గాంధీ మూజియం

344

నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారు ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న ఆ వేడుకలో భాగంగా పబ్లిక్ సర్వీసుల్లో చేపడుతున్న ఇన్నొవేషన్సు గురించి పంచుకోవడానికి సోమవారం ఉదయం ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసారు. అందులో పాలుపంచుకోవడానికి నాకు కూడా ఆహ్వానం వచ్చింది. రాష్ట్రపరి భవన్ కల్చరల్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో ప్రభుత్వం నుంచీ, పౌరసమాజం నుంచీ కూడా చాలామంది పాల్గొన్నారు. పౌరజీవితం మరింత సౌకర్యవంతంగా ఉండటం గురించీ, పౌరులకి ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరింత సత్వరంగానూ, మరింత మెరుగ్గానూ, మరింత చౌకగానూ, మరింత పారదర్శకంగానూ ఉండటంకోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ఎన్నో ప్రయోగాలగురించీ, కొత్త ప్రయత్నాల గురించీ అక్కడ పాల్గొన్నవారు వివరించారు. వారిలో భారతప్రభుత్వ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఐఐఎం ప్రొఫెసర్లు, హైకోర్టు జడ్జిలు, వివిధ శాఖాధిపతులు కూడా ఉన్నారు. వాటిలో ఎక్కువ ప్రయత్నాలు ఎలక్ట్రానిక్ పాలన కి సంబంధించినవే ఉన్నాయి. కాని, కోర్టుల్లో అత్యాచారానికి గురైన బాధితులు తమ వాజ్మూలం ఇవ్వడానికి వారికి భయరహిత వాతావరణం కల్పించడంకోసం డిల్లో హైకోర్టులో జస్టిస్ గీతా మిత్తల్ చేపట్టిన ప్రయోగం అక్కడున్నవారందరినీ వినమ్రుల్ని చేసింది.

2
ఆ తర్వాత ఇన్నొవేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కూడా చూసాను. దేశవ్యాప్తంగా వ్యవసాయం, పండ్లతోటలపెంపకం, వనమూలికలు, వస్తు తయారీరంగాల్లో కొత్తప్రయోగాల్లో అద్భుతమైనవాటిని 60 కి పైగా ఎంపికచేసి అక్కడ ప్రదర్శించారు. ఆ ఇన్నొవేటర్లలో నిరక్షరాస్యులైన రైతులు మొదలుకుని, విద్యార్థులూ, ఇంజనీర్లూ, వస్తూత్పత్తిదారులూ కూడా ఉన్నారు. ఉదాహరణకి, నిశ్శబ్దంగా సంభవించే గుండెపోటు గురించి కనీసం ఆరుగంటలముందే హెచ్చరించగల ఒక పరికరాన్ని తయారు చేసిన ఆకాష్ మనోజ్ తమిళనాడులో పదవతరగతి చదువుతున్నాడు, అతడితో మాట్లాడినప్పుడు, తనకి ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన్ చదవాలని ఉందని చెప్పాడు. భారతప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ 2000 లో ఏర్పాటు చేసిన ఇన్నొవేషన్ ఫౌండేషన్ ఇప్పటిదాకా ఇట్లాంటి ఇన్నొవేటర్లని 847 మందిని గుర్తించింది. వారి ప్రయోగాలకు సుమారు 800 పైగా పేటెంట్ల కోసం దరఖాస్తుచేసింది. ఇప్పటిదాకా 47 ప్రయోగాలకు పేటెంట్లు సంపాదించింది. గ్రామీణప్రాంతాల్లో ఎందరో సివి రామన్లను వెతికిపట్టుకుంటున్న మహత్తర కార్యక్రమమిది.

3
ఆ మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్సు చూడాలనుకున్నాం. కాని సోమవారం సెలవుదినం కావడంతో, ఎట్లాగయితేనేం అనుమతిసంపాదించేం. ఈ మధ్యనే ఆ ఉద్యానవనాన్ని ప్రజలు కూడా చూడటానికి తలుపులు తెరిచారు. ఇంకా అక్కడ శీతాకాల పుష్పాలే రాజ్యమేలుతున్నాయి. ఏప్రిల్ కి గాని ఆ తోటలోకి వసంతకాలశోభ పూర్తిగా చేరుకోదని అక్కడి నిర్వాహకులు చెప్పారు. మొఘల్ గార్డెన్స్ ప్రధానంగా గొప్ప గులాబీతోట. హేమంతం గులాబీల ఋతువుకాకపోయినప్పటికీ ఆ గులాబీలు తమచుట్టూ ఒక సుగంధలోకాన్ని నిర్మించుకుని కాపాడుకోగలుగుతున్నాయి. చిలుకలు, నెమళ్ళు, తేనెటీగలు, తుమ్మెదలతో పాటు అసంఖ్యాకమైన నీటిపక్షులు కూడా ఆ పూలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఏదో జానపదకథలోలాగా, అక్కడున్నంతసేపూ నువ్వు కూడా ఒక పక్షిగా మారకుండా ఉండలేవు. ఆ పరిమళప్రపంచంలో నాలుగడుగులు నడవగానే నీ వీపులోంచి రెక్కలు మొలుస్తున్న అనుభూతికి లోనవకుండా ఉండలేవు.

4
సాయంకాలం రాత్రిగా మారే సమయంలో ఇండియాగేటునుంచి రైసీనా హిల్ దాకా కొంతసేపు నడిచాం. మొత్తం కొత్తఢిల్లీ అంతా అక్కడే ఉందా అనిపించేటంత ట్రాఫిక్, పాదచారులు, సందర్శకులు. అక్కడ పిల్లలూదుతున్న సబ్బుబుడగలు ఎన్ని ఉన్నాయో వాహనాలన్ని ఉన్నాయి. కాని, సాయంసంధ్యావేళ దిగంతం నుంచీ భూమిని ఆవరించే మహామౌనమొకటి అక్కడ కూడా వినిపిస్తూనే ఉంది. చూస్తూండగానే రాష్ట్రపతి భవన్ మీద అస్తమయ సంధ్యాగగనం ఛత్రాన్ని మడుస్తూ ఉంది. ఇంతలోనే దీపాలు వెలిగించారు. ఒక్కసారిగా ఆ ప్రభుత్వభవనం గొప్పదీపశాలగానూ, చిత్రశాలగానూ మారిపోయింది. ఆ దీపాలవెలుతుర్లో వాహనాల వెలుతురు, ఎరుపు,పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగులు పిచికారీ చేస్తూండింది.

5.
మంగళవారం విరామం కావడంతో ఇంతదాకా డిల్లీలో చూడనిదేదైనా కొత్త స్థలం చూడాలనుకున్నాను. యమునానది వడ్డున స్వామినారాయణ్ సంస్థవారు నిర్మించిన అక్షరధాం దేవాలయం గురించి చాలామంది చాలా సార్లు చెప్పగా విన్నానుకాబట్టి అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం రెండుగంటలదాకా అక్కడే ప్రతి ఒక్క విశేషాన్నీ చూస్తూ గడిపాను.సుమారు 100 ఎకరాల స్థలంలో కేవలం అయిదేళ్ళకాలంలోనే నిర్మించిన ప్రాంగణం, దేవాలయసముదాయం అది. చుట్టూ ద్వారాలు. మధ్యలో మహాలయం. ఆ ఆలయానికి సుదీర్ఘమైన గజపీఠం, దానిపైన 25 అడుగుల ఎత్తూ, 611 అడుగులపొడవూ ఉన్న కుడ్యశిల్పసముదాయం ఉంది. నాగరశైలి దేవాలయ స్థాపత్యం, సౌరాష్ట్రభవనాల జిలుగు, పారశీక రాజోద్యానాల వాస్తు ల మేళవింపు. మధ్యలో మహాలయమంతా ఎరుపు, తెలుపు పాలరాతి స్తంభాలు, మధ్యలో బంగారు మలాం చేయబడ్డ 11 అడుగుల స్వామినారాయణుడి పంచలోహమూర్తి. ఆలయం చూడటంకన్నా, ఎక్కువసేపు అక్కడి ఎగ్జిబిషన్ చూడటంలోనే గడపవలసి వచ్చింది. మూడు భాగాలుగా ఉన్న ఆ ఎగ్జిబిషన్లో సుమారు గంటసేపు గంటసేపు సహజానంద దర్శనం పేరిట స్వామినారాయణుడి జీవితసన్నివేశాల ప్రదర్శన చూసాను. రోబోటిక్స్, ఎనిమెట్రోనిక్స్, సౌండ్, లైట్ మేళవించిన ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్ ప్రదర్శన అది. ఆ తర్వాత, సంస్కృతీ విహార్ పేరిట పదిహేను నిమిషాల పాటు ఒక నావలో ప్రాచీన భారతదేశ చరిత్ర దర్శనం. వేదకాలగ్రామాలూ, తక్షశిల, ప్రాచీన భారతీయ వైద్యం, అజంతా, ఎల్లోరాల పున:సృష్టితో కూడుకున్న ఒక వలయం అది. అన్నిటికన్నా నన్ను ఎక్కువ ఆకట్టుకున్నది, నీలకంఠ యాత్రపేరిట ప్రదర్శించిన ఒక డాక్యుమెంటరీ. 85 అడుగులు వెడల్పు 65 అడుగులు ఎత్తు ఉన్న ఐమాక్స్ తెరమీద స్వామినారాయణుడు నీలకంఠుడిగా భారతదేశమంతా సంచరించిన యాత్ర తాలూకు దృశ్యకావ్యం. సుమారు 12000 కిలోమీటర్లమేరకు హిమాలయాలనుండి రామేశ్వరందాకా భారతదేశసాంస్కృతిక, ప్రాకృతిక సౌందర్యం నేపథ్యంలో చిత్రించిన ఆ సినిమా చూస్తున్నంతసేపూ గంభీరమైనదాన్ని దేన్నో చూస్తున్నట్టే అనిపించింది.

6
రాజఘాట్ ఇంతకుముందు చూసానుగాని, అక్కడే ఏర్పాటు చేసిన నేషనల్ గాంధీ మ్యూజియం ని ఇదే మొదటిసారి చూడటం. ఈ నా పర్యటన్లో అత్యంత విలువైన అంశం ఆ మూజియం ని చూడటమే. అక్షరధాం ఆలయంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ వాస్తువైభవం చూసినదానికన్నా, మహాత్ముడి జ్ఞాపకాలుగా అక్కడ భద్రపరిచిన తకిలీలు, ఆయన వాడిన లోటాలు, పళ్ళేలూ, చెప్పులూ, కళ్ళద్దాలూ, చివరికి పళ్ళుకుట్టుకునే పుల్లలూ చూసినప్పుడు నాకు మానసికంగా ఎంతో తృప్తిగా అనిపించింది. ఆ మూజియం 1948 లోనే ప్రారంభించారట. దేశంలో మరెక్కడా, చివరకై సబర్మతీలో కూడా చూడని ఎన్నో విలువైన స్మారకచిహ్నాలు అక్కడ చూడగలం. ఆ మూజియం గ్రౌండు ఫ్లోరులో కార్యాలయం, పుస్తకాల షాపు, ఫొటో సెక్షను ఉన్నాయి. పై అంతస్థులో ఒక భాగమంతా రాట్నాల గాలరీ ఉంది. గాంధీజీ, కస్తూర్బాలతో సహా జాతీయోద్యమ నాయకులెందరో ఉపయోగించిన రాట్నాల, నేసిన వస్త్రాల ప్రదర్శన అది. మరొకవైపు సుమారు 300 ఫొటోలతో కూడిన గాలరీ ఉంది. గాంధీజీ జీవితక్రమాన్ని వివరిస్తూ రూపొందించిన ఆ ప్రదర్శనలో ఎన్నో అరుదైన ఛాయాచిత్రాలున్నాయి. ఆయన హత్యకు గురైనప్పుడు రక్తసిక్తమైన ఆ చివరి వస్త్రాన్ని కూడా అక్కడ ప్రదర్శించారు. ఆ స్మారక ప్రదర్శనలో చాలా విలువైన రెండు విభాగాలు, ఒకటి ఆయన మీద దేశదేశాలూ వెలువరించిన తపాలాబిళ్ళల, కార్డుల, కవర్ల ప్రదర్శన. అది బాపూజీకి ప్రపంచం ఘటిస్తూ వస్తున్న నివాళిని ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది. మరొకటి, ఆయనమీద చిత్రించిన అరుదైన చిత్రాల,శిల్పాల ప్రదర్శన. ఒక రష్యన్ నీటిరంగుల చిత్రం, ఒక స్పానిష్ శిల్పి చెక్కిన బస్ట్ సైజు శిల్పం, చీనా చిత్రకారులు ఆయనమీద నివాళిని లిఖించిన కాలిగ్రఫీ-కాని ఆ చిత్రాల నకళ్ళుగానీ, కనీసం ఒక బ్రోచర్ గానీ అక్కడ లేకపోవడం నన్నెంతో నిరాశకి గురిచేసింది. సబర్మతీలో 1915 నుంచి 30 దాక బాపూజీ నివసించిన ఇల్లు హృదయకుంజ్ నమూనా కూడా ఆ ఆవరణలో ఉంది. ఆ ప్రదర్శన మనలో గొప్ప ఔన్నత్యాన్ని జాగృతం చేసే మాట నిజమేగాని, ఆ భవనమూ, ఆ ప్రాంగణమూ, ఆ స్మారకచిహ్నాల్ని ప్రదర్శించిన తీరూ ఎంతో నిరాశాజనకంగా ఉన్నాయి.

7
అప్పటికే పొద్దువాలిపోయింది. ఉన్న కొద్దిసేపట్లోనూ ఒక్కసారి ఎర్రకోట కలయదిరుగుదామనుకున్నాను. ఈసారి ఎర్రకోటలో నేను కొత్తగా చూసింది సలీంగఢ్ కోట. షేర్ షా సూరి కుమారుడు ఇస్లాం షా సూరి నిర్మించిన ఆ కోటలోనే అజాద్ హింద్ ఫౌజ్ వీరుల్ని నిర్బంధించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ కోటని పునరుద్ధరించి దాన్ని స్వాతంత్ర్య సేనాని స్మారకచిహ్నంగా మార్చింది. ఎర్రకోట ప్రాంగణంలోంచి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి రైల్వే లైను దాటి అవతలకు వెళ్ళాలి. యమునా నది ఒడ్డున ఉన్న ఆ కోటలో ఒక భవనంలో అజాద్ హింద్ ఫౌజ్ స్మారకచిహ్నాల ప్రదర్శన ఉంది. గురుసింగ్ ధిల్లాన్, షానవాజ్ ఖాన్, కెప్టెన్ లక్ష్మి వంటి వీరుల యూనిఫాం, తుపాకులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వెలువరించిన తపాలాస్టాంపులు, చిహ్నాలు, పతాకాలు వంటి వాటిని ప్రదర్శనలో పెట్టారు. మరొక భవనంలో సలీం గఢ్ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ ప్రాచీన మృణ్మయపాత్రల శకలాలు, ఇతర అవశేషాల్ని ప్రదర్శించారు. కాని ఆ రెండు ప్రదర్శనల్నీ కూడా ఇంకా మరింత స్ఫూర్తిదాయకంగానూ, భావస్ఫోరకంగానూ రూపొందించవచ్చనిపించింది. ఎర్రకోటలో మూజియం నేనింతకుముందు చూసిందే. (నేను మొదటిసారి చూసినప్పటి నా పరిశీలనలు ‘నేను తిరిగిన దారులు’ లో ఢిల్లీనుంచి లేఖల్లో చూడవచ్చు.) కాని అట్లాంటి ప్రదర్శనల్లో మనని ప్రతిసారీ సంభ్రమానికి లోనుచెయ్యగల విశేషాలు ఒకటో రెండో కొత్తగా కనిపించకమానవు. నేను మొదటిసారి చూసినప్పుడు జహంగీర్ చక్రవర్తి ఆస్థానంలో చిత్రించిన చేపబొమ్మా, తానీషామీద చిత్రించిన మీనియేచర్లూ ఆకట్టుకుంటే, ఈసారి నన్ను విభ్రాంతపరిచిన చిత్రలేఖనాలు రెండున్నాయి. ఒకటి కబీర్ బొమ్మ. ఈ కబీర్ శారీరకంగా బలిష్టుడిగానూ, హిందూ, మహ్మదీయ చిహ్నాలకు అతీతంగానూ ఉన్నాడు. మరొకటి, బహదూర్ షా ను ఒక సూఫీగా చూపిస్తూ చిత్రించిన బొమ్మ. ఆయన్ను ఒక సూఫీగా చిత్రించిన ఆ బొమ్మను చూడటంతో బహదూర్ షా జీవితం నాలో రేకెత్తించే మహావిషాదమయ స్మృతినుంచి నేనొక్కసారిగా బయటపడ్డాననిపించింది.

8-5-2017

Leave a Reply

%d bloggers like this: