ట్విట్టర్ లో నేను రాజకీయనాయకుల్నీ, సినిమా నటుల్నీ ఫాలో కాను గానీ, అసలు వదిలిపెట్టని ట్వీట్లు మాత్రం African Proverbs అనే అకౌంటువి. ఆ సైటునుంచి రోజుకొక సామెత వస్తూంటుంది. చినువా అచెబె నవలలు చదివినవాళ్ళకి ఆఫ్రికన్ సామెతల మహిమ ఎట్లాంటిదో అనుభవానికి వచ్చే ఉంటుంది. ఆఫ్రికన్ సామెత ప్రతి ఒక్కటీ ఒక కథలాంటిది. లేదా ఆ సామెత వినగానే మనకో కథ తడుతుంది.
ఉదాహరణకి ‘లాభం గర్వాన్ని మించిపోతుంది’ అట్లాంటి ఒక సామెత. ‘ఆ ఊళ్ళో అంతా ఎలకలు తింటూంటే నువ్వూ ఎలకలే తిను’ , ‘కాళ్ళ బలం పొట్టలో ఉంది’, ‘గోడలు కట్టడం కన్నా వంతెనలు కట్టడం మేలు’, ‘ఒక్కడే కూచుని తినేవాడు ఒక్కడే దగ్గాల్సి ఉంటుంది’ లాంటివెన్నో సామెతలు.
మనిషి పుట్టిల్లు ఆఫ్రికా. కథల పుట్టిల్లు కూడా అదే. కథలు సందేశం కోసం చెప్పుకోడం మరీ ఇటీవలి మాట. కాని ఆఫ్రికన్ సామెతలు, జానపద కథలు, చిక్కు ముళ్ళు వింటే కథలు వాటికవే సందేశం అని తెలుస్తుంది. కేవలం కథనానందం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆఫ్రికన్ జానపద కథలు వినాలి. అచ్చమైన కథన కుతూహలం ఆఫ్రికాజాతులకి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదనాలి.
కాని ఆఫ్రికన్ జానపద కథలు మనదాకా చేరినవి చాలా తక్కువ. అది కూడా ఆ దేశాల్లో, ఆ జాతుల మధ్య తిరిగి, వాళ్ళు చెప్పుకునే కథలు విని, వాటిని ఏ మాత్రం మార్చకుండా, విన్నవి విన్నట్టుగా మనకి చెప్పేవాళ్ళు చాలా అరుదు. అట్లాంటి అరుదైన పుస్తకాల్లో నన్ను చాలా ఆకట్టుకున్నది హరాల్డ్ కౌర్లాండర్, జార్జి హెర్జోగ్ లు సంకలనం చేసిన Cow-tail Stitch (1947). అవి పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా నైజీరియాలో, సేకరించిన కథలు.
మళ్ళా ఇన్నాళ్ళకు మరో పుస్తకం నా చేతుల్లోకి వచ్చింది. అలెగ్జాండర్ మెకాల్ స్మిత్ అనే ఆయన సంకలనం చేసిన The Girl Who Married A Lion (2005). ఇవి బోట్స్ వానా, జింబాబ్వేల్లో సేకరించిన కథలు. మనకి లభ్యమయ్యే జానపద కథలు దాదాపుగా పశ్చిమ ఆఫ్రికాకి చెందినవే కావడం వల్ల, ఈ సంకలనం నాకు చాల కొత్తగానూ, చాలా తాజాగానూ అనిపించింది. పుస్తకం చేతుల్లోకి వస్తూనే ఇందులో ఉన్న 18 కథలూ ఏకబిగిన చదివేసాను. ఇప్పుడు వీటిల్లోంచి మీకో కథ వినిపించకుండా ఉండలేకపోతున్నాను.
సింహం కన్నా గొప్ప జంతువు
చెవులపిల్లికి సింహమంటే ఇష్టం లేదు. సింహం రోజూ పొద్దున్నే లేచి అడవిలో గర్జిస్తూ తిరుగుతుంటుంది. ఆ అరుపులు అడవిలో చిన్న జంతువుల్ని ఒకటే భయపెడుతుంటాయి. సింహం తమనెక్కడ తినేస్తుందోనని అవి ప్రాణాలు అరచేతులో పెట్టుకు తిరుగుతున్నాయి. సింహానికి ఆకలేసినప్పుడు కూడా అది గర్జిస్తుండేది. ఆ అరుపు విన్నవాళ్ళకి ‘నా కన్నా గొప్ప జంతువు మరేదీ లేదు . జంతువులన్నీ నా ముందు మోకరిల్లాల్సిందే ‘అన్నట్టుండేది.
నిజమే, సింహం కన్నా పెద్ద జంతువు, గొప్ప జంతువు మరేదీ లేదు. ఏదన్నా ఉందంటే, బహుశా ఏనుగొక్కటే. కాని అది పిరిగ్గొడ్డు. అదెవరి జోలికీ పోయేది కాదు. అరుచుకుంటూ తిరిగేది కాదు. ఒకవేళ ఎప్పుడేనా ఏదన్నా సింహం ఏనుగు మీద విరుచుకుపడితే,ఆ ఏనుగు దాంతో తలపడేది కాదనీ, అడవిలోకే వెనుదిరిగిపోయేదనీ మనం చెప్పుకోవచ్చు.
ఏమైతేనేం, ఈ సింహం రంకెలు ఆపడానికి ఏదో ఒకటి చెయ్యక తప్పదని చెవులపిల్లి అనుకుంది. మూడు రోజులట్లా సుదీర్ఘంగా ఆలోచించిందిగాని, దారి దొరకలేదు. అప్పుడు తట్టింది దానికో ఆలోచన. ఆ ఆలోచన రాగానే అది ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. మామూలుగా పొద్దుటిపూట చెవులపిల్లులు ఊరికే ఎగిరిపడుతుంటాయి చూడండి, అట్లా అన్నమాట.
‘ఓ సింహమా, నీ అరుపులకీ, పెడబొబ్బలకీ తగినశాస్తి జరుగుతుంది చూడు’ అనుకుంది అది తనలో.
చెవులపిల్లి తన దగ్గరికొస్తూండటం చూసి సింహం పైకి లేచి మళ్ళా పెనుగర్జ చేసింది. ఆ అరుపు వింటూనే చెవులపిల్లికి కాళ్ళ కిందనేల కంపించింది. ఒక్క ఉదుటన ఇంటికి పారిపోదామా అనుకుంది. ఆ అరుపులట్లా చెవుల్లో పిడుగుల్లాగా పడుతుండగానే అది సింహం వైపు
‘నీకెంత ధైర్యం! నా ఎదురుగా నడిచొస్తున్నావు’ అరిచింది సింహం. ‘నేనెవరో తెలీదా నీకు? ఇక్కడ జంతువులన్నిటికన్నా నేనే బలమైనదాన్నని తెలీదా?’ అనడిగింది.
చెవులపిల్లి నిటారుగా లేచి నిలబడింది.
‘ఓ సింహమా, నాకు తెలుసు, నువ్వు చాలా గొప్పదానివని, ఈ అడవిలో జంతువులన్నీ నిన్ను చూస్తేనే వణికిపోతాయని’ అంది.
ఆ మాట వింటూనే సింహానికి సంతోషం కలిగింది. అది తన కంఠస్వరం కొంత తగ్గించింది.
‘మంచిది. నేనంటే గౌరవం పోలేదు నీకు. ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు?’ అనడిగింది.
చెవులపిల్లి సింహాన్ని నింపాదిగా చూసింది. తానిప్పుడు చెప్పబోయే మాటలు ఎంత ప్రమాదకరమో తలుచుకుంది.
‘నేనో మాట చెప్దామని వచ్చాను ‘ చెవులపిల్లి నిదానంగా చెప్పింది.’ నీకన్నా గొప్ప జంతువొకటి ఉందిక్కడ’.
ఆ మాటలు చెవిన పడుతూనే సింహం మళ్ళా గర్జించింది. ఎంత గట్టిగా గర్జించిందంటే, అంత పెనుగర్జన ఆ చెవులపిల్లి అప్పటిదాకా వినలేదు. ఆ అరుపుకే తాను కళ్ళు తిరిగిపడిపోతానేమో అనుకుంది. సింహం ఊపిరి పీల్చుకునేదాకా ఆగింది.
‘నేను నిన్ను తక్కువ చేయాలనుకోడం లేదు’, చెవులపిల్లి ప్రార్థిస్తున్నట్టుగా ముఖం పెట్టి ‘ఉన్న సంగతి నీ చెవిన వేద్దామని వచ్చాను’ అంది.
తన ముందున్న ఆ బక్కప్రాణిని సింహం తదేకంగా చూసింది.
‘ఏది ఆ జంతువెక్కడుందో చూపించు. నన్ను చూడనివ్వు’ అనడిగింది.
‘తప్పకుండా చూపిస్తాను’ అంది చెవులపిల్లి. కాని దాన్ని చూడాలంటే ఒక ఇంట్లో చూడాలి’ అని కూడా అంది.
పద అయితే, ఇప్పుడే ఆ ఇంటికి పోదాం’ అంది సింహం.
తాను అందుకోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఇంటికి ఆ సింహాన్ని తీసుకెళ్ళింది చెవులపిల్లి.
ఆ ముందుగుమ్మం చూపిస్తూ, ‘అదిగో ఆ ఇంట్లోనే ఉంది ఆ జంతువు. చూడాలంటే లోపలకి వెళ్ళాలి’ అంది.
సింహం పెద్ద పెద్ద అంగలేస్తూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. అదట్లా లోపలకి అడుగుపెట్టిందో లేదో, చెవులపిల్లి బయట తలుపు మూసేసింది. గొళ్ళెం పెట్టేసింది. తనని ఇంట్లో బంధించిందని అర్థం కాగానే సింహం లోపలనుంచి తలుపు బాదడం మొదలుపెట్టింది.
‘ఏది ఆ జంతువు? దాన్ని తీసుకురా ఇప్పటికిప్పుడు’ అంటో అరిచింది.
‘చప్పుడు చెయ్యకు. అదొస్తుంది. కొద్దిగా ఓపిక పట్టు’ అంది చెవులపిల్లి.
సింహం లోపల గదిలోకి వెళ్ళి నేలమీద పడుకుంది. ఆ రోజంతా, ఆ రాత్రంతా అది ఎదురుచూస్తూనే ఉంది. తెల్లవారగానే మళ్ళా చెవులపిల్లి గుమ్మం దగ్గరికొచ్చి సింహాన్ని పిలిచింది.
‘కనిపించిందా నీకా జంతువు’ అనడిగింది.
‘లేదు, ఇక్కడ నేనొక్కత్తినే ఉన్నాను’
‘సరే, ఓపిక పట్టు, అదొస్తుందెలాగూ’ అంది చెవులపిల్లి.
ఆ మర్నాడు మళ్ళా అదే సమయానికి గుమ్మం దగ్గర చేరి మళ్ళా సింహాన్ని పిలిచింది.
‘ఇంకా రాలేదా?’ అనడిగింది.
సింహానికి కోపం కట్టలు తెంచుకుంది. ‘లేదు, నన్ను బయటికి రానివ్వు, చేసింది చాలు’ అంది.
కాని చెవులపిల్లి సింహం అరుపులు పట్టించుకోకుండా నవ్వేసింది.
‘కొద్దిగా ఆగి చూడు. నువ్వు కోరుకున్నది తప్పకుండా రానే వస్తుంది.’
అప్పుడు కొన్నాళ్ళు గడిచేదాకా ఆగి చెవులపిల్లి మళ్ళా వచ్చింది.
ఈ సారి అదెంత పిలిచినా ఇంట్లోంచి జవాబు రాలేదు.’సింహమా? ఇంట్లో ఉన్నావా లేవా’ అని కేకపెట్టింది.
కొంతసేపటికి, వెనక గదిలో అలికిడైంది. అది సింహం అరుపేకాని, పూర్వంలాగా గర్జన కాదు. ఏదో ఆకులమధ్యా కొమ్మలమధ్యా కదలాడే అల్పప్రాణి చేసే చిరుసవ్వడిలాగా వినిపించింది. చెవులపిల్లి జాగ్రత్తగా తలుపు తెరిచి లోపల అడుగుపెట్టింది.
అక్కడ ఆ లోపలగదిలో నేలమీద సింహం పడుకుని ఉంది. దాని నాలుక వెళ్ళబెట్టి ఉంది. దాహంతో అది పిడచగట్టుకుపోయింది. పక్కటెముకలు పైకి పొడుచుకువచ్చి కనిపిస్తున్నాయి. రోజుల తరబడి తిండిలేక, నీళ్ళు లేక, సింహానికి కనీసం తల పైకెత్తడానికి కూడా ఓపిక లేకపోయింది. అది ఎట్లానో కళ్ళు మాత్రం కదిలించి చెవులపిల్లి కేసి చూసింది.
‘నువ్వు ఎదురుచూస్తున్న ఆ జంతువు వచ్చేసింది తెలుసా’ అంది చెవులపిల్లి. ‘అది నిజంగానే నీకన్నా గొప్పది’ అని కూడా అంది.
సింహం కళ్ళు ఒకింత పెద్దవయ్యాయి.
‘ఏదీ? ఎవరది?’ అనడిగింది. ఆ గొంతుక నూతిలోంచి వినబడ్డట్టుంది.
చెవులపిల్లి నవ్వేసింది.
‘నీకన్నా గొప్ప జంతువు ఆకలి’ అని జవాబిచ్చింది.
29-5-2018
చాలా గొప్ప కథ