ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మార్పు గురించి చెప్తూ ప్రొఫెసర్ రామనారాయణ్ మాతో ఒక విజయగాథ చదివించారు. అది ‘ సేవ్ ద చిల్డరన్’ కి చెందిన జెర్రీ స్టెర్నిన్ అనే ఉద్యోగి వియత్నాంలో పౌష్టికాహారలోపం సమస్యను ఎదుర్కోవడంలో సాధించిన ఒక అసాధారణ విజయానుభవం. ఆ అనుభవాన్ని ఆ ప్రొఫెసర్ మాతో చదివించారు. దాని మీద చర్చ లేవనెత్తారు.
స్టెర్నిన్ వియత్నాం వెళ్ళినప్పుడు అతడి సంస్థకి చెప్పుకోదగ్గ వనరులేవీ లేవు, అయినా కూడా ఆరునెలల్లోనే చెప్పుకోదగ్గ మార్పు తీసుకురావాలని అతడి పై అధికారులు అతణ్ణి ఆదేశించారు. మామూలుగా అయితే అట్లాంటి సమస్యను పరిష్కరించడానికి మనమొక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. ఒక లాగ్ ఫ్రేమ్ రూపొందిస్తాం. వ్యవస్థాపరంగా, ప్రభుత్వపరంగా ఎటువంటి మార్పులు రావాలో సూచిస్తాం. ఎంత నిధులు అవసరమవుతాయో, ఎంతకాలంపాటు అవసరమో లెక్కగడతాం. కాని స్టెర్నిన్ కి అవేవీ చేసే అవకాశం లేదు. అదనపు నిధులూ, అదనపు సిబ్బందీ సమకూరే ప్రశ్నే లేదు. కాని మార్పు తేవాలి, ఎట్లా?
ఒక బీదదేశంలో, చాలినన్ని వనరులులభ్యంగా లేని దేశంలో పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే ఏం చెయ్యాలి? కాని స్టెర్నిన్ ఈ ప్రశ్న మరోలా వేసుకున్నాడు. ఇటువంటి పరిమితుల్లో కూడా, ఇటువంటి బీదరికంలో కూడా ఎక్కడేనా పిల్లలు మామూలు ప్రమాణాల ప్రకారం ఆరోగ్యంగా ఉన్నారా? ఉంటే ఎందుకున్నారు?
ఆ ప్రశ్న అతణ్ణి కొన్ని కొత్తకోణాలు గుర్తించేలా చేసింది. అక్కడ కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారనీ, అందుకు కారణం వాళ్ళకి అదనపు ఆహారం దొరకడం కాదనీ, దొరికిన దాన్నే పిల్లలకు పెట్టడంలో ఆ తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేకపద్ధతులు పాటిస్తున్నారనీ అతడు గుర్తించాడు. స్థానికంగా దొరికే కొద్దిపాటి ఆహారంతోనే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోగలుగుతున్నారని అతడు గుర్తుపట్టాడు. దాన్నతడు positive deviance అన్నాడు.
ఆ విజయగాథని గ్రంథస్థం చేసిన చిప్, డాన్ హీత్ అనే సోదరులు స్టెర్నిన్ bright spots పట్టుకున్నాడన్నారు.
Switch: How to change things when change is hard ( ఆర్ హెచ్, 2011) అనే పుస్తకంలో ఆ సోదరులిద్దరూ ఇట్లాంటి అనుభవాలెన్నో గ్రంథస్థం చేసారు. ఆ రోజు మాతో స్టెర్నిన్ అనుభవాన్ని చదివించిన రామనారాయణ్ Switch పుస్తకం తప్పని సరిగా చదవవలసిన పుస్తకమని పదేపదే నొక్కి చెప్పడంతో ఆరోజే ఐ.ఎస్.బి బుక్ స్టోర్లో ఆ పుస్తకం కొనుక్కుని నిన్నటికి చదవడం పూర్తిచేసేసాను.
Switch నిజంగానే చాలా విలువైన పుస్తకం. సాధారణంగా ఇట్లాంటి వ్యవస్థానిర్వహణ గ్రంథాలు మనం సంపన్నదేశాలకీ, కంపెనీలకి అవసరమనుకుంటాం. కాని ఇట్లాంటి పుస్తకం మనలాంటి దేశాలకీ, సంస్థలకీ, కుటుంబాలకీ చాలా అవసరం. ముఖ్యంగా నిధులు, వనరులు చాలినంతగా లభ్యంగాని మన సమాజాల్లో మార్పు సాధ్యం కావడానికి మన ఆలోచనల్లో, అలవాట్లలో, ఆచరణలో ఎట్లాంటి కొత్త పద్ధతులు సాధ్యం కావచ్చో ఆ పుస్తకం మనలో ఆలోచన రేకెత్తిస్తుంది.
ఆ పుస్తకం చదువుతున్నంతసేపూ చాలా గుర్తొస్తూ ఉంది, చాలా కొత్త ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. కాని ఒక్క సంగతి మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తాను.
కాకినాడలో పడాల చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చిన్న ఔత్సాహిక సంస్థ ఉంది. వాళ్ళు ఫిబ్రవరి నెలలో కొంతమంది ఉపాధ్యాయులకి సన్మానం చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. నాతో పాటు పిల్లలప్రేమికుడు సి.ఎ.ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆ రోజు ఆ సంస్థ సన్మానం చేసిన 25 మంది ఉపాధ్యాయులూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నవాళ్ళు. అందులో 16 మంది మహిళలే. ఆ రోజు వాళ్ళందరితోనూ మాట్లాడించేం. వాళ్ళ అనుభవాలన్నీ వింటుంటే వాళ్ళెంత నిశ్శబ్దంగా సామాజిక పరివర్తన సుసాధ్యం చేస్తున్నారా అనిపించింది. వాళ్ళెవ్వరికీ కూడా తాము చేస్తున్నదాన్ని ఆర్భాటం చెప్పుకోవాలన్న తపనలేదు. కాని రాష్ట్రమంతటా ఎన్నో పాఠశాలలు తిరిగి చూసే నాకు వాళ్ళు చేపడుతున్న ప్రతి చిన్ని పనీ కూడా ఎంత విలువైందో అర్థమవుతూనే ఉంది.
కనీసం ఇద్దరు ఉపాధ్యాయులేనా తాము ఫలానా గ్రామంలో పాఠశాలలో చేరి ఒకటి రెండేళ్ళు పనిచెయ్యగానే స్థానిక ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఒక ఉపాధ్యాయిని ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడంకోసం పాంఫ్లెట్లు ముద్రించి ఆటో అద్దెకు తీసుకుని మైకు పెట్టి ప్రచారం చేసానని చెప్పింది. పదిమంది ఉపాధ్యాయులేనా తమ తరగతి గదుల్లో వికలాంగబాలబాలికలకి ఎంతో కొంత చేయూతనిస్తూనే ఉన్నారు.
సమాజం రుజాగ్రస్తంగా ఉందనీ,మానవసంబంధాలు వ్యాపారమయంగా మారిపోయాయనీ రాస్తున్న మన రచయితలకి తమ చుట్టూతా ఉన్న ఈ bright spots కనిపించడం లేదనుకోవాలి. ఆ రోజు మాట్లాడిన వాళ్ళల్లో ఒక ఉపాధ్యాయుడు తనకి ఒక చిన్న ఏక్సిడెంట్ అయి ఇంటిదగ్గర ఉండిపోతే తన బడిపిల్లలు ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి మరీ తనని చూడటానికి వచ్చారనీ, రస్కుల్లు, బిస్కెట్లూ తెచ్చారనీ చెప్పాడు. మన వార్తాప్రసారమాధ్యమాలు ఇటువంటి సంఘటనని పైకెత్తి చూపిస్తున్నాయా?
బహుశా చిప్, డాన్ హీత్ సోదరులకి ఈ సంగతి తెలిస్తే వాళ్ళు ఆ సంఘటనని అధ్యయనం చేసి తమ పుస్తకంలో దానికొక అధ్యాయం కేటాయించి ఉండేవారు కాదా?
4-4-2015