జీవితంలో మొదటిసారి కాశీయాత్ర చేసాను. మూడు పగళ్ళూ, మూడు రాత్రులూ కాశీలో గడిపాను. చూసాను. కానీ పూర్తిగా దర్శించానని చెప్పలేను. మూడు సర్గలు మటుకే చదివి మహాభారతం అర్థమయిందనుకుంటే ఎట్లానో ఇదీ అట్లానే. అయినా ఒక ప్రలోభం, చూసిందేదో దాన్ని మీతో పంచుకోవాలని.
1
మా తాతగారు కాలినడకన కాశీ వెళ్ళారని మా నాన్నగారు చెప్పేవారు. ఆయనకి మా తాతగారు కాశీ విశ్వేశ్వరుడి పేరే పెట్టుకున్నారు. కానీ మా నాన్నగారు కాశీ వెళ్ళలేకపోయారు. బహుశా అందుకేనేమో కాశీ వెళ్ళగలనని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పుడు మా ఊళ్ళో, ఆ తాటాకుల ఇంట్లో ఈశాన్యమూల చిన్న దేవుడి గది ఉండేది. అక్కడ మా అమ్మ వ్రతాలు చేస్తుండేది. ఆమె కోసం ఆ పసితనంలో శివదేవుడి వ్రతకల్పం చదివిపెట్టేవాణ్ణి. ఆ పుస్తకంలో కాశీ వర్ణన ఉండేది, అట్ట వెనక అన్నపూర్ణాష్టకం. మా ఇంట్లో మహాభక్తవిజయం ఉండేది. ఆ పుస్తకంలో శివభక్తుల కథలు ఎన్ని సార్లు చదివిఉంటానో లెక్కలేదు. ఇక తర్వాతి రోజుల్లో ఉద్యోగరీత్యా శ్రీశైలంలో గడపడంతో కాశీ వెళ్ళాలన్న కోర్కె కూడా పోయింది. కానీ అయిదారేళ్ళ కిందట, నా మిత్రురాలొకామె, ఉద్యోగరీత్యా లక్నోలో పనిచేస్తున్నామె, హిందువు కాని, దేవుడి మీద నమ్మకం లేని భావుకురాలు నా కోసం కాశీనుంచి గంగాజలం తీసుకువచ్చింది. అప్పుడు మటుకు చాలా బలంగా అనిపించింది. కాశీ చూడాలని.
కాశీ ప్రయాణం గురించి నేనింకా ప్రణాళికలు వేస్తూండగానే మా పిల్లలు నన్ను నిలవనివ్వలేదు. దాంతో ‘ఖేచరీ గమనం’ లాంటి ఇండిగో గమనం మీద కాశీ వెళ్ళాం. 1830 లో ఏనుగుల వీరాస్వామయ్య కి మూడు నెలలు, రైలు మార్గాలు పడ్డ తర్వాత, 1889 లో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి పది రోజులు పట్టిన ప్రయాణం మాకు గంటా యాభై నిమిషాలు మటుకే పట్టింది. కాని అది సౌకర్యం కన్నా అసౌకర్యమే అనిపించింది నాకు. నదీనదాలూ, కొండలూ, మైదానాలూ చూడకుండా రెండు గంటల్లో కాశీ వెళ్తే నీకేమి తెలుస్తుంది? అందుకని బాబత్ నగర్ ఎయిర్ పోర్ట్ లో దిగినక్షణం నుండి నేను కాశీగాలి పీల్చాలనీ, చూసిన ప్రతి దృశ్యం నుంచీ ఎంతో కొంత పిండుకోవాలనీ తపిస్తూనే ఉన్నాను.
2
మమ్మల్ని హోటల్ తీసుకు వెళ్ళిన డ్రైవరే మా మొదటి మార్గదర్శకుడు. ‘అన్నిటికన్నా ముందు మీరు బాబా విశ్వనాథుడి దర్శనం చేసుకోండి, ఆ తర్వాత మీరు ఏమి చూడాలనుకుంటే అవి చూడండి’ అన్నాడు. అతడు చెప్పినట్లే శనివారం పొద్దున్నే ఇంకా తెల్లవారకుండానే మేం దర్శనానికి బయలు దేరాం. మొదట గంగా దర్శనం. గంగకి నమస్కరించి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకున్నాం. అప్పుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని, కాలభైరవుణ్ణి దర్శించుకున్నాం.
అప్పుడప్పుడే తెల్లవారుతున్న ఆ ప్రాతఃకాల వేళ ఆ ఇరుకుసందుల్లో, ఆ మురికి సందుల్లో, ఆవులూ, సన్యాసులూ సంచరిస్తున్న ఆ వీథుల్లో తిరుగుతుంటే నాకు కొత్త స్థలాన్ని చూస్తున్నట్టనిపించలేదు. ముప్పై నలభై ఏళ్ళ కిందటి రాజమండ్రిలో తిరుగుతున్నట్టే ఉంది. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఆ పురాతనమైన వీథులిట్లానే ఉండేవి. గంగ ఒడ్డునుంచి కొద్దిగా దూరంగా వచ్చాక నాకు పదే పదే శ్రీశైలమే గుర్తొస్తూ ఉండింది.
కానీ, నేనింతవరకూ చూసిన, తిరిగిన, నివసించిన నగరాలూ, పట్టణాలన్నిటికన్నా కాశీ ప్రత్యేకంగా కనిపించింది. ఆ ప్రత్యేకత కోసం మాటలు వెతుక్కోవలసిన పనిలేకుండానే పూర్వయాత్రీకులు, రచయితలు, స్థలపురాణకారులు ఎంతో రాసిపెట్టారు. ఉదాహరణకి పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో కాశీ చూసిన మార్క్ ట్వేన్ అన్నాడట: ‘బనారస్ చరిత్రకన్నా పురాతనమైనది, సంప్రదాయం కన్నా పురాతనమైనది, స్థలపురాణాలకన్నా పురాతనమైనది, అవన్నీ కలిపితే కూడా వాటన్నిటికన్నా రెట్టింపు పురాతనమైనది’ అని. 20, 21 శతాబ్దాల్లో కాశీ సందర్శించిన ఏ ఒక్క యాత్రా చరిత్రకారుడూ కూడా అంతకన్నా మరొక్క మాట కూడా అదనంగా చెప్పలేకపోయాడు. అందులో ప్రాచీనతా ప్రశంస మాత్రమే ఉంది, ఆధ్యాత్మికత స్ఫురించడం లేదనుకుంటే, 1911-1914 మధ్యకాలంలో కాశీని చూసిన జర్మన్ ఇండాలజిస్టు కౌంట్ హెర్మన్ కీజిర్లింగ్ మాటల్ని కూడా తలుచుకోవచ్చు. ఆయనిట్లా రాసాడు: ‘బనారస్ పవిత్రస్థలం. కేవలం పైపైన మాత్రమే వికసించిన యూరోప్ కి ఇట్లాంటి సత్యాలు అర్థం కావటం కష్టం. ఇక్కడ తిరుగుతుంటే, మరెక్కడకన్నా కూడా నాకు ప్రపంచకేంద్రానికి సన్నిహితంగా ఉన్న భావన కలుగుతూ ఉంది. ఇక్కడెందుకో ప్రతిరోజూ, ఆ మాటకొస్తే, బహుశా ఈ రోజే త్వరలోనే నేనొక అత్యున్నత అనుగ్రహానికి పాత్రుణ్ణి కాగలననిపిస్తోంది’ అని.
3
కాశీ ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒకసారేనా దర్శించవలసిన చోటంటారు. కాని కాశీని చూసినతరువాత అది జిజ్ఞాసి అయిన ప్రతి భారతీయుడూ ఒకసారేనా చూసి తీరవలసిన చోటనిపించింది. ఎందుకంటే కాశీ హిందువులది మాత్రమే కాదు. అది భారతీయులందరిది. జైనం, బౌద్ధం, షడ్దర్శనాలతో పాటు మహ్మదీయ, క్రైస్తవ ధర్మాలతో పాటు భక్తి ఉద్యమంతో పాటు, ఆధునిక సాహిత్యోద్యమాలైన ఛాయావాదం, ప్రగతివాదాలదాకా ప్రతి ఒక్క మానవవికాసోద్యమం అక్కడ వర్ధిల్లింది. వర్ధిల్లడమే కాదు, ఎన్నో ఆచార, ఆరాధానా, ఆలోచనా సంప్రదాయాలింకా అక్కడ సజీవంగా కొనసాగుతూనే ఉన్నాయి. నేనున్న మూడు రోజుల్లో ఆ సంప్రదాయాల్లో కొన్నింటినేనా నమూనాగానైనా చూడాలనుకున్నాను, చూసాను.
కాశీ సూక్ష్మరూప భారతదేశం. ఈ దేశంలో ఎన్ని వైరుధ్యాలున్నాయో అన్నీ అక్కడ కనిపిస్తాయి. అక్కడ శౌచం గురించిన ఆరాటం ఎంత ఉందో అంత అశౌచం ఉంది, జీవితం అక్కడ ఎంత ఉరుకులు పరుగులు పెడుతుందో, అంత తీరికదనముంది. మరింత బాగా బతకాలని మనుషులు అక్కడ ఎన్ని మొక్కులు మొక్కుకుంటారో, అక్కడ చనిపోవాలని కూడా అంతగా కోరుకుంటారు. ఎవరి సంప్రదాయాన్ని వారెంత మక్కువతో మమతతో హత్తుకుని ఉంటారో పక్కవాడికి కూడా అంతగా చోటు వదిలిపెడతారు.
కాశీ నిజంగా కోరుకునేదేమిటి? చెప్పడం కష్టం.
పొద్దున్నే చెత్తతో నిండిపోయిన ఆ వీథుల్లో దర్శనానికి వెళ్తుంటే, మా మార్గదర్శకుడు సంజాయిషీగా ‘ఎనిమిదింటికల్లా ఈ చెత్త శుభ్రమైపోతుంది’ అన్నాడు. స్వచ్ఛభారత్ గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి వారాణసి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన కాశీవాసులకి చేతులెత్తి మొక్కి చెప్పాడుట: ‘మీరు శుభ్రతని పాటించకపోతే నేను తక్కినదేశానికి ఏమీ చెప్పలేను’ అని. మా గైడు చెప్పినట్టే, ఎనిమిదింటికల్లా ఆ వీథులు శుభ్రపడ్డాయి. కాని తొమ్మిదింటికల్లా మళ్ళా ఆ వీథుల్లో చెత్త పోగుపడటం మొదలయ్యింది.
కాశీఖండంలో ఒక చిత్రమైన కథ ఉంది. ఒకప్పుడు భూమ్మీద అరాచకం ప్రబలిపోయిందట. దాన్ని చక్కదిద్దే రాజు కోసం బ్రహ్మ వెతికి రిపుంజయుడనే రాజుని పిలిపించాడట. అతడికి రాజ్యపాలన మీద ఇష్టం లేదు. కాని బ్రహ్మ అతణ్ణి కాశీని పాలించమని అడిగాడు. అవ్యవస్థ చక్కదిద్దమన్నాడు. బ్రహ్మ మాట కాదనలేని రిపుంజయుడు ఒక షరతు పెట్టాడట. తాను కాశీలో సువ్యవస్థ తేవాలంటే దేవుళ్ళంతా ఆ నగరాన్ని విడిచిపోవాలని పట్టుబట్టాడట. అతడి కోరిక ప్రకారమే దేవుళ్ళంతా ఆ నగరం విడిచివెళ్ళిపోయారు. అప్పుడు చాలా ఏళ్ళ పాటు రిపుంజయుడు అద్భుతమైన పాలన సాగించాడు. కాని కాశీని విడిచిపోయిన దేవుళ్ళకి కాశీమీద బెంగపుట్టింది. ఎట్లాగైనా తిరిగి నగరంలో ప్రవేశించాలని పరితపించారు. కుట్రమీద కుట్ర పన్నారు. యోగినుల్ని పంపించారు. సూర్యుణ్ణి పంపించారు, ఆ రాజుతో దశాశ్వమేథాలు చేయించారు. కానీ ఆ రాజు పాలన సడలలేదు. చివరికి ఒక జ్యోతిష్కుడి రూపంలో ఒక దేవత వచ్చి ఆ రాజు మనసుని బలహీనపరిచాడు. రాజు మనసు బలహీనపడగానే దేవీదేవతలంతా తిరిగి కాశీని ఆవరించేసారు.
ఈ పురాతనమైన కథని ప్రతి చారిత్రిక దశలోనూ మళ్ళా కొత్తగా చెప్పుకుంటూనే ఉన్నారు. బహుశా 21 వ శతాబ్దంలో ఈ కథ నాకేమి చెప్తోందంటే, ‘నువ్వు ఏదో ఒకటి మాత్రమే కోరుకోగలవు : సువ్యవస్థనో, లేదా దేవీదేవతల ఉనికినో’ అని, కాశీ సువ్యవస్థని కాదు, దేవుళ్ళని కోరుకుంది అనిన్నీ.
దేవీదేవతలంటే హిందూ దేవతలు మాత్రమే కాదని కాశీలో హిందువులు ఎప్పుడో తెలుసుకున్నారు, ఆ సత్యంతో వాళ్ళు సమాధానపడటమే కాశీజనావాసంలోని అత్యంత సుందరవిశేషం. సువ్యవస్థ అంటే నువ్వు మాత్రమే నమ్ముతుండే ఒక order. అది రానురాను సంకుచితంగా మారిపోతుంది. మనుషులకి కావలసింది పదిమందీ కలిసి బతకడం. విభిన్న సంస్కృతులకీ, విభిన్న ఆచారాలకీ సంబంధించిన మనుషులు కలిసి బతకడం తప్పనిసరిగా chaotic గా ఉండితీరుతుంది. అలాగని నువ్వు ఒక్క రాజు పాలనకోసం అనేకుల దేవీదేవతల్ని బహిష్కరించలేవు. అందుకనే దివోదాసుడైన రిపుంజయుడు ఎంత మంచి పాలన అందించినా, కాశీ ప్రజలు, అతడికి బదులు, అసంఖ్యాక దేవీదేవతల్నే కోరుకున్నారు.
14-6-2017