచరిత మానస్ కావ్యంలో రామకథ నారదుడు వాల్మీకికి చెప్పింది కాదు. శివుడు పార్వతికి చెప్పిన కథ. ఆ కథా ప్రారంభంలో భరద్వాజుడు యాజ్ఞవల్క్యుణ్ణి ఈ విధంగా అడిగాడు: ‘మహాత్మా, ఈ రాముడెవరు? నాకు విశదంగా చెప్పండి. ఒక రాముడు అయోధ్యాపతి దశరథ కుమారుడు…ఆయన వృత్తాంతం లోకానికి విదితమే. పరమశివుడు నిత్యం జపించేది ఈ నామమేనా? లేక మరోనామమా? మీరు సత్యం తప్ప మరొకటి మాటాడనివారు, అన్నీ తెలిసినవారు. దయతో నా ప్రశ్నకి సమాధానమివ్వండి’ (మానస్:1:45:3-4, 46) అని. ఆ ప్రశ్నకి సమాధానం అన్వేషిస్తూ తులసీ రామ చరిత మానస్ కావ్యం రాసాడు. మధ్యయుగ భారతదేశం తాలూకు సామాజిక విశ్వాసాల పరిథిలోనే ఆయన ఆ అన్వేషణ సాగించినప్పటికీ, అది పండితుల, పాలకుల దృక్కోణం నుంచి కాక సాధు సంతుల దృక్కోణం నుంచి అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. రామ మహిమ, రామ సౌందర్యం, రామచరిత ఎంత వివరించినా తనివితీరని తులసీ చివరికి ఒక మాటన్నాడు: ‘అతి కృపాల రఘునాయక/ సదా దీన పర నేహ'( రాముడు అత్యంత దయామూర్తి,దీనుల మిత్రుడు), ‘కోమల చిత అతి దీన దయాలా/కారన బిను రఘునాథ కృపాలా’ (కోమల హృదయుడు, దీనులపట్ల దయాళువు, ఇంకా చెప్పాలంటే అసలు కారణం లేకుండానే ఆయన దయాళువు’). ఆ నిష్కారణ కృపామూర్తి అయిన రాముడెవరో మనకు తెలుసునా?

4
అక్కణ్ణుంచి దుర్గాదేవి మందిరం చూసుకుని మేం గంగాహారతి చూడటానికి గంగ ఒడ్డుకి చేరుకున్నాం. అప్పటికే, సూర్యాస్తమయం అయినప్పటికీ, ఇంకా వెలుగు ఆవరించే ఉంది. దశాశ్వమేథ ఘాట్ దగ్గర హారతి కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మేమొక నావ అద్దెకు తీసుకుని గంగపైన విహారానికి బయలుదేరాం.

డ్రైవరు కూడా మాతో పాటు పడవ ఎక్కి, మాకు ఆ ఘాట్లు ఒక్కొక్కటే చూపిస్తూ ఉన్నాడు. కాశీకి గంగ వల్ల చేకూరిన శోభ ఇంతా అంతా కాదు. హిమాలయాలనుండి దక్షిణ దిశగా ప్రవహిస్తూ వచ్చిన గంగ కాశీ దగ్గరకు రాగానే ఎందుకనో ఉన్నట్టుండి ఉత్తరదిక్కు తిరిగింది, తిరిగి హిమాలయాలకు మరలిపోవాలనా? ఆ గంగ ఒడ్డున, వరుణ, అస్సీ నదులు కలిసే తావుల మధ్య అర్థచంద్రాకారంగానో, ధనురాకారంగానో కాశీనగరం ఏర్పడింది. ఆ అర్థాచంద్రకృతిలో కొంతభాగం మేరకు పడవవాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి చూపించేరు. నెమ్మదిగా చీకటి పడుతున్నది. అప్పుడు చూపించారు మణికర్ణికా ఘాట్ ని.

ఆ మణికర్ణిక శాశ్వత స్మశాన భూమి. అక్కడ గత రెండువేల ఏళ్ళుగా చితాగ్ని రగులుతూనే ఉన్నదని హావెల్ రాసేడు. ఇంకా చిత్రమేమంటే, పోయిన ఏడాది కాశీ మీద కొన్ని యాత్రా వ్యాసాలు రాస్తూ ఒక రచయిత్రి మణికర్ణిక సమీపంలో ‘మా హోటళ్ళు స్మశానానికి చాలా దగ్గర్లోనే ఉన్నాయన్న ప్రకటన ఒకటి చూసేనని’ రాసింది. అది మృత్యువిహారభూమి మాత్రమే కాదు, మృత్యువు ఒక కమాడిటిగా మారిన భూమి కూడా.

గ్రీష్మతాపం తగ్గి గంగ మీంచి చల్లటిగాలులు తిరుగుతూండగానే గంగకి ఆవలి ఒడ్డున ఆకాశంలో పున్నమి చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. దూరంగా గంగాహారతి సన్నాహం మొదలయినట్టు తెలుస్తూండటంతో పడవవాళ్ళు పడవని ఒడ్డువైపు మళ్ళించారు. అప్పటికే అక్కడ వందలాది పడవలు చేరుకున్నాయి. వాటినుండా వేలాదిమంది సందర్శకులు. వలలాగా అల్లుకున్న ఆ పడవల మధ్య మా పడవకూడా సర్దుకుంది. హారతి మొదలయ్యింది.

ఆ తర్వాత అరగంటసేపో, గంటసేపో, కాలం తెలీదు కానీ, మా కళ్ళముందొక రంగుల సముద్రం పోటెత్తింది. మంగళవాద్యాల, శంఖతాళాల మధ్య బిగ్గరగా పాడుతున్న హారతిగీతాల మధ్య దేదీప్యమానమైన దీపాల వెలుగు, రంగురంగుల దీపాలు, ఆ దీపకాంతిలో లక్షలాది రంగుల్లో యాత్రీకులు, వారి వదనాలన్నీ నీటిమీద కలిసిపోతున్న నీటిరంగుల్లాగా అలుక్కుపోయి ఆ ఒడ్డంతా ఒక ఇంద్రచాపం పరిచినట్టుగా అనిపించింది. ఆ హారతి నాలో భక్తిని కాక, మహాసౌందర్యస్ఫురణని జాగృతం చేసింది. నా పసితనంలో మా ఇంటిముందు వేసవి రాత్రుల్లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆ రంగులు, ఆ సంగీతం, ఆ దీపాలు, ఆ రాగాలు కలగలిసి చిత్రించిన అలౌకిక దృశ్యమే మళ్ళా మరింత విస్తరించి ఇప్పుడు నా కళ్ళముందు ప్రత్యక్షమవుతున్నదా అనిపించింది. మధ్యలో వెనక్కి తిరిగి చూస్తే ఆకాశవీధిలో మరొక వెన్నెల హారతి.

15-6-2017

Leave a Reply

%d