కూడె

Reading Time: 2 minutes

355

కథలు ఎక్కడ దొరుకుతాయి? కష్టాలు కంటికి కనిపించేచోటా, భరించలేనంత సామాజిక పీడన, వేదన ఉన్నచోటా కథలు పుట్టడం సహజం. తెలుగు సాహిత్యంలో జరుగుతున్నదదే. కాని, నిజంగా ఒక్కక్షణం ఆగిచూస్తే కథలు లేనిదెక్కడ? చూడగలిగే హృదయం ఉండాలి, చిత్రించగలిగే నేర్పు ఉండాలి, చెప్పాలన్న తపన ఉండాలి. నువ్వు గొప్ప చిత్రకారుడివంటే, దానర్థం, నువ్వు గొప్ప దృశ్యాలు, చారిత్రిక మహాసన్నివేశాలు మటుకే చిత్రిస్తావని కాదు. వాన్ గో లాగా, ఒక జత పాత బూట్లు చిత్రించినా కూడా వాటివెనక ఒక యుగవేదన మొత్తం ప్రతిఫలించాలి. చూడగలిగినవాళ్ళకి అవి వట్టి బూట్లుగా కాక, ఒక తత్త్వశాస్త్రపాఠంలాగా స్ఫురిస్తాయి కూడా: వాన్ గో చిత్రలేఖనం చూసి హిడెగ్గర్ స్పందించకుండా ఉండలేకపోయాడంటే, అందుకే.

కొన్నేళ్ళ కిందట ఒక రోజు, మేం అంతర్వేది వెళ్తున్నాం.నాతో పాటు ప్రసిద్ధ కవి,కథకుడూ ఎమ్మెస్ సూర్యనారాయణ కూడా ఉన్నాడు. తెలంగాణాలోనో, ఉత్తరాంధ్రలోనో, రాయలసీమలోనో వచ్చినట్లుగా గోదావరి జిల్లాల్లో కథలు రావడంలేదంటారు ఎందుకని అనడిగాడు ఎమ్మెస్. మేం మధ్యలో కెమేరాలో రీలు మార్చుకోవలసి వచ్చింది. అక్కడ మ- అనే ఊళ్ళో రోడ్డుపక్క ఉన్న ఒక ఫొటో స్టూడియోలో అడుగుపెట్టాం. అడుగుపెడుతూ ఉండగా, సంభాషణ కథలమీంచి మా రాజమండ్రి మిత్రుల మీదకు మళ్ళింది.

‘… బావమరిది బతకకోరతాడు’ అన్నాడు ఎమ్మెస్ మా సంభాషణ పొడిగిస్తూ.

స్టూడియో ప్రొప్రయిటరు తనదగ్గరున్న కుర్రాడి చేతిలో ఆ కెమేరా పెట్టాడు. ఆ పిల్లవాడు లోపలకి వెళ్ళాడు.

‘ఏమన్నారు! బావమరిది బతకకోరతాడా? ఇంకా ఆ మాట నమ్ముతున్నారా మీరు? బతకకోరిన బావమరిదికి ఏమి దొరుకుతుందో తెలుసా మీకు? ‘ అనడిగాడు ఆ ప్రొప్రయిటరు అప్పుడు మాకేసి తిరిగి.

అతడేం చెప్పాలనుకుంటున్నాడో మాకు అర్థం కాలేదు.

రెండు నిమిషాలు. లోపల రీలు మార్చడానికి పట్టిన వ్యవధి.

ఆ రెండునిమిషాల్లో అతడు తన మిత్రుడొకడు ముంబైలో ఆయిల్ టాంకర్లు శుభ్రం చేసుకుంటూ బతుకువెళ్ళదీస్తూ ఉంటే, ఆ కష్టం నుంచి వాణ్ణి తప్పించి తానెట్లా ఆదరించిందీ, తన ఇంటికి తీసుకొచ్చి తన చెల్లెల్నిచ్చి పెళ్ళి చేసి, ఒక వ్యాపారం పెట్టించిందీ, చివరికి అతడు తన ఊళ్ళోనే మరొకామెతో ఎట్లా పారిపోయిందీ-మొత్తం చెప్పాడు.

మాకు వళ్ళు గగుర్పొడించింది.

‘భద్రుడూ,ఆ కథ సినిమా తియ్యదగ్గ కథ కదూ. అతడు చెప్తుంటే కథలాగా లేదు. స్క్రీన్ ప్లే వింటున్నట్లుంది. మొదటి షాట్ నాకు ఇప్పుడే కళ్ళకి కనిపిస్తోంది..’ అన్నాడు ఎమ్మెస్.

మేం మాటల్లోనే ఆ మొదటిషాట్ చిత్రించుకున్నాం. ముంబైలో హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీ వాళ్ళ ఆయిల్ రిఫైనరీ. కొన్ని వందల ఆయిల్ టాంకర్ల బారులు తీరి ఉంటాయి. అక్కడ ఒక ఆయిల్ టాంక్ లో నెత్తిన దీపం పెట్టుకుని ఒకడు టాంక్ క్లీన్ చేస్తూ ఉంటాడు. మొదటి షాట్ చీకటి. కథ ముగిసేటప్పుడు అతడి బావమరిది తనని కలిసినవాళ్ళకి ఆ కథ చెప్తూ ఉంటాడు. అతడు కథ ముగించగానే చీకటి..

ఆశ్చర్యంగా నిన్న చూసిన మళయాళ చిత్రం ‘కూడె’ (తోడు,2018) లో మొదటి దృశ్యం ఇదే. కథానాయకుడు ఒక ఎడారిలో ఆయిల్ కంపెనీలో, ఆయిల్ టాంకర్లను శుభ్రపరుస్తుండే దృశ్యం. కెమేరాలో మొదటి షాట్ చీకటి. కాని, కథ ముగిసేటప్పటికి చీకటికాదు, తొలిసంజ గులాబి కాంతి.

చిన్నచిన్న పట్టణాల్లో, బస్తీల్లో అద్భుతావహమైన కథలు దొరుకుతాయంటుంది ఆ సినిమాలో ఒక పాత్ర. కాని చూడగలగాలి, చెప్పగలగాలి. ‘కూడె’ అట్లాంటి చిత్రం. ఆ కథకి మూలం ‘హాపీ జర్నీ’ అనే ఒక మరాఠీ చిత్రమని దర్శకురాలు అంజలీ మేనోన్ ప్రకటించినప్పటికీ, ఆ కథ పూర్తి కేరళ కథగా మారిపోయింది. కుటుంబాల్ని ఆదుకోవడంకోసం చిన్నవయసులోనే గల్ఫ్ వెళ్ళవలసి వచ్చిన ఎందరో యువకులు తమ ప్రతిబింబాలు అందులో పోల్చుకోగలుగుతారు.

అలాగని, మామూలు అన్నా చెళ్ళెళ్ళ అనుబంధాన్ని చిత్రించింది అనుకుంటే ఈ కథని సరిగా అర్థం చేసుకోనట్టే. మాజికల్ రియలిస్టు పంథాలో చెప్పిన ఈ కథ, మనం గమనించాలేగాని, చాలా స్థాయిల్లో అర్థవంతమైన స్ఫురణల్ని అందిస్తూనే ఉంటుంది. అది ఒక ఫాంటసీనే అయినప్పటికీ, నన్ను కంటతడిపెట్టించగల ఆ రసస్ఫూర్తినివ్వడంలో ఆ సినిమా పూర్తిగా జయప్రదమైంది.

ఇట్లాంటి కథలు ప్రతి చోటా సంభవిస్తున్నవే. ఈ సినిమా చూస్తున్నంతసేపూ, గోదావరిజిల్లాల్లోని జిల్లాపరిషత్ స్కూళ్ళూ, అక్కడ చదువుకుంటూ, ఏ కుటుంబకారణాలకో చదువు మధ్యలో ఆపేసినవాళ్ళూ, వాళ్ళ ఒక్కప్పటి క్లాస్ మేట్లూ, డ్రిల్లుమాష్టర్లూ, గ్రూపు ఫొటోలూ గుర్తొస్తూనే ఉన్నాయి. అయినా ఇటువంటి కథలు మనకి రావడం లేదంటే, మన మన జీవితాల్లోనో, మన చుట్టూరానో జరిగేవాటిని కథలుగా మలచలేకపోతున్నామని అర్థం.

కథ తిరిగి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఒక కథనీ, ఒక సినిమానీ తలుచుకునేటప్పుడు గుర్తు రావలసింది ఆ కథ కాదు. ఆ కథ నీ మనసు మీద విడిచిపెట్టిన ఇంప్రెషన్లు.

ఆ సినిమా పేరుగానీ, ఆ డైరక్టరు పేరుగానీ, అందులో తన మంత్రమయ దృక్కులతో మనల్ని కట్టిపడేసే పృథ్వీరాజ్ సుకుమారన్ అనే హీరో గురించిగానీ నాకు ఇంతకు ముందు తెలియదు. కాని మా అమృత రమ్మంది వెళ్ళాను. అందుకని సినిమా పూర్తవగానే అమృతకి థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోయాను. ఉదకమండలం సౌందర్యాన్ని చూపించిన ఆ ఫొటోగ్రాఫర్నీ, హృదయతంత్రుల్ని మీటిన ఆ సంగీతదర్శకుణ్ణీ పరిచయం చేసినందుకు కూడా.

21-7-2018

Leave a Reply

%d bloggers like this: