చిత్రించగల ఆ చేతులు ఎక్కడ ?

389

మే 22 వ తేదీనాడు తమిళనాడులో తూత్తుకుడిలో స్టెర్లైట్ కాపర్ స్మెల్టింగ్ కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన పౌరులమీద జరిగిన పోలీసు కాల్పులు ఇటీవలికాలంలో మన దేశంలో జరిగిన అత్యంత భయానకమైన సంఘటనల్లో ఒకటి. పదముగ్గురు చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. ఆ సంఘటన పర్యవసానంగా ప్రభుత్వం ఆ ఫాక్టరీని మూసేసింది. ఇప్పుడు ఆ భూమిని కూడా వెనక్కి తీసేసుకునే ఆలోచనలో ఉందని విన్నాను. తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేయనున్న ఆ సంఘటన గురించి మామూలుగా అయితే కవులూ, రచయితలు, కళాకారులూ పెద్ద ఎత్తున స్పందించేవారు. కాని, ఈసారి ఒక కళాకారుడే ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడి ప్రజాగ్రహాన్ని చవిచూడటం కొత్త ఐరనీ.

తమ జీవితాలగురించీ, పర్యావరణం గురించీ,ఆరోగ్యంగా బతకడం గురించీ ఆందోళన చేస్తున్న ప్రజల మీద తుపాకులు ఎక్కుపెట్టడం,’ఇవాళ కనీసం ఒకడేనా చావాలి’ అనే మాటలు వినవచ్చినవెంటనే తుపాకులు పేలడం మనం సామాజికంగా- రాజకీయంగా కొత్త యుగంలో అడుగుపెడుతున్నామనడానికి సంకేతాలు. దీన్నెట్లా అర్థం చేసుకోవాలో, భవిష్యత్తు చిత్రపటం ఎలా ఉండబోతుందో, ఆ ప్రకంపనలు ముందు పట్టుకోవలసినవాళ్ళు కవులూ, చిత్రకారులూనూ. కాని, నాకు తెలిసి ఎక్కడా కవులు పెద్దగా ప్రతిస్పందించినట్టు వినబడలేదు. ఏ చిత్రకారుడూ ఆ దృశ్యాన్ని చిత్రించినట్టు నేను చూడలేదు.

అసలు ఒక massacre (ఊచకోత అనే తెలుగు పదం కన్నా, ఈ ఇంగ్లీషు పదమే ఎక్కువ అర్థవంతంగా కనిపిస్తోంది) పట్ల ప్రజల ప్రతిస్పందనలోనే కాలానుగుణంగా చాలా మార్పు వస్తోందనిపిస్తోంది. ఒకప్పుడు ఇటువంటి సంఘటనలపట్ల మనుషుల అంతరంగం తీవ్రంగా చలించిపోయేది. కాని, ఇప్పుడు, మన చుట్టూ ఉన్న విజువల్ మీడియా ఇటువంటి దృశ్యాల పట్ల మనల్ని భావరహితంగా మార్చేస్తోంది. క్షణాల మీద ప్రపంచమంతా ప్రసారమయ్యే ఆ దృశ్యాల్ని, ప్రజలు, అంతే తొందరగా, క్షణాల మీద మర్చిపోగలగుతున్నారు. మన హృదయాల్లోకి ఇంకి, లోపల్నించీ మనల్ని వణికించగల శక్తి ఇక ఆ దృశ్యాలకు లేకపోతున్నది.

నా మటుకూ నాకు ఆ కాల్పులు మూడు చిత్రలేఖనాల్ని గుర్తు తెచ్చాయి. మొదటిది, ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా (1746-1828) చిత్రించిన The Third of May 1808. ఆ చిత్రంతో చిత్రకళతో సంప్రదాయ యుగం అంతమై, ఆధునిక యుగం మొదలయ్యిందని చిత్రకళాచరిత్రకారులంతా ఒక్క కంఠంతో చెప్తున్నారు.

386

స్పెయిన్ మీద నెపోలియన్ సైన్యాలు దురాక్రమణ చేసినప్పుడు, మాడ్రిడ్ లో 1808 మే 2 వ తేదీన స్పానిష్ పౌరులు తిరగబడ్డారు. ఆ మర్నాడు, ఆ పౌరుల్ని ఆ సైన్యాలు పట్టుకుని దొరికినవాళ్ళని దొరికినట్టు కాల్చేసారు. అటువంటి ఒక భయానక దృశ్యాన్ని గోయా చూసాడు. ఆ రాత్రి అతడు, ఆ వథ్యస్థలానికి ఒక లాంతరు పట్టుకు వెళ్ళి, ఆ చనిపోయినవాళ్ళ బొమ్మలు గీసుకున్నాడు. ఆ దృశ్యం అతణ్ణి ఆరేళ్ళు వెంటాడింది. 1814 లో ఈ చిత్రం గీసాడు. యుద్ధం పట్ల, అమాయకులైన పౌరులపట్ల సైన్యం, రాజ్యం చూపించగల అమానుషత్వం పట్ల ప్రపంచానికొక సరికొత్త మెలకువ కలిగించాడు. రెండు శతాబ్దాల తర్వాత, అదే స్పెయిన్ లో , యుద్ధ బీభత్సాన్ని తన ‘గుయెర్నికా’ చిత్రంద్వారా చిత్రించడానికి పికాసోకి ఈ చిత్రలేఖనమే దారి చూపించింది.

ఈ చిత్రం మీద గత రెండు శతాబ్దాలుగా ఎందరో అద్భుతమైన వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. అసంఖ్యాకమైన ఆ పరిశీలన్నిటిలోనూ నన్ను చాలా బాగా ఆకట్టుకున్నవి రెండు పరిశీలనలు: మొదటిది, ఎక్కుపెట్టిన ఆ తుపాకులు ఒక గోడలాగా మారడం. అక్కడ మనుషుల మానవత్వం అదృశ్యమై, వాళ్ళు రాజ్యంతాలూకు రాతిగోడగా మారడం. రెండవది, ఆ ఎదురుగా నిలబడ్డ పౌరులు మనుషులుగా, నిస్సహాయులుగా, ఒంటరిగా, ఎవరికి వారు ఆ క్రూరత్వాన్ని ఎదుర్కోవడం. బీభత్సాన్ని, అమానుషత్వాన్ని ఎవరికివారే ఎదుర్కోవలసి ఉంటుందంటున్నాడు గోయా. ఆ మధ్యలో చేతులు పైకెత్తి మృత్యువుకు ముఖాముఖి నిలబడ్డ, పేరు తెలియని, ఆ పౌరుడు శిలువమీద క్రీస్తును స్ఫురింపచేస్తున్నాడు. కాని,ఆ చేతులట్లా చాపి, ఆ దారుణదృశ్యం ఎదట, అతడు చూపరులకేదో ఒక అనిర్వచనీయ విముక్తిని స్ఫురింపచేస్తూ ఉన్నాడు కూడా.

అంతవరకూ రాజాస్థాన చిత్రకారుడిగా సౌకర్యవంతమైన జీవితం జీవించిన గోయా ఆ కాల్పులు చూసాక మళ్ళా మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ షాక్ అతణ్ణి శాశ్వతంగా చెవిటివాణ్ణి చేసేసింది. అతడు మరణించేటప్పటికి, అతడి ఇంటిగోడల నిండా మానవదౌష్ట్యాన్నీ, క్రౌర్యాన్నీ చిత్రించే చిత్రాలు! మనుషి తోటిమనిషి పట్ల చూపగల క్రూరత్వాన్ని తన చుట్టూ చిత్రించుకుంటూ గడిపాడు ఆ మహాచిత్రకారుడు.

ఆ తర్వాత యాభై ఏళ్ళకి, మెక్సికో లో మాక్సిమిలియన్ ను కోర్టు మార్షల్ చేసిన సంఘటనని మరొక సుప్రసిద్ధ చిత్రకారుడు ఎడొవార్డ్ మానె (1832-1883) చిత్రించడానికి పూనుకున్నప్పుడు, అతడికి గోయా చిత్రమే నమూనా. కాని, యాభయ్యేళ్ళకే చిత్రకారుల సంవేదనల్లో వచ్చిన మార్పు ఈ చిత్రం Execution of the Emperor Maximilian of mexico లోచూడవచ్చు.

387

గోయా చిత్రంలో కనిపించే నాటకీయత ఇక్కడ లేదు. ఇక్కడ వధించడం ఒక క్రతువుగా మారిపోవడం కనిపిస్తుంది. అత్యంత భావరహితమైన మానవవధ. మొదటి చిత్రంలో కనీసం చేతులు చాపిన ఒక మానవుడు ఉన్నాడు. ఇక్కడకి వచ్చేటప్పటికి, చేతులు చాపడానికి కూడా మనిషి సిద్ధంగా లేడు. తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఒక ధర్మాన్ని నెరవేరుస్తున్నట్టుగా మనిషి మృత్యువు ముందు నిలబడటమే కనిపిస్తుంది. చివరికి మిగిలింది వట్టి పొగ మాత్రమే. చంపేవాడిలో సరే, చనిపోయేవాడిలో కూడా మానవత్వం అదృశ్యం కావడమే ఈ చిత్రంలోని విషాదం.

ఈ చిత్రం తర్వాత మరొక వందేళ్ళకు కొరియాలో జనమేధాన్ని చిత్రించడానికి పికాసో కి ఈ రెండు చిత్రాలూ దారిచూపించాయి. Massacre in Korea (1951) అనే చిత్రం నరమేధం పూర్తి యాంత్రిక కార్యకలాపంగా మారిపోయిన కాలాన్ని పట్టుకుంది.

388

ఇక్కడ సైన్యం కేవలం మరబొమ్మలు. వాళ్ళల్లో మిగిలిన మానవత్వమేదన్నా ఉంటే, ఆ ఆకృతుల్లో మటుకే మిగిలింది. కానీ, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు చేతుల్లాగా కనిపిస్తున్నాయి. అంటే ఆయుధాలకీ, చేతులకీ మధ్య తేడా తుడిచిపెట్టుకుపోయింది. వాళ్ళ ఎదట నిలబడ్డ కుటుంబం చేతులు చూడండి. ఆ చేతులు ధిక్కరించడానికీ, విలపించడానికీ కూడా చాతకానివి. ఆ చేతులకి మిగిలిందల్లా, ఆ దౌర్భాగ్యక్షణంలో ఒకరినొకరు పట్టుకోవడం, కలిసికట్టుగా మరణించడమే. సర్పక్రతువులో ఒకరినొకరు కావిలించుకుని హోమగుండంలో ఆహూతి కావడానికి వచ్చిపడుతున్న ప్రాణులు తప్ప వారు మరేమీ కారు.

ఈ మూడు చిత్రలేఖనాల్నీ ఒకదానివెనక ఒకటి మార్చిమార్చి చూస్తూ ఉంటే నాకు అర్థమయిందొకటే. పికాసో ఈ చిత్రం చిత్రించి సుమారు డెబ్భై ఏళ్ళు గడిచాక, మరొక నరమేధం మనముందు జరిగాక, ఇప్పుడు ఆ దృశ్యాన్ని చిత్రించడానికి కూడా చేతులు పెగలని కాలానికి మనం చేరుకున్నామన్నదే.

17-7-2018

 

Leave a Reply

%d bloggers like this: