ప్రకృతి, సంస్కృతి

Reading Time: 3 minutes

373

భావరాజు కృష్ణమోహన్ తాడికొండలో నా సహాధ్యాయి. ఇప్పుడు జపాన్ లో ఉంటున్నాడని తెలిసాక, వసంతవేళ చెర్రీపూలు విప్పారే దృశ్యాల్ని నాకు పంపించగలవా అని అడిగాను. మార్చినుంచి ఏప్రిల్ దాకా నెలరోజుల పాటు చెర్రీ పూల వికాసాన్నంతా అతడు ఏకంగా ఆల్బం చేసి మరీ పంపించాడు.

‘చెర్ర్రీ పూలని చూస్తుంటే ఎన్నెన్ని సంగతులో తలపుకొస్తున్నాయి’ అన్నాడు ప్రసిద్ధ హైకూ కవి బషొ. నాక్కూడా ఆ పూలని చూడగానే ఎన్నో తలపులు, సంతోషమూ, దుఃఖమూ కలగలిసిమరీ చుట్టుముట్టాయి.

ఏడాది పొడుగునా వేచి చూస్తే చెర్రీ పూలు నిండుగా వికసించేది ముచ్చటగా మూణ్ణాళ్ళు. చూస్తూండగానే రాలిపోతుంటాయి. ఆ క్షణభంగురమైన, కాని ఆ మూణ్ణాళ్ళే చాలనేంతగా వికసించే ఆ సౌందర్యం కోసమే జపాన్ శతాబ్దాలుగా పరితపిస్తూ ఉంది. ఆ పూల ఎదట కవులు, చిత్రకారులు, రచయితలు తపసు చేస్తూ ఉన్నారు, సొమ్మసిల్లిపోతూ ఉన్నారు, పరవశిస్తూ ఉన్నారు, పలవరిస్తూ ఉన్నారు.

జపాన్ లో చెర్రీ పూలు వికసించే ఆ పూలకారుపొడుగుతా, పూలు పూసిన మూడురోజులూ వాటినే చూడటమే ఒక వేడుక. దాన్ని ‘హనామి’ అంటారు. ఆ హనామికోసం మొత్తం జపాన్ అంతా సమాయత్తమైపోతుంది. అందుకోసమే ఒక కాలండర్, హోటళ్ళు, ఏర్పాట్లు, టూరిస్టు గైడ్లు, పత్రికల్లో ప్రత్యేక అనుబంధాలు. పూలకోసం అంతగా పరితపించే మరో జాతి, మరో దేశం ప్రపంచ పటం మీద మనకు కనిపించదు. (నెదర్లాండ్ లో టులిప్స్ ఉన్నాయి కదా అనవచ్చు, కానీ కవిత్వమేదీ!)

వినడానికి ఆశ్చర్యంగా ఉంటుందిగానీ, జపాన్ లో చెర్రీపూలకి లభిస్తున్న ఈ స్థానం ఆదినుంచీ ఉన్నది కాదు. ఇప్పుడు చూస్తున్న ఈ సుకోమల సంవేదనవెనక, జపనీయమానవుడుఇంత ప్రకృతి ప్రేమికుడు కావడం వెనక, ఎనిమిదవ శతాబ్ది కవితాసంకలనం ‘కొకింషు’ ఉంది.

జపాన్ చరిత్రలో తొమ్మిదవశతాబ్దినుంచి పన్నెండవ శతాబ్ది దాకా నడిచిన హీయిక యుగం కళాసారస్వతాల స్వర్ణ యుగం. ఆ కాలంలో రాజవంశాలు ఒకటికాదు, మొత్తం ఇరవై ఒక్క కవితాసంకలనాలు వెలువరించాయి. ఆ కాలంలోనే మురసకి షికిబు ‘గెంజిగాథ’, సే షొనగన్ ‘దినచర్య’ వెలువడ్డాయి. ఆ రాజవంశం కోసం కి నొ త్సురయుకి అనే కవి స్వయంగా సంకలనం చేసిన కవితాసంపుటి ‘కొకిన్ షు వకా’ (కొత్త కవితల సంపుటి) లో ఇరవై భాగాల్లో మొత్తం 1111 కవితలు ఉన్నాయి. వకా లేదా తంకాగా ప్రసిద్ధి చెందిన అయిదు పాదాల ప్రాచీన ఛందస్సులో రాసిన ఈ కవితలు మనిషికీ, ప్రకృతికీ మధ్య సులలితమైన, సుమనోహరమైన బాంధవ్యాన్ని అల్లిపెట్టి అజరామరం చేసేసాయి.

నిజానికి, జపాన్ ప్రకృతి అంత సులలితమైంది కాదనీ,మహాభీకరమైందనీ, తీవ్రమైన చలిగాలులూ, భరించలేని పగటి ఉష్ణోగ్రతలూ, సముద్రపు తుపాన్లూ, భూకంపాలూ, మహారణ్యాలూ, క్రూరమృగాలూ ఉండే బయటి ప్రకృతికీ, కావ్యప్రకృతికీ మధ్య కొలవలేనంత దూరముందంటాడు హరువొ షిరానె అనే పండితుడు. Japan and the Culture of Four Seasons (2012) అనే తన ప్రసిద్ధ రచనలో అతడు జపాన్ కవిత్వంలో మనం చూసే ప్రకృతి రెండవ ప్రకృతి మటుకే అంటాడు. ఈ ప్రకృతి కొండలకీ, కోనలకీ దూరంగా, నగరాల్లో, రాజాస్థానాల్లో, అంతఃపుర మందిరాల్లో సున్నితమనస్కులైన భావుకులు రూపొందించుకున్న ప్రకృతి మటుకేననీ, ఇక్కడ ప్రకృతి ఒక కావ్యవస్తువుగా, కవిసమయంగా మారిపోయిందనీ అంటాడు. నా దృష్టిలో ఇదొక అద్భుతమైన ప్రక్రియ. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మననాట్యశాస్త్రకారుడివైపు చూడవలసి ఉంటుంది. ‘లోకధర్మి’ ‘నాట్యధర్మి’ గా మారడమంటే ఇదేనంటాడేమో భరతముని.

బాహ్యప్రకృతిని ఇట్లా స్మరణీయంగానూ, సుకోమలంగానూ మార్చుకోవడాన్నే మనం ‘సంస్కృతి’ అంటాం. ప్రకృతి దానికదే సంస్కృతికాదు. మనమీ ప్రపంచంలో జీవించడం కోసం ప్రకృతిని మొదట ‘వికృతి’ చేస్తాం. కాని, ఆ వికృతి మనల్ని అశాంతికి గురిచేస్తుంది. అప్పుడు మనం దాన్ని సంస్కృతిగా మార్చే ప్రయత్నం చేస్తాం. వెదురు నరకడం ‘వికృతి’. కాని దాన్ని విల్లుగా మార్చడం ‘సంస్కృతి’. వట్టి విల్లు మళ్ళా వికృతి. విలుకాడి మీద పాటకట్టడం సంస్కృతి. ఏ జాతి ప్రకృతిని అతి తక్కువ వికృతిగానూ, అత్యధికం సంస్కృతిగానూ మార్చుకోగలదో ఆ జాతికి మటుకే సభ్యత ఉన్నట్టు, సంస్కారం ఉన్నట్టు, ఈ భూమ్మీద మనడానికి నైతికమైన హక్కు ఉన్నట్టు. అట్లా చూసినట్టయితే, ఈ భూమ్మీద మనుగడ సాగించిన ఆదిమ సమాజాలే అత్యంత సంస్కారవంతమైన సమూహాలు, ఆధునిక పారిశ్రామిక సమాజమే అత్యంత అనాగరిక ప్రపంచం.

చెర్రీపూలు పూస్తాయి, రాలిపోతాయి. యుగాలుగా జరుగుతున్న ప్రక్రియ అది. కాని కొకింషు కవులు ఆ పూలు పూయటాన్నీ, రాలిపోవటాన్నీ జపాన్ జీవితంలో భాగంగా మార్చేసారు. వేల ఏళ్ళుగా రాలుతున్న పూలని చూస్తూ, ఆ కవితల్ని తలుచుకుంటూ, తిరిగి తాము కూడా కవితలు చెప్తూ జపనీయ జాతి సుసంస్కృతమయ్యే విద్య నేర్చుకుంటూ ఉంది.

ఆ పద్యవిద్య నేర్చుకున్న కవుల కవితలెట్లా ఉంటాయో, వెయ్యేళ్ళ కిందటి ఈ కొంకిషు కవితలు చూడండి. కొకింషు మొదటి రెండు సంపుటాలూ వసంతం గురించి. అందులో 49 నుంచి 89 దాకానలభై కవితలు చెర్రీపూల గురించే. మొదటి ఇరవయ్యీ పూలు పూయడం గురించి, మిగిలిన ఇరవయ్యీ రాలిపోతున్న పూల గురించి. ఆ తర్వాత 90 నుంచి 134 దాకా ఉన్న కవితలు కూడా, చెర్రీపూల గురించే కాకపోయినా, రాలుతున్న పూల గురించిన కన్నీటిపాటలే.

రాలుతున్న పూలు

1
బహుశా ఈ మన ప్రపంచంలోంచి
చెర్రీపూలన్నీ
కనుమరుగైపోతే తప్ప
ఈ వసంతఋతు హృదయం
శాంతించదనుకుంటాను (53)

2
ఆకుపచ్చని విల్లోకొమ్మలూ
గులాబీ రంగు చెర్రీ పూలూ
ఇక్కణ్ణుంచి చూస్తుంటే
నగరానికి కొత్త జరీ
నేసినట్టున్నాయి. (56)

3
దూరంగా యొషినొ కొండమీద
చెర్రీపూలు విరగబూసి ఉండాలి.
ఇక్కణ్ణుంచి చూస్తుంటే
మంచుతెరలు
కదలాడుతున్నట్టుంది. (60)

4
ఈ వేసవిలో పూలరంగుల్ని
వస్త్రాలకద్దుకుంటాను,
ఈ పూలగుత్తులు కనుమరుగయ్యాక
వాటి జ్ఞాపకాలు
నా నిలువెల్లా కప్పుకుంటాను. (66)

5
నిండా విరిసిన
ఈ పూలని చూడ్డానికి
నిన్నంతా మా వాళ్ళు పోగయ్యారు.
తీరా ఇవి నేలరాలిపోయాక
నాకెంత దగ్గరయ్యాయని! (67)

6
ఒక్క రేక కూడా మిగలకుండా
ఎంత మృదువుగా రాలిపోతున్నాయమ్మా
ఈ చెర్రీపూలు.
ఈ లోకాన్ని పట్టుకు వేలాడేవాళ్ళే
చూడటానికి దుర్భరంగా ఉంటారు. (71)

7
చెర్రీపువ్వుల్లారా
యువతరానికి చోటిచ్చి
నాక్కూడా రాలిపోవాలని ఉంది,
ఎంతచెప్పు, ముదిమి మీదపడ్డవాణ్ణి
చూస్తుంటే ఒకటే జాలేస్తుంది . (77)

8
ఇట్లా రాలిపోడం తప్పదంటే
అసలెందుకు పుయ్యాలి?
ఆ చెర్రీపూలు
ఇంత దూరం నుంచి చూస్తున్న నాకే
ఈ వసంతం అశాంతిపుట్టిస్తోంది. (82)

9
చెర్రీపూలలాగా ఇంత
మృదువుగా రాలిపోయేది
మరేదీ లేదంటే నమ్మలేను,
మన హృదయాలే చూడండి,
కూలిపోడానికి గాలి కూడా అక్కర్లేదు (83)

10
ఓ వసంతపవనమా
ఆ పూలరేకల పక్కనుంచి కదలాడకు.
నాకు తెలుసుకోవాలని ఉంది-
వాటంతట అవే రాలిపోతున్నాయా
లేక నువ్వు రాల్చిపోతున్నావా. (85)

11
కొమ్మలనుండి విడివడ్డ పూలు
ఆకాశంలో తేలుతున్నాయి-
స్వర్గం వైపు ఎగిసిపడుతున్న
నీళ్ళులేని కెరటాల్లాగా
గాలి దాచుకున్న జ్ఞాపకాల్లాగా. (89)

12
ప్రతి వసంతవేళా
పరమోజ్జ్వలంగా ప్రకాశించడం
ఆ పూలవంతు.
అవి రాలిపోతుంటే
చూస్తుండటం మనవంతు (97)

13
ఇట్లా కెరలాడుతున్న గాలులు
నా మాట వింటేనా-
ఆగండక్కడే
ఈ ఒక్క చెట్టునీ
వదిలిపెట్టండనేవాణ్ణి. (99)

14
ఆనాటి నావోడు
అలిగిరాలేదంటూ
ఆ పూలకొమ్మ తెంపుకున్నానా-
అప్పటికే అది కోకిలపాటలో
అల్లాడిపోయింది. (100)

15
వసంతవేళల పొగమంచులో
వేలరంగులు
అవి దాని వెలుగేనా?
లేక కొండల్ని చుట్టబెట్టిన
పూల ప్రతిబింబాలా ? (102)

16
ప్రతిపచ్చికబయలు మీదా
కొండపిచుక కన్నీటిపాట.
దగ్గరకి పోయి చూస్తే
కనిపిస్తున్నవి
గాల్లో తేలుతున్న పూలరేకలు (105)

17
కన్నీళ్ళు పెట్టుకుంటే
రాలిపోతున్న పూలు
కొమ్మలకి చేరుతాయనుకుంటే
నా కళ్ళు కొండపిచుకల
కన్నీటితో పోటిపడుతుండేవి (107)

18
ఓ చిన్నికోకిలా
ఎందుకట్లా
గగ్గోలు పెడుతున్నావు?
ఈ పూలు నేలరాలడం
ఇదే మొదటిసారి కాదే. (110)

19
దిగులుపడ్డ నా హృదయపుపోగుల్ని
దారంలాగా పేని
రాలుతున్న ప్రతి పువ్వునీ
కొమ్మలకి మళ్ళా
కట్టబెడితే ఎంతబాగుణ్ణు! (114)

20
నిన్న రాత్రి
ఈ కొండల్లో బసచేసినప్పుడు
పగటిపూట చూసినట్టే-
కలలో కూడా
రాలుతున్న పూలరేకలు. (117)

6-5-2018

Leave a Reply

%d bloggers like this: