మొన్న సాయంకాలం పిల్లలు ‘దంగల్ ‘ అనే సినిమాకి టికెట్లు బుక్ చేసి తీసుకువెళ్ళారు. ఆ సినిమా ఏమిటో, ఆ టైటిల్ కి అర్థమేమిటో కూడా తెలీదు. హిందీ సినిమా అని తెలియగానే నిరుత్సాహపడ్డాను కూడా.
కానీ, ఇరవై నిమిషాలు గడిచేటప్పటికే నేనొక ప్రత్యేకమైన సినిమా చూస్తున్నానని అర్థమయింది. ఆ తర్వాత ఆ సినిమాలో ఎప్పుడు ఎలా లీనమైపోయానో నాకే తెలియదు. సగం కథ నడిచేటప్పటికి,నా కళ్ళు వర్షిస్తూన్నట్టు అర్థమయింది. చివరి అరగంటా నేను చెప్పలేని భావోద్వేగానికి లోనయ్యాను. బహుశా టూరింగు టాకీసుల్లో సాంఘిక చిత్రాలు చూస్తూ కంటతడి పెట్టే పల్లెటూరి స్త్రీల నిష్కల్మష అంతరంగమేదో నాలో కూడా ఇంకా సజీవంగా ఉండి ఉంటుంది. ఆ నిర్మలత్వాన్ని ఆ సినిమా తట్టి లేపింది. సినిమా పూర్తయ్యేటప్పటికి, థియేటర్లో దీపాలు వెలిగినప్పుడు, తడిసిన నా కళ్ళని దాచుకోవడం నాకు చాలా కష్టమైంది.
‘దంగల్’ సినిమా కథ మళ్ళా ఇక్కడ రాయాలని లేదు. అది ఆడపిల్లలు సరే, మగపిల్లలు కూడా చూడవలసిన సినిమా, అంతకన్నా కూడా తల్లిదండ్రులంతా చూడవలసిన సినిమా. Invictus సినిమా చూసి గొప్ప భావోద్వేగానికి లోనయిన నాకు, అంతకన్నా గొప్ప కథ తెరమీద చూసాననిపించింది. ఇన్విక్టస్ లానే ఇది కూడా నిజజీవితంలో జరిగిన కథ కావడం కూడా ఒక కారణమనుకుంటాను.
దంగల్ చిత్రీకరణ గురించి చర్చించాలని లేదు నాకు. అది చూసితీరవలసిందే తప్ప చర్చించవలసింది కాదు. ఆ ఫిల్మీకరణలో ఏదైనా లోపమంటూ నాకు కనిపిస్తే, ఒకటే, అది ప్రభుత్వ క్రీడాపాఠశాలలో కోచ్ ని మరీ negative గా చూపించారన్నదే. తన దగ్గర శిక్షణ కోసం వచ్చిన క్రీడాకారిణికి కాంస్యపతకాన్ని టార్గెట్ గా నిర్ణయించినప్పుడే, ఆ కోచ్ కోచ్ కాకుండా పోయాడు. ఇంక అంతకు మించిన విలనీ ఏముంటుంది?
అమీర్ ఖాన్ అనే నటుడి సినిమాలేవీ ఇంతకుముందు చూసిన గుర్తులేదు నాకు. కాని, ఈ సినిమా ఒక్కటి చాలు, అతణ్ణి నేను చూసిన మహానటుల జాబితాలో చేర్చుకోవడానికి. ఇక ఆ పిల్లలిద్దరూ, చిన్నప్పటి పిల్లలూ, పెద్దపిల్లలూ కూడా మనతో చాలాకాలమే ప్రయాణిస్తారు.
సినిమా చూసాక, నన్ను వెంటాడుతున్న ప్రశ్న ఒక్కటే. ఎందుకు తెలుగుసినిమాల్లోనూ, ఆ మాటకొస్తే, తెలుగు సాహిత్యంలోనూ మనం ఇటువంటి ఆదర్శవాదానికి దూరమైపోయాం? ఒక జాతిగా మనం మరీ తెలివిమీరిపోయామా? లేక మనం మనకే తెలీనంత సినికల్ గా మారిపోయామా? ఇట్లాంటి కథలు మన చుట్టూ, మన మధ్య సంభవించడం లేదా? ఇట్లాంటి పోరాటాల్ని మనం పోరాటాలుగా గుర్తించలేకపోతున్నామా?
ఒకటి మటుకు నిజం. ఇటువంటి positive కథల్నీ, మనుషుల్నీ,ఆదర్శాల్నీ మనం మన పిల్లల ముందు పెట్టలేకపోతున్నాం కాబట్టే, వాళ్ళు pervert హీరోలవెనకా, pervert డైరక్టర్ల వెనకా పడుతున్నారు. ఆ perverts మన సాంఘిక-రాజకీయ జీవితాన్ని నిర్దేశించడం మొదలుపెట్టారంటే తప్పు వాళ్ళదా!
26-12-2016