చేరా

353

చేకూరి రామారావుగారు ఇక మనమధ్య ఉండరన్న వార్త తెలియని వెలితిని తీసుకొచ్చింది. నిండైన మనిషి. భాషనీ, సాహిత్యాన్నీ అర్థం చేసుకున్నవాడు. తనకు తెలిసినదాన్ని, తను నమ్ముతున్నదాన్ని పదిమందితో పంచుకోవాలని ఉబలాటపడ్డవాడు.

దాదాపు ముఫ్ఫై యేళ్ళకిందట ఒక పుస్తకప్రదర్శనలో ఆయన ‘తెలుగువాక్యం’ దొరికితే చదివాను. అది చాలా సాంకేతికంగానే ఉన్నప్పటికీ, భాషాశాస్త్రాన్ని పాపులర్ చెయ్యాలన్న తపన కనిపించిందందులో.ఎవరీ చేరా అని అడిగాను మిత్రుల్ని. వాళ్ళు చాలానే చెప్పారు. ముఖ్యంగా ఆయన శ్రీశ్రీని ఒక సినిమా ఫేం గా చూడలేకపోయిన సంగతీ, కొంత కవిత్వం రాసినసంగతీ. కాని తక్కిన విస్తృత తెలుగుప్రపంచానికి తెలిసినట్టే చేరా కూడా నాకు బాగా తెలిసింది చేరాతల వల్లనే.

ప్రతి ఆదివారం చేరాతలు చదవడం కోసం ఆ రోజుల్లో సాహిత్యప్రపంచంలో కనవచ్చిన ఆసక్తి లాంటిది ఎనభైలమొదట్లో సస్పెన్స్ సీరియళ్ళ పట్ల కూడా నేను చూడలేకపోయాను. ఎంతో ఉత్కంఠభరితంగానూ, అనివార్యంగా వివాదాస్పదంగానూ ఉండే ఆ కవితావిశ్లేషణలు కవిత్వానుశీలనని నిజంగా ప్రజాస్వామికీకరించాయని చెప్పవచ్చు. కవిత్వం పట్ల సాధారణ ప్రజానీకంలో ఆసక్తిని రేకెత్తించిండంలో బహుశా చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి తరువాత చేరానే చెప్పాలి. భాషాశాస్త్రవేత్తలు నవ్యకవిత్వం పట్ల సానుభూతి చూపించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. వీరేశలింగంగారి కవులచరిత్రలో విస్మరణకు గురైన కవులెందరో ఉన్నారు. స్వయంగా మహాపండితుడూ, కవిత్వరహస్యవేత్త అయి ఉండికూడా సహృదయం కొరవడినందువల్లనే అక్కిరాజు ఉమాకాంతాన్ని కాలం పక్కకు నెట్టేసింది. మారుతున్న పరిస్తితుల్లో కవిత్వాన్ని అర్థం చేసుకోవడమంటే ముందు కవిత్వతత్త్వవిచారం చెయ్యాలని గ్రహించినందువల్లనే కట్టమంచి క్రాంతిదర్శి కాగలిగాడు. బహుశా కట్టమంచి తరువాత తెలుగులో అటువంటి పాత్ర పోషించింది చేరానే అనవలసిఉంటుంది. ( అటువంటి పాత్ర నిర్వహించవలసిన చారిత్రిక అవసరముందని తెలిసికూడా ఆ పాత్రనిర్వహణలో వెల్చేరు నారాయణరావు కృతకృత్యుడు కాలేకపోయాడనే నా అంచనా.)

చేరాతలు చారిత్రికంగా నిర్వహించిన పాత్రని స్థూలంగా చెప్పాలంటే, ఒకటి, ఎనభైలతరువాత ప్రపంచమంతటా, తెలుగు సాహిత్యంలోనూ కనవచ్చిన బహుళగళాలవ్యాప్తిని పట్టుకోగలగడం, రెండవది, వచనకవిత్వలో కూడా నిర్మాణవ్యూహాలుంటాయని గుర్తించి వాటిని వివరించడానికీ, విశ్లేషించడానికీ ప్రయత్నించడం, మూడవది, అన్ని గళాల్నీ ఆహ్వానించినా, వాటిలో మళ్ళా సామాజికంగా అభ్యుదయ పాత్ర పోషించగల గళాల్ని మరీ ముఖ్యంగా పైకెత్తడం.

చేరాతలు నడుస్తున్నంతసేపూ నా కవితని కూడా ఆయన విశ్లేషిస్తారేమోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసాను, ఆ కాలంలో చాలామందికి లాగానే. ఆయన విశ్లేషించకపోగా ఒకటి రెండు సార్లు నా పేరు ప్రస్తావించినప్పుడు prejudiced గానో, biased గానో మాట్లాడారనుకున్నాను, తక్కిన చాలామందిలానే. కాని ఆయనతో వ్యక్తిగతమైన పరిచయం ఏర్పడ్డాక, కొన్ని సందర్భాల్లో దగ్గరగా చూసాక, ఆయనకి ప్రత్యేకంగా ఎట్లాంటి రాగద్వేషాలూ లేవనిపించింది. అట్లాంటి రెండుమూడు సంఘటనలు గుర్తొస్తున్నాయి.

మొదటిది, ఆయన స్మృతికిణాంకాన్ని నేను సమీక్ష చేసినప్పుడు ఆయన చిన్నపిల్లవాడిలాగా సంతోషపడిపోయారు. ముఖ్యంగా ‘కిణాంకం ‘అనేది ఏకవచనమనీ, ఆయన ఆ పుస్తకంలో మనతో పంచుకున్న జ్ఞాపకాలన్నిటివెనకా, మగతగా, మనకి పూర్తిగా వెల్లడిచేయలేని, ఆయన హృదయాన్ని సదా కలచివేస్తున్న జ్ఞాపకమేదో ఒకటి ఉన్నట్లనిపిస్తోందని రాసాను.ప్రెస్ క్లబ్ మెట్లు దిగుతూ ఆయన ‘నువ్వు పుస్తకాన్ని చదివిన తీరుని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీది ఎక్స్ రే దృష్టి ‘అన్నారాయన.

హైదరాబాదులో ఏటా ఒక యువకవయిత్రికి ఇచ్చే అవార్డు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో ఆయన్నూ, నన్నూ, అబ్బూరి ఛాయాదేవిగారినీ సభ్యులుగా పెట్టారొక ట్రస్టు వాళ్ళు. అందులో నేనొక కవయిత్రిని సూచిస్తే, చేరా మరొక కవయిత్రి పేరు సూచించారు. ఛాయాదేవిగారు నాకు ఆ సంగతి చెప్పినప్పుడు, నేను చేరాగారి నిర్ణయం ప్రకారమే పోదామన్నానుగాని, చేరాగారు ఒప్పుకోలేదు. ‘మనం కూర్చుని చర్చించుకుందాం’ అన్నారు. ముగ్గురం ఛాయాదేవిగారి ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నాం. చివరికి, ఆ ఏడాది బహుమతి ఆ ఇద్దరు కవయిత్రులకూ చెరిసగం పంచాలని ప్రతిపాదించాం.

‘స్మృతికిణాంకం ‘ మీద నా సమీక్ష నచ్చినందువల్లననుకుంటాను, ,ఆయన రాసిన ‘రింఛోళి’ మీద ఆంధ్రభూమిలో నాతో సమీక్ష చేయించమని ప్రసేన్ ని అడిగారు. ఎప్పట్లానే నేను బద్ధకంతో ఆలస్యం చేస్తే నాకు ఫోన్ చేసి ‘ ఆ పుస్తకం మీద నువ్వు రాయాలనుకున్నదంతా నిర్మొహమాటంగా రాయి. సంకోచపడవద్దు. నువ్వు సమీక్ష చేస్తే చాలు నాకు ‘అన్నారు.

ఆయన చేరాతల్లో నాకు గుర్తింపు దొరకలేదనుకున్నానుగాని, అంతకన్నా గొప్ప గుర్తింపు ఆయన్నుంచి నాకెన్నోసార్లు దొరికింది. ముఖ్యంగా, తెలుగువిశ్వవిద్యాలయ వారు నా ‘పునర్యానం’ కావ్యానికి ఉత్తమ వచనకవిత పురస్కారం అందించినప్పుడు, చెన్నయ్యగారు ‘ఆ పుస్తకానికి చేరాగారు న్యాయనిర్ణేత, ఆయన ఎంత అద్భుతంగా రాసేరో దానిమీద’ అన్నారు. ఆ తరువాత చేరాగారే నాకు పోన్ చేసి నా చెవుల్ల్లో తేనే, పాలూ కలిసి మరీ ప్రశంసలజల్లు కురిపించారు. మరోసారి, తెలుగువిశ్వవిద్యాలయం గిడుగురామ్మూర్తి మీద మా ఇద్దరితో ప్రసంగాలు ఏర్పాటు చేసింది. అప్పుడు మొదట ఆయన్ని మాట్లాడమంటే, ‘ఈ అవకాశానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వీరభద్రుడు మాట్లాడేక నాకేమీ మాట్లాడటానికి మిగలదు’ అన్నారు.

శ్రీ శ్రీలాగా , ఇస్మాయిల్ లాగా చేరా వాక్యం కూడా చాలా విశిష్టమైనది. కవిత్వస్పర్శలేని వచనం అది, అలాగని పెళుసుగానూ, చదువుతుంటే తునకలైపోయే పొడివచనం కాదు.మారుతున్న సమాజాన్ని చూస్తూ, అర్థం చేసుకుంటూ, ఆవేదన చెందుతూ, ఆ క్రమంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగల హృదయం ఆయనది. ఆయన రాసింది నాలుగుపేజీలు చదివినా కూడా ఆ మనిషి మనకెంతో ముఖ్యమైనవాడిగా గోచరిస్తాడు. ఇప్పుడు నాలాంటి అసంఖ్యాక తెలుగుపాఠకులు పోగొట్టుకున్నామనుకుంటున్నది, అటువంటి ముఖ్యమైన వ్యక్తినే, నిరంతరస్పందనాశీలమైన ఆ హృదయాన్నే.

25-7-2014

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s