కరదీపిక

Reading Time: 2 minutes

367

గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ సభ్యులకోసం రూపొందించిన కరదీపిక మొన్న మా సంస్థ సమావేశ మందిరంలో ఆహ్వానించేం. మా సిబ్బందితోపాటు, ఆ కరదీపికలో రూపకల్పనలో పాలుపంచుకున్న మిత్రులు కూడా ఆ క్షణాన్ని మాతో పంచుకున్నారు.

దేశంలో గిరిజన ప్రాంతాలు శతాబ్దాలుగా తమదైన ఒక సాంప్రదాయిక పాలనావిధానాన్ని పాటించేవి. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో బెంగాల్లోనూ, మద్రాసులోనూ పాలనమొదలుపెట్టి, గిరిజన ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోవడం మొదలయ్యాక వాళ్ళకి చాలా తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. బెంగాలు ప్రావిన్సులో ఛోటానాగపూర్ అడవుల్లోనూ, మద్రాసుప్రావిన్సులో గంజాం, విశాఖపట్టణం జిల్లాల్లోనూ గిరిజనులు ప్రాణాలు వదులుకోడానికేనా సిద్ధపడ్డారుగానీ,బ్రిటిష్ తరహా పాలనని అంగీకరించలేదు. దాంతో మొదట్లో ఈస్టిండియా కంపెనీ, ఆ తర్వాత బ్రిటిష్ పాలకులూ కూడా గిరిజన ప్రాంతాలవరకూ తమ పాలనావిధానాన్ని సవరించుకోడానికి సిద్ధపడక తప్పలేదు. దేశం స్వతంత్రమై, మనకంటూ మనమొక రాజ్యాంగం రాసుకున్నాక, గిరిజన ప్రాంతాలకు ఆ ప్రత్యేకత కొనసాగాలని భావిస్తూ, రాజ్యాంగ రూపకర్తలు, దేశంలోని గిరిజన ప్రాంతాలకు వర్తించే పాలనావిధానం ఎలా ఉండాలో అయిదవ, ఆరవ షెడ్యూళ్ళలో పొందుపరిచారు.

దేశమంతా ఒకే తరహా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం రాజ్యాంగానికి 73 వ సవరణ తీసుకొచ్చాక, ఆ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపచేయాలా వద్దా అన్న అంశాన్ని పరిశీలించమని ఒక కమిషన్ ని నియమించింది. దిలీప్ సింగ్ భూరియా అధ్యక్షతన ఏర్పాటయిన ఆ కమిషన్ గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్యానికి పూర్వం కొనసాగిన సాంప్రదాయిక పాలనావిధానం ఏదో ఒక మేరకు కొనసాగే విధంగా, గ్రామసభలు ఏర్పాటు చెయ్యాలనీ, ఆ గ్రామసభలకు వీలైనన్ని అధికారాలు బదలాయించాలనీ సూచించింది. ఆ సిఫార్సులమేరకు భారతప్రభుత్వం 1996 లో ఒక చట్టం చేసి అయిదవ షెడ్యూలు పరిథిలో ఉన్న రాష్ట్రాల్ని కూడా ఆ నమూనాలో చట్టాలు రూపొందించమని చెప్పింది. ఆ ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1998 లో ఒక చట్టం చేసిందిగాని, 2011 దాకా నిబంధనావళి విడుదల కానేలేదు. ఇప్పటికి కూడా దేశంలో ఈ చట్టం అమలు కావలసిన 10 రాష్ట్రాల్లోనూ 5 రాష్ట్రాల్లో ఇంకా నియమనిబంధనావళి ఏర్పడనే లేదు.

అన్నిటికన్నా పాలన చాలా కష్టమైంది. దానికి పరిజ్ఞానం కావాలి, క్రమశిక్షణ కావాలి. మన రాష్ట్రాల్లో కూడా 2011 లోనే నియమనిబంధనావళి ఏర్పడ్డా, ఆ నియామల ప్రకారం తమ గ్రామాల్ని తామెట్లా పరిపాలించుకోవాలో గ్రామసభలకి శిక్షణ అందనే లేదు. 2011 నుంచీ రాష్ట్రం విడిపోయే హడావిడిలో ఉన్నందువల్ల, గిరిజన గ్రామసభల గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేకపోయింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ గ్రామసభలకి శిక్షణ ఇవ్వడానికి ఒక కరదీపిక రూపొందించమని అడగటంతో మేమా పనికి పూనుకున్నాం. గిరిజన గ్రామసభల్ని బలోపేతం చేసే ఒక కరదీపికని దేశంలోనే మొదటిసారిగా రూపొందించగలిగాం.

చట్టం ప్రకారం గిరిజన గ్రామసభలకి కొన్ని విశేషపాలనాధికారాలు లభించాయి. ఆ అధికారాల్ని ఏ విధంగా వినియోగించాలో గ్రామసభలకి చెప్పడం ముఖ్యం. కాని అలా చెప్పడానికి ఏ విధమైన కరదీపిక రూపొందించాలో మా ముందు ఎటువంటి నమూనా లేదు. 1956 నుంచీ అమల్లో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థ పనిచేయడానికి కూడా అటువంటి కరదీపిక ఏదీ ఎవరూ ఇంతదాకా రూపొందించినట్టు లేదు.

దాదాపు ఏడాది కాలం పట్టింది ఈ పనికి. ఇందులో ఎందరో భాగస్వాములున్నారు. మొదటగా, అసలు గిరిజన గ్రామసభల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాలనుకున్నాం. అందుకోసం హైదరాబాదు విశ్వవిద్యాలయం వారి యాంత్రొపాలజీ శాఖ మాకు 9 మంది ఇంటర్న్ లను అప్పగించింది. యాంత్రొపాలజీ ఎమ్మే చదువుతున్న ఆ విద్యార్థులు పోయిన వేసవిలో నలభై రోజులపాటు గిరిజన ప్రాంతాలు పర్యటించారు. దాదాపు 200 గ్రామాలు సందర్శించారు. సుమారు 2000 మంది గిరిజన పెద్దల్ని ఇంటర్వ్యూ చేసారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా మేము రూపొందించబోయే కరదీపిక ప్రజలకి అర్థమయ్యే భాషలో సరళంగానూ, సుబోధంకంగానూ ఉండాలని అర్థమయింది.

దాంతో ఈ చట్టం మీద ఇప్పటికే విశేష కృషి చేసిన ఎన్.ఐ.ఆర్.డి సంస్థకి చెందిన డా.అణ్ణామలై గారికీ, గిరిజన సంక్షేమశాఖలో మూడున్నరదశాబ్దాలకు పైన కృషి చేసిన కె.వి.సుబ్బారెడ్డిగారికీ కరదీపిక రూపొందించే బాధ్యత అప్పగించాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేపట్టిన డా.పి.శివరామకృష్ణని కూడా ఈ కృషిలో భాగస్వాముల్ని చేసాం. మొత్తం పది పాఠాలుగా రూపొందించిన ఈ కరదీపిక పదవతరగతి దాకా చదువుకున్న ఏ గిరిజన యువతీయువకులకైనా అర్థమయ్యే రీతిలో బొమ్మల్తో రూపొందించాం.

భారతరరాజ్యాంగ రూపకర్తలు గిరిజన ప్రాంతాల్లో ‘శాంతి’, ‘సుపరిపాలన’ ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ వెనక నూటయాభై ఏళ్ళుగా రక్తంలో తడిసిన గిరిజన ప్రాంతాల జ్ఞాపకాలున్నాయి. ‘శాంతి’, ‘సుపరిపాలన’ అనే మాటలు వాడటంలో రాజ్యాంగ రూపకర్తలు ఎంతో వివేకాన్నీ, దూరదృష్టినీ కనపరిచారు. ఎందుకంటే, గిరిజన ప్రాంతాల్లో శాంతి మరిన్ని పోలీసు బలగాలవల్లా, మరిన్ని వైర్ లెస్ సెట్ల వల్లా రాదు. అది సుపరిపాలన వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ప్రజలు తమ వ్యవహారాలు తామే చక్కదిద్దుకునే ప్రజాస్వామిక పాలనవల్లనే సుపరిపాలన సాధ్యపడుతుంది. అటువంటి సుపరిపాలనకు మేము రూపొందిన కరదీపిక దోహదపడగలదన్నదే మా ఆకాంక్ష.

21-4-2018

Leave a Reply

%d bloggers like this: