చలసాని ప్రసాద్

Reading Time: 3 minutes

356

చలసాని ప్రసాద్ గారూ నేనూ స్నేహితులమని చెప్పలేను గానీ మాది కేవలం పరిచయం కాదనీ అంతకన్నా ఎక్కువేననీ చెప్పగలను. ఇద్దరు పరిచయస్తులు స్నేహితులుగా మారడానికి ఇద్దరి మధ్యా తలెత్తవలసిన ఆకర్షణ ఏదో మా మధ్య కూడా తలెత్తినప్పటికీ, అది స్నేహంగా వికసించకపోవడానికి ఆయన రాజకీయ విశ్వాసాలు మాత్రం కారణం కాదు. (నిజానికి తీవ్ర రాజకీయ విశ్వాసాలున్న మనుషుల దగ్గర నాకు ఊపిరాడదు, కాని ప్రసాద్ గారి గురించి అలా అనుకోలేను.)

మా పరిమిత ప్రపంచం నుంచి మాకు విస్తృత సాహిత్య ప్రపంచాన్నిపరిచయం చేసిన జగన్నాథ రావుగారే చలసాని ప్రసాద్ గారిని కూడా మాకు పరిచయం చేసారు. ముఫ్ఫై ఏళ్ళకిందట మా అక్కనీ, నన్నూ ఆయన 37, సిరిపురం ఇంటికి ( ఆ నెంబరు కరెక్టే కదా) పరిచయం చేసినప్పుడు ఆ గోడలమీద పెద్ద పెద్ద ఫొటోల్లో కనిపించే మార్క్స్, ఎంగెల్స్ ని ఎంత విభ్రాంతిగా చూసానో, తుమ్మల వేణుగోపాలరావుగారినీ, కృష్ణాబాయిగారినీ, అత్తలూరి నరసింహారావుగారినీ, పద్మినిగారినీ, ప్రసాద్ గారినీ కూడా అంతే విభ్రాంతితో చూసాను.

సహజంగానే వాళ్ళంతా గొప్ప ప్రభావశీలం కలిగిన మనుషులు. ఇక జగన్నాథ రావుగారు వాళ్ళ గురించి చెప్పే మాటలవల్ల వాళ్ళు మరింత ధగధగలాడుతూ కనబడ్డారు. ఆ ఇల్లు ఒక తరం తరానికే దారి చూపిందని ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నాకెప్పటికీ గుర్తే.

ఆ తరువాత నరసింహారావుగారిని చాలసార్లే కలిసాను గాని, ప్రసాద్ గారితో కలిసి మాట్లాడింది చాలా తక్కువ.కాని ఆయన సంకలనం చేసిన పుస్తకాలతో,ముఖ్యంగా శ్రీశ్రీ, కుటుంబరావు సాహిత్యంతో గడిపింది ఎక్కువ. ఆ సంకలనాల్లో ఆయన రాసిన ఫుట్ నోట్లూ, నామవివరణలతో సహా. అట్లా పుస్తకాలకు నామవివరణలు రాయడం సోవియెట్ పుస్తకాలను చూసి చేసేవారనుకుంటాను. కాని ఆ నామవివరణల్లో కూడా ప్రసాద్ గారు కనబడతారు. ఆయన తీవ్ర ఇష్టాఇష్టాలతో. ( సోవియెట్ పుస్తకాల్లో నామవివరణ పద్ధతినీ, చలసాని గారి వివరణల్నీ పోల్చి ఒక వ్యాసం రాయాలని నాకు చాలాకాలంగా ఒక సరదా.)

ఈ రోజు ఆయన్ని తలచుకుంటుంటే, ఎంతో సన్నిహితుడూ, స్నేహపాత్రుడూ, నిష్కపటీ అయిన మనిషికి సంబంధించిన రెండుమూడు సంఘటనలు గుర్తొస్తున్నాయి.

మొదటిది,చాలా ఏళ్ళ కిందట, బహుశా పాతికేళ్ళ కిందట కావచ్చు, నేనెక్కడో శ్రీ శ్రీ గురించి ప్రసంగిస్తూ, మాటల మధ్యలో ఆయన ‘బెండయ్యగారి గది ‘ అని ఒక నాటకం రాయాలనుకున్నాడని చెప్పాను. ఆ ప్రసంగానికి ప్రసాద్ గారు ఎందుకొచ్చారో గుర్తు లేదు గాని ప్రసంగం అయ్యాక, ‘నువ్వా నాటకం చదివావా?’ అనడిగారు. లేదన్నాను. చదవాలని ఉందా? అనడిగారు. ఆశ్చర్యపోయాను. ‘శ్రీశ్రీ ఆ నాటకం రాయాలనుకుంటున్నట్టు చెప్పాడుగాని, రాసినట్టు చెప్పలేదే ‘ అన్నాను. ‘అవును రాయలేదు, కాని దానికి కొంత హోం వర్క్ చేసుకున్నాడు, ఆ రాతప్రతి నా దగ్గరుంది, కావాలంటే నువ్వు చదువుకోవచ్చు’ అన్నారు.

ఆ రాతప్రతి చూడటం కోసమే ఒకరోజు విశాఖపట్టణంలో వాళ్ళింటికి వెళ్ళాను. అసలు రాతప్రతినో, జిరాక్సు కాపీనో గుర్తులేదుగాని, ఒక నాటకం రాయడానికి శ్రీ శ్రీ రాసుకున్న ప్రణాళిక అది. కాఫ్కా తరహాలో మధ్య మధ్య చిన్న చిన్న బొమ్మలు కూడా గీసుకున్నాడు. ఆ రాతప్రతి చదివే అవకాశమిచ్చినందుకు నేను ప్రసాద్ గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.

మరొక సందర్భం కొద్దిగా విచిత్రమైంది. 2002 లో పి.వి.నరసింహారావు గారి లోపలి మనిషి నవలని విశాఖపట్టణంలో కాళీపట్నం రామారావుగారు ఆవిష్కరించిన సందర్భం. ఆ రోజు పి.వి. నరసింహారావు మాట్లాడుతూ, తాను కూడా రావిశాస్త్రి వారసుడిగా రచనలు చెయ్యాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఒక మనిషి పూర్తి రాజకీయ జీవితం జీవించి, అత్యున్నత విధాననిర్ణయ స్థానాల్లో గడిపి, చివరికి ఒక రచయితగా జీవించాలనుకోవడం, అది కూడా వ్యవస్థని విమర్శనాత్మకంగా చిత్రించే తరహా రచయిత కావాలనుకోవడం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆ మాటే ఇండియా టుడే లో నా కాలంలో రాసాను. అది చదివి ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి పత్రికలో నా మీద విరుచుకుపడ్డారు. కానీ దాని గురించి ఆయనతోగొడవపెట్టుకోవాలనిపించలేదు నాకు. ఆ ఆగ్రహం వల్ల ఆయన నాకు మరింత సన్నిహితుడయ్యాడనే అనిపించింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు కలుసుకున్నా ఆ విషయం గురించి ఆయనా మాట్లాడలేదు, నేనూ మాట్లాడలేదు.

ఒక ఏడాది కిందటి మాట. ఒక రోజు రాత్రి హఠాత్తుగా ఆయన్నుంచి ఫోన్. ఆశ్చర్యపోయాన్నేను. కారణం మరింత ఆశ్చర్యకరం. నా పుస్తకం ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ ఆయనకు రావెల సోమయ్యగారు పంపించారట. అది చదువుతున్నానని చెప్పారు. ఆయన నాతో గొడవ పెట్టుకోవడానికి వీలైనంత సామగ్రి ఉందందులో. కానీ ఆశ్చర్యం, అందులో రచయితగా గాంధీజీ గురించి రాసిన ఒక వ్యాసం గురించే ఆయన చాలాసేపు మాట్లాడేరు. ప్రజలభాషలో రాయాలనీ, రచయితలు ప్రజల్లోకి వెళ్ళాలనీ, ప్రజల సమస్యలగురించి రాయాలనీ రాసిన గాంధీ గురించి సంతోషంగా మాట్లాడటానికి ఆయనకు అభ్యంతరమేముంటుంది? ఆ వ్యాసంలో ‘గాంధీ, ద రైటర్’ అని భవానీ భట్టాచార్య రాసిన పుస్తకం గురించి నేను ప్రస్తావించాను. ఆ పుస్తకం తాను చూడలేదనీ,పంపించగలవా అని అడిగారు. సాహిత్యం గురించి గాంధీ రాసిన రెండు అపురూపమైన వ్యాసాల క్లిప్పింగ్సు తనదగ్గర ఉన్నాయనీ తాను వాటిని నాకు పంపిస్తాననీ అన్నారు. ఆ మర్నాడే నేను నా దగ్గరున్న పుస్తకం కొరియర్ చేసేసాను.

ప్రసాద్ గారి గురించి తలచుకుంటుంటే నాకనిపించిందిదే: చాలా విలువైన పుస్తకమొకటి నీకు కనిపించి చదవడం మొదలుపెడతావు, చదువుతుంటే చాలా ఆసక్తి కలుగుతోందని గ్రహిస్తావు. కాని ఏ కారణం చేతనో ఆ పుస్తకం పూర్తిగా చదవడం కుదిరిఉండదు. అయితేనేం, ఆ పుస్తకం ఎంతో విలువైందనీ, ఆ పుస్తకం గురించి నీకు తెలిసినందుకే నువ్వెంతో అదృష్టవంతుడవనీ గ్రహిస్తావు. అది చాలదా!

6-8-2015

Leave a Reply

%d bloggers like this: