గిరిజన మూజియం

372

మొన్న సోమవారం భువనేశ్వర్ వెళ్ళినప్పుడు, గిరిజన మూజియం కి కూడా వెళ్ళాం. చాలాకాలంగా వింటూ ఉన్నా మొదటిసారి చూడటం. అక్కడ గడిపింది కొద్దిసేపే అయినా చాలా విలువైన సేకరణల్నీ, చాలా స్ఫూర్తిదాయకమైన ఆడియో విజువల్ డాక్యుమెంటేషన్ నీ చూసాననిపించింది.

భువనేశ్వర్ నుంచి ఖుర్దా వెళ్ళే రోడ్డులో రైల్వే స్టేషన్ కి ఆరుకిలోమీటర్ల దూరంలోనూ, ఏర్ పోర్టునుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ, రోడ్డుమీదనే గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థవారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మూజియం. 1984 నుంచీ చిన్న స్థాయిలో నడుస్తూ ఉన్న ఒక వస్తుసంగ్రహ శాలని Museum of Tribal Arts and Artefacts గా 2001 లో ప్రారంభించారు. ఇందులో ప్రధానమైన మూజియం భవనంలో అయిదు గాలరీలు, అరుబయట గిరిజన జనావాసాల నమూనాలు, గిరిజన ప్రార్థనా స్థలాల నమూనాలు, ఒక ఓషధీ వనంతో పాటు, ఒడిశాలోని 13 ఆదిమ గిరిజన తెగల మీద ఒక ప్రత్యేకమైన ప్రదర్శన విభాగం కూడా ఉన్నాయి.

మూజియం ప్రధానభవనంలోని అయిదు గాలరీల్ని తమ అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శనగా మూజియం కాటలాగు పేర్కోవడం సమంజసమే. నాకు తెలిసి అంత విలువైన, సుసంపన్నమైన, వైవిధ్యవంతమైన సేకరణ గిరిజన జీవితానికి సంబంధించి దేశంలో మరొకటి లేదని చెప్పవచ్చు.

మొదటిగాలరీలో గిరిజనుల అలంకరణ సామగ్రి, ముఖ్యంగా వస్త్రవిశేషాలన్నీ పొందుపరిచారు. ఎనిమిది తెగలకు చెందిన 34 రకాల వస్త్రవిశేషాల తో పాటు, 17 తెగలకు చెందిన 911 అలంకారవిశేషాలు షోకేసుల్లో ప్రదర్శించారు. దోంగ్రియా కోదుల అల్లికలు, చెట్టు బెరడునుంచి తీసిన నారతో బోండాలు, గదబలు నేసుకునే వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణలు. ఇవికాక, వెండి కడియాలు, దండలు, జడపిన్నులు, వడ్డాణాలు, నగలు, కంటెలు ఊహించలేనన్ని, ఊహించలేనంత వైవిధ్యంతో సాక్షాత్కరించాయి.

రెండవ గాలరీలో మరింత అలంకరణసామగ్రి, హస్తకళలు, చిత్రలేఖనాలు, ఫొటోలు ఉన్నాయి. ఆ గాలరీలో నన్ను విభ్రాంతికి లోను చేసింది దువ్వెనలు. కనీసం ఎనభై రకాల దువ్వెనలు ఉన్నాయక్కడ. ఆకృతికల్పనలో, తయారీలో, సున్నితత్త్వంలో, వినియోగంలో అంత విస్తృతిని, అంత వైవిధ్యాన్ని సాధించగలిగిన ఆ మానవసమూహాల్ని ఆదిమజాతులుగా మనం ఎందుకు పేర్కొంటున్నామో నాకు అర్థం కాలేదు. ప్లాస్టిక్ దువ్వెనలు తప్ప మరొకటి ఊహించలేని మనం ఎంత పేదవాళ్ళమో కదా అనిపించింది.నలభై రకాల చిలిములు, పొగతాగే పైపులు, మద్యపాత్రలు, క్రతువుల్లో వాడే పూజాసామగ్రి తో పాటు ధాన్యం గింజలతో రూపొందించే అపురూపమైన 24 రకాల కళారూపాలు కూడా ఉన్నాయి అక్కడ.

మూడవ గాలరీ మొత్తం వేట, ఆయుధసామగ్రితో పాటు చేపలు పట్టే సామగ్రి, పరికరాల సముదాయంతో నిండి ఉంది. వడిసెలలు, చాకులు, బల్లేలు, గొడ్డళ్ళు, పక్షుల్ని, చేపల్ని పట్టే వలలతో పాటు, చారిత్రాకమైన మెరియా (నరబలి)కత్తి కూడా మొత్తం రెండువందలకు పైగా వస్తువులు అక్కడ ప్రదర్శించబడ్డాయి. వాటితో పాటు కత్తులు, బాకులు, తుపాకులు, బరిసెలు వంటి యాభై రకాల ఆయుధసామగ్రి కూడా కనిపిస్తున్నది.

నాలుగవ గాలరి లో మొత్తం వ్యావసాయిక పనిముట్లు, గృహోపకరణాలు ఉన్నాయి. దాదాపు 16 తెగలకు చెందిన మూడువందల పరికరాలు ఉన్నాయక్కడ. కొలతలు కొలిచే పాత్రలు, నూనె తియ్యడానికి వాడే బుట్టలు, మద్యపాత్రలు, దీపాలు, బుట్టలు వంటివి ఉన్నాయక్కడ.

అయిదవ గాలరీలో సంగీత, నాట్య పరికరాలు దాదాపు యాభై రకాలతో పాటు, 27 తెగలకు చెందిన డోక్రా కళాకృతులు కూడా దాదాపు నూటయాభై దాకా ఉన్నాయి.శిరోవేష్టనాలు, బాజాలు, తుడుంలు, కొమ్ము బూరాలు, పిల్లంగోవులు, కిన్నెరలు, నోటితో వాయించే తంత్రీవాద్యాలతో పాటు అత్యంత కళాకౌశలాన్ని చూపించే డోక్రా లోహశిల్పాలు కూడా ముందుకువెళ్ళకుండా ఆపేస్తున్నాయి.

అన్నిటికన్నా కూడా ఆ గాలరీల్లో నన్ను గాఢంగా ఆకట్టుకున్నది, ప్రతి షోకేసుదగ్గరా ఏర్పాటు చేసిన ఆడియో విజువల్ డాక్యుమెంటేషను. ప్రతి షోకేసుదగ్గరా ఒక టచ్ స్క్రీన్ ఏర్పాటు చేసారు. అక్కడ మెనూ చూసుకుంటూ మనం ఒక్కొక ఎగ్జిబిట్ నీ, గిరిజన జీవితంలో దాని స్థానమేమిటో ఒకటి రెండు నిమిషాల విజువల్ గా చూడవచ్చు. లేదా ఆ ఎగ్జిబిట్ ని గ్రాఫికల్ గా వివరించే ఒక పాఠంలాగా కూడా చూసి తెలుసుకోవచ్చు. ఆ గాలరీల్లో ఉన్న ఆ డాక్యుమెంటేషన్ మొత్తం చూసుకుంటూ వెళ్ళాలంటే, బహుశా, నెలరోజులు పడుతుందేమో అనిపించింది.

ఆ ప్రధాన భవనం మధ్యనున్న ఖాళీస్థలంలోనే 14 గిరిజన తెగల ప్రార్థనాస్థలాల నమూనాల్ని కూడా ఆరుబయట ఏర్పాటు చేసారు. మూజియం భవనానికి ఒక పక్కన, ఆరుబయట, గదబ, కోదు, సంతాల్, సవర, జువాంగ్ తెగల గృహాల నమూనాలు కూడా నిర్మించారు. మరొక పక్క, ఒక ప్రత్యేక భవనంలో ఆదిమతెగల జీవనశైలి ప్రదర్శన ఉంది. ఒడిశాలోని 13 ఆదిమతెగలు, లంజియ సవర, బొండా, దోంగరియ కోంధ్, మన్ కిర్డియా, జువాంగ్, దిదాయి, కుటియా కోంధ్       (వీళ్ళ గురించే గోపీనాథ మొహాంతి అమృతసంతానం లో రాసింది. వీళ్ళే ఇటీవలి కాలంలో వేదాంత బాక్సైటు తవ్వకాన్ని నిరోధించి చరిత్రసృష్టించారు), హిల్ ఖరియా, చుక్టియా భుంజియా, లోధా, పాడి భుయాన్, బిర్హోర్, సవర ల గృహనిర్మాణ, జీవనవిధానాల నమూనాలతో పాటు ప్రతి ఒక్క తెగ మీద తీసిన మూడు నిమిషాల డాక్యుమెంటరీలు కూడా ప్రదర్శించారు. ప్రతి తెగ దగ్గరా ఆ తెగ వివరాలతో పాటు టచ్ స్క్రీన్ మీద ఆ డాక్యుమెంటరీ చూడవచ్చు.

మాకున్న కొద్ది సమయంలోనూ రెండు, మూడు డాక్యుమెంటరీలు మటుకే చూడగలిగాను. కాని, అవి మరవలేనివి. ఒక డాక్యుమెంటరీ మొదలుకాగానే అడవిలో కోదుకన్యలు నాట్యం చేస్తూ గీతాలాపన మొదలుపెట్టగానే నా హృదయం లయ తప్పిపోయింది. ఎప్పుడో ఎక్కడో దారితప్పి, మందకి దూరమైన లేగ దూడకి, ఆవుల అంబారవాలు వినిపిస్తే ఎలా ఉంటుందో ఆ గిరిజన గీతాలాపన వినగానే నాకలా అనిపించింది.

మూజియంలో గిరిజన సాంస్కృతిక సంస్థవారి ప్రచురణలు కూడా ఉన్నాయి. వాటిలో 13 ఆదిమగిరిజన తెగలమీదా వెలువరించిన పుస్తకాల బాక్సు సెట్ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ తెగల్లో ఒక్కొక్క తెగ నీ చూస్తూ, వాళ్ళ గ్రామాలకు పోయి, వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళని అర్థం చేసుకుంటూ, ఒక్కొక్కరి మీదా ఒక కథనో, నవలనో రాయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది.

మూజియం నుంచి బయటకి వచ్చాక ఏర్ పోర్ట్ కు వెళ్ళేంతసేపూ, ఏర్ పోర్టులో, విమానంలో, విమానం దిగి ఇంటికొచ్చేదాకా, వచ్చిన తరువాత కూడా ఒకటే ఆలోచన: అంత జీవశక్తితో, అనేకవర్ణశోభితంగా, సాంస్కృతికంగా సుసంపన్నంగా ఉన్న ఆ గిరిజన సమాజాలకు మనమేమివ్వగలిగాం? గనులపేరిట, అభయారణ్యాలపేరిట, పారిశ్రామిక సముదాయాల పేరిట, భారీ నీటిపారుదల ప్రణాళికల పేరిట వాళ్ళ అందమైన ఆకాశాల్నీ, తేనెపెరల్నీ, పూలతావుల్నీ వారినుంచి దూరం చెయ్యడమే కదా.

1-5-2018

Leave a Reply

%d bloggers like this: