ట్రివియం

384

ప్రధానోపాధ్యాయులకోసం మేమొక కరదీపిక రూపొందిస్తూండగా నా కొలీగ్ డా.సర్వేశ్వర్ నెట్ లోంచి కొంత సమాచారం తీసిపెట్టాడు. అందులో ‘హెడ్ మాస్టర్’ అనే ఒక మాడ్యూల్లో ఒక వ్యాసం నా దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యాసం ద్వారా నేను మొదటిసారిగా డరోతీ సేయర్స్ రాసిన The Lost Tools of Learning (1947) గురించి విన్నాను.

ఆ వ్యాసం వెంటనే చదవకుండా ఉండలేకపోయాను. గత డెబ్బై ఏళ్ళుగా లెక్కపెట్టలేనన్ని సార్లు ముద్రించబడుతూ వస్తున్న ఆ వ్యాసం నాకొక కనువిప్పు. మొత్తం 23 పేజీల ఆ వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. విద్య పట్ల, బోధన పద్ధతుల పట్లా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన వ్యాసం అది.

మామూలుగా మనం యూరోప్ లో మధ్యయుగాలు చీకటి యుగాలనీ, మతం ప్రజల్ని గుడ్డిగా శాసించిందనీ, ఆ అంధయుగంనుంచి కొత్త పరివర్తన రినైజాన్సుతో మొదలయ్యిందనీ చదువుకున్నాం. అప్పుడే ప్రాచీన గ్రీకు గ్రంథాలు వారికి అందుబాటు లోకి వచ్చాయనీ, వాటిని అధ్యయనం చెయ్యడం ద్వారా వారు వివేచనాశీలురుగానూ, హేతువాదులుగానూ, మానవతావాదులుగానూ రూపొందారనీ చిన్నప్పుడు మా హైస్కూలో మా వెంకటరత్నం మాష్టారు మాకు చెప్పారు.

కానీ, ఆ గ్రీకు గ్రంథాల్ని మధ్యయుగాల విద్యార్థులు ఏ పద్ధతిలో చదివారు? వాటిని వారికెవరు బోధించారు? ఏ బోధన-అభ్యసన ప్రక్రియ వల్ల లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, బొకాషియో, డాంటే, షేక్ స్పియర్, గెలీలియో, బ్రూనో లు రూపొందారు? ఏ విద్యాబోధన పునాదులమీద తదనంతర కాలాల్లో ఫ్రాన్సిస్ బేకన్,న్యూటన్, వోల్టేర్, డెనిస్ డిడిరో, గొథే, సెర్వాంటిస్ లు ప్రభవించగలిగారు? వారు ఏ పద్ధతిలో చదువుకున్నారు? మాంటిసోరీ, పెస్టలోజి, ఫ్రోబెల్ వంటి విద్యావేత్తలు లేని కాలంలో, ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక విద్యావిధానం ఊహించడానికి కూడా లేని రోజుల్లో, అచ్చుపుస్తకాలూ, పత్రికలూ, కంప్యూటర్లూ, ఇంటర్నెట్లు లేని కాలంలో ఏ సామగ్రి, ఏ సాహసం, ఏ వ్యక్తిత్వ నిర్మాణం ఆధారంగా యూరోప్ ప్రపంచవిజేత కాగలిగింది?

ఇది ఒక ప్రశ్న. దీని వెను వెంటనే పుట్టే మరొక ప్రశ్న మరి ఇప్పుడు అటువంటి మహామేధావులు, సృజనాత్మక కళాకారులూ, మౌలిక శాస్త్రవేత్తలూ ఎందుకు ప్రభవించడం లేదు? నిజమే,టెక్నాలజీ పరంగా ప్రపంచం ఇప్పుడు సాధిస్తున్న విజయాలు మనం కొలవలేనివి. కాని మౌలిక విజ్ఞాన శాస్త్రంలో మనం ఎక్కడున్నాం?

ఇక మూడవ ప్రశ్న, అన్నిటికన్నా, ముఖ్యమైన ప్రశ్న, డరోతీ సేయర్స్ అడిగింది. ఆమె ఇలా అంటోంది:

‘ఇంతదాకా పశ్చిమ యూరోపు చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యున్నతస్థాయికి అక్షరాస్యతా శాతం చేరిన ఈ కాలంలో, ప్రజలు మనమింతదాకా కనీ వినీ ఎరగనంతగా, వ్యాపార ప్రకటనల, బహిరంగ ప్రచారాల ప్రభావానికి లోనుకావడం మీకు వింతగా, దురదృష్టకరంగా గోచరించడంలేదా? లేదా అదంతా, రేడియోవల్లా, పత్రికలవల్లా ముందటికంటే ప్రచారం మరింత విస్తృతంగా వ్యాపించడం తప్ప మరేమీకాదని తీసిపారేస్తారా? నిజంగా చూడండి, ఈ పరిస్థితికి, ఒక వాస్తవానికీ, అభిప్రాయానికీ మధ్య తేడా చూడలేకపోవడానికీ, నిర్ధారణకీ, సంభావ్యతకీ మధ్య సరిహద్దులు గీసుకోలేని ఈ పరిస్థితికి కారణం మన ఆధునిక విద్యాపద్ధతులేమోనన్న అనుమానం, మీ మనసుల్లో, లోపల్లోపల, మీకు కలగడం లేదా?’

ఆమె ఈ ప్రశ్న అడిగినప్పుడు యూరోప్ అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగించింది. ఒక ప్రజాస్వామిక దేశం ఒక రాజరిక దేశం మీద ఆటంబాంబు వేసిన పొగ మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె ఈ ప్రశ్న అడిగింది. కానీ, అప్పటికి టివి లేదు, ట్విట్టర్, స్కైప్, ఫేస్ బుక్, యూట్యూబుల్లేవు. ఇప్పుడు, ఈ అత్యాధునిక సమాచార ప్రసార సాధనాల మధ్య ఆమె ప్రశ్న,మరింత బిగ్గరగా నా మొహం మీద మొహం పెట్టి, అడుగుతోంది: చెప్పు, మనుషులు ఎందుకింత ద్వేషపూరితంగా, ఇంత అర్థరహితంగా, ఇంత వితండంగా వాదించుకుంటున్నారు?

డరోతీ సేయర్స్ వ్యాసం చదవకముందు నాకు అనుమానంగా ఉన్నదికాస్తా ఇప్పుడు రూఢి అయిపోయింది. ఈ అర్థరాహిత్యానికీ, ఈ ద్వేషానికీ మూలాలు మన పాఠశాలల్లోనే వెతకవలసి ఉంటుందని. విజ్ఞానసాధనాలు కాలేకపోయిన మన పాఠశాల వైఫల్యానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఇది. నిజమే, ఈ ఆధునిక విద్య మధ్యయుగాల్లో యూరోప్ లోనూ, వందేళ్ళ కిందట భారతదేశంలోనూ మనం ఊహించలేనిది. కాని, వందేళ్ళ కిందట దేశం చూసిన ఒక గాంధీ, టాగోర్, అంబేద్కర్, జగదీశ్ చంద్రబోస్, రామానుజన్, రామన్, రాధాకృష్ణన్ ఇప్పుడెందుకు కనిపించడం లేదు? భాషలేవైనా, ప్రాంతాలేవైనా, మతధర్మాలేవైనా, భారతదేశం ఒకటే అని తాము నమ్మి, మనల్ని నమ్మించగలిగిన ఆ మహామానవులు ఇప్పుడు టెలివిజన్ స్టూడియోల్లో ఎందుకు కనిపించడం లేదు?

మధ్యయుగాల్లో చదివిన చదువుకన్నా ఇప్పుడు మన పాఠశాలల్లో పిల్లలు ఎన్నో సబ్జెక్టులు చదువుకుంటున్నారనీ, కాని దాని అర్థం వాళ్ళు మధ్యయుగాలనాటి విద్యార్థుల కన్నా ఎక్కువ తెలుసుకుంటున్నారని మాత్రం కాదంటోంది డరోతీ. ఆమె ఈ మాటలు అంటున్నప్పటికి సరిగ్గా నలభై ఏళ్ళముందు గాంధీజీ తన ‘హింద్ స్వరాజ్’ లో ఈ ప్రశ్నలే వేసినట్టు ఆమెకి తెలీదు. తాను చదువుకున్న ఆల్జీబ్రా, జాగ్రఫీ, హిస్టరీ ఏవీ కూడా తన ఇంద్రియాలనెట్లా అదుపులో పెట్టుకోవాలో తనకు నేర్పలేకపోయాయని గాంధీ ఆ పుస్తకంలో వాపోయాడు.

మధ్యయుగాల్లో విద్యావ్యవస్థ ఇందుకు భిన్నంగా ఉండేదని అంటుంది డరోతీ సేయర్స్. అప్పుడు విద్యార్థులకి నేర్పేవి మొత్తం ఏడు అంశాలు. వాటిలో మొదటి మూడింటినీ ‘ట్రివియం’ అనీ, మిగిలిన నాలుగింటినీ ‘క్వాడ్రివియం’ అనీ అనేవారు. ట్రివియంలో మూడు అంశాలు: తర్కం, వ్యాకరణం, అభివ్యక్తి (రెటారిక్). తర్కం అంటే ఆలోచించమెట్లానో తెలుసుకునే కళ. వివిధ సంకేతాల్ని కనుగొనడం, వాటిమధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వ్యాకరణం. తాను అర్థం చేసుకున్నదాన్ని ఆలోచనతో మేళవించి చెప్పగలగడం రెటారిక్. నిజానికి ఇవి మూడూ సబ్జెక్టులుకావు, అధ్యయన పద్ధతులు అనవలసి ఉంటుంది. అంటే నేర్చుకోడమెట్లానో నేర్పే పద్ధతులన్నమాట. ఒకసారి, ఈ పద్ధతుల్ని పిల్లవాడికి పరిచయం చేసిన తరువాత, పిల్లవాడు, నేర్చుకోడమెట్లానో నేర్చుకున్నాక, ఏ విషయాన్నైనా, ఎంత కొత్త విషయాన్నైనా తనంత తానే నేర్చుకోగలుగుతాడు.

కానీ,ఇప్పుడు మన పాఠశాలల్లో ఇది జరుగుతోందా? ‘పిల్లవాడికి పద్యాలకి అర్థం చెప్పరూ’ అని వెంకమ్మ అడిగిన ప్రశ్నకి ‘యిప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపు జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్,ఆల్జీబ్రా, మాథమాటిక్స్, యివన్నీ హడలేసి చెప్తారండి’ అంటాడు గిరీశం. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా మన పాఠశాలల్లో నడుస్తున్నది విద్య కాదు, ‘హడలేసి చెప్పడమే’.

తర్కం, వ్యాకరణం, రెటారిక్ నేర్పిన తర్వాత, పిల్లలకి నాలుగు సబ్జెక్టులు మాత్రమే మధ్యయుగాలు నేర్పేవి. మొదటిది, అరిథ్ మెటిక్, అంటే, సంఖ్యల్ని అర్థం చేసుకోవడం. రెండవది సంగీతం. అంటే సంఖ్యాజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమెట్లానో తెలుసుకోవడం. మూడవది జామెట్రీ. అంటే స్థలం గురించిన పరిజ్ఞానం. నాలుగవది, ఖగోళశాస్త్రం. స్థలం గురించి తెలుసుకున్నదాన్ని ఆచరణలో అనువర్తింపచెయ్యడం. ఈ నాలుగు అంశాల్లోనూ మధ్యయుగాల్లో బోధించిన విషయం బహుశా ఇప్పుడు అయిదవతరగతి పిల్లవాడి స్థాయికి మించి ఉండకపోవచ్చు. కాని, మనం చూడవలసింది విషయవిస్తృతిని కాదు. విషయంవేరు, అభ్యసన సామర్థ్యం వేరు. ఇప్పటి అయిదవ తరగతి పిల్లవాడికి లభించే పరిజ్ఞానంతోనే అప్పుడొక కోపర్నికస్ రూపొందాడని మనం మర్చిపోకూడదు. కాని, ఇప్పుడు మసాచుసెట్స్ యూనివెర్సిటీనుంచి నోబెల్ బహుమతులు పుచ్చుకుంటున్న శాస్త్రవేత్తలు ప్రభవిస్తున్నారు కాని, మరొక కోపర్నికస్ పుట్టలేదని మనం గుర్తుపెట్టుకోవాలి.

ఇప్పుడు ఇరవయి ఒకటవ శతాబ్దానికి అవసరమైన విద్యానైపుణ్యాలుగా చెప్పుకుంటున్న నాలుగు నైపుణ్యాల్లోనూ: critical thinking, creative abilities, communication మధ్యయుగాల ట్రివియంలో ఉన్నవేనని నాకిప్పుడు అర్థమవుతోంది. నాలుగవ నైపుణ్యం, collaboration ఒక్కటే కొత్తగా వచ్చి చేరిన నైపుణ్యం. అందులో ఆశ్చర్యం లేదు. గత అయిదువందల ఏళ్ళుగా ప్రపంచం నేర్చుకున్న గుణపాఠాల వల్ల నేర్చుకోకతప్పని నైపుణ్యం అది.

8-7-2018

Leave a Reply

%d bloggers like this: