డా. రాధేయ

385

ప్రపంచంలో సాహిత్యానికిచ్చే అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి లాంటిదే, ఎన్నో సార్లు, వివాదాల్లో చిక్కుకుంది. ఒకరిద్దరు ఆ పురస్కారం తిరస్కరించేరు కూడా. అటువంటిది, ఒక వ్యక్తి, ఒంటరిగా, తన పేరుమీద ముప్పై ఏళ్ళుగా కవిత్వానికి పురస్కారాలు ప్రకటిస్తూ, ఒక్కసారి కూడా ఎవరూ వేలెత్తి చూపలేకుండా నిర్వహించాడంటే మాటలా?

డా. రాధేయ ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు నెలకొలి మూడు దశాబ్దాలు గడిచింది. గత సంవత్సరానికిచ్చే పురస్కారాలు ఈ రోజు ప్రదానం చేయబోతున్నారు. గత సంవత్సరం బహుమతి నిర్ణయించడానికి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతల కమిటీలో నేను కూడా ఉన్నాను. అప్పుడు నాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది ఆ పురస్కారాన్ని ఎంత నిష్కళంకంగా, ఎంత నిబద్ధతతో ఎంపిక చేస్తున్నారో. ఆ అవార్డు సభలో మాట్లాడమని డా.రాధేయ నన్ను ఆహ్వానించేడు. ఆ సందర్భంగా ఆయన గురించీ, ఆ పురస్కారం గురించీ ఎన్నో విషయాలు తెలిసాయి.

‘అతడు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ’ అనో లేదా ‘అతడు వ్యక్తి కాదు శక్తి’ అనో అనడం పడికట్టువాక్యాలుగా మారిపోయేయిగానీ, డా.రాధేయ గురించి చెప్పడానికి, ఆ వాక్యాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. ఊహించండి, ఒక చేనేతకారుడి కొడుకు, మగ్గం బతుకులు, ఆ కుటుంబాల్లో తనొక్కడే చదువుకున్నవాడు. చాలీ చాలని జీతంతో ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించి, నెమ్మదిగా, కాలేజి లెక్చరర్ గా ఎదిగి, అయిదేళ్ళ కిందట, పదవీ విరమణ చేసిన మనిషి. అతడి వెనక ప్రభుత్వానికి చెందిన ఏ బలగం లేదు. అతడే సాహిత్య అకాడెమీకీ అధ్యక్షుడు కాడు, ఆ డబ్బుతో, తనకి నచ్చినవాళ్ళకి వితరణ చెయ్యడానికి. తన సొమ్ము, తన కష్టార్జితం, తన పిల్లలకోసం దాచివుంచుకోవలసిన డబ్బుతో, ప్రకటనలిచ్చి, కవిత్వసంపుటాల్ని ఆహ్వానించి, న్యాయనిర్ణేతలని వెతికి పట్టుకుని, పుస్తకాలు ఎంపికచేసి, తాను ఎక్కడ పనిచేస్తే అక్కడే సభలు నిర్వహించి, ఆ ఆ కవుల్ని యథాశక్తి సత్కరించి-ఇట్లానే మూడు దశాబ్దాలు గడిపేడు.

ఈరోజు ఆ ముప్పై మంది కవులతో పాటు, ఇంతదాకా ఆ పురస్కారం పొందలేకపోయిన మరొక పది మంది కవుల్ని కూడా జతపరిచి, అనంతపురంలో గొప్ప పండగ చేస్తున్నాడు. ఆ నలభైమందితో పాటు, మరొక ఇరవై మంది కవుల్ని కూడా సత్కరిస్తున్నాడు. మొత్తం అరవై మంది కవులు. అనంతపురం ఈరోజు నిజంగా రాయలేలిన సీమ అనిపించుకుంటున్నది. ఒక సాహితీమూర్తి శ్రీకృష్ణదేవరాయలు కావడానికి రాజ్యమే ఉండనక్కరలేదు. ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్?’ చాలామందిని అభినవభోజుడనీ, అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనీ అంటూంటారు. శుష్కమైన వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఆ బిరుదులు చాల బరువుగా బుజాలమీదకి వాలిపోయిన కిరీటాల్లాగా కనిపిస్తాయి. కాని, శ్రీకృష్ణదేవరాయలు అని అనవలసి ఉంటే రాధేయ లాంటి వ్యక్తినే అనాలి. తాను కవి అయిఉండి గత ముప్పై ఏళ్ళుగా ఎందరో కవులకు గండపెండేరాలు తొడుగుతున్నందుకు.

అవార్డులు నెలకొల్పేవాళ్ళు చాలాసార్లు ఆ అవార్డు కింద ఇచ్చే నగదు మొత్తం ఎంత పెద్దదిగా ఉంటే ఆ అవార్డు అంత ప్రతిష్టాత్మకం అవుతుందని భావిస్తూంటారు. తెలుగులో అటువంటి అవార్డులు లేకపోలేదు. కానీ, ఒక అవార్డు ప్రతిష్ట దాని వెనక ఉన్న నిష్పాక్షికత, విలువల పట్ల నిబద్ధత వల్ల మాత్రమే నిలబడుతుంది తప్ప, అయిదంకెల మొత్తం వల్ల కాదు. తనకి కేంద్ర సాహిత్య అకాడెమీ లభించిందిగానీ, ఉమ్మడిశెట్టి అవార్డు లభించలేదనే అసంతృప్తి తనను బాధిస్తూనే ఉంటుందని ఒక ప్రసిద్ధ కవి వాపోయేడంటే, ఆ అవార్డు ఎటువంటి ప్రతిష్టను సంతరించుకున్నదో ఊహించవచ్చు.

ఉమ్మడిశెట్టి సాహిత్యపురస్కారం వట్టి అవార్డు కాదు. ఆ బహుమతి చరిత్ర గత మూడు దశాబ్దాల వచన కవిత్వ చరిత్ర. నడుస్తున్న సమాజాన్ని తెలుగు కవిత ఎట్లా ప్రతిబింబిస్తున్నదో, ఏ పురిటినొప్పులు అనుభవిస్తున్నదో ఆ రికార్డు. ఆ ముప్పై మంది కవుల్నీ పరిచయం చేస్తూ డా.రాధేయ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. కాని, అంతకన్నా కూడా, సాహిత్యచరిత్రకారులు పూనుకోవలసిన పని అది. నా వరకూ నాకు, రిటైర్ అయినతరువాత, ఆ ముప్పై పుస్తకాల్నీ పరిశీలిస్తూ ఒక సమగ్ర పరిశీలన చేయాలన్న కోరిక మాత్రం చాలా బలంగా ఉంది.

ఈ రోజు తెలుగునేల మీద ప్రతి ఒక్క కవికీ అనంతపురం ఒక తీర్థస్థలిగా మారడానికి కారకుడైన ఆ ఒకే ఒక్కడికి నా అభినందన పూర్వక కరచాలనం, అత్మీయ ఆలింగనం.

15-7-2018

Leave a Reply

%d bloggers like this: